ఎగిసిన నిరసన | Protest rallies for samaikyandhra | Sakshi
Sakshi News home page

ఎగిసిన నిరసన

Published Tue, Dec 10 2013 6:32 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

Protest rallies for samaikyandhra

 సాక్షి, అనంతపురం : తెలంగాణ ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ వెన్నుదన్నుగా నిలువడంతో సమైక్య ఉద్యమకారులు కదం తొక్కారు. సోనియా గాంధీ.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. క్లాక్ టవర్‌పై నల్ల జెండా ఎగుర వేసి నిరసన  తెలిపారు. జిల్లాలో సోమవారం ‘సమైక్య’ పోరు జోరుగా కొనసాగింది. ఏపీ ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు జిల్లా బంద్ విజయవంతమైంది.

 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అనంతపురం నగరంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సోనియాగాంధీ దిష్టిబొమ్మతో భారీ శవయాత్ర నిర్వహించారు. అనంతరం సప్తగిరి సర్కిల్‌లో మానవహారం నిర్మించి, సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా దుకాణాలు బంద్ చేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు నగరంలో ర్యాలీ నిర్వహిస్తుండగా... పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఎంఐఎం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి  బైక్ ర్యాలీ చేపట్టారు. యువజన జేఏసీ, నగర పాలక సంస్థ ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలోనూ ర్యాలీలు కొనసాగాయి. ఎస్కేయూతో పాటు రొద్దంలో విద్యార్థులు నిరసన ర్యాలీలతో హోరెత్తించారు.

ధర్మవరంలో జేఏసీ, విద్యార్థి సంఘాల నాయకులు సోనియాగాంధీ బర్త్‌డేను బ్లాక్‌డేగా పాటిస్తూ ప్రదర్శన నిర్వహించారు. గుంతకల్లులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ చేపట్టారు. టీడీపీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి, జేఏసీ నేతలు వేర్వేరుగా ర్యాలీ నిర్వహించారు. ఏపీఎన్‌జీఓలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మునిసిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేశారు. కళ్యాణదుర్గంలో జేఏసీ ఆధ్వర్యాన ర్యాలీ చేపట్టారు. నార్త్‌హైస్కూల్ విద్యార్థులు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ ఆకారంలో కూర్చుని నిరసన తెలిపా రు. రెవెన్యూ కార్యాలయం ఎదుట తహశీల్దార్, జేఏసీ నాయకులు నిరసన తెలిపారు.

పుట్టపర్తిలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సోనియాగాంధీ జ న్మదినం... మనకు దుర్దినమంటూ పేడతో తయారు చే సిన కేక్‌ను సోనియా దిష్టిబొమ్మకు తినిపించారు. అనంతరం దిష్టిబొమ్మను తగులబెట్టారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు ఆధ్వర్యంలో పట్టణ బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, జేఏసీ నాయకులు సోనియాగాంధీ చిత్రపటానికి చెప్పుల దండ వేసి... పాతమునిసిపల్ కార్యాలయం నుంచి వినాయసర్కిల్ వరకు ఊరేగిం చారు. అనంతరం అక్కడ దహనం చేశారు. గుమ్మఘట్ట, బుక్కరాయసముద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. తాడిపత్రిలో నాన్‌పొలిటికల్ జేఏసీ, ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి పిండ ప్రదానం చేశారు. తాడిపత్రిలో ఇం జనీరింగ్ కళాశాల విద్యార్థుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.  కూడేరులో రాస్తారోకో చేశారు. అలాగే విద్యార్థులు రోడ్డుపైనే పాఠాలు చదువుతూ నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement