
దాతృత్వం చాటుకున్న బాలీవుడ్ నటుడు
ముంబై: 'రక్తచరిత్ర' సినిమాతో తెలుగువారికి పరిచయమైన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. మంచి నటుడిగానే కాక ఎన్నో సందర్భాల్లో ఒబెరాయ్ సమాజం కోసం తన వంతుగా సహాయాన్ని చేస్తూనే ఉన్నారు. జమ్మూ కశ్మీర్ లోని 10 మంది బాలికల చదువుకయ్యే ఖర్చు కోసం స్కాలర్ షిప్ అందించడానికి ఒబెరాయి స్థాపించిన ఎన్జీఓ 'దేవీ' ముందుకు వచ్చింది.
జమ్ము కశ్మీర్లోని సెయింట్ లారెన్స్ పాఠశాలలోని 10 మంది విద్యార్థినులకు ఈ స్కాలర్షిప్ ఫలాలు అందనున్నాయి. విద్యార్థినుల ఉన్నత చదువులకు, హాస్టల్, వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును స్పాన్సర్ చేయనున్నారు. స్కాలర్షిప్ విషయమై వివేక్ ఒబెరాయ్ స్పందిస్తూ..చదువు వారిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లగలిగితే, వారి లక్ష్యాలను చేరకోవడానికి కావల్సిన రెక్కలను అందించడానికి తాను సిద్ధమని తెలిపారు.