నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమవారం నిరసన జ్వాలలు మిన్నంటాయి. సోనియా జన్మదినాన్ని తెలుగుజాతి విద్రోహదినం, బ్లాక్‌డేగా ప్రకటించిన పలు ప్రజా, ఉద్యోగ, విద్యార్థి, ఎన్‌జీఓ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. సీమాంధ్రులకు తీరని ద్రోహం తలపెట్టిన సోనియా గాంధీ సజీవంగా ఉన్న తమ దృష్టిలో మరణించినట్టేనని నెల్లూరు నగరంలో వీఆర్‌సీ కూడలిలో టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఆమె దిష్టిబొమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు.
ఆమె ఫొటో ఉన్న ఫ్లెక్సీకి హీలియం బెలూన్లు కట్టి గాల్లోకి వదిలి సోనియా ఆత్మకు పరలోక ప్రాప్తి కలిగించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్‌సీ కూడలిలో సోనియా దిష్టిబొమ్మకు కర్మక్రియలు నిర్వహించారు. రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కేవీఆర్ పెట్రోల్‌బంకు కూడలిలో కళ్లకు నల్లగుడ్డలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. భారీగా తరలివచ్చిన విద్యార్థినులు మానవహారం చేపట్టారు. ఏపీఎన్‌జీఓ సంఘం
జిల్లాశాఖ ఆధ్వర్యంలో దర్గామిట్టలోని ఎన్‌జీఓ హోమ్ ఎదుట సోనియా దిష్టిబొమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. సోనియా, దిగ్విజయ్, యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంకటగిరిలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మకు ఉరి బిగించిన అనంతరం దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ కూడలిలో టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు.
మిన్నంటిన నిరసన
Published Tue, Dec 10 2013 7:02 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement