మామూలుగా అయితే స్కూల్లో టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్తారు. హోంవర్క్ రాసుకురమ్మని చెప్తారు. పరీక్షలు పెట్టి మార్కులు వేస్తారు. పైగా ఇవన్నీ చేసినందుకు ప్రైవేటు స్కూళ్లలో ఫీజు తీసుకుంటారు. అయితే థాయ్‌లాండ్‌లో ఉన్న ‘మెషై పట్టానా స్కూల్’(mechai pattana school) లో మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఈ బడినే ప్రపంచవ్యాప్తంగా "Bamboo Sc-hool' అని కూడా అంటారు. ఇక్కడ పిల్లలకు పాఠాలతోపాటు సేవ చేయడం నేర్పిస్తాను. సమాజంలో ఎలా బతకాలో నేర్పిస్తారు. తోటివారిని ఎలా గౌరవించాలో, వృద్ధులతో ఎలా నడుచుకోవాలో, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో.. ఇవన్నీ నేర్పిస్తారు. ఇవన్నీ నేర్పినందుకు వారు ఫీజేమీ తీసుకోరు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి 400 చెట్లు నాటితే చాలు.
థాయ్‌లాండ్‌కు చెందిన మెషై విరవైద్య అనే ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది 2008లో ఈ పాఠశాలను ్రపారంభించారు. స్కూళ్లలో పెరుగుతున్న పేద, ధనిక తారతమ్యం, పాఠశాలలు కేవలం పుస్తకాలు బట్టీ వేసే ప్రదేశాలుగా మారిపోవడం వంటివి గమనించి తాను ఈ స్కూల్‌ని స్థాపించినట్లు ఆయన వివరిస్తారు. బడిలో అందరూ ఒకచోట చేరి సంస్కారాన్ని, సామాజిక సేవనీ, పౌరబాధ్యతలనూ నేర్చుకోవాలని అంటారు.
దానికి తగ్గట్టే ఈ పాఠశాల విధివిధానాలను ఆయన రూపొందించారు. ఇక్కడ మామూలు తరగతులతోపాటు కూరగాయలు పండించడం, పశువుల్ని పెంచడం, కళాకృతులు తయారు చేయడం, వంటలు చేయడం వంటివి నేర్పిస్తారు. దీంతోపాటు విద్యార్థులను బృందాలుగా ఏర్పరిచి, వారికొక నాయకుణ్ని నియమిస్తారు. వారిని సమన్వయం చేసుకుంటూ, వారిలో స్ఫూర్తి నింపుతూ సాగేలా అతనికి తర్ఫీదు ఇస్తారు. ఇక్కడ బాధ్యతలన్నీ విద్యార్థులే తీసుకుంటారు. కొత్తవారిని స్కూల్లో చేర్చుకోవడం, కొత్త టీచర్లను విధుల్లోకి తీసుకోవడం వంటి పనుల కోసం ‘స్టూడెంట్ బోర్డ్’ పని చేస్తుంది.
స్కూల్‌కి కావాల్సిన వస్తువులు కొనడం, ఇచ్చిన నిధుల్ని సక్రమంగా ఖర్చుచేయడం కూడా వారి బాధ్యతే. ఇక్కడ వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారు ఫీజు చెల్లించనవసరం లేదు. అయితే పాఠశాలల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రతి విద్యార్థి ఏడాదిలో 400 గంటలు సమాజ సేవ చేయాలి. అది ఇక్కడ కచ్చితమైన నిబంధన. స్త్రీలను ఎలా అర్థం చేసుకోవాలి, వారి మానసిక పరిస్థితి, శారీరక ఇబ్బందులేమిటనే అంశాలపై ఇక్కడి విద్యార్థులకు ప్రత్యేక తరగతులుంటాయి. దీనివల్ల వారిలో తోటివారి పట్ల అవగాహన, ఆత్మీయత పెరుగుతాయని మెషై విరవైద్య వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment