2024–25పై ఫిక్కీ అంచనా
ద్రవ్యోల్బణం దిగివస్తుందనీ విశ్లేషణ
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ రెండవ త్రైమాసికంలో 5.4 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును నమోదుచేయడాన్ని ‘‘తాత్కాలిక ధోరణి’’గా ఫిక్కీ ప్రెసిడెంట్, ఇమామీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష వర్ధన్ అగర్వాల్ పేర్కొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 6.5 నుంచి 7 శాతం ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని పరిశ్రమ సంఘం అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు పెట్టుబడులూ పుంజుకుంటాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఒక ఇంటర్వ్యూలో అగర్వాల్ పేర్కొన్న ముఖ్యాంశాలు...
→ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యోల్బణం –ఆర్థిక వృద్ధికి మధ్య చక్కటి సమన్వయాన్ని సాధించాల్సి ఉంది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల విషయంలో ఆర్‌బీఐ పూర్తి పరిపక్వతతో వ్యవహరిస్తోంది.
→ వచ్చే నెలలో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని పరిపాలన బాధ్యతలు స్వీకరించిన తర్వాత, భారతదేశానికి భారీ సవాళ్లు వస్తాయని నేను భావించడం లేదు. → భౌగోళికంగా–రాజకీయంగా ఇప్పుడు ప్రతి దేశం వాటి ప్రయోజనాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. అయితే, ట్రంప్ పాలనా కాలంలో భారత్‌కు భారీ సవాళ్లు ఉంటాయని నేను భావించడం లేదు. ముఖ్యంగా మెక్సికో, చైనా తదితర దేశాలకు టారిఫ్‌లు ఎక్కువగా
ఉండవచ్చు.
→ ట్రంప్ పాలనా కాలంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు, కానీ స్థూలంగా చూస్తే, భారత్ పరిశ్రమలకు అవకాశాలు లభించే అనేక
అంశాలు ఉన్నాయి.
→ భారత్ ప్రైవేట్ రంగ మూలధన పెట్టుబడి వ్యయాలు మరింత పెరగాలి. సామర్థ్య వినియోగ స్థాయిలు 75 శాతానికి చేరాలి. ఇది సాధ్యమయ్యే విషయమేనని మేము
విశ్వసిస్తున్నాం.
→ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తన మూలధన వ్యయాలను 15 శాతం పెంచాలని ఛాంబర్ బడ్జెట్ ముందస్తు సిఫార్సు చేసింది.
→ టీడీఎస్ (మూలం వద్ద పన్ను మినహాయింపు) సరళీకరణ, పర్యావరణ పరిరక్షణ వ్యవస్థ పురోగతికి బడ్జెటరీ కేటాయింపులు వంటి అంశాలనూ ఫిక్కీ సిఫారసు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment