బిల్లును అడ్డుకోండి
సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులకు ఏపీఎన్జీవోల అల్టిమేటం
లేదంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు
ఈనెల 10-15 వరకు కీలకమైన రోజులు
కేంద్రమంత్రులు సవరణలు కోరడం సరికాదు
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకోవడానికి కేంద్ర మంత్రులు, ఎంపీలకు ఇదే చివరి అవకాశం. విభజన ప్రక్రియకు సంబంధించి ఈ నెల 10నుంచి 15వరకు ఎంతో కీలకమైన రోజులు. అసెంబ్లీ తిప్పిపంపిన బిల్లునే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నందున , బిల్లు రాష్ట్రపతి నుంచి రాజ్యసభకు రాకుండా అడ్డుకోవాలి’’ అని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేశారు. ఏపీఎన్జీవో భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రెండువారాలు ఉండే పదవుల కోసం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుంటే చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారని కేంద్రమంత్రులను హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా.. విభజన బిల్లుపై కేంద్రమంత్రులు చేసిన సవరణలను కేబినెట్ తోసిపుచ్చిందన్నారు. అసెంబ్లీలో బిల్లును ఎమ్మెల్యేలు అడ్డుకున్న విధంగానే, పార్లమెంట్లో కూడా విభజన బిల్లు ఆమోదం పొందకుండా ఎంపీలు, మంత్రులు అడ్డుకోవాలని సూచించారు. అడ్డుకోకుంటే వారిని ప్రజలు క్షమించరని, వాళ్ల ఇళ్లముందు ప్రజలు ఎటువంటి ఆందోళనలు చేసినా ఏపీఎన్జీవోల మద్దతు ఉంటుందని తెలిపారు. సమావేశంలో సంఘం కోశాధికారి వీరేంద్రబాబు, నగర కార్యదర్శి సీవీరమణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పరిరక్షణ కోసం ఉద్యోగులు చేపట్టిన ఉద్యమానికి రాజకీయ పక్షాల నుంచి కూడా సంపూర్ణ మద్దతు లభించింది. తమ పార్టీల కార్యకర్తలందరూ ఉద్యమంలో పాల్గొంటారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. త్వరలోనే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని క లిసి మద్దతు కోరతాం.
విభజన బిల్లు రాజ్యసభకు వచ్చిన పక్షంలో.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు.
ప్రజల ఆమోదం లేకుండా విభజన బిల్లుపై కేంద్ర మంత్రులు సవరణలు కోరడం సరికాదని ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. మంత్రుల మాటలను కేబినెట్ పెడచెవిన పెట్టినందున, ఇప్పటికైనా కేంద్ర మంత్రులు సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు.
తెలుగు జాతి ఐక్యంగా కలసుండాలన్న ఎన్టీఆర్ ఆకాంక్షలను కాపాడాలని పురందేశ్వరికి డాక్టర్ల జేఏసీ కన్వీనర్ రాజేంద్ర విజ్ఞప్తి చేశారు. బిల్లును అడ్డుకోకపోతే చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమాలను ఆడనివ్వబోమని స్పష్టం చేశారు.