‘మురిపాల’మూరు చిన్నారులు | 230 children adopted from Palamuru Shishu gruha | Sakshi
Sakshi News home page

‘మురిపాల’మూరు చిన్నారులు

Dec 21 2024 12:54 AM | Updated on Dec 21 2024 12:54 AM

230 children adopted from Palamuru Shishu gruha

∙శిశుగృహలో చిన్నారుల వివరాలు తెలుసుకుంటున్న అప్పటి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రస్తుత కలెక్టర్‌ విజయేందిర బోయి

‘నాకూ నా కుటుంబం ఉంది’ అనేది గుండె నిండా ధైర్యాన్ని ఇచ్చే మాట. ‘నాకు నా కుటుంబం ఉంది’ అనేది చీకట్లో వెన్నెలై పలకరించే మధురమైన మాట. ఆ ధైర్యాన్ని ఇచ్చే మాట, మధురమైన మాటకు నోచుకోని శిశువులు అక్కడ కనిపిస్తారు. అయితే వారి దురదృష్టాన్ని చూసి ‘పాలమూరు శిశుగృహ’ కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఉండదు. వెన్నెల రాత్రులలో చందమామ కథలు చెబుతున్నట్లు ఉంటుంది...

‘చిన్నీ... నువ్వేమీ బాధ పడవద్దు. నిన్ను వెదుక్కుంటూ ఒక అమ్మ తప్పనిసరిగా వస్తుంది’ అని ఆభయమిస్తున్నట్లుగా ఉంటుంది. నిజమే, దత్తత తీసుకోవడానికి దేశవిదేశాల నుంచి ఎంతోమంది తల్లులు ఈ శిశుగృహకు వస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డలో 2010లో శిశుగృహ ఏర్పాటు అయింది. 2011 నుంచి దత్తత ప్రక్రియ మొదలైంది. సంతానలేమితో బాధపడుతున్న దంపతులు రోజుల వయసున్న పసికందు నుంచి అంతకంటే పెద్ద వయసు ఉన్న పిల్లల వరకు దత్తత తీసుకునే అవకాశాన్ని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కల్పించింది. ‘శిశుగృహ’ నుంచి 230 మంది చిన్నారులు దత్తతకు వెళ్లారు. ఇలా దత్తతకు వెళ్లిన వారిలో ఆడ శిశువులు, బాలికలే అధికంగా ఉండడం విశేషం.

ప్రేమకు ఊరితో పనేమిటి? దేశంతో పనేమిటి?
‘నాకు ఒక బిడ్డ కావాలి’ అంటూ అమెరికా నుంచి రెక్కలు కట్టుకొని వాలింది క్రిస్టినా నోయ. క్రిస్టినా–మాథ్యూ థామస్‌ దంపతులు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌లుగా పనిచేస్తున్నారు.వారికి ఇద్దరు సంతానం. ఇద్దరూ మగపిల్లలే కావడంతో ఆడబిడ్డను దత్తత తీసుకున్నారు. ఆ పాపను ఎత్తుకుంటూ క్రిస్టినా నోయల్‌ మురిసిపోయింది.

‘నా బిడ్డలతో సమానంగా చూసుకుంటాను. ఎలాంటి కష్టం రానివ్వను...’ ఇలా తన చుట్టూ ఉన్న వారితో చెప్పుకుంటూ పోతూనే ఉంది ఆ తల్లి. తనను వెదుక్కుంటూ వచ్చిన తల్లిని చూసిన మొదటి క్షణంలో ఆ పాప కళ్లలో ఎలాంటి భావం లేదు. ఆ తరువాత మాత్రం నవ్వింది. ‘ఇప్పుడు నాకు కూడా ఒక అమ్మ ఉంది’ అని తెగ సంబరపడుతున్నట్లుగా ఉంది ఆ నవ్వు. ఆ నవ్వు చూసి అక్కడున్న వాళ్లందరూ నవ్వారు... ఇలాంటి ఆత్మీయ పరిమళాలు వెదజల్లడం పాలమూరు శిశుగృహలో కొత్త కాదు.

అమ్మను మించిన అమ్మలు
పిల్లలు దత్తతకు వెళ్లినప్పుడు అందరి కంటే ఎక్కువ సంతోషించేదీ, బాధ పడేదీ శిశుగృహలో పని చేసే ఆయాలు. సంతోషం ఎందుకంటే...‘మా పిల్లలకు అమ్మ దొరికింది’ అనుకోవడం వల్ల. బాధ ఎందుకంటే...‘అయ్యో! నా సొంత బిడ్డలా చూసుకున్న పిల్ల ఇక నాకు కనిపించదా!’ అనుకోవడం వల్ల. ఇక్కడ ఆయాగా పనిచేస్తున్న చెన్నమ్మ తాను చేస్తున్నది ఉద్యోగం మాత్రమే అనుకోవడం లేదు.

ఆడ శిశువులే ఎక్కువ
‘శిశుగృహ’లో నుంచి ఇప్పటివరకు 28 మంది శిశువులను విదేశీయులు దత్తత తీసుకున్నారు. ఇందులో ఆడశిశువులు ఇరవైరెండు మంది. మగ శిశువులు ఆరుగురు. అమెరికాకు పద్నాలుగు మంది, స్పెయిన్ కు ఐదుగురు, ఇటలీకి ముగ్గురు, మాల్టా, స్వీడన్ కు ఇద్దరు, ఫిన్ లాండ్, కెనడాకు ఒక్కొక్కరు దత్తతకు వెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయి. – కిషోర్‌ కుమార్‌ పెరుమాండ్ల, సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

దేవుడు నాకు ఇచ్చిన అవకాశం
‘శిశుగృహ’లోని వారు ఎక్కడెక్కడి వారో కాదు... నా పిల్లలే. ‘వారి భవిష్యత్‌ బాగుండాలనే ఎప్పుడూ కోరుకుంటున్నాను. ఎక్కడ ఉన్నా వారు చల్లగా ఉండాలి.  – చెన్నమ్మ, ఆయా

అల్లారుముద్దుగా
శిశుగృహకు వచ్చిన చిన్నారులను చూస్తే జాలి కలగని వారు ఉండరు. బుడిబుడి నడకల వయసులోనే వారికెన్ని కష్టాలు అనిపిస్తుంది. వారిని మా సొంత పిల్లల మాదిరిగా చూసుకుంటాం. అల్లారుముద్దుగా పెంచుతాం. వారు వెళితే బాధగా ఉన్నప్పటికీ వారికి ఆసరా ఉండాలి కదా.  – వెంకటమ్మ, ఆయా

విదేశాల్లో మా పిల్లలు... గర్వంగా ఉంది
మేము పెంచి పెద్దచేసిన పిల్లలు విదేశాలకు దత్తత వెళ్లి అక్కడే ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది. మేము కష్టపడి పెంచినందున ఆ కష్టానికి తగిన ఫలితం దొరికింది అని సంతోషపడతాం. ఏదో ఒకరోజు మా దగ్గరికి వచ్చి పలకరిస్తారనే ఆశ ఉంది. – విజయలక్ష్మి, ఆయా

అప్పుడు బాధగా అనిపిస్తుంది
వివిధ కారణాలతో శిశుగృహకు వచ్చే పిల్లలకు మేమే అమ్మలమవుతాం. కడుపున పుట్టకపోయినా అన్ని రకాల ప్రేమలు అందిస్తాం. దత్తత వెళ్లేవరకు ఆ పిల్లలకు తల్లిదండ్రులం మేమే. దత్తత వెళ్లిన పిల్లలు గుర్తుకు వచ్చినప్పుడు చాలా బాధగా ఉంటుంది. అయితే వారు ఎక్కడున్నా మంచిగా ఉండాలన్నదే మా కోరిక. – మణెమ్మ, ఆయా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement