జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.4 శాతం
తయారీ, వినియోగం, మైనింగ్ రంగాలు పేలవం
రెండేళ్ల కనిష్టానికి ఆర్థిక వ్యవస్థ..
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీలో వృద్ధి మందగమనం నెలకొంది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్, క్యూ2) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.4 శాతానికి (2023 ఇదే కాలంలో పోల్చి) పరిమితమైంది. గడచిన రెండేళ్లలో ఇంత తక్కువ స్థాయి జీడీపీ వృద్ధి రేటు ఇదే తొలిసారి.
ఇంతక్రితం 2022–23 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం) భారత్ ఎకానమీ 4.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. సమీక్షా కాలంలో తయారీ, వినియోగం, మైనింగ్ రంగాలు పేలవ పనితీరును ప్రదర్శించినట్లు శుక్రవారం విడుదలైన జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) డేటా వెల్లడించింది.
5.4 శాతం వృద్ధి రేటు ఎలా అంటే..
2023–24 రెండవ త్రైమాసికంలో (2011–12 ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికగా) ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తూ, స్థిర ధరల వల్ల వాస్తవ జీడీపీ విలువ రూ.41.86 లక్షల కోట్లు. తాజా సమీక్షా కాలం (2024 జూలై–సెపె్టంబర్) ఈ విలువ రూ.44.10 లక్షల కోట్లకు ఎగసింది. వెరసి జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదయ్యింది. ఇక ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయని ప్రస్తుత ధరల వద్ద ఇదే కాలంలో జీడీపీ విలువ రూ.70.90 లక్షల కోట్ల నుంచి రూ.76.60 లక్షల కోట్లకు చేరింది. ఈ ప్రాతిపదికన వృద్ధి రేటు 8 శాతం.
ఆరు నెలల్లో వృద్ధి 6 శాతం
ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) ద్రవ్యోల్బణం సర్దుబాటుతో స్థిర ధరల వద్ద గత ఏడాది ఇదే కాలంలో జీడీపీ విలువ 82.77 లక్షల కోట్లుగా ఉంటే, తాజాగా 87.74 లక్షల కోట్లకు చేరింది. వెరసి వృద్ధి రేటు 6%గా నమోదైంది. ప్రస్తుత ధరల వద్ద చూస్తే, విలువ రూ.141.40 లక్షల కోట్ల నుంచి రూ.153.91 లక్షల కోట్లకు ఎగసింది. వెరసి వృద్ధి రేటు 8.9%.
కీలక రంగాలు ఇలా...
→ తయారీ రంగంలో వృద్ధి రేటు 14.3 శాతం (2023 క్యూ2) నుంచి 2.2 శాతానికి పడిపోయింది.
→ వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 1.7 శాతం నుంచి 3.5 శాతానికి ఎగసింది.
→ మైనింగ్ అండ్ క్వారీయింగ్ విభాగంలో 11.1 శాతం వృద్ధి రేటు 0.01 శాతానికి క్షీణబాట పట్టింది.
→ ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సరీ్వసుల విభాగంలో వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 6.7 శాతానికి ఎగసింది.
→ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల విభాగంలో వృద్ధి రేటు 10.5 శాతం నుంచి 3.3 శాతానికి మందగించింది.
→ నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 13.6 శాతం నుంచి 7.7 శాతానికి పడిపోయింది.
→ ప్రైవేటు తుది వినియోగ వ్యయం (పీఎఫ్‌సీఈ) వృద్ధి రేటు తాజా సమీక్షా కాలంలో 6 శాతంగా నమోదయ్యింది. క్యూ1 (ఏప్రిల్–జూన్) ఈ విభాగం వృద్ధి రేటు 7.4%గా ఉంది.
అక్టోబర్లో ‘మౌలిక’ రంగమూ నిరాశే..
ఇదిలావుండగా, ఎనిమిది మౌలిక పారిశ్రామిక విభాగాల వృద్ధి రేటు అక్టోబర్‌లో 3.1 శాతంగా నమోదయ్యింది. 2023 ఇదే నెలతో పోలి్చతే (12.7 శాతం) వృద్ధి రేటు భారీగా పడిపోవడం గమనార్హం. బొగ్గు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాల్లో వృద్ధి మందగించగా, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు రంగాల్లో ఏకంగా క్షీణత నమోదయ్యింది. రిఫైనరీ ప్రొడక్టుల్లో మాత్రం వృద్ధి రేటు పెరిగింది. కాగా, ఈ ఎనిమిది రంగాలూ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ 4.1 శాతం వృద్ధి సాధించగా, 2023 ఇదే కాలంలో ఈ రేటు 8.8 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ 40.27%.
వృద్ధి వేగంలో గ్లోబల్ ఫస్ట్..
తాజాగా గణాంకాలు వెలువడిన క్యూ2లో వృద్ధి వేగంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలోనే కొనసాగింది. భారత్ ఈ సమయంలో 5.4 శాతం వృద్ధి సాధిస్తే, రెండవ స్థానంలో ఉన్న చైనా ఇదే కాలంలో 4.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.
నిరుత్సాహమే, కానీ...
జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదు కావడం నిరుత్సాహపరిచే అంశమే. అయితే ఎకానమీలోని కొన్ని విభాగాల్లో సానుకూలతలు కనిపిస్తున్నాయి. వ్యవసాయం–అనుబంధ పరిశ్రమలు, నిర్మాణ రంగం ఇందులో ఉన్నాయి. ఆ అంశాలు ఎకానమీ ప్రమాదంలో లేదని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి.
– వీ అనంత నాగేశ్వరన్, సీఈఏ
Comments
Please login to add a commentAdd a comment