APNGO association
-
ఉద్యోగుల ఆకాంక్ష తీరేలా!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా పండుగ కానుకగా 2022 జూలై ఒకటికి సంబంధించిన డీఏ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. బకాయి ఉన్న రెండు డీఏల్లో ఒకటి పండుగ రోజు ఇస్తామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో మహిళా ఉద్యోగులకు ఇతర శాఖల ఉద్యోగుల మాదిరిగానే 5 రోజులు అడిషనల్ లీవులు ఇస్తామని చెప్పారు. సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ఎన్జీవోల సంఘం 21వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగుల ప్రయోజనాలు, వారికి మంచి చేసే విషయంలో గతంలోని అన్ని ప్రభుత్వాల కంటే ఎంతో ముందున్నామని తెలిపారు. ఉద్యోగులకు మంచి చేసే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గే పరిస్థితే లేదని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులదని, వారికి తోడుగా ఉంటున్న ప్రభుత్వమని చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మీ భుజ స్కందాలపైనుంచే... సంక్షేమాన్ని అందించడం, అభివృద్ధిని పంచిపెట్టడం, సేవా ఫలాలను ప్రజల దాకా తీసుకెళ్లడంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు ఉద్యోగులే. విధాన నిర్ణయాలు తీసుకునేది రాజకీయ వ్యవస్థ, ముఖ్యమంత్రి అయితే వాటిని అమలు చేసేది మీరే. పౌర సేవలు ప్రజల వద్దకు డెలివరీ అయ్యేది మీ భుజ స్కందాలపైనుంచే. మీ సంతోషం, మీ భవిష్యత్ మన ప్రభుత్వ ప్రాధాన్యతలేనని మీ అందరికీ మరోసారి భరోసా ఇస్తున్నా. అది నా బాధ్యత. ప్రభుత్వం అనే కుటుంబంలో కీలక సభ్యులైన మీ అందరి పట్ల అభిమానాన్ని, గౌరవాన్ని, ప్రేమను, మరీ ముఖ్యంగా నిజాయితీని చాటే విషయంలో మన ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వంతో పోల్చినా మిన్నగా, సానుకూలంగా ఉందని సవినయంగా తెలియజేస్తున్నా. ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించాం 2019లో అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు ఆర్నెళ్లలోనే గ్రామ స్థాయిలో సేవలను అందుబాటులోకి తెచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఎంత కమిట్మెంట్ చూపించామంటే ఏకంగా 1.35 లక్షల శాశ్వత ఉద్యోగాలను ప్రతి గ్రామం, మున్సిపాలిటీ వ్యవస్థలో సచివాలయ వ్యవస్థ ద్వారా రిక్రూట్ చేశాం. చాలామంది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమన్నారు. వారి బాధలకు వాళ్లను వదిలేయాలని ఎంతో మంది సలహా ఇచ్చారు. విలీనంతో ఎన్నో సమస్యలు వస్తాయన్నారు. అయినాసరే ఆర్టీసీ ఉద్యోగులపై మమకారంతో కమిట్మెంట్లో ఎక్కడా లోపం చేయలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మీరందరూ చూశారు. నిజాయితీగా, కమిట్మెంట్తో అడుగులు వేశాం. పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం మనందరిది. గత ప్రభుత్వ హయాంలో అతి తక్కువ జీతాలకు పని చేస్తూ ఎన్నికలకు 6 నెలలు ముందు వరకు రూపాయి కూడా జీతం పెరగక దయనీయ పరిస్థితిలో ఉన్న ఉద్యోగుల జీతాలను మనం వచ్చాక పెంచాం. గత పాలకులు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు వారికి జీతాలు పెంచాలనే ఆలోచనే చేయలేదు. ఓట్లు వేయించుకోవాలన్న దుర్బుద్ధితో ఎన్నికలకు ముందు పెంచారు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీతాలను మరింత పెంచి మొట్ట మొదటి రోజు నుంచి పెంచిన జీతాలు ఇస్తున్నాం. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వీఈవోలు, మెప్మా రీసోర్స్ పర్సన్లు, శానిటేషన్ వర్కర్లు, గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, హోంగార్డులు, మధ్యాహ్న భోజనం వండే ఆయాలు.. వీరందరి జీతాలను మనమే మనసు పెట్టి పెంచి ఇస్తున్నాం. జీతాల బడ్జెట్ మూడు రెట్లు పెంపు.. గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.1,100 కోట్లు మాత్రమే ఉండే జీతాల బడ్జెట్ ఇప్పుడు రూ.3,300 కోట్లకు ఎగబాకినా చిరునవ్వుతో అందరికీ మంచి చేస్తున్నాం. కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌వోఆర్ (స్టేట్ ఓన్ రెవెన్యూ) తగ్గినా డీబీటీ ద్వారా పారదర్శకంగా సంక్షేమ ఫలాలను అందించాం. ఇవన్నీ జరగబట్టే ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు.ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వు ఉంది అంటే దానికి కారణం మీరు (ఉద్యోగులు) మీరు డెలివరీ చేసిన విధానం అని చెప్పడానికి గర్వపడుతున్నా. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ప్రజలను కష్టాలకు వదిలేయలేదు. ఉద్యోగుల పట్లా మానవత్వంతో వ్యవహరించాం. గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వదిలేసిన ఆర్టీసీ కారుణ్య నియామకాల విషయంలోగానీ 10 వేలకుపైగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో గానీ ఏపీ వైద్య విధాన పరిషత్‌లోని 14,658 మందిని ప్రభుత్వంలోకి తీసుకొనే విషయంలోగానీ జిల్లా కేంద్రాలన్నింటిలోనూ 16 శాతం హెచ్ఆర్ఏ ఇచ్చే విషయంలోగానీ ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా 55 వేల మంది సిబ్బందిని క్రమబద్ధీకరించడంలోగానీ 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలోగానీ భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్‌చేసే విషయంలోగానీ ఎంఈవోల నియామకాలు, ఎంపీడీవోలకు ప్రమోషన్లు ఇవ్వడం.. ఇలా అనేక అంశాల్లో గత ప్రభుత్వం మాదిరిగా మన ప్రభుత్వం ఎవరికీ అన్యాయం చేయలేదు. ప్రతి సమస్యనూ పరిష్కరించాలి, ఉద్యోగుల ముఖంలో చిరునవ్వు చూడాలనే తపన, తాపత్రయంతో సమస్యలను పరిష్కరిస్తూ ఉద్యోగులకు తోడుగా నిలిచాం. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ ఇవ్వడం మొదలు పెట్టింది మనందరి ప్రభుత్వమే. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ కిందకు తెచ్చి కమిషన్లు లేకుండా నెలలో మొదటి వారంలోనే జీతాలు ఇచ్చేలా అండగా నిలబడగలిగాం. ప్రతి గ్రామంలో నాడు – నేడు ఉద్యోగులు ఎంతమంది? మీరే చూడండి.. గతంలో ప్రతి గ్రామంలో ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండే వారు? ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండేవి? ఈరోజు ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు? ఎన్ని కార్యాలయాలు గ్రామంలో ఉన్నాయో ఆలోచన చేయండి. సచివాలయాలు మొదలు రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్లు.. కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థలే. వీటన్నింటినీ గత నాలుగేళ్లలోనే విస్తరించాం. ఇవన్నీ బాగుంటేనే ప్రజలు బాగుంటారు. ఉగ్యోగులు కూడా బాగుంటారు. చంద్రబాబు లాంటి పాలకుడు ఉంటే.. చంద్రబాబు లాంటి పాలకుడు ఉంటే ఇవన్నీ తీసేస్తారు. గవర్నమెంట్ ఆస్పత్రులు నిర్వీర్యమవుతాయి. పేషెంట్లు రావడం మానేస్తారు. పేషెంట్లు రావడం లేదని ఆస్పత్రులను తొలగిస్తారు. ఆర్టీసీని బాగా నడపలేకపోతే ప్రజలు రావట్లేదు కదా.. ఇక ఆర్టీసీ బస్సులు ఎందుకు? ఆర్టీసీ కార్మికులు ఎందుకని వాటిని మూసివేసే కార్యక్రమం చేస్తారు. ఇవాళ 26 జిల్లాలతో ప్రభుత్వ వ్యవస్థ విస్తరించింది. ఈరోజు 7 నియోజకవర్గాలకు ఓ కలెక్టర్, ఎస్పీ, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, గ్రామస్థాయిలో సచివాలయాలు, సిబ్బంది, అడుగడుగునా 50 ఇళ్లకు వలంటీర్ వ్యవస్థ ఉన్నాయి. ఈ స్థాయిలో ప్రభుత్వం, ఉద్యోగులంతా సేవలందించేందుకు ఉత్సాహంగా అడుగులు వేస్తున్న పరిస్థితి. సీపీఎస్ సమస్యపై నిజాయితీగా మనసు పెట్టా అనేక ఏళ్లుగా పరిష్కారం చూపకుండా గత ప్రభుత్వాలు గాలికి వదిలేసిన సీపీఎస్ సమస్యను పరిష్కరించేందుకు నిజాయితీగా, మనసు పెట్టి అడుగులు వేశాం. అనేక సమావేశాలు, ఆలోచనలు, ఒకటిన్నర సంవత్సరం.. ఈ స్థాయిలో అధ్యయనం చేసిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. విదేశాల్లో అమలవుతున్న రకరకాల పెన్షన్ స్కీములను కూడా అధ్యయనం చేశాం. రిటైర్ అయిన తర్వాత కూడా ఉద్యోగులు చిరునవ్వుతో జీవించేలా, న్యాయం జరిగేలా ఆర్డినెన్స్‌కు పంపించాం. జీపీఎస్.. గ్యారెంటీ పెన్షన్ స్కీమ్‌ను తెచ్చాం. మాట తప్పే ఉద్దేశమే ఉంటే ఇది అమలు చేయలేమని చెప్పి ఊరుకునేవాళ్లం. కానీ మంచి చేయాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన, తాపత్రయంతో పని చేశాం. ఈ విషయంలో నేను గడిపినంత సమయం.. బహుశా చాలా తక్కువ విషయాల్లో నేను ఇంత టైమ్ ఇచ్చి ఉంటా. ఒక మంచి సొల్యూషన్ ఇవ్వగలిగాం. రాబోయే రోజుల్లో దేశమంతా ఈ పెన్షన్ స్కీమ్‌ను కాపీ కొట్టి అనుసరించే పరిస్థితి వస్తుంది. నాడు 3.97 లక్షలు.. నేడు అదనంగా 2.06 లక్షల ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్లో కొత్త రికార్డులు నెలకొల్పిన ప్రభుత్వం మనది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు 3.97 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే మనం అధికారంలోకి వచ్చాక 2,06,388 మందిని కొత్తగా నియామకాల ద్వారా శాశ్వత ఉద్యోగులుగా నియమించాం. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో 1.35 లక్షల మంది, హెల్త్ సెక్టార్లో 53,126 మంది ఉద్యోగులు మన కళ్లెదుటే కనిపిస్తారు. నష్టాల ఊబి నుంచి ఆర్టీసీని, ఉద్యోగులను కాపాడేందుకు 53 వేల మందిని రెగ్యులరైజ్ చేశాం. మెరుగైన ప్రభుత్వ వ్యవస్థ కోసం ఇవన్నీ చేశాం. గత ప్రభుత్వ డ్రామాలతో విసిగిపోయిన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంపై క్యాబినెట్లో చర్చించాం. తొలుత 2014 జూన్‌కు ముందు 5 సంవత్సరాలు ఇస్తే సరిపోతుందనుకున్నాం. కానీ నేను జిల్లాలకు తిరగడం మొదలు పెట్టాక.. మాకు ఇబ్బందులున్నాయి, వాళ్లకు అవుతున్నాయి, మాకు రెగ్యులరైజ్ కావడం లేదని చెప్పారు. దీనిపై ఆలోచన చేశా. వారి ముఖంలో కూడా చిరునవ్వు చూడాలని మళ్లీ క్యాబినెట్లో పెట్టి వీరందరికీ ఇచ్చాం. మనసు పెట్టి మిగతావారికి కూడా మంచి జరగాలి, వారి ముఖంలో చిరునవ్వులు చూడాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేశాం. దళారీ వ్యవస్థను తొలగించి ఆప్కాస్ ద్వారా ఒకటో తారీఖునే జీతాలు వచ్చేలా, లంచాలు, కటింగ్‌లు లేకుండా ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ తెచ్చి చిరు ఉద్యోగులకు మంచి జరిగేలా అడుగులు వేశాం. ఉద్యోగులు నిశ్చింతగా తమ ఉద్యోగాలు చేసుకునేలా తగిన వాతావరణం కల్పిస్తూ అడుగులు ముందుకు వేశాం. ప్రభుత్వ రంగాల మూసివేతలో రికార్డు బాబుదే ప్రభుత్వ రంగాలను మూసివేయడం, వీఆర్ కూడా ఇవ్వకుండా గోల్డెన్ హ్యాండ్ షేక్ అంటూ ఉద్యోగులను ఇంటికి పంపడంలో గత ప్రభుత్వానిది ఓ అడ్డగోలు రికార్డు. కొన్నేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు రాసిన మనసులో మాట పుస్తకాన్ని ప్రతి ఉద్యోగీ చదవాలని విజ్ఞప్తి చేస్తున్నా. (మనసులో మాట పుస్తకంలో కొన్ని అంశాలను సీఎం జగన్ చదివి వినిపించారు). 2,70,700 ఉద్యోగాలను సమీక్షించి 40.62 శాతం అదనంగా ఉన్నాయని ఆ పుస్తకంలో ఆయన రాసుకున్నారు. శాశ్వత ఉద్యోగాల కాలపరిమితిని పరిశీలించాలని, 1996–97లోనే సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల్ని శాశ్వత ప్రాతిపదికన నియమించటాన్ని ప్రభుత్వం మానేసిందని చంద్రబాబు తన పుస్తకంలో ప్రస్తావించారు. ఓ విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగుల ఎంపిక ప్రారంభించామని, ప్రభుత్వ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన ఇవ్వాలని, సిబ్బంది సంఖ్యను తగ్గించడానికి అది ఉత్తమ మార్గమని చంద్రబాబు తన మనసులో మాట చెప్పారు. కొత్త నియామకాలు చేపట్టకూడదు. ఇవీ చంద్రబాబు మనసులో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అభిప్రాయం. విద్యుత్ సంస్థ ఉద్యోగుల్లో 66 శాతం, పౌర సరఫరాల సంస్థలో 65 శాతం, రెవెన్యూలో 64 శాతం, పోలీసు శాఖలో 62 శాతం, స్థానిక సంస్థల్లో 52 శాతం మంది అవినీతిపరులేనని తేలినట్లు చంద్రబాబు స్వయంగా ఆ పుస్తకంలో రాసుకున్నారు. అదే ప్రజాభిప్రాయమంటూ తనకు నచ్చిన పర్సెంటేజీని జోడించి పుస్తకాన్ని ముద్రించారు. కనీసం ఈ నంబర్లు రాసే ముందు ఎవరిని అడిగారు? ప్రతి ఆఫీసుకూ వెళ్లి.. వీళ్లు మాత్రమే మంచోళ్లు, మిగతావాళ్లంతా లంచగొండులనే అధికారం ఎవరిచ్చారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. ఒకటి రెండు కేసులో ఆఫీసర్లు లంచాలు తీసుకుంటే ఏసీబీ వాళ్లు రెయిడ్ చేస్తే కలెక్టర్ యాక్షన్ తీసుకుంటారు. తనంతట తానే లెక్కలు గట్టి అంతా లంచగొండులేనని, వాటిని మూసేయాలి, ప్రైవేట్ పరం చేయాలంటూ ఆ పెద్దమనిషి పుస్తకంలో రాశాడు. మరి ఇలాంటి మనిషి రేపొద్దున మీకు మంచి చేయగలడా? అని ఆలోచన చేయాలి. శాశ్వత ఉద్యోగాలకు కోత.. వ్యవస్థలు నిర్వీర్యం ఇలాంటి వ్యక్తి కాబట్టే 2014–19 మధ్య శాశ్వత ఉద్యోగుల నియామకాన్ని చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా తగ్గించారు. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆయన హయాంలో ఆర్టీసీ పరిస్థితి ఏమిటి? గవర్నమెంట్ ఆస్పత్రులు, గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి ఏమిటి? ఇక గ్రామ స్థాయిలో పరిపాలన దేవుడెరుగు! అధికారులు, పారదర్శకతతో పని లేదు. జన్మభూమి కమిటీలు చాలు.. లంచాలు తీసుకుని ఎవరికి సిఫారసు చేస్తే అదే పరిపాలన. ఐదేళ్లలో కేవలం 34 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమించారు. 1999 నుంచి 2004 మధ్య ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు మూసివేశారు. ఇందుకోసం ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ అని ఓ విభాగాన్నే సెక్రటేరియట్లో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను పప్పు బెల్లాలకు తన వాళ్లకు అమ్మేసుకున్నారు. ఉద్యోగులను నడిరోడ్డుపై వదిలేశాడు. ఆల్విన్, నిజాం షుగర్స్, రిపబ్లిక్ ఫోర్చ్, చిత్తూరు డెయిరీ, ప్రకాశం డెయిరీ.. ఇలాంటివి ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన చరిత్ర ఈ పెద్దమనిషిది. ఆయన ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల గురించి మొసలి కన్నీరు కారుస్తుంటే ఇంతకంటే ఘోరం ఏముంటుంది? మనది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వం. మీరు ఎవరి ప్రలోభాలకూ గురి కావద్దు. చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, దత్తపుత్రుడు.. వీరందరికీ ఉన్నదంతా ఒక్కటే.. కేవలం నా మీద కడుపుమంట. రాష్ట్ర ప్రజల మీద, ఉద్యోగుల మీద మీదా వీరికి ఏమాత్రం ప్రేమ లేదు. వీరు చేసే రాజకీయ విమర్శలు, రెచ్చగొట్టే మాటలు, కట్టు కథలను నమ్మవద్దని సవినయంగా కోరుతున్నా. పోలీసులు, ఉద్యోగులపై భౌతిక దాడులా? పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేతలు పగబట్టి భౌతిక దాడులు జరుపుతున్నారు. 47 మంది పోలీసులపై పుంగనూరులో దాడి చేశారు. ఒకరి కన్ను కూడా పోయింది. పోలీసులు ఏం పాపం చేశారని దాడులు చేశారు? కన్ను పోగొట్టడానికి మీరు ఎవరు? ‘‘మీకు పర్మిషన్ ఉన్న రూట్లో వెళ్లండి.. వేరే రూట్లో పోవద్దండి.. వేరే పార్టీ వాళ్లు ధర్నా చేసుకుంటున్నారు. గొడవలు జరుగుతాయి.. ’’ అని పోలీసులు చెబితే శాంతి భద్రతల సమస్య సృష్టించి శవ రాజకీయాలకు కూడా వెనుకాడని వారిని గమనించమని కోరుతున్నా. ఉద్యోగులకు మేలుపై వెనక్కి తగ్గం ఉద్యోగుల ప్రయోజనాలు, వారికి మంచి చేసే విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గే పరిస్థితి లేదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. రెండు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని శీనన్న (ఎన్జీవోల సంఘం ఛైర్మన్) అన్నారు. 2022 జూలై 1కి సంబంధించిన డీఏని దసరా పండుగనాడు మీ అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తా. మెడికల్, హెల్త్ డిపార్ట్మెంట్లో మహిళా ఉద్యోగులకు మిగతా వారి మాదిరిగా 5 రోజుల అడిషనల్ హాలిడే కావాలన్నారు. దాన్ని కూడా మంజూరు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మీది. మీకు తోడుగా ఉంటున్న ప్రభుత్వం. ఆర్థిక ఇబ్బందులతో కొద్దో గొప్పో మీరు అనుకున్న స్థాయిలో నేను చేయలేకపోయి ఉండవచ్చు. కానీ మనసు నిండా ప్రేమ మాత్రం ఎక్కువగానే ఉంది. ఈ ప్రభుత్వం మీది. మీకు మంచి చేసే విషయంలో నాలుగు అడుగులు వేయడానికి ఎప్పుడూ ముందుంటా. -
పెండింగ్‌లో ఉన్న డీఏలో ఒకటి దసరా కానుకగా అందిస్తాం: సీఎం జగన్
Updates ఏపీ ఎన్జీవో సంఘం సభ్యులందరికీ శుభాకాంక్షలంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం జగన్ ►పెండింగ్‌లో ఉన్న డీఏలో ఒకటి దసరా కానుకగా అందిస్తాం ►జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు అడ్డగోలుగా దోచుకున్నారు ►మొక్కుబడిగా కొన్ని ఉద్యోగాలు విదిల్చారు ►బాబు, ఆయన వర్గానికి నా మీద కడుపు మంట ►పుంగనూరులో పోలీసులపై దాడి చేశారు ►47 మంది పోలీసులపై దాడికి పాల్పడ్డారు ►ఒక పోలీసు కన్న పోగొట్టారు ►ఉద్యోగుల గురించి బాబుకు ఎంతో దారుణమైన అభిప్రాయాలున్నాయి ►ఉద్యోగుల్లో చంద్రబాబు ఏ వర్గాన్నీ పట్టించుకోలేదు ►బాబు దృష్టిలో కొందరు మంచొళ్లు.. మిగిలిన వారంత లంచ గొండులు ►ఉద్యోగులను ఇలా నిందించే హక్క బాబుకు ఎవరిచ్చారు ►బాబు మంచి చేయగలడా అని ఉద్యోగులు ఆలోచించాలి ►ప్రభుత్వ వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశాడు ►బాబు హయాంలో 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేశారు ►ఉద్యోగులు రిటైరయ్యాక వారి జీవితాల్లో మంచి జరగాలని తీసుకొచ్చాం ►2019 నుండి 3 లక్షల 19 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ►ఉద్యోగ వ్యవస్థను మెరుగుపరిచేలా అడుగులు వేశాం ►53 వేల మందిని హెల్త్ సెక్టార్లో నియమించాం ►ఉద్యోగుల ఇబ్బందుల గురించి ఎప్పుడూ సానుకూలంగా స్పందించాం ►ఎంతో నిజాయితీగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాం ►దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శగా నిలిచాం ►ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గ్యారెంటీ పెన్షన్ స్కీమ్‌ను తీసుకొచ్చాం ►జీపీఎస్ పెన్షన్ స్కీమ్‌కు రేపో, ఎల్లుండో ఆర్డినెన్స్ వస్తుంది ►ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న తపన ఉన్న వ్యక్తిని నేను ►ఈ పెన్షన్ స్కీమ్ దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ►గత ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను నాశనం చేసింది ►కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలలో ప్రభుత్వ యంత్రాంగం విస్తరించింది. ►ఇప్పుడు 7 నియోజకవర్గాలకు ఒక కలెక్టర్, ఒక ఎస్పీని నియమించాం ►గత ప్రభుత్వం పక్కన పడేసిన సమస్యలను పరిష్కరించాం ►కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇచ్చిన ప్రభుత్వం మనది ►ప్రతీ చోటా దళారీ వ్యవస్థకు చెక్ పెట్టాం ►నెల మొదటి వారంలోనే జీతాలు ఇస్తూ ఉద్యోగులకు అండగా నిలిచాం ►ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగాల మీద మమకారం ఉన్న ప్రభుత్వం మనది ►నాడు-నేడుతో ప్రభుత్వ బడులను కార్పోరేట్ స్కూల్స్‌కు ధీటుగా రూపొందించాం ►కారుణ్య నియామాల్లోనూ పారదర్శకత పాటించాం ►10వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం ►అభివృద్ధి, సంక్షేమంలో మాది ప్రజాప్రభుత్వం ►మాకు, ప్రజలకు మధ్య ఉద్యోగులు వారధులు ►మీ సంతోషం, మీ భవిష్యత్తు మన ప్రభుత్వ బాధ్యతే ►ఏ ప్రభుత్వంతో పోల్చినా మేము అంతకంటే మిన్నగా ఉన్నాం ►గత ప్రభుత్వం ఉద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ►పదవీ విరమణ వయస్తును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం ►ఎప్పుడూ నిజాయితీ కమిట్మెంట్తోనే అడుగులు వేశాం ►గత ప్రభుత్వం ఎన్నికలకు 6 నెలల ముందు ఉద్యోగులను మభ్యపెట్టింది ►అన్ని వర్గాల ఉద్యోగులకు జీతాలు పెంచింది మనమే ►కోవిడ్ టైంలో రెవెన్యూ తగ్గినా డీబీటీని అమలు చేశాం ►విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీఎన్జీవో అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం) 21 వ రాష్ట్ర మహా సభలకు హాజరైన సీఎం జగన్ ►ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌తో పాలు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. -
రాజధానిని వదులుకుంటే చరిత్ర క్షమించదు..
