
న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఆర్మీ, అస్సాం రైఫిల్స్, పోలీసులు చేసినట్లుగా ఆరోపణలు వచ్చిన ఎన్‌కౌంటర్లపై తగినన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయనందుకు సీబీఐని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కేవలం 12 ఎఫ్‌ఆర్‌ఐలు మాత్రమే నమోదు చేయడంపై జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ యుయు లలిత్‌ల ధర్మాసనం సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. జనవరి 31 లోపు మరో 30 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని ఆదేశించింది. మణిపూర్‌లో అధికార పరిధిని అతిక్రమించి చేసిన హత్యలకు సంబంధించి 1,528 కేసులపై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
‘లోయా’ డాక్యుమెంట్లపై...
సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతికి సంబంధించిన ఏ డాక్యుమెంట్లను పిటిషనర్లకు ఇవ్వాలన్న నిర్ణయా న్ని మహారాష్ట్ర ప్రభుత్వానికే సుప్రీం కోర్టు వదిలిపెట్టింది. లోయా మృతిపై స్వతంత్ర విచారణ జరపాలంటూ పలువురు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం లోయా పోస్టుమార్టం నివేదికతో పాటు పలు డాక్యుమెంట్లను కోర్టు ముందుంచింది. ఆ డాక్యుమెంట్లను తమకు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టును కోరగా.. ఆ డాక్యుమెంట్లలో రహస్య సమాచారం ఉందని, బహిర్గతం చేయలేమని మహారాష్ట్ర తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి సముచితమని భావిస్తే డాక్యుమెంట్లను పిటిషనర్లకు ఇవ్వాలని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఎం శాంతనగౌడర్‌ల బెంచ్ పేర్కొంది.
బోఫోర్స్ కేసు అప్పీలుకున్న అర్హతేంటీ?
బోఫోర్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేయడానికి పిటిషనర్‌కున్న అర్హతేంటో చెప్పాలని బీజేపీ నేత అజయ్ అగర్వాల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. తీర్పుపై సీబీఐ ఎలాంటి అప్పీలు చేయలేదని.. ఈ కేసులో జోక్యం చేసుకునే అవసరం పిటిషనర్‌కు ఏముందో చెప్పాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment