
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచీ వరుసగా 6.5 శాతం నుంచి 7 శాతం సుస్థిర వృద్ధి బాటన సాగుతుందని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ అంచనావేశారు. కేంద్రం చేపట్టిన వివిధ ఆర్థిక సంస్కరణలు ఇందుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ పురోగతిలో ఉందని కూడా వివరించారు. కోవిడ్–19 సెకండ్ వేవ్ ఎకానమీపై అంతగా ప్రభావం చూపకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ దిగ్గజ విశ్లేషణా సంస్థ– డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ) నిర్వహించిన ఒక వర్చువల్ కార్యక్రమంలో సుబ్రమణియన్ వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో ముఖ్యమైనవి...
► గడచిన ఏడాదిన్నరగా కేంద్రం పలు సంస్కరణాత్మక చర్యలను తీసుకుంటోంది. వచ్చే దశాబ్ద కాలంలో ఆయా చర్యలు మంచి వృద్ధి ఫలాలను అందిస్తాయని నేను భావిస్తున్నాను.
► 2020–21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో రికవరీ బాగుంది. అయితే ఊహించని రీతిలో సవాళ్లు వచ్చిపడ్డాయి. ముఖ్యంగా ఆరోగ్య మౌలిక రంగం తీవ్ర ఒత్తిడికి గురయ్యింది. అయితే మొదటి వేవ్‌తో పోల్చితే ఎకానమీపై ప్రభావం పరిమితమే.
► వ్యవసాయం, కార్మిక రంగాల్లో సంస్కరణలు, ఎగుమతుల పీఎల్‌ఐ స్కీమ్, సూక్ష్మ లఘు మధ్య చిన్న తరహా పరిశ్రమల నిర్వచనం మార్పు, మొండిబకాయిలకు సంబంధించి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ వంటి పలు అంశాలు భవిష్యత్‌లో దేశాభివృద్ధిని సుస్థిర బాటన నడపనున్నాయి.
► మహమ్మారి నుంచి దేశం రికవరీ సాధించడానికి వ్యాక్సినేషన్ చాలా కీలకం. తద్వారా కోవిడ్–19ను సాధారణ ఫ్లూ కింద మార్చి, దాని తీవ్రతను గణనీయంగా తగ్గించడానికి వీలవుతుంది.
రెండేళ్ల పురోగతికి దూరమయ్యాము: వివేక్ దేవ్రాయ్
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) చైర్మన్ వివేక్ దేవ్రాయ్ అంతకుముందు కార్యక్రమంలో మాట్లాడుతూ, 2021–22లో భారత్ ఎకానమీ వృద్ధి 10 శాతం ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఇది బేస్ మాయగా (పోల్చుతున్న నెల లేదా ఏడాదిలో అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెల లేదా ఏడాదిలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్) ఆయన అంగీకరించారు. మహమ్మారి వల్ల దేశం రెండేళ్లు ఆర్థిక పురోగతిని కోల్పోయిందన్నారు. ప్రస్తుతం కన్నా దాదాపు రెట్టింపై 2024–25 ఆర్థిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఆవిర్భావం కల దూరమయ్యిందన్నారు. దీనితోపాటు 2030 నాటికి సుస్థిర ఆర్థికవృద్ధి (ఎస్‌డీజీ) లక్ష్యాలనూ భారత్ చేరుకోలేని పరిస్థితి ఎదురవుతోందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment