శిశుగృహలో.. మృత్యుఘోష | kids dies in shishugruha in Nalgonda | Sakshi
Sakshi News home page

శిశుగృహలో.. మృత్యుఘోష

Published Tue, Nov 7 2017 10:20 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

kids dies in shishugruha in Nalgonda - Sakshi

నల్లగొండ : తల్లిఒడి నుంచి దూరమైన అనాథ శిశువులకు కొండంత అండగా నిలవాల్సిన నల్లగొండ శిశుగృహలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ముర్రుపాల రుచికూడా తెలియకుండా పుట్టిన కొద్ది రోజులకే శిశుగృహలోకి అడుగుపెడుతున్న చిన్నారులకు అనారోగ్య సమస్యలు ప్రాణాలమీదకు తీసుకొస్తున్నాయి. నెలలు కూడా నిండని ఆ చిన్నారులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పసి మొగ్గలోనే ప్రాణాలు వదిలేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని శిశుగృహలో ఇటీవలి కాలంలో చిన్నారులు వరుసగా మృతిచెందిన సంఘటనలు కలవరం రేపుతున్నాయి. అనాథ శిశువులకు ఆశ్రయం కల్పించేందుకు  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవరకొండ, నల్లగొండలో శిశు గృహలు ఏర్పాటు చేశారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా దేవరకొండ కేంద్రాన్ని కూడా నల్లగొండలోనే కలిపి నిర్వహిస్తున్నారు. ఒక్కో శిశుగృహాకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సంఖ్య పది మంది చిన్నారులు మాత్రమే. కానీ ప్రస్తుతం ఈ రెండు గృహాల్లో కలిపి మొత్తం 50 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. శిశుగృహలో పదిమంది దాటితే హైదరాబాద్‌లోని శిశువిహార్‌కు తరలించాలి. కానీ అక్కడ కూడా పరిస్థితులు సరిగా లేకపోవడంతో నల్లగొండలోనే ఉంచుతున్నారు. అయితే ఇక్కడి కేంద్రంలోని చిన్నారులకు వాతావరణ పరిస్థితు అనుకూలించడం లేదు. అధికారులు అందిస్తున్న పోషకారహారంలో లోపాలు ఉండటంతో శిశువులకు ఏ కొద్దిపాటి అనారోగ్య సమస్య తలెత్తిన అల్లాడిపోతున్నారు. శిశువుల్లో ఎక్కువ మంది ఆడపిల్లలే కావడం, వారి వయస్సు సున్నా నుంచి రెండేళ్ల లోపే ఉండటంతో అనారోగ్య సమస్యలు ఊపిరాడకుండా చేస్తోన్నాయి.

ప్రాణాలతో చెలగాటం..
శిశుగృహల్లో చేరుతున్న చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదని చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. తల్లినుంచి వేరైన పిల్లలకు ముర్రుపాలు అందకపోవడం ప్రధాన సమస్య అయితే ఆ తర్వాత అధికారులు అందించాల్సిన పౌష్టికాహారం పిల్లలకు సమపాళ్లలో అందడం లేదు. పాల డబ్బాలు కొనేందుకు కూడా అధికారుల వద్ద డబ్బులు లేకపోవడంతో విజయ డెయిరీ.. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే టెట్రా పౌడర్‌ ప్యాకెట్లను వాడుతున్నారు. ప్యాకెట్లలోని పౌడర్‌లో పౌష్టికాహార గుణాలు తక్కువగా ఉండటంతో ఆ ప్రభావం శిశువుల ఎదుగుదలపై పడుతుందని వైద్యులు తెలిపారు. పోషకాహార లోపం కారణంగానే ఇటీవల కాలంలో చిన్నారులు వాంతులు, విరోచనాలు, శ్వాసకోస సంబంధిత వ్యాదుల్లో ఆస్పత్రుల్లో చేరారు. కొద్ది రోజుల క్రితం ఓ చిన్నారి వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో పిల్లలను పరీక్షించే వైద్యుడి వద్దకు అధికారులు తీసుకెళ్లారు. పిల్లలకు ఇస్తున్న పాల పౌడర్‌లో లోపం ఉండటంతో చిన్నారి పరిస్థితి విషమంగా మారిందని తేలింది. టెట్రా పౌడర్‌ వాడటం వల్ల కిడ్నీలపై దాని ప్రభావం పడిందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగానే మరో శిశువుకు పాలు పట్టించడంలో ఆయాలు సరైన పద్ధతి పాటించకపోవడంతో ఆ శిశువు చనిపోయింది. శిశువుకు పట్టిన పాలు లోపలికి పోకుండా శ్వాసనాళానికి అడ్డుపడటంతో ఊపిరి పీల్చుకోలేపోయింది. ఆగమేఘాల మీద శిశుగృహ సిబ్బంది ఆ శిశువును ఆస్పత్రికి తీసుకొచ్చినా వైద్యులు కాపాడలేకపోయారు. ఇలాంటి సంక్లిష్ట సమస్యను ఎదుర్కొన్న 20 మంది చిన్నారులను ప్రాణాపాయస్థితి నుంచి కాపాడగలిగామని వైద్యులు తెలిపారు.

సకాలంలో వైద్యం అందక..
 శిశుగృహలోని పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు అప్పటికప్పుడు ఆగమేఘాల మీద ప్రభుత్వ ఆస్పత్రి తీసుకెళ్తున్నారు. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి వ్యాధులకు మాత్రమే వైద్యం చేస్తున్నారు. రోగనిరోధక శక్తి, బరువు తక్కువగా ఉన్న పిల్లలకు ఈ విషయంలో వైద్యులు ఏమీ చేయలేకపోతున్నారు. ప్రభుత్వ వైద్యులు కాకుండా ప్రైవేటు వైద్యుల సహాకారం తీసుకుందామంటే అందుకు అయ్యే వైద్య ఖర్చులు భారీగా ఉండటంతో వెనుకాడుతున్నారు. చివరికి శిశువులను హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అప్పటికే చిన్నారులకు వ్యాధి ముదిరిపోవడంతో అక్కడకు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ మూడు నెలల కాలంలో ఆరుగురు శిశువులు మృతి చెందారు. కానీ అనధికారికంగా వచ్చిన సమాచారం మేరకు పది మంది శిశువులు మృతి చెందినట్లు తెలిసింది. ప్రస్తుతం 8 మంది చిన్నారులు నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 15 రోజులుగా చికిత్స పొందుతున్నారు. మరో ఐదుగురిని నీలోఫర్‌కు తరలించారు.  

పిల్లలు చనిపోతున్నారు
శిశుగృహాల్లో సామార్ధ్యానికి మించి పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం 46 మంది పిల్లలకు ఆశ్రయం కల్పించాం. ముర్రుపాలు పట్టించకపోవడంతో పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటోంది. అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించి వైద్యం అందిస్తున్నాం. వైద్యుల సూచనల మేరకు రోగ తీవ్రతను బట్టి నీలోఫర్‌కు తరలిస్తున్నాం. మూడు నెలల కాలంలో ఆరుగురు చనిపోయారు. టెట్రాప్యాకెట్‌ పౌడర్‌ వాడాం. కానీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం లేదని బంద్‌ చేశాం.
                                                                                             - పుష్పలత, ఐసీడీసీ పీడీ

పిల్లల పెంపకం సరిగా లేదు
శిశువులకు పౌష్టికాహారం సరిగా అందడం లేదు. టెట్రాప్యాకెట్‌లలో సొల్యూడ్‌ ఫాక్సన్‌  ఉంటుంది. ఈ పౌడర్‌ వాడకం వల్ల శిశువులు నీరసించిపోవడం, స్టిమ్యూలేషన్‌ లేకపోవడం జరుగుతుంది. చిన్నపిల్లల కిడ్నీలు ఒత్తిడికి గురివుతాయి. అప్పుడే పుట్టిన పిల్లలకు 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్ర తలో ఉంచాలి. లేదంటే మెటాబాలిక్‌ స్ట్రెస్‌ పెరుగుతుంది. పిల్లలకు వెచ్చదనం కావాలి. చిన్నచిన్న గదుల్లో వారిని ఉంచాలి.  తీవ్ర అనారోగ్యానికి గురైన 15 చిన్నారులకు వైద్యం చేశా.
                                                                                                - సుధాకర్, పిల్లలను పరీక్షించిన వైద్యులు

తక్కువ బరువు ఉంటున్నారు
శిశుగృహ నుంచి వస్తున్న చిన్నారులు తక్కువ బరువు ఉంటున్నారు. జలబు, దగ్గు, నయం చేయడం, బరువు పెంచడం వరకు ఇక్కడ సేవలు అందిస్తున్నాం. పిల్లల శరీరంలోపల ఏమున్నది అనేది తెలియదు. సీవియర్‌ సమస్యలు వస్తే నీలోఫర్‌కు రెఫర్‌ చేస్తున్నాం. ప్రస్తుతం ఆస్పత్రిలో 8మంది చిన్నారులకు వైద్యం అందిస్తున్నాం. ఎక్కువ మంది పిల్లల్లో డయేరియా సమస్య కూడా కనిపిస్తుంది.
                                                                                                -  దామెర యాదయ్య, ప్రభుత్వ వైద్యులు, (చిన్నపిల్లలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement