సంక్రాంతికి పీఆర్సీ ఇస్తాం
* 3న ఉపసంఘం భేటీ: యనమల
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి పీఆర్సీ ఇస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. పీఆర్సీ మీద చర్చించడానికి జనవరి 3న మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో చర్చల తేదీని ఆ భేటీలో ఖరారు చేస్తామని తెలిపారు.
పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలూ గట్టిగా డిమాండ్ చేయలేదని, ప్రభుత్వమూ నాన్చివేత ధోరణిలో ఉందంటూ.. ‘సంక్రాంతి పీఆర్సీ తెచ్చేనా’ శీర్షికన ‘సాక్షి’వార్త ప్రచురించింది. ఈ నేపథ్యంలో అటు ఉద్యోగ సంఘాలు, ఇటు ప్రభుత్వ వర్గాల్లో కదలిక వచ్చింది.
ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు నేతృత్వంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు (ఏపీ రెవెన్యూ సంఘం), వెంకటేశ్వరరావు (యూటీఎఫ్), కత్తి నరసింహారెడ్డి(ఎస్టీయూ), రఘురామిరెడ్డి (ఏపీటీఎఫ్), చంద్రశేఖరరెడ్డి(ఏపీఎన్జీవో), మురళీకృష్ణ (సచివాలయ ఉద్యోగుల సంఘం)తో కూడిన ఉద్యోగ సంఘాల జేఏసీ మంగళవారం.. యనమలతో భేటీ అయింది. సంక్రాంతికి పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. దానికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. ‘మీతో మాట్లాడకుండా ఫిట్‌మెంట్ నిర్ణయించం’ అని చెప్పారు.