
సరైన వసతులు కల్పిస్తేనే..
ఉద్యోగుల తరలింపుపై అశోక్‌బాబు స్పష్టీకరణ
నందిగామ రూరల్: రాజధానికి ఉద్యోగులు తరలిరావాలంటే ప్రభుత్వం అందుకు అవసరమైన వసతులు కల్పించాల్సిందేనని, సరైన వసతులు లేకుండా తరలివచ్చేందుకు ఉద్యోగులు ఏమాత్రం సుముఖంగా లేరని రాష్ట్ర ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా నందిగామలో కొత్తగా నిర్మించిన ఎన్జీవో కాంప్లెక్స్‌ను ప్రారంభించేందుకు ఆదివారం ఇక్కడకు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానికతపై ఇప్పటివరకు స్పష్టమైన హామీ లేదని, వసతుల కల్పన విషయంలో సైతం సరైన స్పష్టత లభించలేదన్నారు. తమ డిమాండ్ల పరిష్కారంతోపాటు తగిన సమయం కూడా ఇస్తేనే తరలింపు సాధ్యమవుతుందని చెప్పారు. ఏర్పాట్లు పూర్తి చేసిన తరువాత తగిన సమయంతో కూడిన తేదీని ప్రకటించాలని, ఇలా చేస్తే తరలి వచ్చేందుకు ఉద్యోగులుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.