CM Jagan Good News In APNGO Association 21st State Council Meetings, Details Inside - Sakshi
Sakshi News home page

ఉద్యోగుల ఆకాంక్ష తీరేలా!

Published Tue, Aug 22 2023 2:39 AM | Last Updated on Tue, Aug 22 2023 10:19 AM

CM Jagan good news in APNGO Association state council meetings - Sakshi

విజయవాడలో జరిగిన ఏపీఎన్జీవోల సంఘం మహాసభకు హాజరైన ఉద్యోగులు , ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా పండుగ కానుకగా 2022 జూలై ఒకటికి సంబంధించిన డీఏ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. బకాయి ఉన్న రెండు డీఏల్లో ఒకటి పండుగ రోజు ఇస్తామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో మహిళా ఉద్యోగులకు ఇతర శాఖల ఉద్యోగుల మాదిరిగానే 5 రోజులు అడిషనల్‌ లీవులు ఇస్తామని చెప్పారు. సోమవారం విజయ­వాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ ఎన్జీవోల సంఘం 21వ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలకు సీఎం జగన్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఉద్యోగుల ప్రయోజనాలు, వారికి మంచి చేసే విషయంలో గతంలోని అన్ని ప్రభుత్వాల కంటే ఎంతో ముందున్నామని తెలిపారు. ఉద్యోగులకు మంచి చేసే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గే పరిస్థితే లేదని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులదని, వారికి తోడుగా ఉంటున్న ప్రభుత్వమని చెప్పారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

మీ భుజ స్కందాలపైనుంచే...
సంక్షేమాన్ని అందించడం, అభివృద్ధిని పంచిపెట్టడం, సేవా ఫలాలను ప్రజల దాకా తీసుకెళ్లడంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు ఉద్యోగులే. విధాన నిర్ణయాలు తీసుకునేది రాజకీయ వ్యవస్థ, ముఖ్యమంత్రి అయితే వాటిని అమలు చేసేది మీరే. పౌర సేవలు ప్రజల వద్దకు డెలివరీ అయ్యేది మీ భుజ స్కందాలపైనుంచే.

మీ సంతోషం, మీ భవిష్యత్‌ మన ప్రభుత్వ ప్రాధాన్యతలేనని మీ అందరికీ మరోసారి భరోసా ఇస్తున్నా. అది నా బాధ్యత. ప్రభుత్వం అనే కుటుంబంలో కీలక సభ్యులైన మీ అందరి పట్ల అభిమానాన్ని, గౌరవాన్ని, ప్రేమను, మరీ ముఖ్యంగా నిజాయితీని చాటే విషయంలో మన ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వంతో పోల్చినా మిన్నగా, సానుకూలంగా ఉందని సవినయంగా తెలియజేస్తున్నా. 

ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించాం
2019లో అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు ఆర్నెళ్లలోనే గ్రామ స్థాయిలో సేవలను అందుబాటులోకి తెచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఎంత కమిట్‌మెంట్‌ చూపించామంటే ఏకంగా 1.35 లక్షల శాశ్వత ఉద్యోగాలను ప్రతి గ్రామం, మున్సిపాలిటీ వ్యవస్థలో సచివాలయ వ్యవస్థ ద్వారా రిక్రూట్‌ చేశాం. చాలామంది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమన్నారు.

వారి బాధలకు వాళ్లను వదిలేయాలని ఎంతో మంది సలహా ఇచ్చారు. విలీనంతో ఎన్నో సమస్యలు వస్తాయన్నారు. అయినాసరే ఆర్టీసీ ఉద్యోగులపై మమకారంతో కమిట్‌మెంట్‌లో ఎక్కడా లోపం చేయలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మీరందరూ చూశారు. నిజాయితీగా, కమిట్‌మెంట్‌తో అడుగులు వేశాం. పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం మనందరిది.

గత ప్రభుత్వ హయాంలో అతి తక్కువ జీతాలకు పని చేస్తూ ఎన్నికలకు 6 నెలలు ముందు వరకు రూపాయి కూడా జీతం పెరగక దయనీయ పరిస్థితిలో ఉన్న ఉద్యోగుల జీతాలను మనం వచ్చాక పెంచాం. గత పాలకులు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు వారికి జీతాలు పెంచాలనే ఆలోచనే చేయలేదు. ఓట్లు వేయించుకోవాలన్న దుర్బుద్ధితో ఎన్నికలకు ముందు పెంచారు.

మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీతాలను మరింత పెంచి మొట్ట మొదటి రోజు నుంచి పెంచిన జీతాలు ఇస్తున్నాం. అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, వీఈవోలు, మెప్మా రీసోర్స్‌ పర్సన్లు, శానిటేషన్‌ వర్కర్లు, గిరిజన కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు, హోంగార్డులు, మధ్యాహ్న భోజనం వండే ఆయాలు.. వీరందరి  జీతాలను మనమే మనసు పెట్టి పెంచి ఇస్తున్నాం. 

జీతాల బడ్జెట్‌ మూడు రెట్లు పెంపు..
గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.1,100 కోట్లు మాత్రమే ఉండే జీతాల బడ్జెట్‌ ఇప్పుడు రూ.3,300 కోట్లకు ఎగబాకినా చిరునవ్వుతో అందరికీ మంచి చేస్తున్నాం. కోవిడ్‌ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌వోఆర్‌ (స్టేట్‌ ఓన్‌ రెవెన్యూ) తగ్గినా డీబీటీ ద్వారా పారదర్శకంగా సంక్షేమ ఫలాలను అందించాం. ఇవన్నీ జరగబట్టే ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు.ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వు ఉంది అంటే దానికి కారణం మీరు (ఉద్యోగులు) మీరు డెలివరీ చేసిన విధానం అని చెప్పడానికి గర్వపడుతున్నా. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ప్రజలను కష్టాలకు వదిలేయలేదు. ఉద్యోగుల పట్లా మానవత్వంతో వ్యవహరించాం.

గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వదిలేసిన ఆర్టీసీ కారుణ్య నియామకాల విషయంలోగానీ 10 వేలకుపైగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో గానీ ఏపీ వైద్య విధాన పరిషత్‌లోని 14,658 మందిని ప్రభుత్వంలోకి తీసుకొనే విషయంలోగానీ జిల్లా కేంద్రాలన్నింటిలోనూ 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇచ్చే విషయంలోగానీ ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా 55 వేల మంది సిబ్బందిని క్రమబద్ధీకరించడంలోగానీ 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలోగానీ భాషా పండితులను స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోట్‌చేసే విషయంలోగానీ ఎంఈవోల నియామకాలు, ఎంపీడీవోలకు ప్రమోషన్లు ఇవ్వడం.. ఇలా అనేక అంశాల్లో గత ప్రభుత్వం మాదిరిగా మన ప్రభుత్వం ఎవరికీ అన్యాయం చేయలేదు.

ప్రతి సమస్యనూ పరిష్కరించాలి, ఉద్యోగుల ముఖంలో చిరునవ్వు చూడాలనే తపన, తాపత్రయంతో సమస్యలను పరిష్కరిస్తూ ఉద్యోగులకు తోడుగా నిలిచాం. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్‌ స్కేల్‌ ఇవ్వడం మొదలు పెట్టింది మనందరి ప్రభుత్వమే. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఆప్కాస్‌ కిందకు తెచ్చి కమిషన్లు లేకుండా నెలలో మొదటి వారంలోనే జీతాలు ఇచ్చేలా అండగా నిలబడగలిగాం. 

ప్రతి గ్రామంలో నాడు – నేడు ఉద్యోగులు ఎంతమంది?
మీరే చూడండి.. గతంలో ప్రతి గ్రామంలో ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండే వారు? ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండేవి? ఈరోజు ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు? ఎన్ని కార్యాలయాలు గ్రామంలో ఉన్నాయో ఆలోచన చేయండి. సచివాలయాలు మొదలు రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీలు, ఇంగ్లీష్‌ మీడియం ప్రభుత్వ స్కూళ్లు.. కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థలే. వీటన్నింటినీ గత నాలుగేళ్లలోనే విస్తరించాం. ఇవన్నీ బాగుంటేనే ప్రజలు బాగుంటారు. ఉగ్యోగులు కూడా బాగుంటారు. 
 
చంద్రబాబు లాంటి పాలకుడు ఉంటే.. 
చంద్రబాబు లాంటి పాలకుడు ఉంటే ఇవన్నీ తీసేస్తారు. గవర్నమెంట్‌ ఆస్పత్రులు నిర్వీర్యమవుతాయి. పేషెంట్లు రావడం మానేస్తారు. పేషెంట్లు రావడం లేదని ఆస్పత్రులను తొలగిస్తారు. ఆర్టీసీని బాగా నడపలేకపోతే ప్రజలు రావట్లేదు కదా.. ఇక ఆర్టీసీ బస్సులు ఎందుకు? ఆర్టీసీ కార్మికులు ఎందుకని వాటిని మూసివేసే కార్యక్రమం చేస్తారు.

ఇవాళ 26 జిల్లాలతో ప్రభుత్వ వ్యవస్థ విస్తరించింది. ఈరోజు 7 నియోజకవర్గాలకు ఓ కలెక్టర్, ఎస్పీ, సబ్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, గ్రామస్థాయిలో సచివాలయాలు, సిబ్బంది, అడుగడుగునా 50 ఇళ్లకు వలంటీర్‌ వ్యవస్థ ఉన్నాయి. ఈ స్థాయిలో ప్రభుత్వం, ఉద్యోగులంతా సేవలందించేందుకు ఉత్సాహంగా అడుగులు వేస్తున్న పరిస్థితి. 

సీపీఎస్‌ సమస్యపై నిజాయితీగా మనసు పెట్టా
అనేక ఏళ్లుగా పరిష్కారం చూపకుండా గత ప్రభుత్వాలు గాలికి వదిలేసిన సీపీఎస్‌ సమస్యను పరిష్కరించేందుకు నిజాయితీగా, మనసు పెట్టి అడుగులు వేశాం. అనేక సమావేశాలు, ఆలోచనలు, ఒకటిన్నర సంవత్సరం.. ఈ స్థాయిలో అధ్యయనం చేసిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. విదేశాల్లో అమలవుతున్న రకరకాల పెన్షన్‌ స్కీములను కూడా అధ్యయనం చేశాం. రిటైర్‌ అయిన తర్వాత కూడా ఉద్యోగులు చిరునవ్వుతో జీవించేలా, న్యాయం జరిగేలా ఆర్డినెన్స్‌కు పంపించాం.

జీపీఎస్‌.. గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ను తెచ్చాం. మాట తప్పే ఉద్దేశమే ఉంటే ఇది అమలు చేయలేమని చెప్పి ఊరుకునేవాళ్లం. కానీ మంచి చేయాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన, తాపత్రయంతో పని చేశాం. ఈ విషయంలో నేను గడిపినంత సమయం.. బహుశా  చాలా తక్కువ విషయాల్లో నేను ఇంత టైమ్‌ ఇచ్చి ఉంటా. ఒక మంచి సొల్యూషన్‌ ఇవ్వగలిగాం. రాబోయే రోజుల్లో దేశమంతా ఈ పెన్షన్‌ స్కీమ్‌ను కాపీ కొట్టి అనుసరించే పరిస్థితి వస్తుంది.

నాడు 3.97 లక్షలు.. నేడు అదనంగా 2.06 లక్షల ఉద్యోగులు
ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌లో కొత్త రికార్డులు నెలకొల్పిన ప్రభుత్వం మనది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు 3.97 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే మనం అధికారంలోకి వచ్చాక 2,06,388 మందిని కొత్తగా నియామకాల ద్వారా శాశ్వత ఉద్యోగులుగా నియమించాం. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో 1.35 లక్షల మంది, హెల్త్‌ సెక్టార్‌లో 53,126 మంది ఉద్యోగులు మన కళ్లెదుటే కనిపిస్తారు.

నష్టాల ఊబి నుంచి ఆర్టీసీని, ఉద్యోగులను కాపాడేందుకు 53 వేల మందిని రెగ్యులరైజ్‌ చేశాం. మెరుగైన ప్రభుత్వ వ్యవస్థ కోసం ఇవన్నీ చేశాం. గత ప్రభుత్వ డ్రామాలతో  విసిగిపోయిన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడంపై క్యాబినెట్‌లో చర్చించాం. తొలుత 2014 జూన్‌కు ముందు 5 సంవత్సరాలు ఇస్తే సరిపోతుందనుకున్నాం.

కానీ నేను జిల్లాలకు తిరగడం మొదలు పెట్టాక.. మాకు ఇబ్బందులున్నాయి, వాళ్లకు అవుతున్నాయి, మాకు రెగ్యులరైజ్‌ కావడం లేదని చెప్పారు. దీనిపై ఆలోచన చేశా. వారి ముఖంలో కూడా చిరునవ్వు చూడాలని మళ్లీ క్యాబినెట్‌లో పెట్టి వీరందరికీ ఇచ్చాం. మనసు పెట్టి మిగతావారికి కూడా మంచి జరగాలి, వారి ముఖంలో చిరునవ్వులు చూడాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేశాం.

దళారీ వ్యవస్థను తొలగించి ఆప్కాస్‌ ద్వారా ఒకటో తారీఖునే జీతాలు వచ్చేలా, లంచాలు, కటింగ్‌లు లేకుండా ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ తెచ్చి చిరు ఉద్యోగులకు మంచి జరిగేలా అడుగులు వేశాం. ఉద్యోగులు నిశ్చింతగా తమ ఉద్యోగాలు చేసుకునేలా తగిన వాతావరణం కల్పిస్తూ అడుగులు ముందుకు వేశాం. 

ప్రభుత్వ రంగాల మూసివేతలో రికార్డు బాబుదే
ప్రభుత్వ రంగాలను మూసివేయడం, వీఆర్‌ కూడా ఇవ్వకుండా గోల్డెన్‌ హ్యాండ్‌ షేక్‌ అంటూ ఉద్యోగులను ఇంటికి పంపడంలో గత ప్రభుత్వానిది ఓ అడ్డగోలు రికార్డు. కొన్నేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు రాసిన మనసులో మాట పుస్తకాన్ని ప్రతి ఉద్యోగీ చదవాలని విజ్ఞప్తి చేస్తున్నా. (మనసులో మాట పుస్తకంలో కొన్ని అంశాలను సీఎం జగన్‌ చదివి వినిపించారు). 2,70,700 ఉద్యోగాలను సమీక్షించి 40.62 శాతం అదనంగా ఉన్నాయని ఆ పుస్తకంలో ఆయన రాసుకున్నారు.

శాశ్వత ఉద్యోగాల కాలపరిమితిని పరిశీలించాలని, 1996–97లోనే సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల్ని శాశ్వత ప్రాతిపదికన నియమించటాన్ని ప్రభుత్వం మానేసిందని చంద్రబాబు తన పుస్తకంలో ప్రస్తావించారు. ఓ విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగుల ఎంపిక ప్రారంభించామని, ప్రభుత్వ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన ఇవ్వాలని, సిబ్బంది సంఖ్యను తగ్గించడానికి అది ఉత్తమ మార్గమని చంద్రబాబు తన మనసులో మాట చెప్పారు. కొత్త నియామకాలు చేపట్టకూడదు.

ఇవీ చంద్రబాబు మనసులో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అభిప్రాయం. విద్యుత్‌ సంస్థ ఉద్యోగుల్లో 66 శాతం, పౌర సరఫరాల సంస్థలో 65 శాతం, రెవెన్యూలో 64 శాతం, పోలీసు శాఖలో 62 శాతం, స్థానిక సంస్థల్లో 52 శాతం మంది అవినీతిపరులేనని తేలినట్లు చంద్రబాబు స్వయంగా ఆ పుస్తకంలో రాసుకున్నారు. అదే ప్రజాభిప్రాయమంటూ తనకు నచ్చిన పర్సెంటేజీని జోడించి పుస్తకాన్ని ముద్రించారు.

కనీసం ఈ నంబర్లు రాసే ముందు ఎవరిని  అడిగారు? ప్రతి ఆఫీసుకూ వెళ్లి.. వీళ్లు మాత్రమే మంచోళ్లు, మిగతావాళ్లంతా లంచగొండులనే అధికారం ఎవరిచ్చారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. ఒకటి రెండు కేసులో ఆఫీసర్లు లంచాలు తీసుకుంటే ఏసీబీ వాళ్లు రెయిడ్‌ చేస్తే కలెక్టర్‌ యాక్షన్‌ తీసుకుంటారు. తనంతట తానే లెక్కలు గట్టి అంతా లంచగొండులేనని, వాటిని మూసేయాలి, ప్రైవేట్‌ పరం చేయాలంటూ ఆ పెద్దమనిషి పుస్తకంలో రాశాడు. మరి ఇలాంటి మనిషి రేపొద్దున మీకు మంచి చేయగలడా? అని ఆలోచన చేయాలి. 

శాశ్వత ఉద్యోగాలకు కోత.. వ్యవస్థలు నిర్వీర్యం
ఇలాంటి వ్యక్తి కాబట్టే 2014–19 మధ్య శాశ్వత ఉద్యోగుల నియామకాన్ని చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా తగ్గించారు. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆయన హయాంలో ఆర్టీసీ పరిస్థితి ఏమిటి? గవర్నమెంట్‌ ఆస్పత్రులు, గవర్నమెంట్‌ స్కూళ్ల పరిస్థితి ఏమిటి? ఇక గ్రామ స్థాయిలో పరిపాలన దేవుడెరుగు! అధికారులు, పారదర్శకతతో పని లేదు. జన్మభూమి కమిటీలు చాలు.. లంచాలు తీసుకుని ఎవరికి సిఫారసు చేస్తే అదే పరిపాలన.

ఐదేళ్లలో కేవలం 34 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమించారు. 1999 నుంచి 2004 మధ్య ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు మూసివేశారు. ఇందుకోసం ఇంప్లిమెంటేషన్‌ సెక్రటేరియట్‌ అని ఓ విభాగాన్నే సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను పప్పు బెల్లాలకు తన వాళ్లకు అమ్మేసుకున్నారు. ఉద్యోగులను నడిరోడ్డుపై వదిలేశాడు. ఆల్విన్, నిజాం షుగర్స్, రిపబ్లిక్‌ ఫోర్చ్, చిత్తూరు డెయిరీ, ప్రకాశం డెయిరీ.. ఇలాంటివి ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన చరిత్ర ఈ పెద్దమనిషిది.

ఆయన ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల గురించి మొసలి కన్నీరు కారుస్తుంటే ఇంతకంటే ఘోరం ఏముంటుంది? మనది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వం. మీరు ఎవరి ప్రలోభాలకూ గురి కావద్దు. చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, దత్తపుత్రుడు.. వీరందరికీ ఉన్నదంతా ఒక్కటే.. కేవలం నా మీద కడుపుమంట. రాష్ట్ర ప్రజల మీద, ఉద్యోగుల మీద మీదా వీరికి ఏమాత్రం ప్రేమ లేదు. వీరు చేసే రాజకీయ విమర్శలు, రెచ్చగొట్టే మాటలు, కట్టు కథలను నమ్మవద్దని సవినయంగా కోరుతున్నా. 

పోలీసులు, ఉద్యోగులపై భౌతిక దాడులా?
పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేతలు పగబట్టి భౌతిక దాడులు జరుపుతున్నారు. 47 మంది పోలీసులపై పుంగనూరులో దాడి చేశారు. ఒకరి కన్ను కూడా పోయింది. పోలీసులు ఏం పాపం చేశారని దాడులు చేశారు? కన్ను పోగొట్టడానికి మీరు ఎవరు? ‘‘మీకు పర్మిషన్‌ ఉన్న రూట్‌లో వెళ్లండి.. వేరే రూట్‌లో  పోవద్దండి.. వేరే పార్టీ వాళ్లు ధర్నా చేసుకుంటున్నారు. గొడవలు జరుగుతాయి.. ’’ అని పోలీసులు చెబితే శాంతి భద్రతల సమస్య సృష్టించి శవ రాజకీయాలకు కూడా వెనుకాడని వారిని గమనించమని కోరుతున్నా. 

ఉద్యోగులకు మేలుపై వెనక్కి తగ్గం
ఉద్యోగుల ప్రయోజనాలు, వారికి మంచి చేసే విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గే పరిస్థితి లేదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. రెండు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని శీనన్న (ఎన్జీవోల సంఘం ఛైర్మన్‌) అన్నారు. 2022 జూలై 1కి సంబంధించిన డీఏని దసరా పండుగనాడు మీ అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తా. మెడికల్, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో మహిళా ఉద్యోగులకు మిగతా వారి మాదిరిగా 5 రోజుల అడిషనల్‌ హాలిడే కావాలన్నారు.

దాన్ని కూడా మంజూరు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మీది. మీకు తోడుగా ఉంటున్న ప్రభుత్వం. ఆర్థిక ఇబ్బందులతో కొద్దో గొప్పో మీరు అనుకున్న స్థాయిలో నేను చేయలేకపోయి ఉండవచ్చు. కానీ మనసు నిండా ప్రేమ మాత్రం ఎక్కువగానే ఉంది. ఈ ప్రభుత్వం మీది. మీకు మంచి చేసే విషయంలో నాలుగు అడుగులు వేయడానికి ఎప్పుడూ ముందుంటా.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement