భారత్‌లో ‘వీ’ నమూనా ఆర్థికాభివృద్ధి! | India is witnessing a V- shaped recovery | Sakshi
Sakshi News home page

భారత్‌లో ‘వీ’ నమూనా ఆర్థికాభివృద్ధి!

Sep 5 2020 5:12 AM | Updated on Sep 5 2020 5:12 AM

India is witnessing a V- shaped recovery - Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్న భారత్‌ ఆర్థిక వ్యవస్థ, తిరిగి ‘వీ’ (V) తరహా వృద్ధి రేటును చూస్తోందని ఆర్థికశాఖ నివేదిక పేర్కొంది. కోవిడ్‌–19పై సమరానికి అమలు చేసిన కఠిన లాక్‌డౌన్‌ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) భారత స్థూల దేశీయోత్పత్తి మైనస్‌ 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ గురువారం విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే...

► ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో ఒక్క భారత ఆర్థిక వ్యవస్థే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా ప్రతికూల పరిస్థితే నెలకొంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ 33 శాతం, బ్రిటన్‌ 21.7 శాతం, ఫ్రాన్స్‌ 18.9 శాతం, స్పెయిన్‌ 22.1 శాతం, ఇటలీ 17.7 శాతం, జర్మనీ 11.3 శాతం నష్టపోగా. యూరో ప్రాంతం దాదాపు మైనస్‌ 15 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. జపాన్‌ విషయంలో ఈ క్షీణ రేటు 9.9 శాతంగా ఉంది.   

 ► ఇక లాక్‌డౌన్‌ వల్ల ప్రయోజనాల విషయానికి వస్తే, కోవిడ్‌–19 ప్రతికూల పరిస్థితులపై ఈ కాలంలో ఒక స్పష్టమైన అంచనాలకు రాగలిగాం. మరణాల రేటు తగ్గడానికి తగిన చర్యలు తీసుకున్నాం.  ప్రపంచంలో కోవిడ్‌–19 ప్రేరిత మృతుల రేటు (శాతాల్లో) భారత్‌లోనే తక్కువ ఉంది. ఆగస్టు 31 వరకూ చూస్తే,  భారత్‌లో మృతుల రేటు కేవలం 1.78 శాతంగా ఉంటే, అమెరికాలో ఈ రేటు 3.04 శాతంగా ఉంది. బ్రిటన్‌లో ఈ రేటు ఏకంగా 12.35 శాతం. ఫ్రాన్స్‌లో 10.09 శాతం. జపాన్‌లో 1.89 శాతం. ఇటలీలో 13.18 శాతం.   

► ప్రస్తుతం భారత్‌ ‘వీ’ (ఠి)  తరహా వృద్ధి పురోగమనంలో ఉంది. ఇందుకు తగిన గణాంకాలు కనిపిస్తున్నాయి. ఆటో, ట్రాక్టర్, ఎరువుల అమ్మకాలు పెరుగుతున్నాయి. రైల్వే రవాణా పెరుగుతోంది. స్టీల్, సిమెంట్, విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగం పెరుగుతోంది. ఈ– వే బిల్స్‌ బాగున్నాయి. జీఎస్‌టీ వసూళ్ల విషయంలో సానుకూలత కనిపిస్తోంది. రహదారులపై రోజూవారీ టోల్‌ వసూళ్లు మెరుగుపడుతున్నాయి.

రిటైల్‌ ఫైనాన్షియల్‌ లావాదేవీలు, తయారీ పర్చేజింగ్‌ మేనుఫ్యాక్చరింగ్‌ ఇండెక్స్‌ పరిస్థితి బాగుంది. మౌలిక రంగాలు సానుకూల సంకేతాలు ఇస్తున్నాయి. పెట్టుబడులు మెరుగుపడుతున్నాయ్‌. ఎగుమతులు వృద్ధి బాటలోకి వెళ్లే పరిస్థితులు నెలకొంటున్నాయి. వ్యవసాయ రంగంలో మంచి పురోగతి కనబడుతోంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు చరిత్రాత్మక రికార్డు స్థాయిల్లో (ఆగస్టు 28వ తేదీతో ముగిసిన వారంలో చరిత్రాత్మక రికార్డు స్థాయి 541.431 బిలియన్‌ డాలర్లు)కొనసాగుతున్నాయి. 14 నెలలకుపైగా దిగుమతులకు ఇవి సరిపోతాయి.  

► దేశంలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఎటువంటి ప్రతికూలతలూ లేకుండా కేంద్రం, ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటున్నాయి.  

► అయితే ఇంకా కొన్ని కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాలు, మౌలిక రంగం, స్టార్టప్స్, మానవ వనరుల నైపుణ్యత, ఆరోగ్య భద్రత వంటి రంగాల్లో ఇంకా పురోగతి సాధించాల్సి ఉంది. భూ, న్యాయ, కార్మిక, క్యాపిటల్‌ మార్కెట్‌ విభాగాల్లో మరిన్ని వ్యవస్థాగత సంస్కరణలు అవసరం. నిరుద్యోగ సమస్యసహా సమస్యల పరిష్కారానికి కేంద్రం అధిక దృష్టి కేంద్రీకరించింది.  

రూపాయికి 33 పైసలు లాభం
ఈక్విటీ మార్కెట్‌ భారీగా నష్టపోయినా, శుక్రవారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ  33 పైసలు బలపడి 73.14 వద్ద ముగిసింది. దీనితో వారం వారీగా రూపాయి 25 పైసలు లాభపడినట్లయ్యింది. రూపాయి వరుసగా నాలుగు వారాల నుంచీ బలపడుతూ వస్తోంది. ఈ నెల మొత్తం ఐపీఓల ద్వారా దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడులు వస్తాయన్న అంచనాలే రూపాయి బలోపేతానికి కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రిసెర్చ్‌ డిప్యూటీ హెచ్‌ దేవర్‌‡్ష వికెల్‌ అభిప్రాయపడుతుండడం గమనార్హం.  

25 శాతం రెవెన్యూ వృద్ధి లక్ష్యంగా భారత్‌: వుయ్‌ వర్క్‌
కోవిడ్‌–19 తీవ్ర సవాళ్లు విసురుతున్నప్పటికీ, భారత్‌ ప్రస్తుత క్యాలెండర్‌ ఇయర్‌లో 25 శాతం రెవెన్యూ వృద్ధి లక్ష్యంతో ఉందని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న రియల్టీ సంస్థ– ఎంబసీ గ్రూప్‌ అనుబంధ విభాగం వుయ్‌ వర్క్‌ అంచనావేసింది. దీనిని సాధించే అవకాశాలు కూడా భారత్‌కు ఉన్నాయని అభిప్రాయపడింది. అయితే రాబడీ–వ్యయాలను చూస్తే 2019 కన్నా, 2020లో కొంత ప్రతికూలతలు తప్పవని తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement