ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న అశోక్‌ బాబు | NGO Leader Ashok Babu playing Games With Employees Life | Sakshi
Sakshi News home page

పదవి కోసం అశోక్‌ బాబు ఎందాకైనా..!

May 25 2018 7:35 AM | Updated on Oct 17 2018 5:10 PM

NGO Leader Ashok Babu playing Games With Employees Life - Sakshi

అశోక్‌ బాబు ఫైల్‌ఫొటో

సాక్షి, అమరావతి : ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన యూనియన్‌ నాయకులే పదవీకాంక్షతో వందలాది మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో అదే జరుగుతోంది. ఉద్యోగులకు గెజిటెడ్‌ హోదా వస్తే ఏపీ ఎన్‌జీవో సంఘం అధ్యక్ష పదవి పోతుందన్న భయంతో పి.అశోక్‌బాబు దానికి అడ్డుపడుతున్నారని వాణిజ్య శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిళ్లు
జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్‌ శాఖలోని ఉద్యోగులతో సమానంగా వాణిజ్య శాఖ ఉద్యోగుల హోదాలను మార్చాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా గ్రేడ్‌ టు నాన్‌ గెజిటెడ్‌ హోదాలో ఉన్న అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ (ఏసీటీవో) పదవిని గెజిటెడ్‌ హోదాతో కూడిన గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ (జీఎస్‌టీవో)గా మార్చాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏసీటీవోలను జీఎస్‌టీవోలుగా మారుస్తూ సర్వీస్‌ నిబంధనలు జారీ అయ్యాయి. అయితే తమకు గెజిట్‌డ్‌ హోదా రాకుండా కొన్ని రాజకీయ శక్తులు అడ్డుపడుతున్నాయని ఏసీటీవోలు వాపోతున్నారు.

కారుణ్య నియామకం కింద వాణిజ్య శాఖలో ఏసీటీవోగా విధులు నిర్వర్తిస్తున్న అశోక్‌బాబు గెజిటెడ్‌ హోదాతో కూడిన జీఎస్‌టీవోగా మారితే.. తక్షణం నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగ సంఘం నేత పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి జీవో రాకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. తన పదవి కోసం మిగిలిన 768 ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న గెజిటెడ్‌ హోదాకు సంబంధించిన ఫైలు కదలకుండా పైనుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపిస్తున్నారు. కమర్షియల్‌ ట్యాక్స్‌ కమిషనర్‌ శ్యామలరావుతో పాటు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు కూడా ఆమోదం తెలిపినా తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అశోక్‌బాబు అడ్డుకుంటున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తక్షణం అమలు చేయాలి
రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహశీల్దార్, సబ్‌ రిజిస్ట్రార్, కోఆపరేటివ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ వంటి వారికి ఇప్పటికే గెజిటెడ్‌ హోదా కల్పించారు. అదే గ్రేడు పరిధిలోకి వచ్చే జీఎస్‌టీవోలకూ గెజిటెడ్‌ హోదా కల్పించాలి. ఇప్పటికే ఏసీటీవోలను జీఎస్‌టీవోలుగా మారుస్తూ సర్వీసు నిబంధనల్లో సవరణ చేశారు. వ్యక్తులతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్న గెజిటెడ్‌ హోదాను తక్షణం నోటిఫై చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. – కె.ఆర్‌.సూర్యనారాయణ, వాణిజ్య శాఖ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement