బడ్జెట్‌పై బహిరంగ చర్చకు రెడీ.. చంద్రబాబుకు కాకాణి సవాల్‌ | Ex Minister Kakani Govardhan Reddy Comments On Yanamala Ramakrishnudu | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌పై బహిరంగ చర్చకు రెడీ.. చంద్రబాబుకు కాకాణి సవాల్‌

Published Thu, Nov 14 2024 9:22 PM | Last Updated on Thu, Nov 14 2024 9:22 PM

Ex Minister Kakani Govardhan Reddy Comments On Yanamala Ramakrishnudu

సాక్షి, నెల్లూరు: బడ్జెట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సీఎం చంద్రబాబుతో సహా మంత్రులకు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్ విసిరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసే అవకాశం లేనేలేదని.. అందుకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరే నిదర్శనమన్నారు. శాసనమండలిలో బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ప్రసంగాన్ని కాకాణి ఖండించారు.

‘‘యనమల రామకృష్ణుడుకి మతి భ్రమించి మాట్లాడారు. మాజీ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడే మాటలు ఇవేనా ? సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టడానికే జగన్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ చంద్రబాబు పాలన కంటే జగన్ ప్రభుత్వంలోనే సమర్దవంతంగా పనిచేసింది. చంద్రబాబు వ్యాఖ్యలు, యనమల రామకృష్ణుడు మాటలు అర్థం పర్థం లేనివి. బడ్జెట్ పత్రాల్లో రాష్ట్రానికున్న అప్పులు రూ. 6.46 లక్షల కోట్లు ఉన్నాయని చంద్రబాబు ప్రభుత్వమే ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పత్రాల్లో స్పష్టమైనప్పటికీ టీడీపీ ఇంకా అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. శాసనమండలిలో యనమల రామకృష్ణుడు రూ.14 లక్షల కోట్లు అప్పులున్నాయని ఇంకా అబద్దాలు చెప్తున్నారు.’’

‘‘తెచ్చిన మొత్తం అప్పులను కాగ్‌కు వెల్లడించలేదని యనమల ఆరోపిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పులను కాగ్‌కు చెప్పలేదని మరో విచిత్రమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఐదునెలలు అయ్యింది. మరి ఈ ఐదునెలల కాలంలో అప్పులు ఇంకా ఉన్నాయి. దాచిపెట్టారని అనుకుంటే ఎందుకు తవ్వి తీయలేదు? అప్పులను దాచేశారని కనిపెట్టి ఉంటే.. ఎందుకు బడ్జెట్‌ పత్రాల్లో పెట్టలేదు?

రూ.2.23 లక్షల కోట్లు బడ్జెట్యేతర అప్పులు వైఎస్సార్సీపీ చేసిందని చెబుతున్న యనమల అలా ఉంటే వాటిని ఎందుకు బడ్జెట్ పత్రాల్లో పెట్టలేదు. ఆర్థిక మంత్రిగా పలుమార్లు పనిచేసిన యనమలకు బడ్జెట్‌ పత్రాలు కూడా అర్థంకాలేదు. రూ.2.23లక్షల కోట్లమేర పూచీకత్తుల కింద అప్పులు తీసుకునేందుకు మాత్రమే ప్రభుత్వానికి పరిమితి ఉందని, అంత వెసులుబాటు ఉన్నా గ్యారంటీలు చూపి కేవలం రూ.1.54 లక్షలకు మాత్రమే చేసిందని కాగ్‌ చెప్పింది. మరి యనమల పచ్చి అబద్ధాలు ఎలా చెప్తారు? 

..అలాగే గ్యారంటీల ద్వారా అప్పులు తీసుకునే వెసులుబాటును బాగా పెంచేశారని కూడా యనమల అబద్ధాలు చెప్పారు. రాష్ట్రం ఆదాయం 1.74 లక్షల కోట్లు అయితే ఇందులో గ్యారంటీలద్వారా అప్పులు 89శాతం కూడా చేరుకోలేదు. మరి యనమల ఇన్ని పచ్చి అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారు. పూచీకత్తుల ద్వారా అప్పులకోసం వెసులుబాటు పెంచుకుని అప్పులు తీసేసుకున్నారన్నది వాస్తవం కాదు.

..ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో రిస్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ గురించి యనమలకు తెలియదా? పూచీకత్తుల ద్వారా తీసుకున్న అప్పులకు రిస్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ నిర్ణయించిన దానికన్నా.. చాలా తక్కువగా ఉందనే విషయం యనమలకు తెలియకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. రిస్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ చేయకున్నా సరే.. గ్యారంటీల ద్వారా అప్పులు రాష్ట్ర ఆదాయాల్లో 89 శాతం దాటడం లేదు. ఒకవేళ రిస్క్‌ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే గనుక గ్యారంటీల కన్నా తీసుకున్న అప్పులు మరింత తక్కువే. మరి యనమల ఎందుకు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. 

..చేబదుళ్లు అంటే కూడా అర్థం తెలియని వ్యక్తి యనమల. చేబుళ్లు కింద తీసుకున్నవి వెంటనే కట్టాలి. అలా చేస్తేనే మళ్లీ ఇస్తారు. 2023-2024 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి చేబదుళ్లు కింద రాష్ట్రం ఇవ్వాల్సినవి కేవలం రూ.594 కోట్లు మాత్రమే. కాని.. యనమల రూ.2 లక్షల కోట్లు భారం ఉందని అన్నట్టుగా మండలికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. క్యాపిటల్‌ ఎక్స్‌పెండేచర్‌కూ, క్యాపిటల్‌ అవుట్‌లేకూ తేడా ఉందని చెప్పుకుంటూ ఆరోపణలు చేశారు. క్యాపిటల్‌ అవుట్‌ లే ప్రకారం అసలు ఖర్చుపెట్టలేదన్నట్టుగా చెప్పారు. వాస్తవంగా క్యాపిటల్‌ అవుట్‌లే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో రూ.12,242 కోట్లు అయితే, గత ఆర్థిక సంవత్సరం నాటికి రూ.23,330 కోట్లకు చేరింది.  

..వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జీఎస్‌డీపీ బాగా పడిపోయింది, నెగెటివ్‌ గ్రోత్‌ వచ్చిందని తప్పుడు వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ జగన్‌కి ఎకానమీ అంటూ తెలియదని తప్పుడు మాటలు మాట్లాడారు. వాస్తవం ఏంటంటే వైఎస్సార్‌సీపీ హయాంలో జీడీపీలో రాష్ట్ర జీఎస్‌డీపీ 4.83 శాతానికి పెరిగింది. టీడీపీ 2014-19 మధ్య టీడీపీ హయాంలో ఇది కేవలం 4.42శాతం మాత్రమే. నిన్న(బుధవారం) వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌, ఆయన చూపించిన సాక్ష్యాధారాలతో ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయాయి. ఇకనైనా అబద్దాలు చెప్పడం మానుకుంటే మంచిది.’’ అని కాకాణి పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement