చీకటి రోజు | united agitation become severe in Ananthapur district | Sakshi
Sakshi News home page

చీకటి రోజు

Published Wed, Feb 19 2014 2:59 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

united agitation become severe in Ananthapur district

తెలుగు జాతిని నిలువునా చీల్చిన దుర్దినమిది.. 23 జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను 23 నిమిషాల్లో నిర్దాక్షిణ్యంగా చీల్చేశారు.. కేంద్రంలోని అధికార యూపీఏ, ప్రతిపక్ష బీజేపీ నేతలు తడి గుడ్డతో తెలుగువారి గొంతు కోసేశారు.. అభివృద్ధిలో అట్టడుగున ఉన్న ‘అనంత’ గతేం అవుతుందన్న కనీసపాటి ఆలోచన చేయకుండానే చంద్రబాబు ఇచ్చిన గొడ్డలితో రాష్ట్రాన్ని నరికేశారు.
 
 రాష్ట్ర విభజనను అడ్డుకుంటున్నామంటూ మాటలు కోటలు దాటించిన కాంగ్రెస్, టీడీపీ నేతలిప్పుడు తేలు కుట్టిన దొంగలయ్యారు.. (అ)మంగళవారం సాయంత్రం అందరూ ‘టీ’ తాగే సమయంలో.. ఆ ‘టీ’ తాగేందుకు అవసరమయ్యే సమయమంతైనా తీసుకోకుండానే ‘తెలంగాణ ఇచ్చేశాం.. ఇక తన్నుకు చావండి’ అంటూ లోక్‌సభలో ‘టీ’ బిల్లుకు ఆమోదం తెలపడంపై ‘అనంత’ ప్రజలు కన్నీటిపర్యంతమవుతున్నారు.. ఇది మన ఖర్మ కాకపోతే మరేంటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇదేం పాలన అంటూ రగిలిపోతున్నారు.. విభజనకు కారణమైన నేతల భరతం పడతామని శపథం చేస్తున్నారు.. వారి రాజకీయ జీవితానికి సమాధి కట్టేందుకు రాళ్లు పేర్చుకుని సిద్ధంగా ఉన్నారు..
 
 సాక్షి, అనంతపురం :  రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలపడంతో సమైక్యవాదులు జిల్లా అంతటా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఇంత ఘోరంగా విభజించిన వారు నాశనమవుతారంటూ నినదించారు. బిల్లుకు సంబంధించి పార్లమెంటులో చర్చ ప్రారంభం కాగానే టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారాలను కూడా నిలిపి వేసి 23 నిమిష్లాల్లోనే ఆమోద ముద్ర వేయడంతో సమైక్యవాదులు కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి అనంతపురంలో కొద్దిసేపు యుద్ధవాతావరణం నెలకొంది. సమైక్యవాదులు ఒక్క సారిగా రోడ్లపైకి వచ్చి సోనియాగాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ప్రధాన పట్టణాల్లో స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్ పాటించారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారడంతో కర్ఫ్యూను తలపించింది.
 
 ఆందోళన చేస్తున్న సమైక్యవాదులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. సమైక్యవాదుల్లో భయాందోళనలు కల్గించేందుకు పోలీసులు భారీ సంఖ్యలో ఉదయం నుంచే నగరంలోని ప్రధాన వీధులలో కలియదిరిగారు. విద్యార్థులు బయటకు రాకుండా ఆర్ట్స్ కళాశాల హాస్టల్ వద్ద ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఇనుప కంచె వే శారు. శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 
 విద్యార్థులు ఒక్క సారిగా బయటకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అనంతపురం - చెన్నై జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన వెంటనే ఆర్టీసీ బస్సులు సైతం రోడ్లమీదకు రాకుండా డిపోలకే పరిమితమయ్యాయి.
 
 పెట్రోల్ బంకులు, ఏటీఎం సెంటర్లను సైతం మూసివేశారు. ఏడవ నంబర్ జాతీయ రహదారిపై సమైక్యవాదులు ఆందోళన చేపట్టడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలకు బీజేపీ మద్దతు తెలుపడంతోనే లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిందని ఆరోపిస్తూ సమైక్యవాదులు బీజేపీ జిల్లా కార్యాలయంపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాంగ్రెస్ కార్యాలయంపై కూడా దాడులు జరిగే అవకాశం వుందని భావించి పోలీసులు వలయాకారంగా వుంటూ రక్షణగా నిలిచారు.
 
 విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అనంతపురంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇదిలా ఉండగా అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలో బుధవారం జరగాల్సిన అన్ని పరీక్షలనూ వాయిదా వేసినట్లు వైస్ చాన్సలర్ లాల్‌కిషోర్ తెలిపారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామన్నారు. ఆందోళనకారులు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి చొరబడే అవకాశం ఉందని భావించిన పోలీసులు అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
 నేడు జిల్లా బంద్.. రాష్ట్ర విభజన  బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు అన్ని వర్గాల వారు మద్దతు తెలపాలని జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, పార్టీ నేత బి.ఎర్రిస్వామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉదయం 7 గంటలకు సుభాష్‌రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకోవాలని వారు పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement