అపర్ణకు ...అవేవీ అడ్డు కాలేదు..
పెళ్లి.. భర్త.. పిల్లలు... సంసారం... అనుకున్న లక్ష్యానికి అవేవీ అడ్డుకాలేదు. పట్టు పట్టిందంటే శపథం నెరవేరేదాకా విశ్రమించలేదు ఆ ధీర వనిత. ఆడపిల్ల రైల్వే పోలీసేంటి అనుకుంటున్న తరుణంలో ఏకంగా తెలంగాణలోనే ఏకైక రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ మహిళా ఎస్సైగా దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగం సాధించి జిల్లా కీర్తి కిరీటాన్ని దేశమంతటా చాటిచెప్పింది కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తికి చెందిన ఆడెపు అపర్ణ.
ఎల్కతుర్తి : ఎల్కతుర్తికి చెందిన ఆడెపు అపర్ణాదేవి... ఇద్దరు పిల్లల తల్లి. కానీ, చదువుపై ఉన్న శ్రద్ధ ఆమెను ఇంటికే పరిమితం చేయలేదు. పట్టుదలతో శ్రమించేలా చేసింది. అనుకున్న లక్ష్యానికి చేరువ చేసింది. ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌కు చెందిన ఆడెపు పుష్పనీల-కృష్ణమూర్తి దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి సంతానం. బతుకుదెరువు నిమిత్తం ఈ కుటుంబం వరంగల్ జిల్లా భూపాలపల్లికి వలసవెళ్లింది. కృష్ణమూర్తి ఆర్‌ఎంపీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను చదివించాడు.
కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కూతురు అపర్ణాదేవికి ఎల్కతుర్తికి చెందిన మేన బావ వల్లాల శ్యాంసుందర్‌తో 2003లో వివాహం జరిపించారు. ఆయన పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో చిరు ఉద్యోగి. అప్పటికి అపర్ణ ఇంటర్ చదువుతోంది. చదువుపై మక్కువ తగ్గని ఆమె, తాను చదువుకుంటానని, ఎప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని ఉందని భర్త శ్యాంసుందర్‌తో చెప్పి అత్తవారింట్లో ఒప్పించింది. పెళ్లయ్యాక కుటుంబ బాధ్యతలతో చదువుపై ధ్యాస తగ్గుతుందని బంధువులు, కుటుంబసభ్యులు చెప్పిచూసినా ఆమె పట్టు విడువలేదు. దీంతో అత్తారింట్లోనూ ప్రోత్సహించారు. డిగ్రీ పూర్తయ్యేసరికి ఆమె ఇద్దరు కూతుళ్ల తల్లి అయింది. కుటుంబ బాధ్యతలు మోస్తూనే బీఈడీ కూడా పూర్తి చేసింది. పెద్దకూతురు శ్రీవళ్లి ఇప్పుడు నాలుగో తరగతి చదువుతుండగా, చిన్నకూతురు శీవర్ష ఒకటో తరగతి చదువుతోంది.
అవకాశాన్ని అందుకుంది
దక్షిణమధ్య రైల్వేలో 2010లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్సైల నోటిఫికేషన్ వెలువడింది. పట్టుదలగా చదివి పరీక్ష రాసిన అపర్ణ 2012లో ప్ర కటించిన ఫలితాల్లో ఆర్పీఎఫ్ ఎస్సైగా సెలక్ట్ అయ్యింది. ప్రభుత్వోద్యోగం సాధించాలన్న తన కల నిజమైనందుకు ఎంతో సంతోషించింది. ఒక మహిళ రైల్వే పోలీసుగా చెయ్యడమేం టని, పిల్లల సంగతేంటని ఎంతోమంది సూటిపోటి మాటలన్నప్పటికీ భర్త, అత్తగారింట్లో ప్రోత్సాహంతో పిల్లల ఆలనాపాలనా వారికి అప్పగించి శిక్షణకు వెళ్లింది. గతేడాది డిసెంబర్ 15 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 19 వరకు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జేఆర్ ఆర్పీఎఫ్ అకాడమీలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసింది. శిక్షణ సమయంలోనే నెలకు రూ.29 వేల వేతనాన్ని అందుకుంది. అపర్ణ తమ్ముడు రాజేంద్రప్రసాద్ సైతం సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
తొలి తెలంగాణ తేజం
ఇప్పటివరకు ఆర్పీఎఫ్ 52 బ్యాచ్‌ల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ ఒక్క మహిళ ఎంపిక కాలేదు. 53వ బ్యాచ్ నుంచి ముగ్గురు మహిళలు ఆర్పీఎఫ్ ఎస్సైలుగా ఎంపిక కాగా అందులో ఒకరు రాయలసీమ, మరొకరది గుంటూరు కాగా, తెలంగాణ నుంచి ఈ అరుదైన అవకాశం ఆడెపు అపర్ణాదేవికి దక్కింది.
జార్ఖండ్‌లో పోస్టింగ్
శిక్షణ పూర్తి చేసుకున్న అపర్ణకు ఈ నెల 3న జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో ఆర్పీఎఫ్ ఎస్సైగా పోస్టింగ్ ఇచ్చారు. రైల్వే స్థిర, చరాస్తులు కాపాడడం, రైళ్లలో జరిగే దొంగతనాలు, అక్రమాలు, అన్యాయం అరికట్టడం ఆమె విధులు. ప్రభుత్వోద్యోగం సాధించాలన్న కల సాకారం చేసుకున్న అపర్ణ ఈ క్రమంలో తను పడ్డ శ్రమను, శిక్షణలో అనుభవించిన కష్టాలను మరిచిపోయి రెండు రోజుల క్రితం ఎల్కతుర్తికి వచ్చింది. భర్త, పిల్లలు, కుటుంబసభ్యులను కలుసుకుని శిక్షణలో తన అనుభవాలను వారితోపాటు ‘సాక్షి’తో పంచుకుని ఆనందం వ్యక్తం చేసింది.
పట్టుదలతోనే...
పట్టుదల ఉంటే ఎంతటి అడ్డంకులైనా గడ్డిపోచతో సమానమే. పిల్లలు పుట్టారని చదవకుండా ఊరుకుంటే ఇప్పుడీ స్థాయికి వచ్చేదాన్ని కాదు. కష్టమనుకోకుండా ఇష్టపడి లక్ష్యాన్ని చేరుకున్నాను. మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. నా వేతనం నెలకు రూ.35 వేలపైనే ఉంటుందని తెలుస్తోంది. మొదటి వేతనం ఇంకా తీసుకోలేదు. నేను ఈ స్థాయికి చేరుకున్నానంటే నాభర్త, తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉంది. త్వరలోనే మన రాష్ట్రానికి ఎస్సైగా రావాలని కోరుకుంటున్నా.
- అపర్ణ