పీసీసీ పీఠంపై రఘువీరా | N . raghuveera reddy member as congress committee | Sakshi
Sakshi News home page

పీసీసీ పీఠంపై రఘువీరా

Published Wed, Mar 12 2014 2:38 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

N . raghuveera reddy member as congress committee

సాక్షి, అనంతపురం : సీమాంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఎన్.రఘువీరారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లా నుంచి పీసీసీ చీఫ్‌గా కుర్చీని అధిష్టించిన వారిలో రఘువీరారెడ్డి రెండో వ్యక్తి కావడం విశేషం.

1937లో అప్పటి మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఇల్లూరుకు చెందిన నీలం సంజీవరెడ్డి (మాజీ రాష్ట్రపతి) పని చేశారు. ఆయన తరువాత ప్రస్తుతం జిల్లాలోని మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురానికి చెందిన నీలకంఠాపురం రఘువీరారెడ్డి సీమాంధ్ర పీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టనున్నారు.

జిల్లాకు చెందిన రఘువీరారెడ్డి 1989లో మడకశిర నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రవేశం చేశారు. 1994 ఎన్నికల్లో మడకశిర నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి వైటీ ప్రభాకర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో మడకశిర నుంచి విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో మడకశిర నుంచి విజయం సాధించిన రఘువీరా.. దివంగత వైఎస్ మంత్రివర్గంలో ఐదేళ్లపాటు వ్యవసాయశాఖ మంత్రిగా పని చేశారు.
 
 నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో మడకశిర నియోజకవర్గం 2009 ఎన్నికల్లో ఎస్సీలకు రిజర్వు కావడంతో జనరల్ నియోజకవర్గం కళ్యాణదుర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. మూడోసారి విజయం సాధించిన రఘువీరారెడ్డి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో రెండోసారి వ్యవసాయశాఖ మంత్రిగా పగ్గాలు చేపట్టారు. వైఎస్ హఠాన్మరణంతో రోశయ్య మంత్రివర్గంలోనూ అదే శాఖను రఘువీరా నిర్వహించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో మూడున్నరేళ్లపాటూ రెవెన్యూశాఖను నిర్వహించారు. ఇప్పుడు పీసీసీ చీఫ్‌గా నియమితులయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులను సన్నద్ధం చేయడంలో భాగంగా మంగళవారం అనంతపురం వచ్చిన రఘువీరారెడ్డికి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా ఫోన్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement