shishugruha
-
‘మురిపాల’మూరు చిన్నారులు
‘నాకూ నా కుటుంబం ఉంది’ అనేది గుండె నిండా ధైర్యాన్ని ఇచ్చే మాట. ‘నాకు నా కుటుంబం ఉంది’ అనేది చీకట్లో వెన్నెలై పలకరించే మధురమైన మాట. ఆ ధైర్యాన్ని ఇచ్చే మాట, మధురమైన మాటకు నోచుకోని శిశువులు అక్కడ కనిపిస్తారు. అయితే వారి దురదృష్టాన్ని చూసి ‘పాలమూరు శిశుగృహ’ కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఉండదు. వెన్నెల రాత్రులలో చందమామ కథలు చెబుతున్నట్లు ఉంటుంది...‘చిన్నీ... నువ్వేమీ బాధ పడవద్దు. నిన్ను వెదుక్కుంటూ ఒక అమ్మ తప్పనిసరిగా వస్తుంది’ అని ఆభయమిస్తున్నట్లుగా ఉంటుంది. నిజమే, దత్తత తీసుకోవడానికి దేశవిదేశాల నుంచి ఎంతోమంది తల్లులు ఈ శిశుగృహకు వస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డలో 2010లో శిశుగృహ ఏర్పాటు అయింది. 2011 నుంచి దత్తత ప్రక్రియ మొదలైంది. సంతానలేమితో బాధపడుతున్న దంపతులు రోజుల వయసున్న పసికందు నుంచి అంతకంటే పెద్ద వయసు ఉన్న పిల్లల వరకు దత్తత తీసుకునే అవకాశాన్ని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కల్పించింది. ‘శిశుగృహ’ నుంచి 230 మంది చిన్నారులు దత్తతకు వెళ్లారు. ఇలా దత్తతకు వెళ్లిన వారిలో ఆడ శిశువులు, బాలికలే అధికంగా ఉండడం విశేషం.ప్రేమకు ఊరితో పనేమిటి? దేశంతో పనేమిటి?‘నాకు ఒక బిడ్డ కావాలి’ అంటూ అమెరికా నుంచి రెక్కలు కట్టుకొని వాలింది క్రిస్టినా నోయ. క్రిస్టినా–మాథ్యూ థామస్ దంపతులు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.వారికి ఇద్దరు సంతానం. ఇద్దరూ మగపిల్లలే కావడంతో ఆడబిడ్డను దత్తత తీసుకున్నారు. ఆ పాపను ఎత్తుకుంటూ క్రిస్టినా నోయల్ మురిసిపోయింది.‘నా బిడ్డలతో సమానంగా చూసుకుంటాను. ఎలాంటి కష్టం రానివ్వను...’ ఇలా తన చుట్టూ ఉన్న వారితో చెప్పుకుంటూ పోతూనే ఉంది ఆ తల్లి. తనను వెదుక్కుంటూ వచ్చిన తల్లిని చూసిన మొదటి క్షణంలో ఆ పాప కళ్లలో ఎలాంటి భావం లేదు. ఆ తరువాత మాత్రం నవ్వింది. ‘ఇప్పుడు నాకు కూడా ఒక అమ్మ ఉంది’ అని తెగ సంబరపడుతున్నట్లుగా ఉంది ఆ నవ్వు. ఆ నవ్వు చూసి అక్కడున్న వాళ్లందరూ నవ్వారు... ఇలాంటి ఆత్మీయ పరిమళాలు వెదజల్లడం పాలమూరు శిశుగృహలో కొత్త కాదు.అమ్మను మించిన అమ్మలుపిల్లలు దత్తతకు వెళ్లినప్పుడు అందరి కంటే ఎక్కువ సంతోషించేదీ, బాధ పడేదీ శిశుగృహలో పని చేసే ఆయాలు. సంతోషం ఎందుకంటే...‘మా పిల్లలకు అమ్మ దొరికింది’ అనుకోవడం వల్ల. బాధ ఎందుకంటే...‘అయ్యో! నా సొంత బిడ్డలా చూసుకున్న పిల్ల ఇక నాకు కనిపించదా!’ అనుకోవడం వల్ల. ఇక్కడ ఆయాగా పనిచేస్తున్న చెన్నమ్మ తాను చేస్తున్నది ఉద్యోగం మాత్రమే అనుకోవడం లేదు.ఆడ శిశువులే ఎక్కువ‘శిశుగృహ’లో నుంచి ఇప్పటివరకు 28 మంది శిశువులను విదేశీయులు దత్తత తీసుకున్నారు. ఇందులో ఆడశిశువులు ఇరవైరెండు మంది. మగ శిశువులు ఆరుగురు. అమెరికాకు పద్నాలుగు మంది, స్పెయిన్ కు ఐదుగురు, ఇటలీకి ముగ్గురు, మాల్టా, స్వీడన్ కు ఇద్దరు, ఫిన్ లాండ్, కెనడాకు ఒక్కొక్కరు దత్తతకు వెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయి. – కిషోర్ కుమార్ పెరుమాండ్ల, సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్దేవుడు నాకు ఇచ్చిన అవకాశం‘శిశుగృహ’లోని వారు ఎక్కడెక్కడి వారో కాదు... నా పిల్లలే. ‘వారి భవిష్యత్ బాగుండాలనే ఎప్పుడూ కోరుకుంటున్నాను. ఎక్కడ ఉన్నా వారు చల్లగా ఉండాలి. – చెన్నమ్మ, ఆయాఅల్లారుముద్దుగాశిశుగృహకు వచ్చిన చిన్నారులను చూస్తే జాలి కలగని వారు ఉండరు. బుడిబుడి నడకల వయసులోనే వారికెన్ని కష్టాలు అనిపిస్తుంది. వారిని మా సొంత పిల్లల మాదిరిగా చూసుకుంటాం. అల్లారుముద్దుగా పెంచుతాం. వారు వెళితే బాధగా ఉన్నప్పటికీ వారికి ఆసరా ఉండాలి కదా. – వెంకటమ్మ, ఆయావిదేశాల్లో మా పిల్లలు... గర్వంగా ఉందిమేము పెంచి పెద్దచేసిన పిల్లలు విదేశాలకు దత్తత వెళ్లి అక్కడే ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది. మేము కష్టపడి పెంచినందున ఆ కష్టానికి తగిన ఫలితం దొరికింది అని సంతోషపడతాం. ఏదో ఒకరోజు మా దగ్గరికి వచ్చి పలకరిస్తారనే ఆశ ఉంది. – విజయలక్ష్మి, ఆయాఅప్పుడు బాధగా అనిపిస్తుందివివిధ కారణాలతో శిశుగృహకు వచ్చే పిల్లలకు మేమే అమ్మలమవుతాం. కడుపున పుట్టకపోయినా అన్ని రకాల ప్రేమలు అందిస్తాం. దత్తత వెళ్లేవరకు ఆ పిల్లలకు తల్లిదండ్రులం మేమే. దత్తత వెళ్లిన పిల్లలు గుర్తుకు వచ్చినప్పుడు చాలా బాధగా ఉంటుంది. అయితే వారు ఎక్కడున్నా మంచిగా ఉండాలన్నదే మా కోరిక. – మణెమ్మ, ఆయా -
శిశువును రూ. 20 వేలకు అమ్మడానికి సిద్ధపడింది
సాక్షి, జగిత్యాల : జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో పసికందు అమ్మకానికి సిద్ధపడ్డ శిశువు కథ కొలిక్కిరానుంది. సుమారు 20 రోజులక్రితం కరీంనగర్‌లోని స్వధార్‌హోమ్ నుంచి పారిపోయిన గంగజ్యోతి ఆర్మూర్ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. విచారణలో చిన్నారిని అపహరించానని ఒప్పుకున్నట్లు తెలిసింది. నిర్మల్ జిల్లా కడెంకు చెందిన పుట్ట గంగజ్యోతి, మహారాష్ట్రకు చెందిన నవీన్ దంపతులు. ఇద్దరు ఆర్మూర్ బస్టాండ్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు స్నేహ ఉంది. నవీన్ భార్యను విడిచిపెట్టి పోవడంతో జ్యోతి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో నెలరోజుల పసికందును రూ.20 వేలకు అమ్మడానికి సిద్ధపడుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు, ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చి పాపను అప్పగించారు. అధికారుల విచారణలో జ్యోతి పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి లోతుగా విచారణ చేపట్టారు. శిశువును, జ్యోతిని, నక్షితను కూడా స్వధార్‌హోమ్‌కు తరలించారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. కాగా 20 రోజుల క్రితం గంగజ్యోతి తన కూతురు నక్షితను స్వధార్‌హోమ్‌లోనే వదిలిపెట్టి పారిపోయింది. శుక్రవారం గంగజ్యోతి ఆర్మూర్‌లో పట్టుబడగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జరిగిన సంఘటనపై విచారణ చేపడుతున్నారు. అయితే మెట్పల్లిలో అమ్మకానికి పెట్టిన పాప నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన గందం సుమలత బిడ్డగా తెలుస్తోంది. దీనిపై ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. గందం సుమలత పాపనే ఎత్తుకెళ్లినట్లు గంగజ్యోతి చెప్పినప్పటికీ డీఎన్ఏ పరీక్షల నివేదిక కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం పాప కరీంనగర్‌లోని శిశుగృహలో ఉంది. -
శిశుగృహలో.. మృత్యుఘోష
నల్లగొండ : తల్లిఒడి నుంచి దూరమైన అనాథ శిశువులకు కొండంత అండగా నిలవాల్సిన నల్లగొండ శిశుగృహలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ముర్రుపాల రుచికూడా తెలియకుండా పుట్టిన కొద్ది రోజులకే శిశుగృహలోకి అడుగుపెడుతున్న చిన్నారులకు అనారోగ్య సమస్యలు ప్రాణాలమీదకు తీసుకొస్తున్నాయి. నెలలు కూడా నిండని ఆ చిన్నారులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పసి మొగ్గలోనే ప్రాణాలు వదిలేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని శిశుగృహలో ఇటీవలి కాలంలో చిన్నారులు వరుసగా మృతిచెందిన సంఘటనలు కలవరం రేపుతున్నాయి. అనాథ శిశువులకు ఆశ్రయం కల్పించేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవరకొండ, నల్లగొండలో శిశు గృహలు ఏర్పాటు చేశారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా దేవరకొండ కేంద్రాన్ని కూడా నల్లగొండలోనే కలిపి నిర్వహిస్తున్నారు. ఒక్కో శిశుగృహాకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సంఖ్య పది మంది చిన్నారులు మాత్రమే. కానీ ప్రస్తుతం ఈ రెండు గృహాల్లో కలిపి మొత్తం 50 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. శిశుగృహలో పదిమంది దాటితే హైదరాబాద్‌లోని శిశువిహార్‌కు తరలించాలి. కానీ అక్కడ కూడా పరిస్థితులు సరిగా లేకపోవడంతో నల్లగొండలోనే ఉంచుతున్నారు. అయితే ఇక్కడి కేంద్రంలోని చిన్నారులకు వాతావరణ పరిస్థితు అనుకూలించడం లేదు. అధికారులు అందిస్తున్న పోషకారహారంలో లోపాలు ఉండటంతో శిశువులకు ఏ కొద్దిపాటి అనారోగ్య సమస్య తలెత్తిన అల్లాడిపోతున్నారు. శిశువుల్లో ఎక్కువ మంది ఆడపిల్లలే కావడం, వారి వయస్సు సున్నా నుంచి రెండేళ్ల లోపే ఉండటంతో అనారోగ్య సమస్యలు ఊపిరాడకుండా చేస్తోన్నాయి. ప్రాణాలతో చెలగాటం.. శిశుగృహల్లో చేరుతున్న చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదని చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. తల్లినుంచి వేరైన పిల్లలకు ముర్రుపాలు అందకపోవడం ప్రధాన సమస్య అయితే ఆ తర్వాత అధికారులు అందించాల్సిన పౌష్టికాహారం పిల్లలకు సమపాళ్లలో అందడం లేదు. పాల డబ్బాలు కొనేందుకు కూడా అధికారుల వద్ద డబ్బులు లేకపోవడంతో విజయ డెయిరీ.. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే టెట్రా పౌడర్ ప్యాకెట్లను వాడుతున్నారు. ప్యాకెట్లలోని పౌడర్‌లో పౌష్టికాహార గుణాలు తక్కువగా ఉండటంతో ఆ ప్రభావం శిశువుల ఎదుగుదలపై పడుతుందని వైద్యులు తెలిపారు. పోషకాహార లోపం కారణంగానే ఇటీవల కాలంలో చిన్నారులు వాంతులు, విరోచనాలు, శ్వాసకోస సంబంధిత వ్యాదుల్లో ఆస్పత్రుల్లో చేరారు. కొద్ది రోజుల క్రితం ఓ చిన్నారి వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో పిల్లలను పరీక్షించే వైద్యుడి వద్దకు అధికారులు తీసుకెళ్లారు. పిల్లలకు ఇస్తున్న పాల పౌడర్‌లో లోపం ఉండటంతో చిన్నారి పరిస్థితి విషమంగా మారిందని తేలింది. టెట్రా పౌడర్ వాడటం వల్ల కిడ్నీలపై దాని ప్రభావం పడిందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగానే మరో శిశువుకు పాలు పట్టించడంలో ఆయాలు సరైన పద్ధతి పాటించకపోవడంతో ఆ శిశువు చనిపోయింది. శిశువుకు పట్టిన పాలు లోపలికి పోకుండా శ్వాసనాళానికి అడ్డుపడటంతో ఊపిరి పీల్చుకోలేపోయింది. ఆగమేఘాల మీద శిశుగృహ సిబ్బంది ఆ శిశువును ఆస్పత్రికి తీసుకొచ్చినా వైద్యులు కాపాడలేకపోయారు. ఇలాంటి సంక్లిష్ట సమస్యను ఎదుర్కొన్న 20 మంది చిన్నారులను ప్రాణాపాయస్థితి నుంచి కాపాడగలిగామని వైద్యులు తెలిపారు. సకాలంలో వైద్యం అందక.. శిశుగృహలోని పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు అప్పటికప్పుడు ఆగమేఘాల మీద ప్రభుత్వ ఆస్పత్రి తీసుకెళ్తున్నారు. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి వ్యాధులకు మాత్రమే వైద్యం చేస్తున్నారు. రోగనిరోధక శక్తి, బరువు తక్కువగా ఉన్న పిల్లలకు ఈ విషయంలో వైద్యులు ఏమీ చేయలేకపోతున్నారు. ప్రభుత్వ వైద్యులు కాకుండా ప్రైవేటు వైద్యుల సహాకారం తీసుకుందామంటే అందుకు అయ్యే వైద్య ఖర్చులు భారీగా ఉండటంతో వెనుకాడుతున్నారు. చివరికి శిశువులను హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అప్పటికే చిన్నారులకు వ్యాధి ముదిరిపోవడంతో అక్కడకు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ మూడు నెలల కాలంలో ఆరుగురు శిశువులు మృతి చెందారు. కానీ అనధికారికంగా వచ్చిన సమాచారం మేరకు పది మంది శిశువులు మృతి చెందినట్లు తెలిసింది. ప్రస్తుతం 8 మంది చిన్నారులు నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 15 రోజులుగా చికిత్స పొందుతున్నారు. మరో ఐదుగురిని నీలోఫర్‌కు తరలించారు. పిల్లలు చనిపోతున్నారు శిశుగృహాల్లో సామార్ధ్యానికి మించి పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం 46 మంది పిల్లలకు ఆశ్రయం కల్పించాం. ముర్రుపాలు పట్టించకపోవడంతో పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటోంది. అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించి వైద్యం అందిస్తున్నాం. వైద్యుల సూచనల మేరకు రోగ తీవ్రతను బట్టి నీలోఫర్‌కు తరలిస్తున్నాం. మూడు నెలల కాలంలో ఆరుగురు చనిపోయారు. టెట్రాప్యాకెట్ పౌడర్ వాడాం. కానీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం లేదని బంద్ చేశాం. - పుష్పలత, ఐసీడీసీ పీడీ పిల్లల పెంపకం సరిగా లేదు శిశువులకు పౌష్టికాహారం సరిగా అందడం లేదు. టెట్రాప్యాకెట్లలో సొల్యూడ్ ఫాక్సన్ ఉంటుంది. ఈ పౌడర్ వాడకం వల్ల శిశువులు నీరసించిపోవడం, స్టిమ్యూలేషన్ లేకపోవడం జరుగుతుంది. చిన్నపిల్లల కిడ్నీలు ఒత్తిడికి గురివుతాయి. అప్పుడే పుట్టిన పిల్లలకు 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్ర తలో ఉంచాలి. లేదంటే మెటాబాలిక్ స్ట్రెస్ పెరుగుతుంది. పిల్లలకు వెచ్చదనం కావాలి. చిన్నచిన్న గదుల్లో వారిని ఉంచాలి. తీవ్ర అనారోగ్యానికి గురైన 15 చిన్నారులకు వైద్యం చేశా. - సుధాకర్, పిల్లలను పరీక్షించిన వైద్యులు తక్కువ బరువు ఉంటున్నారు శిశుగృహ నుంచి వస్తున్న చిన్నారులు తక్కువ బరువు ఉంటున్నారు. జలబు, దగ్గు, నయం చేయడం, బరువు పెంచడం వరకు ఇక్కడ సేవలు అందిస్తున్నాం. పిల్లల శరీరంలోపల ఏమున్నది అనేది తెలియదు. సీవియర్ సమస్యలు వస్తే నీలోఫర్‌కు రెఫర్ చేస్తున్నాం. ప్రస్తుతం ఆస్పత్రిలో 8మంది చిన్నారులకు వైద్యం అందిస్తున్నాం. ఎక్కువ మంది పిల్లల్లో డయేరియా సమస్య కూడా కనిపిస్తుంది. - దామెర యాదయ్య, ప్రభుత్వ వైద్యులు, (చిన్నపిల్లలు) -
ఏ తల్లి కన్నబిడ్డో..
సాక్షి, కడప : ఆరు నెలల క్రితం ఓ తల్లి వదిలేసిన పురిటి బిడ్డను కడప శిశుగృహ సిబ్బంది అక్కున చేర్చుకున్నారు. బరువు తక్కువగా ఉన్న ఆ బిడ్డకు ఐసీడీఎస్ అధికారులు మెరుగైన వైద్యం చేయించి సంరక్షించారు. ఇప్పుడు ఆ బుజ్జాయి 4.5 కిలోల బరువు ఉన్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆరు నెలల క్రితం రాజంపేట మున్సిపాలిటీ సమీపంలోని వంక ప్రాంతంలో ఓ తల్లి పురిటి బిడ్డను వదిలేసి వెళ్లింది. ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో తెలీదు ఆ చిన్నారిని స్కూల్ బ్యాగులో ఉంచి వెళ్లింది. పసికందు ఏడుస్తుంటే సమీపంలో దుస్తులు ఉతుకుతున్న రజకులు గమనించారు. ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకున్నారు. బరువు తక్కువగా ఉందని గ్రహించారు. అదే సమయంలో ఒక ముస్లిం సోదరుడు (పండ్ల వ్యాపారి) అటుగా వచ్చాడు. ఆయనకు ఐదుగురు ఆడ పిల్లలు. బరువు తక్కువగా ఉన్న ఈ చిన్నారిని కడపకు తీసుకెళ్లి వైద్యం చేయించాడు. నాలుగైదు వేలు ఖర్చు చేశాడు. ఆ తర్వాత కడపలోని అధికారులు సమాచారం ఇచ్చాడు. వెంటనే అధికారులు రిమ్స్‌కు తరలించి వైద్య సేవలు అందించి విషమ పరిస్థితిలో ఉన్న చిన్నారిని కాపాడారు. ఐసీడీఎస్ పీడీ రాఘవరావు ప్రత్యేక శ్రద్ధతీసుకున్నారు. అక్కడి నుంచి కడప నగర శివార్లలోని శిశుగృహకు తరలించి ప్రత్యేకంగా చూసుకుంటూ వచ్చారు. పుట్టినపుడు 800 గ్రాముల బరువున్న ఆ చిన్నారి ప్రస్తుతం 4.5 కిలోల బరువు ఉన్నాడు. శిశు విహార్‌లో ఐసీడీఎస్ పీడీ పర్యవేక్షణలో చిన్నారికి రమణకుమార్ అని నామకరణం కూడా చేశారు. ఆ చిన్నారి ప్రస్తుత వయస్సు ఆరు నెలలు. ముద్దుగా ఉన్న ఆ బుజ్జాయిని గురువారం సాయంత్రం దంపతులు దత్తత తీసుకున్నారు.