‘యనమల’ ఇలాకాలో కొండలు మాయం
తెలుగు తమ్ముళ్ల గ్రావెల్ దోపిడీ
కాకినాడ జిల్లాలో అడ్డగోలుగా తవ్వకాలు
జేబులు నింపుకొన్న టీడీపీ నేతలు
డి.పట్టా భూముల్లోనూ దందా
డి.పోలవరం, తేటగుంటల్లో వెలుగులోకి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికారం చేతికొచ్చిందని తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. అధికారులను బెదిరించి దారికి తెచ్చుకుని కొండలకు కొండలనే మాయం చేసేస్తున్నారు. మైనింగ్ నిబంధనలకు తూట్లు పొడిచి అడ్డగోలుగా గ్రావెల్ తవ్వేసి కొండలను పిండి చేస్తున్నారు. అడిగేవాడు లేడనే ధైర్యంతో అడ్డగోలు దోపిడీకి తుని పరిసర ప్రాంతాలను అడ్డాగా చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుడు ఇలాకాలో గ్రావెల్ దోపిడీ గడచిన నెల రోజులుగా ఇష్టారాజ్యంగా సాగుతోంది.
తెలుగుదేశం పార్టీ నేతల అండదండలు చూసుకుని తమ్ముళ్లు పగలు, రాత్రి అనే తేడా లేకుండా గ్రావెల్‌ను దోచుకుపోతూ కొండలను పిండి చేసేస్తున్నారు. దళితులు, బలహీనవర్గాల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం డి.పట్టా భూములను ఇచ్చి సాగుకు మలుచుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అటువంటి సాగుకు అనుకూలంగా లేని భూమిని చదును చేయిస్తున్నామనే కుంటి సాకులతో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది.
గతంలో ప్రభుత్వాలు దళితులు, బీసీల స్వయం సమృద్ధి కోసం ఇచ్చిన పట్టా భూములను కూడా వదిలి పెట్టడం లేదు. ఇందుకు తుని పరిసర ప్రాంతాలలో ఉన్న కొండలను తమ్ముళ్లు ఒకటొకటిగా మాయం చేస్తున్నారు.
అడ్డూ, అదుపూ లేదనే ధైర్యంతో..
మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ప్రాతినిధ్యం వహిస్తోన్న తుని నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా బరితెగిస్తోంది. తుని రూరల్ మండలం డి.పోలవరం శివారు అశోక్‌నగర్ గండి సమీపాన ఎ.నాయుడికి గతంలో ప్రభుత్వం 1.15 ఎకరాలు కేటాయించింది. ఆ భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగించాలనేది డి పట్టాభూములు ఇవ్వడంలో ప్రభుత్వ ఆశయం.
అటువంటి డి పట్టా భూమికి మైనింగ్, రెవెన్యూ సహా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే లారీలకు లారీలలో గ్రావెల్‌ను తవ్వేసి ఇప్పటికే రూ.లక్షలు వెనకేసుకున్నారు. డి.పట్టా భూమి నుంచి అనుమతి లేకుండా తట్ట గ్రావెల్‌ను కూడా తరలించే వెసులుబాటు ఎవరికీ లేదు. అటువంటిది గ్రావెల్ తవ్వకాలు జరిపి తుని–నర్సీపట్నం రోడ్డును ఆనుకుని ఉన్న రూ.లక్షల విలువైన 40 సెంట్ల స్థలాన్ని మెరక చేశారు. డి.పోలవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు పీఎస్ రావు అధికార అండతో గ్రావెల్ తవ్వేసి రూ.లక్షలు మింగేశారని స్థానికులు విమర్శిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల తిరగకుండానే గ్రావెల్, రాయి తవ్వేసి ట్రాక్టర్లపై తరలిస్తూ రూ.లక్షలు వెనకేసుకున్నారు. గడచిన రెండు నెలల్లోనే ఈ డి పోలవరం పరిధిలో రూ.కోటికి పైనే ఎర్ర గ్రావెల్‌ను కొల్లగొట్టారని స్థానికులు విమర్శిస్తున్నారు. డి పోలవరం నుంచి డైలీ పాతిక, ముప్‌పై లారీలకు తక్కువగాకుండా రాత్రి, పగలు అనే వ్యత్యాసం లేకుండా అడ్డగోలుగా తవ్వేసుకుపోయారు. తమ వెనుక యనమల ఉన్నారని తమకు అడ్డూ, అదుపూ లేదనే ధైర్యంతో తెలుగు తమ్ముళ్లు అడ్డగోలుగా గ్రావెల్‌ను తవ్వేసి సొమ్ము
చేసుకుంటున్నారు.
పోలవరం ఎడమ కాలువ మట్టినీ తరలించారు
ఇందుకు తీసిపోని రీతిలోనే కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారికి అతి సమీపాన తుని రూరల్ మండల పరిధిలో తేటగుంట శివారు రాజులకొత్తూరులో ఇదే దందా నడుస్తోంది. రాజులకొత్తూరు సమీపాన జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న జిరాయితీ భూమి చదును చేసుకుంటున్నామంటూ దొడ్డిదారిన గ్రావెల్‌ను తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ సర్పంచ్, మండల స్థాయి నాయకుడు కుమ్మక్కై రెడ్ గ్రావెల్ తవ్వకాలతో అక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.
ఇక్కడి నుంచి నిత్యం 10, 12 టైర్ల లారీల్లో 50 వరకు గ్రావెల్‌ను తరలించేసి రూ.లక్షలు కూడబెడుతున్నారు. అటవీ భూములు అక్రమంగా తవ్వేస్తున్నారన్న ఫిర్యాదుతో రెవెన్యూ, ఫారెస్టు అధికారులు సర్వే జరిపి జిరాయితీ భూమికి, అటవీ భూమికి సరిహద్దులు ఏర్పాటు చేశారు. కానీ గుట్టుచప్పుడు కాకుండా గ్రావెల్ తవ్వకాల దందాకు మాత్రం అడ్డుకట్ట వేసే నాథుడే లేకుండా పోయాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లోవకొత్తూరు, తేటగుంట సమీపాన పోలవరం ఎడమ ప్రధాన కాలువ గట్ల వెంబడి ఎర్రమట్టిని కూడా అయినకాడికి తెగనమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. కాలువల నుంచి తీసిన మట్టితో పాటు గట్లను కూడా పెకలించి వేసి మట్టిని దోచుకుపోతున్నారు. డైలీ లారీల్లో ఎడమ కాలువ మట్టిని తవ్వి లారీకి రూ.15 వేలు నుంచి రూ.20 వేలు వంతున అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment