సమైక్య రాష్ట్రం కోసం మీరేం చేశారు? | ys jagan mohan reddy fires on chandra babu naidu | Sakshi
Sakshi News home page

సమైక్య రాష్ట్రం కోసం మీరేం చేశారు?

Published Mon, Feb 3 2014 1:45 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

సమైక్య రాష్ట్రం కోసం మీరేం చేశారు? - Sakshi

సమైక్య రాష్ట్రం కోసం మీరేం చేశారు?

 ధర్నాలు చేశారా? దీక్షలు చేశారా? రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చారా?  కిరణ్, చంద్రబాబులపై జగన్ ధ్వజం
 
     చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో
     తెలంగాణ నేతలతో విభజన అనిపిస్తారు..
     సీమాంధ్ర నేతలతో సమైక్యమనిపిస్తారు
     8 నెలల కిందటే కిరణ్ తన రాజీనామాను
     సోనియా ముఖాన పడేసి ఉంటే పరిస్థితి
     ఇక్కడి దాకా వచ్చేది కాదు
 
 ‘ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:
 ‘‘నాయకుడంటే కార్పొరేటర్ నుంచి పార్టీ అధ్యక్షుడి వరకు ఒకే తాటి మీద ఉండాలి. తమ వాదన ధైర్యంగా వినిపించి ప్రజలను ఓట్లు అడగాలి. 8 నెలల కిందటే కిరణ్‌కుమార్‌రెడ్డి తన సీఎం పదవికి రాజీనామా చేసి ఆ లేఖను సోనియా గాంధీ ముఖాన పారేసి ఉంటే ఈ రోజు విభజన ఇక్కడి దాకా వచ్చేది కాదు. సమైక్య ముసుగులో డ్రామాలు చేస్తున్న చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఏరోజైనా సమైక్యాంధ్ర కోసం దీక్షలు చేశారా? ఏ రోజైనా ధర్నాలు చేశారా? రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చారా? ఆర్టికల్ 3 దుర్వినియోగం గురించి ఏ రోజైనా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారా? మీ ఇద్దరిలో ఒకరైనా ఒక లైన్ మీద ఉన్నారా? కేసీఆర్, చంద్రబాబు, కిరణ్‌కు తేడా ఏమీ లేదు. మూడు ప్రాంతాల్లోనూ సమైక్యాన్ని కోరే ప్రజలున్నా.. వారి మధ్య చిచ్చు పెట్టి విభజిస్తున్న మీరు విభజనవాదులు కాదా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించినవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండవ ప్రజాప్రస్థానం(ప్లీనరీ)లో ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
 
 రాష్ట్రంలో నీతి లేని రాజకీయం..
 2011 జూలై 8వ తేదీ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పార్టీ తొలి ప్లీనరీ జరిగింది. ఈ రెండున్నరేళ్లలో చాలా చూశాం. చాలా కష్టాలు, చాలా చాలా కుతంత్రాలు, అన్యాయమైన, నిజాయితీ లేని రాజకీయాలు చూశాం. ఇన్ని జరుగుతున్నా ఎక్కడా, ఎవ్వరూ, ఎప్పుడూ కూడా తొణకలేదు.. బెణకలేదు, అదరలేదు.. బెదరలేదు. ఒక మనిషిని, ఒక పార్టీని తప్పించేందుకు, ఓట్ల కోసం, సీట్ల కోసం చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరూ కూడా కుమ్మక్కై, కోర్టుల దాకా ఒక్కటిగా వెళ్లి కేసులు పెట్టిన రోజులు చూశాం. చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం నేరం రుజువు కాకుంటే మూడు నెలల్లోపు ఆ వ్యక్తి ఎవరైనా సరే బెయిలిచ్చి బయటకు పంపాలి. అయినా కూడా దర్యాప్తు పేరుతో, విచారణసైతం జరగకుండా ఒక వ్యక్తిని 16 నెలలపాటు జైల్లో ఉంచిన నీచమైన రాజకీయాలు చూశాం. 16 నెలలు జైల్లో పెట్టి నన్ను కనపడకుండా చేయాలనుకున్నారు. వైఎస్సార్ సీపీని లేకుండా చేయాలనుకున్నారు. నేను ఎవరినీ కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా కట్టడి చేశారు. ఇంత చేసినా వెంట్రుక కూడా పీకలేకపోయారు. జైల్లో ఉన్నప్పుడు భయాల మధ్య, అన్యాయమైన రాజకీయాల మధ్య ఎప్పుడూ కూడా నిజాయితీని, ప్రజలు మన మీద పెట్టుకున్న విశ్వసనీయతను ఏ రోజూ నేను వమ్ము చేయలేదు. నేను జైల్లో ఉన్నా కూడా పార్టీ బాధ్యతలను స్వీకరించిన నా తల్లి విజయమ్మ, నా చెల్లి షర్మిల, నాకు తోడుగా నిలిచిన నా భార్య భారతి, పార్టీలో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు.
 
 నేను మరచిపోలేని రోజులవి..
 జైల్లో ఉన్న ఆ 16 నెలలు నేను మరచిపోలేని రోజులు. బయట జరుగుతున్న నీచమైన రాజకీయం చూసి నా గుండె తట్టుకోలేకపోయింది.
 
     అప్పట్లో పార్లమెంటులో ఎఫ్‌డీఐ బిల్లు మీద ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ దిక్కు తోచని పరిస్థితిలో ఉంది. జగన్‌ను జైల్లో పెట్టారు.. కార్యకర్తలను బెదిరించారు. జగన్ ఇక బయటకు రాడనీ, తీహార్ జైలుకు తీసుకు వెళతారని ఎల్లో మీడియాలో రకరకాల కథనాలు రాయించారు. ఇంత చేసినా ఎఫ్‌డీఐ ఓటింగ్‌లో పేదలు, చిల్లర వర్తకుల భవిష్యత్తు కోసం జగన్ నిజాయితీగల రాజకీయం చేశాడు. అదే చంద్రబాబు అయితే ఎమ్మార్, ఐఎంజీ కేసుల్లో సీబీఐ కేసులు ఎదుర్కోకుండా ఉండటంకోసం కాంగ్రెస్‌తో లాలూచీ పడి తన ఎంపీలను ఓటింగ్‌కు గైరు హాజరు చేయించారు.
 
     రాష్ట్రంలోని కిరణ్ సర్కారు ప్రజల మీద 32 వేల కోట్ల రూపాయల కరెంటు బిల్లులు బాదుడు బాదితే ప్రతిపక్షాలన్నీ ఒక్కటై ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానంపెట్టాయి. జగన్ జైల్లో ఉండి కూడా తన పార్టీ ఎమ్మెల్యేలతోపాటు తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో, ఆరుగురు టీడీపీ శాసనసభ్యులతో కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయించాడు. కానీ చంద్రబాబు బయటే ఉన్నా.. కేసులకు భయపడి కాంగ్రెస్‌తో కుమ్మక్కై తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయించి కాంగ్రెస్ సర్కారును కాపాడాడు.
 
 చంద్రబాబు భయానక పాలన..
 ఆ రోజులు నాకు బాగా గుర్తున్నాయి... వైఎస్ ఇంకా ముఖ్యమంత్రి కాలేదు. చంద్రబాబు భయానక పాలన సాగుతూ ఉండేది.
     ఆ సమయంలో గ్రామాల్లోకి వెళితే అవ్వలు, తాతలు మాకు ఫించన్ రావడం లేదని చెప్పిన రోజులు గుర్తున్నాయి. పెన్షన్ చూస్తే రూ.70 మాత్రమే ఇచ్చేవారు. అది కూడా గ్రామాల్లో 200 మంది లేదా 150 మంది వృద్ధులుంటే.. కేవలం పది పదిహేను మందికే పెన్షన్లు ఇచ్చి చేతులు దులుపుకునేవారు. ఎవరైనా చనిపోతేనే కొత్త వారికి మంజూరు చేస్తామని అధికారులు చెబుతుంటే గుండెలు తరుక్కుపోయేవి.
 
     పేదల పిల్లలు ఇంజనీరింగ్ చదవాలంటే రూ.30 వేల ఫీజు కట్టాల్సి వచ్చేది. ఇది కట్టడానికి ఇల్లు, ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేది. చంద్రబాబు సీఎంగా ఒక్క రోజైనా వారి బాధలు విన్నారా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్ చార్జీలు వసూలు చేసిన దౌర్భాగ్యకర పరిస్థితులు ఉండేవి.
 
     రైతన్నలకు ఉచితంగా కరెంటు ఇచ్చి ఆదుకోండి అని రాజశేఖరరెడ్డి ధర్నాలు, దీక్షలు చేసి అడిగితే.. కరెంటు ఉచితంగా ఇస్తే.. ఈ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరాకుండా పోతాయన్నారు చంద్రబాబు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వారు తిన్నది అరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.
 
 సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం..
 ‘‘సమైక్యం అంటే తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాలు. కానీ 70 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు ముందుకు పోతోంది. సోనియా గాంధీ డెరైక్షన్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ఒకవైపు రాష్ట్ర విభజనకు సహకరిస్తూనే మరోవైపు సమైక్యాంధ్ర ఛాంపియన్ అనిపించుకునే నీచమైన రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు సభలోనే ఒక చేత్తో సైగ చేసి తన పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేలతో జై తెలంగాణ అనీ, మరో చేత్తో సైగ చేసి సీమాంధ్ర ఎమ్మెల్యేలతో జై సమైక్యాంధ్ర అని నినాదాలు చేయిస్తున్నారు. సోనియా, కిరణ్, చంద్రబాబు ఎవరూ చూడటం లేదనుకుని విభజన రాజకీయం చేస్తున్నారు. కానీ పైన దేవుడు చూస్తున్నాడు. మనం సింహాల్లా ముందుకు పోయి 30 ఎంపీ సీట్లు గెలిచాక.. ఈ రాష్ట్రాన్ని విభజించే దమ్ము, ధైర్యం ఎవరికుందో చూద్దాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వారినే ప్రధానిని చేద్దాం.’’     - జగన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement