
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరాల మేరకు ఏర్పాటైన 26 జిల్లాలకు ప్రభుత్వం ఇన్‌చార్జ్ మంత్రులను నియమించింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యకలాపాల అమలుపై సమీక్షలు, పర్యవేక్షణ చేయనున్నారు. అలాగే 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, 11 మంది ప్రాంతీయ సమన్వయకర్తలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం తొణికిసలాడుతోంది. పాలన వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించి కొత్తగా ఏర్పాటు చేసిన 26 జిల్లాల్లో ఈ నెల 4 నుంచి పరిపాలనను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
అదేవిధంగా 25 మందితో ఈ నెల 11న కొత్తగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులతోపాటు పార్టీ అధ్యక్షులను, ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించారు. వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షుల కో–ఆర్డినేటర్‌గా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇక పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డిని నియమించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు.
ఆదిలోనే చెప్పినట్లుగానే..
2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించి.. అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేసి.. వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని.. మంత్రివర్గంలోకి కొత్తవారిని తీసుకుంటామని.. ఇది నిరంతర ప్రక్రియ అని సీఎం వైఎస్ జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 11న మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలో.. ఎవరికి పార్టీ బాధ్యతలు ఇవ్వాలో తనకు బాగా తెలుసని చెప్పిన సీఎం వైఎస్ జగన్ ఆ మేరకు నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆదిలోనే చెప్పినట్లుగానే మంత్రివర్గం నుంచి తప్పించినవారికి జిల్లాల పార్టీ అధ్యక్షులుగా, ప్రాంతీయ సమన్వయకర్తలుగా బాధ్యతలు ఇచ్చారు. జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్‌చార్జి మంత్రులు, ప్రాంతీయ సమన్వయకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని సంస్థాగతంగా మరింతగా బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజు జూలై 8న వైఎస్సార్‌సీపీ ప్లీనరీ నిర్వహిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఆలోగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలను జిల్లా అధ్యక్షులు సమన్వయం చేసుకుంటూ వైఎస్సార్‌సీపీ గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలో, పార్టీని బలోపేతం చేయడంలో ప్రాంతీయ సమన్వయకర్తలు క్రియాశీలక పాత్ర పోషించనున్నారు.
గడపగడపకూ వెళ్లి ప్రజల ఆశీర్వాదం..
వచ్చే నెల నుంచి ప్రతి నియోజకవర్గంలో నెలకు పది సచివాలయాలను ప్రతి ఎమ్మెల్యే సందర్శించాలని సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారు. వాటి పరిధిలోని గ్రామాల్లో 20 రోజులు పర్యటించి.. ప్రతి ఇంటికి వెళ్లాలని సూచించారు. గత మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా ఆ ఇంటిలోని సభ్యులకు అందిన ప్రయోజనాన్ని వివరించాలన్నారు. అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను ఎండగట్టడంతోపాటు తమను ఆశీర్వదించమని ప్రజలను కోరాలని ఇటీవల వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
గడపగడపకూ వెళ్లి ప్రజల ఆశీర్వాదం తీసుకుంటున్న సమయంలోనే బూత్ కమిటీలను పునర్ నిర్మించాలని.. వాటిలో కనీసం 50 శాతం మంది మహిళలు ఉండేలా చూడాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో సగటున 80 సచివాలయాల వరకూ ఉంటాయి. గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమం పూర్తయ్యేసరికి కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆశీర్వాదాన్ని పొందడంతోపాటు బూత్ స్థాయి నుంచి పార్టీ మరింతగా బలోపేతమవుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ విస్తృత కార్యక్రమాలు చేపట్టనుండటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment