BT naidu
-
కుల వృత్తి లేని వాల్మీకులకు కార్పొరేషన్ రుణాలు
వాల్మీకి జయంతి నాటికి ఎస్టీ సాధనపై శుభవార్త – వాల్మీకి/బోయ ఫెడరేషన్ చైర్మన్ బీటీ నాయుడు – ఘనంగా పాలకమండలి ప్రమాణ స్వీకారం కర్నూలు(అర్బన్): ఎలాంటి కుల వృత్తి లేని వాల్మీకుల ఆర్థికాభివృద్ధికి వాల్మీకి/బోయ ఫెడరేషన్ ద్వారా రుణాలను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు ఫెడరేషన్ చైర్మన్ బీటీ నాయుడు తెలిపారు. సోమవారం నగర శివారు సుంకేసుల రోడ్డులోని ఎంఆర్సీ ఫంక్షన్ హాల్లో వాల్మీకి/బోయ పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఫెడరేషన్ ఎండీ బి.నాగభూషణం చైర్మన్ బీటీ నాయుడు, డైరెక్టర్లు బి.బాదన్న, సి.హులిగయ్య, సాకె మద్దిలేటి, బి.వెంకట నారాయణ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జీలు మీనాక్షినాయుడు, కేఈ ప్రతాప్, వీరభద్రగౌడు, విష్ణువర్దన్‌రెడ్డి, తిక్కారెడ్డి, నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గుడిసె క్రిష్ణమ్మ, శాలివాహన, వడ్డెర ఫెడరేషన్ల చైర్మన్లు తుగ్గలి నాగేంద్ర, దేవళ్ల మురళీ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీటీ నాయుడు మాట్లాడుతూ వాల్మీకి/ బోయ కులాలకు చెందిన వారు ఐదుగురు కలిసి ఒక సొసైటీగా ఏర్పడితే రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని.. ఇందులో రూ.5 లక్షలు సబ్సిడీ కాగా, మిగిలిన రూ.5 లక్షలను తక్కువ వడ్డీతో ఫెడరేషన్‌కు తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఫెడరేషన్‌కు రూ.25 కోట్లు కేటాయించారని, ఈ బడ్జెట్ ఖర్చు చేస్తే రూ.100 కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమైక్యాంధ్రలో కొందరు పాలకుల పుణ్యమా అని వాల్మీకి/బోయలు ఎస్టీ, బీసీ, డీఎన్టీలుగా తీవ్రమైన ప్రాంతీయ వ్యత్యాసానికి గురవుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని దశాబ్దాలుగా ఉద్యమాలు కొనసాగుతున్నాయన్నారు. అక్టోబర్‌లో జరగనున్న మహర్షి వాల్మీకి జయంతి నాటికి వాల్మీకులంతా తమ చిరకాల కోరికపై శుభవార్త వింటారన్నారు. వాల్మీకులు సమిధలు కారాదు : రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన వాల్మీకులు ఫ్యాక్షన్ ఊబిలో కూరుకుపోయి ఎవరి కోసం సమిధలు కారాదని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. గతంలో జిల్లాలో ఒక ఎస్పీ పనిచేసిన సమయంలో అనేక మంది వాల్మీకులు ఎన్కౌంటర్ అయ్యారని, కానీ ఆ నాయకుని కుటుంబంలో ఒక్కరు కూడా ఎన్కౌంటర్ కాలేదన్నారు. టీడీపీలో మొదటి నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్న బీటీ నాయుడుకు ఫెడరేషన్ చైర్మన్ అప్పగించడం మంచి గుర్తింపు ఇచ్చినట్లయిందన్నారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ కొలుసు లాలా లజపతిరావు, ఏఈఓ సుబ్రమణ్యంతో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వాల్మీకులు హాజరయ్యారు. -
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి
ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్రప్రధాన కార్యదర్శి బీటీనాయుడు పత్తికొండ టౌన్: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీటీ నాయుడు డిమాండ్ చేశారు. బుధవారం పత్తికొండలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చేవరకు బ్రిటీష్‌వారి హయాంలో రెండువందల ఏళ్లు వాల్మీకులు ఎస్టీలుగానే ఉన్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాల్మీకులు ఎస్సీలుగా, కర్ణాటకలో ఎస్టీలుగా గుర్తించారన్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో వాల్మీకులు విద్య, ఉద్యోగపరంగా అభివృద్ధి సాధించారన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కోస్తాలోని ఐదు జిల్లాల్లో ఎస్టీలుగా, తెలంగాణ ప్రాంతంలో బీసీలుగా, రాయలసీమ ప్రాంతంలో డీనోటిఫైడ్ ట్రైబ్‌లుగా గుర్తించారన్నారు. ఒకే రాష్ట్రంలో ప్రాంతీయ వ్యత్యాసాలతో పూర్తిగా నష్టపోయారన్నారు. వాల్మీకులకు కులవృత్తి లేకపోవడంతో రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ ఊబిలో చిక్కుకుని నేరాలకు పాల్పడి, కేసులలో ఇరుక్కుని కుటుంబాలు నాశనం చేసుకున్నారన్నారు. అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల వేళ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీలు ఇచ్చి, తర్వాత విస్మరిస్తున్నాయన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో వాల్మీకులను ఎస్టీజాబితాలో చేరుస్తామని తీర్మానం చేసి, పార్లమెంట్‌కు పంపించాడన్నారు. అలాగే రిటైర్డు ఐఏఎస్ చెల్లప్ప ఆధ్వర్యంలో కమిటీని నియమించారన్నారు. ఈ విషయమై వాల్మీకి సంఘాల నాయకులతో కలసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి తమ సమస్య విన్నవించామన్నారు. సీఎం చంద్రబాబు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంపై సానుకూలంగా స్పందించాడన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ మైరాముడు, బీసీసంక్షేమసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆస్పరి శ్రీనివాసులు నాయుడు, వాల్మీకిసంఘం నాయకులు ఆస్పరి రవిచంద్ర, బీటీ గోవిందు, హోసూరు రామాంజినేయులు, దస్తగిరి నాయుడు, మునిస్వామి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
వాల్మీకుల అభ్యున్నతికి కృషి
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకుల విషయంలో నెలకొన్న ప్రాంతీయ వ్యత్యాసాలను తొలగించేందుకు కృషి చేస్తామని మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. విషయంపై ప్రభుత్వ కార్యదర్శులతో చర్చించి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వాల్మీకి మహర్శి జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక బుధవారపేట సర్కిల్లో జరిగిన ఉత్సవ సభకు మంత్రి అధ్యక్షత వహించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, ఏజేసీ రామస్వామి, జెడ్పీ సీఈఓ ఏ సూర్యప్రకాష్, డీసీసీ అధ్యక్షులు బీవై రామయ్య హాజరయ్యారు. ముందుగా వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి జ్యోతులు వెలిగించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎస్టీ జాబితాలో చేరేందుకు వాల్మీకులు పోరాటం చేస్తున్నారని, అయితే ఇందుకు సంబంధించి రాజ్యాంగపరమైన ఇబ్బందులున్నట్లు తెలిసిందన్నారు. సమస్యలను తొలగించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జోహరాపురం ప్రాంతంలో వాల్మీకి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలాన్వేషణ పూర్తయిందని చెప్పిన మంత్రి త్వరలోనే భూమి పూజ నిర్వహిస్తామని తెలిపారు. నగరంలో వాల్మీకి విగ్రహం ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బీటీ నాయుడు మాట్లాడుతూ వాల్మీకులను ప్రత్యేకంగా ఎస్టీ జాబితాలో చేర్చాల్సిన అవసరం లేదని, ఇందుకు సంబంధించి ప్రాంతీయ వివక్షను తొలగిస్తే చాలన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని కోరారు. జిల్లాలో అనేక సంవత్సరాలుగా సత్ప్రవర్తనతో జీవిస్తున్న ఎంతో మంది వాల్మీకుల పేర్లు రౌడీషీటర్ల జాబితాలో ఉన్నాయని, ఎక్కడ నేరం జరిగినా ముందుగా వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూవాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ ఆందోళన వ్యక్తం చేశారు. సత్ప్రవర్తన కలిగిన వాల్మీకుల పేర్లను రౌడీషీటర్ల జాబితా నుంచి తొలగించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్పీతో సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సందర్భంగా మహర్శి వాల్మీకి వేషధారణలో వచ్చిన రమణ ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. మాజీ మేయర్ బంగి అనంతయ్య, జిల్లా బీసీ సంక్షేమాధికారి రవిచంద్ర, బీసీ కార్పొరేషన్ ఈడీ రమణ, సాంఘీక సంక్షేమశాఖ డీడీ ఎంఎస్ శోభారాణి, డా.భవానీప్రసాద్, డా.టి పుల్లన్న, డా.మోహన్, సీనియర్ పాత్రికేయులు టి మద్దిలేటి, బీసీ హెచ్డ బ్ల్యూఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, రాష్ట్ర బీసీ నాయకులు గడ్డం రామక్రిష్ణ, వాల్మీకి నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.