సాక్షి, జగిత్యాల : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో పసికందు అమ్మకానికి సిద్ధపడ్డ శిశువు కథ కొలిక్కిరానుంది. సుమారు 20 రోజులక్రితం కరీంనగర్‌లోని స్వధార్‌హోమ్ నుంచి పారిపోయిన గంగజ్యోతి ఆర్మూర్ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. విచారణలో చిన్నారిని అపహరించానని ఒప్పుకున్నట్లు తెలిసింది. నిర్మల్ జిల్లా కడెంకు చెందిన పుట్ట గంగజ్యోతి, మహారాష్ట్రకు చెందిన నవీన్ దంపతులు. ఇద్దరు ఆర్మూర్ బస్టాండ్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు స్నేహ ఉంది. నవీన్ భార్యను విడిచిపెట్టి పోవడంతో జ్యోతి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది.
ఈ క్రమంలో నెలరోజుల పసికందును రూ.20 వేలకు అమ్మడానికి సిద్ధపడుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు, ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చి పాపను అప్పగించారు. అధికారుల విచారణలో జ్యోతి పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి లోతుగా విచారణ చేపట్టారు. శిశువును, జ్యోతిని, నక్షితను కూడా స్వధార్‌హోమ్‌కు తరలించారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. కాగా 20 రోజుల క్రితం గంగజ్యోతి తన కూతురు నక్షితను స్వధార్‌హోమ్‌లోనే వదిలిపెట్టి పారిపోయింది.
శుక్రవారం గంగజ్యోతి ఆర్మూర్‌లో పట్టుబడగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జరిగిన సంఘటనపై విచారణ చేపడుతున్నారు. అయితే మెట్‌పల్లిలో అమ్మకానికి పెట్టిన పాప నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన గందం సుమలత బిడ్డగా తెలుస్తోంది. దీనిపై ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. గందం సుమలత పాపనే ఎత్తుకెళ్లినట్లు గంగజ్యోతి చెప్పినప్పటికీ డీఎన్‌ఏ పరీక్షల నివేదిక కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం పాప కరీంనగర్‌లోని శిశుగృహలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment