AP: రాబడిని మించిన జీతాలు | CS Committee Recommendation to CM YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

AP: రాబడిని మించిన జీతాలు

Published Tue, Dec 14 2021 2:20 AM | Last Updated on Tue, Dec 14 2021 7:13 PM

CS Committee Recommendation to CM YS Jagan Mohan Reddy - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు పీఆర్సీ నివేదిక అందజేస్తున్న సీఎస్‌ సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు

సాక్షి, అమరావతి: రాష్ట్ర సొంత ఆదాయాన్ని మించి ఉద్యోగుల వేతనాల వ్యయం అవుతోందని, ఈ నేపథ్యంలో ఐదేళ్లకు ఒకసారి ఉద్యోగుల వేతన సవరణను రాష్ట్రం భరించే స్థితిలో లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల కమిటీ 11వ వేతన సవరణ కమిషన్‌ సిఫార్సులపై స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా ఏళ్ల నుంచి అత్యధిక ఫిట్‌మెంట్‌ ఇస్తూ వస్తున్నారని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర 7వ వేతన సవరణ కమిషన్‌ను అనుసరించి 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 11వ వేతన సవరణ కమిషన్‌ నివేదికను అధ్యయనం చేసిన కమిటీ పలు సిఫార్సులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌కు నివేదిక సమర్పించింది. 

కేంద్ర వేతన సంఘం సిఫార్సుల దిశగానే ..
► కొద్ది సంవత్సరాలుగా మంజూరైన ఫిట్‌మెంట్‌ ఎక్కువగా ఉందని గమనించాలి. రాష్ట్ర సొంత రాబడికి మించిన ఖర్చు హెచ్‌ఆర్‌ వ్యయం పెరగడానికి దారి తీసింది.
► 9వ పీఆర్‌సీలో 27 శాతం సిఫార్సు చేస్తే దాన్ని మించి 39% ఫిట్‌మెంట్‌ మంజూరు చేశారు.
► 10వ పీఆర్సీ 29 శాతం ఫిట్‌మెంట్‌ సిఫార్సు చేస్తే అంతకు మించి 43% మంజూరు చేశారు. 
► ఇదే కాలంలో 7వ కేంద్ర వేతన సవరణ కమిషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14.29%

ఫిట్‌మెంట్‌ మంజూరైంది
► 11వ రాష్ట్ర పీఆర్సీ కమిటీ ఐదేళ్లకు 27 శాతం ఫిట్‌మెంట్‌ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు చాలా ఎక్కువగా ఉంది.
► తెలంగాణలో పీఆర్‌సి 7.5% ఫిట్‌మెంట్‌ సిఫారసు చేసింది.
► చాలా రాష్ట్రాలు కేంద్ర వేతన సంఘం సిఫార్సుల స్వీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి.
► ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణలను కొనసాగించలేదు. పదేళ్లకు ఒకసారి 7వ కేంద్ర వేతన సవరణ ప్రకారం 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి.


తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌  

ఏపీలోనే అత్యధికం
► 2018–19లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వ్యయం రూ. 52,513 కోట్లు కాగా 2020–21 నాటికి ఏకంగా రూ.67,340 కోట్లకు చేరుకుంది. 
► 2018–19లో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయం (ఎస్‌ఓఆర్‌)లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల మొత్తం 84 శాతం కాగా 2020–21 నాటికి 111 శాతానికి చేరుకుంది. 
► ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం చేస్తున్న వ్యయం 2018–19లో 32 శాతం అయితే 2020–21 నాటికి 36 శాతానికి పెరిగింది. 
► ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వ్యయం ఏపీలోనే అధికం. 2020–21లో తెలంగాణాలో ఇది కేవలం 21 శాతమే. ఛత్తీస్‌గఢ్‌లో 32 శాతం, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో 31 శాతం, ఒడిశాలో 29 శాతం, మధ్యప్రదేశ్‌లో 28 శాతం, హర్యానాలో 23 శాతం ఉంది.

బకాయిలు రాలేదు... కోవిడ్‌తో పెను భారం
► విభజన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పెను ప్రభావం చూపింది
► తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ.2,37,632 కాగా ఏపీలో అది కేవలం రూ. 1,70,215 మాత్రమే ఉంది.
► రూ.6,284 కోట్ల విద్యుత్‌ బకాయిలు తెలంగాణ నుంచి ఇంకా రావాల్సి ఉంది
► రెవిన్యూ లోటు కింద రూ.18,969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
► కోవిడ్‌ కారణంగా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారి దాదాపు రూ.30 వేల కోట్ల అదనపు భారం పడింది.

కష్టాలున్నా ప్రయోజనాలను కాపాడుతూ..
► ఇన్ని కష్టాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాల కోసం పలు నిర్ణయాలు తీసుకుంది.
► ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే 2019 జూలై 1 నుంచి 27 శాతం ఐఆర్‌ ఇచ్చింది. 
ఐఆర్‌ రూపంలో ఉద్యోగులకు రూ.11,270.21 కోట్లు, పెన్షనర్లకు రూ.4,569.78 కోట్లు, మొత్తంగా రూ.15.839.99 కోట్లు చెల్లించింది.
► అంగన్‌వాడీ, ఆశావర్కర్లు సహా వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు వేతనాలు పెంచింది.
► 3,01,021 మంది ఉద్యోగులకు ఈ ప్రభుత్వం జీతాలు పెంచింది. తద్వారా ఏడాదికి జీతాల రూపంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.1,198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లకు పెరిగింది.
► కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు సహా ఇతర ప్రయోజనాలను ఈ ప్రభుత్వం అందించింది.
► ప్రభుత్వ విభాగాలు, యూనివర్శిటీలు, సొసైటీలు, కేజీవీబీ, మోడల్‌ స్కూళ్లు తదితర ఉద్యోగులకు వర్తింప చేసింది.
► ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అమలు చేస్తోంది. 
► ఈ చర్యల వల్ల ప్రభుత్వంపై రూ.360 కోట్ల మేర ఏటా భారం పడుతోది.

మధ్యవర్తులు లేకుండా నేరుగా జీతాలు
► అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ప్రయోజనాల కోసం అప్కాస్‌ను ప్రారంభించింది. మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జీతాలను జమ చేస్తోంది. ఈపీఎఫ్‌ మరియు ఈఎస్‌ఐ వంటి సదుపాయాలను కల్పించింది. అప్కాస్‌ రూపంలో ఏడాదికి ప్రభుత్వంపై రూ. 2,040 కోట్ల భారం పడుతోంది.
► ఎంపీడీఓలకు ప్రమోషనల్‌ ఛానల్‌ అంశాన్ని ఈ ప్రభుత్వం పరిష్కరించింది. 
► గ్రేడ్‌–1 వీఆర్వోలకు ప్రమోషన్‌ ఛానల్‌ను ఏర్పాటు చేసింది.
► రాష్ట్రవ్యాప్తంగా 3,795 వీఆర్వో, వీఆర్‌ఏ పోçస్టుల భర్తీకి ఆదేశాలు ఇచ్చింది.
► మహిళా ఉద్యోగులకు ఏటా అదనంగా ఐదు రోజుల పాటు ప్రత్యేకంగా సెలవులు మంజూరు చేసింది.
► హైదరాబాద్‌ నుంచి అమరావతి వచ్చిన  ఉద్యోగులకు 30శాతం హెచ్‌ఆర్‌ఐ చెల్లిస్తోంది. 
► ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ కోవిడ్‌ను ఎదుర్కొంటూ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ తదితర సిబ్బంది నియమకాలు పెద్ద ఎత్తున చేపట్టడంతో ఏటా అదనంగా రూ.820 కోట్ల భారం ఖజానాపై పడింది.

ఆర్టీసీ విలీనం... పాలన సంస్కరణలు
► ఏపీఎస్‌ ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడంతో 2020 జనవరి నుంచి సంస్థ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. జనవరి 2020 నుంచి అక్టోబరు 2021 వరకూ రూ.5,380 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది.
► పరిపాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తెచ్చింది. 
► 1.28 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను తీసుకుంది. ఏడాదికి రూ. 2,300 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది.

అడగకుండానే ‘ఐఆర్‌’
రాష్ట్ర ప్రభుత్వం 2019లో అధికారంలోకి వస్తూనే ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎవరూ అడగకుండానే 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించింది. దీనివల్ల ఏటా దాదాపు రూ.16 వేల కోట్ల అదనపు భారం పడినప్పటికీ వారి ప్రయోజనాలను కాపాడుతూ ముందుకు సాగింది. ఉద్యోగులకు జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులు ఈ ఏడాది రూ.67,340 కోట్లకు చేరుకున్నాయి. ఐఆర్‌ ప్రకటించేనాటికి అంతా బాగున్నా కోవిడ్‌తో 2019–20లో రూ.8వేల కోట్లకు పైగా, 2020–21లో రూ.14వేల కోట్లకు పైగా ఆదాయం తగ్గిపోయింది. కోవిడ్‌ నియంత్రణ,  వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు మరో రూ.8వేల కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మొత్తంగా రూ.30 వేల కోట్ల భారం పడింది. వీటితో పాటు ఐఆర్‌తో ఇప్పటికే మోయలేని భారం ఉన్నా ఉద్యోగుల డిమాండ్లు, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఫిట్‌మెంట్‌ను భరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.  

వివిధ అంశాలపై సిఫార్సులు ఇవీ..
పే స్కేల్స్‌ 11వ పీఆర్సీ సిఫార్సు: మాస్టర్‌ పే స్కేల్‌ను 32 గ్రేడ్‌లు, 83 (81 నుంచి 83కు పెంపు) స్టేజస్‌తో రూపొందించాలి. ఉద్యోగుల గ్రేడ్‌లు, స్టేజ్‌ల ఆధారంగా నెలకు కనీస వేతనం రూ.20 వేలు.. గరిష్ఠ వేతనం రూ.1.79 లక్షలు చెల్లించేలా మాస్టర్‌ పే స్కేల్‌ను అమలు చేయాలి.

సెక్రటరీల కమిటీ: పదవీ విరమణ వయోపరిమితిని 58 నుంచి 60 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో మాస్టర్‌ పే స్కేల్‌లో స్టేజ్‌లను 81 నుంచి 83కు పెంచడం సబబే. నెలకు కనీస వేతనం రూ.20 వేలు.. గరిష్ఠ వేతనం రూ.1.79 లక్షలు ఇవ్వాలని 11వ పీఆర్సీ చేసిన ప్రతిపాదన సహేతుకమైనదే.

ఫిట్‌మెంట్‌ 11వ పీఆర్సీ: ఐఎల్‌వో ప్రమాణాల ప్రకారం ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్‌ బెనిఫిట్‌ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 27 శాతం ఐఆర్‌ ఇస్తోంది. ఈ నేపథ్యంలో 27 శాతం ఫిట్‌మెంట్‌ బెనిఫిట్‌ ఇవ్వాలి.

సెక్రటరీల కమిటీ: గత పదేళ్లలో 9వ పీఆర్సీ ఫిట్‌మెంట్‌ బెనిఫిట్‌ను 27 శాతం సిఫార్సు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 39 శాతం మంజూరు చేసింది. పదో పీఆర్సీ కమిటీ ఫిట్‌మెంట్‌ బెనిఫిట్‌ను 29 శాతం సిఫార్సు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం మంజూరు చేసింది. గత పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 82 శాతం ఫిట్‌మెంట్‌ బెనిఫిట్‌ ఇస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14.29 శాతం(ఏడో పీఆర్సీ) మాత్రమే ఇచ్చింది. తెలంగాణ పీఆర్సీ కమిటీ ఐదేళ్ల కాలానికి 7.5 శాతం ఫిట్‌మెంట్‌ బెనిఫిట్‌ను సిఫార్సు చేస్తే.. రాష్ట్రంలో 11వ పీఆర్సీ 27 శాతాన్ని సిఫార్సు చేసింది. దీని వల్లే రాష్ట్ర సొంత ఆదాయానికి మించి ఉద్యోగుల వేతనాలకు అధికంగా వ్యయమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఏడో వేతన సంఘం చేసిన సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14.2 శాతం ఫిట్‌మెంట్‌ బెనిఫిట్‌ ఇస్తే సరిపోతుంది.

కొత్త పే స్కేలు వర్తింపజేయాల్సిన తేదీ.. 
11వ పీఆర్సీ: 1–7–2018 నుంచి కొత్త పే స్కేల్‌ను వర్తింపజేయాలి. మానిటరి బెనిఫిట్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.

సెక్రటరీల కమిటీ: ఏపీఎస్‌ఆర్టీసీ(పీటీడీ) ఉద్యోగులకు 1–1–2020 నుంచి కొత్త పే స్కేల్‌ను వర్తింపజేయాలి. మానిటరి బెనిఫిట్‌ను 1–10–2022 నుంచి అమలు చేయాలి. అంటే 2022, నవంబర్‌లో మానిటరి బెనిఫిట్‌తో కూడిన వేతనాన్ని ఇవ్వాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement