కుల వృత్తి లేని వాల్మీకులకు కార్పొరేషన్ రుణాలు
కుల వృత్తి లేని వాల్మీకులకు కార్పొరేషన్ రుణాలు
Published Mon, Jun 12 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM
వాల్మీకి జయంతి నాటికి ఎస్‌టీ సాధనపై శుభవార్త
– వాల్మీకి/బోయ ఫెడరేషన్ చైర్మన్ బీటీ నాయుడు
– ఘనంగా పాలకమండలి ప్రమాణ స్వీకారం
కర్నూలు(అర్బన్): ఎలాంటి కుల వృత్తి లేని వాల్మీకుల ఆర్థికాభివృద్ధికి వాల్మీకి/బోయ ఫెడరేషన్ ద్వారా రుణాలను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు ఫెడరేషన్ చైర్మన్ బీటీ నాయుడు తెలిపారు. సోమవారం నగర శివారు సుంకేసుల రోడ్డులోని ఎంఆర్‌సీ ఫంక‌్షన్ హాల్‌లో వాల్మీకి/బోయ పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఫెడరేషన్ ఎండీ బి.నాగభూషణం చైర్మన్ బీటీ నాయుడు, డైరెక్టర్లు బి.బాదన్న, సి.హులిగయ్య, సాకె మద్దిలేటి, బి.వెంకట నారాయణ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు మీనాక్షినాయుడు, కేఈ ప్రతాప్, వీరభద్రగౌడు, విష్ణువర్దన్‌రెడ్డి, తిక్కారెడ్డి, నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గుడిసె క్రిష్ణమ్మ, శాలివాహన, వడ్డెర ఫెడరేషన్ల చైర్మన్లు తుగ్గలి నాగేంద్ర, దేవళ్ల మురళీ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీటీ నాయుడు మాట్లాడుతూ వాల్మీకి/ బోయ కులాలకు చెందిన వారు ఐదుగురు కలిసి ఒక సొసైటీగా ఏర్పడితే రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని.. ఇందులో రూ.5 లక్షలు సబ్సిడీ కాగా, మిగిలిన రూ.5 లక్షలను తక్కువ వడ్డీతో ఫెడరేషన్‌కు తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఫెడరేషన్‌కు రూ.25 కోట్లు కేటాయించారని, ఈ బడ్జెట్ ఖర్చు చేస్తే రూ.100 కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమైక్యాంధ్రలో కొందరు పాలకుల పుణ్యమా అని వాల్మీకి/బోయలు ఎస్‌టీ, బీసీ, డీఎన్‌టీలుగా తీవ్రమైన ప్రాంతీయ వ్యత్యాసానికి గురవుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకులను ఎస్‌టీ జాబితాలో చేర్చాలని దశాబ్దాలుగా ఉద్యమాలు కొనసాగుతున్నాయన్నారు. అక్టోబర్‌లో జరగనున్న మహర్షి వాల్మీకి జయంతి నాటికి వాల్మీకులంతా తమ చిరకాల కోరికపై శుభవార్త వింటారన్నారు.
వాల్మీకులు సమిధలు కారాదు : రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన వాల్మీకులు ఫ్యాక‌్షన్ ఊబిలో కూరుకుపోయి ఎవరి కోసం సమిధలు కారాదని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. గతంలో జిల్లాలో ఒక ఎస్‌పీ పనిచేసిన సమయంలో అనేక మంది వాల్మీకులు ఎన్‌కౌంటర్ అయ్యారని, కానీ ఆ నాయకుని కుటుంబంలో ఒక్కరు కూడా ఎన్‌కౌంటర్ కాలేదన్నారు. టీడీపీలో మొదటి నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్న బీటీ నాయుడుకు ఫెడరేషన్ చైర్మన్ అప్పగించడం మంచి గుర్తింపు ఇచ్చినట్లయిందన్నారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ కొలుసు లాలా లజపతిరావు, ఏఈఓ సుబ్రమణ్యంతో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వాల్మీకులు హాజరయ్యారు.
Advertisement