టెక్కలి: విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని వక్తలు నొక్కి వక్కాణించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గురువారం నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. విద్యార్థి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సామాజిక సంఘాల ప్రతినిధులు పాల్గొని విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు కావాల్సిందేనంటూ తీర్మానించారు. ప్రాంతీయ అసమానతలకు తావులేకుండా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతాశయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖలో రాజధానికి శ్రీకారం చుట్టారని, దీనికి మనమంతా మద్దతు తెలపాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు లేకుండా సీఎం వైఎస్ జగన్ వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని, ఈ క్రమంలో విశాఖను పరిపాలన రాజధానిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి చెప్పారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసుకునేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకుంటే భావితరాలు మనల్ని క్షమించవని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ హెచ్చరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా విశాఖలో రాజధాని కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఎవరు అడ్డుపడినా ఊరుకోం.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ పాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి కోసం విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరు అడ్డుపడినా తొక్కుకుంటూ రాజధానిని ఏర్పాటు చేసుకుంటాం. – ప్రొఫెసర్ గుంట తులసీరావు, శ్రీకాకుళం నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్. మద్దతిద్దాం.. వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో రాజధాని ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి ప్రభుత్వ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ చైతన్యవంతం కావాలి. – పేడాడ పరమేశ్వరరావు, జర్నలిస్టు సంఘం రాష్ట్ర నేత ఉత్తరాంధ్ర నుంచి వలస నివారణ విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటును ఉద్యోగ సంఘాల తరఫున పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం. దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వలసలను నివారించవచ్చు. విశాఖలో రాజధాని వలన కలిగే ప్రయోజనాలపై గ్రామ స్థాయిలో చర్చా వేదికలు నిర్వహించాలి. సీఎం జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. – చౌదరి పురుషోత్తంనాయుడు, ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర నేత ఇప్పుడు వదిలేస్తే.. చరిత్ర క్షమించదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఉత్తరాంధ్రపై అభిమానంతో విశాఖలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఓ సువర్ణావకాశం. ఇలాంటి అవకాశాన్ని విడిచి పెడితే చరిత్ర మనల్ని క్షమించదు. విశాఖ రాజధాని కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి. – హనుమంతు సాయిరాం, ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు. భావి తరాల భవిత కోసం.. విశాఖలో రాజధాని వల్ల కలిగే ప్రయోజనాలపై గ్రామ స్థాయిలో ప్రజలను చైతన్యపరచాలి. రాజధాని ఏర్పాటుతో భావి తరాల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. విశాఖలో రాజధాని సాధన కోసం టెక్కలి నుంచే ఉద్యమాన్ని ప్రారంభించాలి. – దానేటి శ్రీధర్, వైద్యుడు, జిల్లా నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్. -
పీఆర్సీ ప్రక్రియ నెలాఖరుకు పూర్తి
సాక్షి,అమరావతి: అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి 11వ పీఆర్సీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించి ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి హామీ లభించిందని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు పొడిగించేందుకు అంగీకరించారని, సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని సీఎంవో నుంచి హామీ లభించిందని తెలిపారు. జేఏసీల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం కోసమే రెండు జేఏసీలు కృషి చేస్తాయని, సీపీఎస్ రద్దు, పీఆర్సీ, ఫిట్మెంట్ సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. సీఎం అదనపు కార్యదర్శి కె.ధనంజయరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సీఎంవోలో ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘంగా చర్చించి తాము ఇచ్చిన వినతి పత్రంలోని అంశాలను పరిగణలోకి తీసుకున్నారని తెలిపారు. ఉద్యోగుల సహకారం మరువలేనిదని, కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందులతో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరిస్తామని చెప్పారన్నారు. 18, 19న సీఎస్‌తో భేటీ! సీపీఎస్ రద్దు, పీఆర్సీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు తదితర అంశాలను ప్రస్తావించినట్లు ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. నెట్వర్క్ ఆస్పత్రులతో సమావేశం ఏర్పాటు చేసి హెల్త్ కార్డు ద్వారా ఉత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. 45 రోజుల్లోనే కారుణ్య నియామకాలు ఇవ్వాలని కోరగా సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 17, 18వ తేదీలలో జరుగుతుందన్నారు. పీఆర్సీపై ఈ నెల 18, 19వ తేదీల్లో ఉద్యోగ సంఘాలతో సీఎస్ సమావేశాన్ని నిర్వహించి చర్చించే అవకాశం ఉందన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు జి.హృదయరాజు, వైవీ రావు, కేవీ శివారెడ్డి, జీవీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు ప్రక్రియ నెలాఖరులోగా కొలిక్కి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగుల ప్రధాన సమస్యలను వచ్చే నెలాఖరులోగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. బుధవారం తాడేపల్లిలో సీఎం కార్యాలయం అధికారులతో కలసి ఏపీ ఎన్జీవో, ఏపీ అమరావతి జేఏసీ సంఘాల నేతలతో ఆయన సమావేశమై ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. అనంతరం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుతో కలసి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఉద్యోగులకు ప్రాధాన్యత పెరిగిందని సజ్జల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేయాల్సిన కీలక బాధ్యత ఉద్యోగుల భుజస్కందాలపై ఉందన్నారు. ఉద్యోగులను తన జట్టుగా సీఎం జగన్ భావిస్తారన్నారు. ఉద్యోగుల సంక్షేమం, భద్రత విషయంలో రెండడుగులు ముందుండాలన్నది సీఎం జగన్ విధానమన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే ఎవరూ అడగకుండానే 27 శాతం ఐఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. దీనివల్ల ఏటా రూ.10 వేల కోట్ల భారం పడుతున్నప్పటికీ వెనుకాడకుండా ఇచ్చామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎన్నాళ్లగానో ఉన్న డిమాండ్‌ను నెరవేర్చి సిబ్బంది సమస్యలను సీఎం పరిష్కరించారన్నారు. త్వరలోనే అధికారిక చర్చలు ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సజ్జల స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, కొత్తగా 1.30 లక్షల ఉద్యోగాలను కల్పించి పరిపాలనను వికేంద్రీకరించామని చెప్పారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని, ఆ కారణంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కొంత జాప్యం జరిగిందన్నారు. పరిపాలన వ్యవహారాలు, సంక్షేమాభివృద్ధి పథకాల అమలులో నిమగ్నం కావడం వల్ల సీఎం జగన్‌కు సమయం చాలడం లేదని, ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఏ సమస్యతో వచ్చినా తాము పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని వివరించారు. ఇప్పుడు జరిగినవి అధికారికంగా జరుగుతున్న చర్చలు కావని, త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో నిర్వహించే సమావేశమే అధికారికమని, అప్పుడు అన్ని సంఘాలను ఆహ్వానిస్తారన్నారు. ఉద్యోగ సంఘాల వ్యవహారాల్లో రాజకీయాలు చొప్పించాలని ప్రయత్నిస్తే ఫూల్స్ అవుతారన్నారు. -
ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసరావు
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా బండి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఇప్పటివరకు అధ్యక్షునిగా ఉన్న ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి ప్రభుత్వ సర్వీస్ నుంచి బుధవారం రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం సంఘం ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి శ్రీనివాసరావును అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన స్థానంలో వైఎస్సార్ జిల్లా ఎన్జీవోల సంఘం అధ్యక్షునిగా ఉన్న కేవీ శివారెడ్డిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. చదవండి: డెయిరీ విభజనపై ఇరు రాష్ట్రాలకు నోటీసులు -
'ఉద్యోగుల ఉసురు టీడీపీకి తగులుతుంది'
సాక్షి, విజయవాడ : శాసనమండలిలో ద్రవ్యవినిమయ బిల్లు పాస్ కాకపోవడం వల్లనే ఉద్యోగులకు జీతాలు రాలేదని, అందుకు టీడీపీ ఎమ్మెల్సీలే కారణమని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ' టీడీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకోవడంతోనే మాకు జీతాలు రాలేదు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మా ఉద్యోగుల ఉసురు టీడీపీ ఎమ్మెల్సీలకు తగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 1 తేదీన జీతాలు రావాలి. జీతాలు రాక ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో మూడు నెలలకు ఆర్డినెన్స్ తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారు.. పది లక్షల మంది ఉద్యోగులు పెన్సర్స్ జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు.యాబై ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇలా మండలిలో జరగలేదు.. మాజీ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కౌన్సిల్ లో ఉండి కూడ ఉద్యోగులు మేలు జరలేదు.. అశోక్ బాబు ఉద్యోగులకు నష్టం జరుగుతుందని తెలిసి కూడా ద్రవ్యవినిమాయ బిల్లును అడ్డుకున్నారు.' అంటూ తెలిపారు. (ఈఎస్ఐ స్కాంతో సంబంధం లేదని చెప్పగలరా ?) ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ' పథకం ప్రకారం మండలి చైర్మన్ ద్రవ్యవినిమయ బిల్లును అడ్డుకున్నారు. బిల్లును అడ్డుకోవడానికి టీడీపీ ఎమ్మెల్సీలు పావుగా వాడుకున్నారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్సీలు వ్యవహరించారు. జీతాలు రాక ఉద్యోగులు అనేక ఇబ్బంది పడుతున్నారు..కౌన్సిల్ లో టీడీపీ ఎమ్మెల్సీ లు వ్యవహరించిన తీరును తీవ్రంగా కండిస్తున్నాము. బిల్లు పాస్ కాకపోతే జీతాలు రావని తెలిసి కూడా అశోక్ బాబు మాట్లాడకపోవడం దారుణం.' అంటూ వెల్లడించారు. (ఏపీలో 845 కొత్త పాజిటివ్ కేసులు) -
వికేంద్రీకరణతోనే రాష్ట్ర వికాసం
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర వికాసం సాకారమవుతుందని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం సమావేశ మందిరంలో ‘అభివృద్ధి వికేంద్రీకరణ–రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి’ అంశంపై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి మేధావుల సదస్సును నిర్వహించింది. సమితి వ్యవస్థాపకుడు ఎన్.రాజారెడ్డి మాట్లాడుతూ.. అమరావతి పేరుతో ఏక కేంద్రంగా పరిపాలన, అభివృద్ధి జరుగుతోందని, ఇది రాష్ట్రానికి ఎంతమాత్రం మంచిది కాదని చెప్పారు. రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన వెయ్యి పడకల క్యాన్సర్ ఆస్పత్రిని అమరావతికి తరలించడం శోచనీయమన్నారు. ఏపీ ఎన్జీవో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడు జిల్లాలు వెనుకబడ్డాయని కేంద్రం గుర్తించిందని, వీటికి ఊతం ఇచ్చేలా మూడు రాజధానుల నిర్ణయం నిలుస్తుందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం అంతంత మాత్రంగానే నిధులు ఇస్తోందని, ఇలాంటి సమయంలో విశాఖను పాలనా రాజధానిగా ఎంపిక చేయడం మంచి నిర్ణయమన్నారు. పాలన వికేంద్రీకరణ జరగకపోతే చరిత్ర పునరావృతమై రాష్ట్ర విభజన దిశగా అడుగులు పడతాయని అంబేడ్కర్ యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య లజపతిరాయ్ అభిప్రాయపడ్డారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. రాజధాని పేరుతో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని, ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల వద్ద 7 వేల ఎకరాల భూములు ఉండటం వెనుక ఆంతర్యమేమిటో తెలియాలన్నారు. కార్యక్రమంలో ఆచార్య ఓఆర్ రెడ్డి, ఆచార్య టి.తిమ్మారెడ్డి, ఆచార్య నిమ్మ వెంకటరావు, ఆచార్య పేటేటి ప్రేమానందం, ఆచార్య కె.చంద్రమౌళి, తిరుపతి నుంచి కుసుమకుమారి, కర్నూలు నుంచి లక్ష్మీ నారాయణ, కడప నుంచి మునిరాజు, అనంతపురం నుంచి అవుల మనోహర్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ఫలితంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ నెల 24న తిరుపతి వేదికగా ఉత్తరాంధ్ర, రాయలసీమ మేధావుల ఐక్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖ నుంచే ఎన్జీవోల కార్యకలాపాలు మహారాణిపేట (విశాఖ దక్షిణ): పరిపాలన వికేంద్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులను ఉద్యోగులు స్వాగతిస్తున్నారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. ఆదివారం విశాఖ ఎన్జీవో హోమ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే విశాఖలో రాష్ట్ర ఎన్జీవో కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తామని, ఇక్కడ నుంచే కార్యకలాపాలు జరుగుతాయని వివరించారు. 13 జిల్లాల అభివృద్ధికి ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. -
చంద్రబాబు తీరు దారుణం
సాక్షి, కాకినాడ : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మార్షల్స్‌పై టీడీపీ నేత చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష సభ్యులు చేసిన దౌర్జన్యాన్ని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం వారు విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులపై ప్రతిపక్ష నాయకులు చేసిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, దానికి బాధ్యులైన వ్యక్తులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు.. విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బందిని అనుచిత పదజాలమైన ‘బాస్టర్డ్’ అని తిట్టడం, వారిపై దాడి చేయడం, ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం బాధాకరమని అన్నారు. సాక్షాత్తూ రాష్ట్ర కేంద్ర కార్యాలయమైన అసెంబ్లీలోనే ఉద్యోగులపై దాడి చేస్తే సాధారణ ఉద్యోగుల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. అసాంఘిక శక్తులను వెనకేసుకు వచ్చి, అసెంబ్లీలోకి దౌర్జన్యంగా దూసుకెళ్లడాన్ని నియంత్రించి, నిబంధనల మేరకు పని చేసే ఉద్యోగులను తిట్టించడం, దాడికి దిగటం దారుణమని పేర్కొన్నారు. ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినే విధంగా వాడిన మాటలను చంద్రబాబునాయుడు వెంటనే ఉపసంహరించుకుని, ఉద్యోగ వర్గానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చులకన భావమేనని, ఉద్యోగులను హింసించే మనస్తత్వం ఆయనకు ఉందని అన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం నిరంతం కష్టపడి పని చేసే ఉద్యోగుల జోలికి వస్తే ఉద్యోగ సంఘాలుగా తాము ఊరుకోబోమని హెచ్చరించారు. దొమ్మీగా అసెంబ్లీలోకి వచ్చే విధానాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అక్కడ పని చేసే మార్షల్స్‌పై ఉంటుందని, ఆ విషయం చంద్రబాబుకు తెలీదా అని ఆశీర్వాదం, శ్రీనివాస్ ప్రశ్నించారు. కింది స్థాయి ఉద్యోగులపై చంద్రబాబు చేసిన దౌర్జన్యానికి క్షమాపణ చెప్పాలని, ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భావనతో ఉండడం సరికాదని అన్నారు. ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన చంద్రబాబు తీరును ప్రతి ఉద్యోగీ ఖండించాలని వారు పిలుపునిచ్చారు. -
ఏపీఎన్జీవో అశోక్‌బాబుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గన్‌ఫౌండ్రీలోని ఏపీ ఎన్జీవో భవన్‌లోని నాలుగు గదులు, ఒక సమావేశ మందిరాన్ని భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘానికి అప్పగించాలన్న గత ఉత్తర్వుల్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. భవనంలోని గదులకు తాళాలు వేసి అమరావతికి వెళ్లిపోతే వాటిని ఎన్జీవోలు ఉపయోగించుకోవాలంటే ఎలాగని నిలదీసింది. ఫోన్ చేస్తే వసతులు కల్పిస్తామని చెప్పడం కాదని, ఎవరైనా ఎన్జీవో చేసిన ఫోన్‌కు స్పందించనప్పుడు ఇక్కడున్న వారి పరిస్థితి ఏం కావాలో చెప్పాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఏపీఎన్జీవో భవన్లో నాలుగు గదులు, ఒక హాలును తమ సంఘం వినియోగించుకునేందుకు అప్పగించాలన్న ఆదేశాల్ని అశోక్‌బాబు ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదంటూ భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని శుక్రవారం ధర్మాసనం మరోసారి విచారించింది. గదులకు తాళాలు వేసి అమరావతికి వెళ్లి కూర్చుంటే వాటి వసతుల కోసం భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘం వారు ఎవరిని కలుసుకోవాలో చెప్పాలని ధర్మాసనం అడిగింది. వాచ్‌మన్‌కు దరఖాస్తు చేసుకోవాలా.. గదులు/హాలు వినియోగానికి వీలుగా ఏపీఎన్జీవో సంఘానికి చెందినవారు ఇక్కడ ఎందుకు అందుబాటులో లేరో చెప్పాలని పేర్కొంది. భాగ్యనగర్ ఎన్జీవో అసోసియేషన్ తరఫు న్యాయవాది జల్లి కనకయ్య వాదనలు వినిపిస్తూ.. గన్ఫ్రౌండీలోని ఎన్జీవో సంఘం గదుల్ని అద్దెకు ఇచ్చారని, నెలకు రూ.రెండు లక్షలు అద్దె వస్తోందని, అద్దెకు ఇవ్వని గదులకు తాళాలు వేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. తమ సంఘ సభ్యుల్ని వాచ్‌మన్ లోపలికి రానీయడం లేదన్నారు. ఈ వివరాలన్నింటినీ కౌంటర్లో తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. దీనిపై అశోక్‌బాబు తరఫు న్యాయవాది కల్పించుకుని.. ఏపీఎన్జీవో సంఘ కార్యాలయానికి ఫోన్ చేస్తే గదుల వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. వెంటనే ధర్మాసనం కల్పించుకుని.. ఫోన్ చేసినప్పుడు స్పందించకపోతే వసతి కోసం ఎక్కడ వేచి ఉండాలని ప్రశ్నించింది. హైదరాబాద్‌లో ఏపీ ఎన్జీవోకు చెందిన వారెవరైనా ఉండాలి కదా అని అడిగింది. న్యాయవాది స్పందిస్తూ.. వసతి కోసమే గదులు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయని, అయితే భాగ్యనగర్ ఎన్జీవో సంఘం కార్యాలయ గది కూడా కావాలని పట్టుబడుతోందని చెప్పారు. మీ వాదనల్ని కౌంటర్ వ్యాజ్యంలో తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయకపోవడంతో ధర్మాసనం ఆదేశాల మేరకు గత వారం జరిగిన విచారణకు అశోక్‌బాబు స్వయంగా హాజరయ్యారు. -
సంక్రాంతికి పీఆర్సీ ఇస్తాం
* 3న ఉపసంఘం భేటీ: యనమల సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి పీఆర్సీ ఇస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. పీఆర్సీ మీద చర్చించడానికి జనవరి 3న మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో చర్చల తేదీని ఆ భేటీలో ఖరారు చేస్తామని తెలిపారు. పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలూ గట్టిగా డిమాండ్ చేయలేదని, ప్రభుత్వమూ నాన్చివేత ధోరణిలో ఉందంటూ.. ‘సంక్రాంతి పీఆర్సీ తెచ్చేనా’ శీర్షికన ‘సాక్షి’వార్త ప్రచురించింది. ఈ నేపథ్యంలో అటు ఉద్యోగ సంఘాలు, ఇటు ప్రభుత్వ వర్గాల్లో కదలిక వచ్చింది. ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు నేతృత్వంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు (ఏపీ రెవెన్యూ సంఘం), వెంకటేశ్వరరావు (యూటీఎఫ్), కత్తి నరసింహారెడ్డి(ఎస్టీయూ), రఘురామిరెడ్డి (ఏపీటీఎఫ్), చంద్రశేఖరరెడ్డి(ఏపీఎన్జీవో), మురళీకృష్ణ (సచివాలయ ఉద్యోగుల సంఘం)తో కూడిన ఉద్యోగ సంఘాల జేఏసీ మంగళవారం.. యనమలతో భేటీ అయింది. సంక్రాంతికి పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. దానికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. ‘మీతో మాట్లాడకుండా ఫిట్మెంట్ నిర్ణయించం’ అని చెప్పారు. -
బిల్లును అడ్డుకోండి
సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులకు ఏపీఎన్జీవోల అల్టిమేటం లేదంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు ఈనెల 10-15 వరకు కీలకమైన రోజులు కేంద్రమంత్రులు సవరణలు కోరడం సరికాదు సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకోవడానికి కేంద్ర మంత్రులు, ఎంపీలకు ఇదే చివరి అవకాశం. విభజన ప్రక్రియకు సంబంధించి ఈ నెల 10నుంచి 15వరకు ఎంతో కీలకమైన రోజులు. అసెంబ్లీ తిప్పిపంపిన బిల్లునే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నందున , బిల్లు రాష్ట్రపతి నుంచి రాజ్యసభకు రాకుండా అడ్డుకోవాలి’’ అని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేశారు. ఏపీఎన్జీవో భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రెండువారాలు ఉండే పదవుల కోసం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుంటే చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారని కేంద్రమంత్రులను హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా.. విభజన బిల్లుపై కేంద్రమంత్రులు చేసిన సవరణలను కేబినెట్ తోసిపుచ్చిందన్నారు. అసెంబ్లీలో బిల్లును ఎమ్మెల్యేలు అడ్డుకున్న విధంగానే, పార్లమెంట్లో కూడా విభజన బిల్లు ఆమోదం పొందకుండా ఎంపీలు, మంత్రులు అడ్డుకోవాలని సూచించారు. అడ్డుకోకుంటే వారిని ప్రజలు క్షమించరని, వాళ్ల ఇళ్లముందు ప్రజలు ఎటువంటి ఆందోళనలు చేసినా ఏపీఎన్జీవోల మద్దతు ఉంటుందని తెలిపారు. సమావేశంలో సంఘం కోశాధికారి వీరేంద్రబాబు, నగర కార్యదర్శి సీవీరమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పరిరక్షణ కోసం ఉద్యోగులు చేపట్టిన ఉద్యమానికి రాజకీయ పక్షాల నుంచి కూడా సంపూర్ణ మద్దతు లభించింది. తమ పార్టీల కార్యకర్తలందరూ ఉద్యమంలో పాల్గొంటారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. త్వరలోనే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని క లిసి మద్దతు కోరతాం. విభజన బిల్లు రాజ్యసభకు వచ్చిన పక్షంలో.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ప్రజల ఆమోదం లేకుండా విభజన బిల్లుపై కేంద్ర మంత్రులు సవరణలు కోరడం సరికాదని ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. మంత్రుల మాటలను కేబినెట్ పెడచెవిన పెట్టినందున, ఇప్పటికైనా కేంద్ర మంత్రులు సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు. తెలుగు జాతి ఐక్యంగా కలసుండాలన్న ఎన్టీఆర్ ఆకాంక్షలను కాపాడాలని పురందేశ్వరికి డాక్టర్ల జేఏసీ కన్వీనర్ రాజేంద్ర విజ్ఞప్తి చేశారు. బిల్లును అడ్డుకోకపోతే చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమాలను ఆడనివ్వబోమని స్పష్టం చేశారు. -
ఆఖరి పోరాటం చేయండి
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: ఆంధ్ర రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కోరుతూ తమవంతు ప్రయత్నంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలంతా ఆఖరి పోరాటం చేయాలని ఎన్జీవో సంఘ నాయకులు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఎన్జీవోలు, సమైక్యవాదులు శ్రీకాకుళంలోని జెడ్పీ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని సమైక్యవాదులు కోరగా ఉద్యోగులు విధులు బహిష్కరించి బయటకు వచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. కార్యాలయం ఎదురుగా ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేశా రు. కళా బృందాల సభ్యులు సమైక్యాంధ్ర గీతాలు ఆలపించగా.. సమైక్యవాదులు, ఎన్జీవోలు నృత్యాలు చేశారు. అనంతరం జిల్లా కోర్టు వద్ద నాయ్యవాదుల సమైక్య శిబిరాన్ని ఎన్జీవోలు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా సమైక్యాంధ్ర పరి రక్షణ వేదిక కమిటీ చైర్మన్ హనుమంతు సాయిరాం మాట్లాడుతూ కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి తగిన మద్దతు లేదన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర విభజనకే మొగ్గుచూపడం బాధాకరమన్నారు. వేదిక ప్రతినిధులు జామి భీమశంకరరావు, దుప్పల వెంకట్రావు మాట్లాడుతూ విభజన జరిగితే ఇరుప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. కార్యక్రమంలో సమై క్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు కిలారి నారాయణరావు, శోభారాణి, పూజారి జానకీరాం, బమ్మిడి నర్సింగరావు, ఎల్.జగన్మోహనరావు, పి.జయరాం పాల్గొన్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు
-
మిన్నంటిన నిరసన
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమవారం నిరసన జ్వాలలు మిన్నంటాయి. సోనియా జన్మదినాన్ని తెలుగుజాతి విద్రోహదినం, బ్లాక్‌డేగా ప్రకటించిన పలు ప్రజా, ఉద్యోగ, విద్యార్థి, ఎన్జీఓ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. సీమాంధ్రులకు తీరని ద్రోహం తలపెట్టిన సోనియా గాంధీ సజీవంగా ఉన్న తమ దృష్టిలో మరణించినట్టేనని నెల్లూరు నగరంలో వీఆర్సీ కూడలిలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆమె దిష్టిబొమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె ఫొటో ఉన్న ఫ్లెక్సీకి హీలియం బెలూన్లు కట్టి గాల్లోకి వదిలి సోనియా ఆత్మకు పరలోక ప్రాప్తి కలిగించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్సీ కూడలిలో సోనియా దిష్టిబొమ్మకు కర్మక్రియలు నిర్వహించారు. రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కేవీఆర్ పెట్రోల్‌బంకు కూడలిలో కళ్లకు నల్లగుడ్డలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. భారీగా తరలివచ్చిన విద్యార్థినులు మానవహారం చేపట్టారు. ఏపీఎన్జీఓ సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో దర్గామిట్టలోని ఎన్జీఓ హోమ్ ఎదుట సోనియా దిష్టిబొమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. సోనియా, దిగ్విజయ్, యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంకటగిరిలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మకు ఉరి బిగించిన అనంతరం దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ కూడలిలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు.