బాలలది గమ్యం తెలియని ప్రయాణం..! | The children travel to an unknown destination ..! | Sakshi
Sakshi News home page

బాలలది గమ్యం తెలియని ప్రయాణం..!

Published Sat, Aug 8 2015 4:00 AM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM

The children travel to an unknown destination ..!

 ఒంగోలు సబర్బన్ : ‘బాలలు తెలిసీ తెలియని వయసులో బజారున పడుతున్నారు. వీరికి గమ్యం తెలియక ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. గ్రామాల్లో పనులు లేక తల్లిదండ్రులు వలస వెళ్తుండటమే ఇందుకు కారణం’ అని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వి.మోహన్‌కుమార్ అభిప్రాయపడ్డారు. హెల్ప్ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఓ హోటల్‌లో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన ఎన్‌జీఓ ప్రతినిధులకు ‘బజారున పడుతున్న బాలలు.. గమ్యం తెలియని ప్రయాణం’ అన్న అంశంపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు.

నెల్లూరు రీజియన్ జిల్లాల పరిధిలో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మోహన్‌కుమార్ మాట్లాడుతూ చిన్నారులు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లకుండా ఎక్కడెక్కడికో వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల వలసలతో పిల్లలు తమ హక్కులు, కోల్పోతున్నారని చెప్పారు. గ్రామీణ బాలలు ఎక్కువగా అభివృద్ధి చెందిన పట్టణాలు, రాష్ట్రాలకు వె ళ్తున్నారన్నారు. తల్లిదండ్రులు పనుల ఒత్తిడిలో పిల్లలను ఒంటరిగా వదిలేయటంతో వారు రకరకాల అలవాట్లకు బానిసలవుతున్నారని పేర్కొన్నారు.

బయటకు వెళ్లిన మగపిల్లలు హింసకు గురవుతుంటే, ఆడపిల్లలు లైంగిక వేధింపులకు బలవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు చట్టాలున్నా అసలు చిన్నారులను అక్కడివరకూ వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే వారి భవిష్యత్ బాగుంటుందని మోహన్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. వలసలతో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి హెల్ప్ సంస్థ డెరైక్టర్ ఎన్‌వీఎస్. రామ్మోహన్ వివరించారు.

గ్రామాల నుంచి ఎంత మంది వలస వెళ్తున్నారో లెక్కించాలని ఎన్‌జీఓ సంస్థల ప్రతినిధులకు సూచించారు. దేశ జనాభాలో 50 శాతం యువకులు ఉన్నారని, వారిలో 42 శాతం మంది 18 సంవత్సరాల లోపు వయసు వారని చెప్పారు. సదస్సు కన్వీనర్ బాలశౌరి మాట్లాడుతూ వలస బాధిత బాలలను గుర్తించి వారి హక్కులు కాపాడాలని కోరారు. సీడబ్ల్యూసీ, ఐసీపీఎస్.. వంటి ఆపదలో ఉన్న బాలలకు రక్షణ కల్పించాలని, వారికి సౌకర్యాలు సమకూర్చాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల చైర్మన్లు డీవీఆర్‌కె శివప్రసాద్, డి.రోహన్‌కుమార్, పి.జయరాజ్‌తో పాటు చైల్డ్‌లైన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement