ICPS
-
పిల్లల దత్తతకు డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శిశువుల (పిల్లల) దత్తతకు డిమాండ్ పెరుగుతోంది. సంతాన భాగ్యంలేని వేలాది మంది దంపతులు అనాధ బిడ్డలను పెంచుకొనేందుకు పోటీ పడుతున్నారు. తమకు శిశువులను దత్తత ఇస్తే వారిని బాధ్యతగా పెంచి ప్రయోజకులను చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దత్తత ప్రక్రియను నిర్వహిస్తుంది. సమీకృత బాలల సంరక్షణ పథకం(ఐసీపీఎస్)లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లోని 14 ప్రత్యేక దత్తత ఏజేన్సీలు (శిశు గృహాలు) ఉన్నాయి. వాటి పరిధిలో 110 మంది పిల్లలు (శిశువులు) ఉన్నారు. కాగా, శిశువుల దత్తత కోసం ఏకంగా 1,018 మంది దంపతులు చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దత్తత నిబంధనలకు లోబడి అధికారులు అర్హులైన దంపతులను ఆచి తూచి ఎంపిక చేస్తారు. 2020 నుంచి 2024 వరకు మొత్తం 325 మంది పిల్లలను దత్తత ఇవ్వగా వారిలో 186 ఆడ శిశువులు ఉండటం గమనార్హం.నిర్లక్ష్యానికి గురైన బిడ్డలకు వరం దత్తత..కుటుంబ నేపధ్యంలో వదిలివేసిన, నిరాశ్రయమైన, నిర్లక్ష్యానికి గురైన పిల్లల సంరక్షణ, రక్షణకు దత్తత అనేది గొప్ప వరం. అటువంటి పిల్లలకు ప్రేమతో కూడిన కుటుంబ వాతావరణం లభిస్తుంది. అనాథ పిల్లలను దత్తత ద్వారా కుటుంబాల్లోకి తిరిగి చేర్చడమే ముఖ్య ఉద్ధేశం. దత్తత అనేది కుటుంబాల కోసం పిల్లలను ఇవ్వడం కాదు.. పిల్లల కోసం కుటుంబాలను అందించడమే ప్రధానంగా ఉంటుంది. అనాథలైన బిడ్డలకు వసతి, విద్య, వారి ప్రతిభా సామర్థ్యాలు పెంపొందించడంతోపాటు వారికి ప్రేమ, వాత్సల్యం అందించేందుకు దోహదం చేస్తుంది. పిల్లల సరైన అభివృద్ధికి అవసరమైన భావోద్వేగ, శారీరక, మానసిక భద్రతను అందిస్తుంది. పిల్లలు సామాజిక దుర్వినియోగానికి గురికాకుండా నివారిస్తుంది. జాతీయ స్థాయిలో ప్రత్యేక ఏజెన్సీదత్తతకు సంబంధించిన అన్ని విషయాలను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం 1990 జూలై 3న జాతీయ స్థాయిలో ‘సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ (సీఏఆర్ఏ)’ ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయిలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. సీఏఆర్ఏ 2011 ఫిబ్రవరిలో ‘చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ – గైడెన్స్ సిస్టమ్ (కేరింగ్స్)’ పేరుతో ప్రత్యేకంగా అధికారికంగా https://cara.wcd.gov.in అనే వెబ్సైట్ ప్రారంభించింది. ఈ వెబ్సైట్ ద్వారా దత్తతకు ఆన్లైన్ దరఖాస్తులు, గైడ్‌లైన్స్ వంటి అనేక అంశాలను పారదర్శకంగా పర్యవేక్షిస్తుంది. దత్తత ప్రక్రియ సులభతరం చేయడంతోపాటు వాటిలో కీలకపాత్ర పోషించే ఏజెన్సీల జవాబుదారీతనాన్ని పెంచుతుంది. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో దత్తతకు ముందు తర్వాత కూడా ఆన్లైన్ పర్యవేక్షణ చేస్తుంది. -
చిన్నారులపై చిన్న చూపు!
సాక్షి, అమరావతి: చిన్నారుల సంరక్షణకు నిధుల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి చిన్నచూపు చూసింది. గత ఆర్థిక సంవత్సరం మహిళా, శిశు సంక్షేమానికి రూ.30,000 కోట్లు కేటాయించిన కేంద్రం.. తాజా బడ్జెట్లో మాత్రం రూ.24,435 కోట్లే కేటాయించింది. అంతే కాకుండా 15వ ఆర్థిక సంఘం సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పథకాలకు కూడా కత్తెర వేశారు. అలాగే రెండు, మూడు పథకాలను కలిపి ఒక మిషన్ కిందకు తీసుకొచ్చారు. మహిళలు, పిల్లలకు సంబంధించి మూడు ముఖ్యమైన మిషన్లు.. వాత్సల్య(పిల్లల రక్షణ, సంరక్షణ, సంక్షేమ), శక్తి(మహిళల రక్షణ, సంక్షేమం), సంబల్(ఉజ్వల హోమ్స్, వన్‌స్టాఫ్ సెంటర్స్, హెల్ప్‌లైన్స్, స్వధార్)ను ఏర్పాటు చేశారు. మిషన్ వాత్సల్యలో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ పథకం(ఐసీపీఎస్) ఒక భాగం. గత బడ్జెట్లో ఐసీపీఎస్‌కు రూ.1,500 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈసారి రూ.900 కోట్లే కేటాయించింది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో–2019 నివేదిక ప్రకారం మన దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక బాలుడు లేదా బాలిక అదృశ్యమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారి రక్షణకు సంబంధించిన మిషన్ వాత్సల్యకు నిధుల కోత విధించారు. అలాగే కరోనా విజృంభణ సమయంలో సంరక్షణ గృహాల్లో ఉన్న 1,48,788 మంది పిల్లలను వారి సంబంధీకుల వద్దకు పంపించారు. అయితే లాక్డౌన్ దెబ్బకు వీరిని పోషించాల్సిన వారు ఉపాధి కోల్పోవడంతో.. ఈ చిన్నారుల్లో అత్యధిక మంది బాలకార్మీకులుగా మారిపోయారు. మరోవైపు స్కూల్ ఎడ్యుకేషన్‌కు కూడా గత ఆర్థిక సంవత్సరం కన్నా 9.71 శాతం తక్కువ నిధులు కేటాయించారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారుల సంరక్షణ, అభివృద్ధి ఎలా సాధ్యమని విద్యా రంగ నిఫుణులు ప్రశ్నిస్తున్నారు. -
శిశువును రూ. 20 వేలకు అమ్మడానికి సిద్ధపడింది
సాక్షి, జగిత్యాల : జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో పసికందు అమ్మకానికి సిద్ధపడ్డ శిశువు కథ కొలిక్కిరానుంది. సుమారు 20 రోజులక్రితం కరీంనగర్‌లోని స్వధార్‌హోమ్ నుంచి పారిపోయిన గంగజ్యోతి ఆర్మూర్ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. విచారణలో చిన్నారిని అపహరించానని ఒప్పుకున్నట్లు తెలిసింది. నిర్మల్ జిల్లా కడెంకు చెందిన పుట్ట గంగజ్యోతి, మహారాష్ట్రకు చెందిన నవీన్ దంపతులు. ఇద్దరు ఆర్మూర్ బస్టాండ్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు స్నేహ ఉంది. నవీన్ భార్యను విడిచిపెట్టి పోవడంతో జ్యోతి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో నెలరోజుల పసికందును రూ.20 వేలకు అమ్మడానికి సిద్ధపడుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు, ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చి పాపను అప్పగించారు. అధికారుల విచారణలో జ్యోతి పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి లోతుగా విచారణ చేపట్టారు. శిశువును, జ్యోతిని, నక్షితను కూడా స్వధార్‌హోమ్‌కు తరలించారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. కాగా 20 రోజుల క్రితం గంగజ్యోతి తన కూతురు నక్షితను స్వధార్‌హోమ్‌లోనే వదిలిపెట్టి పారిపోయింది. శుక్రవారం గంగజ్యోతి ఆర్మూర్‌లో పట్టుబడగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జరిగిన సంఘటనపై విచారణ చేపడుతున్నారు. అయితే మెట్పల్లిలో అమ్మకానికి పెట్టిన పాప నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన గందం సుమలత బిడ్డగా తెలుస్తోంది. దీనిపై ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. గందం సుమలత పాపనే ఎత్తుకెళ్లినట్లు గంగజ్యోతి చెప్పినప్పటికీ డీఎన్ఏ పరీక్షల నివేదిక కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం పాప కరీంనగర్‌లోని శిశుగృహలో ఉంది. -
బాలలది గమ్యం తెలియని ప్రయాణం..!
ఒంగోలు సబర్బన్ : ‘బాలలు తెలిసీ తెలియని వయసులో బజారున పడుతున్నారు. వీరికి గమ్యం తెలియక ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. గ్రామాల్లో పనులు లేక తల్లిదండ్రులు వలస వెళ్తుండటమే ఇందుకు కారణం’ అని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వి.మోహన్‌కుమార్ అభిప్రాయపడ్డారు. హెల్ప్ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఓ హోటల్లో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన ఎన్జీఓ ప్రతినిధులకు ‘బజారున పడుతున్న బాలలు.. గమ్యం తెలియని ప్రయాణం’ అన్న అంశంపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. నెల్లూరు రీజియన్ జిల్లాల పరిధిలో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మోహన్‌కుమార్ మాట్లాడుతూ చిన్నారులు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లకుండా ఎక్కడెక్కడికో వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల వలసలతో పిల్లలు తమ హక్కులు, కోల్పోతున్నారని చెప్పారు. గ్రామీణ బాలలు ఎక్కువగా అభివృద్ధి చెందిన పట్టణాలు, రాష్ట్రాలకు వె ళ్తున్నారన్నారు. తల్లిదండ్రులు పనుల ఒత్తిడిలో పిల్లలను ఒంటరిగా వదిలేయటంతో వారు రకరకాల అలవాట్లకు బానిసలవుతున్నారని పేర్కొన్నారు. బయటకు వెళ్లిన మగపిల్లలు హింసకు గురవుతుంటే, ఆడపిల్లలు లైంగిక వేధింపులకు బలవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు చట్టాలున్నా అసలు చిన్నారులను అక్కడివరకూ వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే వారి భవిష్యత్ బాగుంటుందని మోహన్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. వలసలతో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి హెల్ప్ సంస్థ డెరైక్టర్ ఎన్వీఎస్. రామ్మోహన్ వివరించారు. గ్రామాల నుంచి ఎంత మంది వలస వెళ్తున్నారో లెక్కించాలని ఎన్జీఓ సంస్థల ప్రతినిధులకు సూచించారు. దేశ జనాభాలో 50 శాతం యువకులు ఉన్నారని, వారిలో 42 శాతం మంది 18 సంవత్సరాల లోపు వయసు వారని చెప్పారు. సదస్సు కన్వీనర్ బాలశౌరి మాట్లాడుతూ వలస బాధిత బాలలను గుర్తించి వారి హక్కులు కాపాడాలని కోరారు. సీడబ్ల్యూసీ, ఐసీపీఎస్.. వంటి ఆపదలో ఉన్న బాలలకు రక్షణ కల్పించాలని, వారికి సౌకర్యాలు సమకూర్చాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల చైర్మన్లు డీవీఆర్కె శివప్రసాద్, డి.రోహన్‌కుమార్, పి.జయరాజ్‌తో పాటు చైల్డ్‌లైన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నిద్దురపోతున్న నిఘా
స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలపై నిత్యం నిఘా ఉంచాల్సిన జిల్లా సమగ్ర బాలల పర్యవేక్షణ విభాగం(ఐసీపీఎస్) మొద్దు నిద్ర పోతుంది. జిల్లాలో ఏదో ఒక చోట ఆకస్మిక సంఘటన చోటుచేసుకున్నప్పుడు మాత్రమే ఉరుకులు పరుగులు పెడుతూ మిగతా సమయాల్లో జిల్లా కేంద్రం గడప దాటి బయటకి వెళ్లడం లేదు. దీంతో పుట్టగొడుగొల్లా పుట్టుకొస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలు సేవల ముసుగులో అనేక అక్రమాలకు పాల్పడుతున్నాయి. తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. సమగ్ర బాలల పర్యవేక్షణ విభాగాన్ని భారత ప్రభుత్వం 2010లో ఏర్పాటు చేసింది. దీంట్లో రెండు విభాగాలు ఉంటాయి. మొదటిది ఇనిస్ట్యూటేషన్ కేర్, రెండోది నాన్ ఇనిస్ట్యూటేషన్ కేర్. ఈ రెండు విభాగాలకు డీసీపీఓ, ఏపీడీ, ప్రోగాం ఆఫీసర్లు ఉంటారు. ఇనిస్ట్యూటేషన్ కేర్ ఆధ్వర్యంలో స్వచ్ఛం ద సంస్థలకు అనుమతులివ్వడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నడుస్తున్న ఉజ్వల, స్వధార్, షార్ట్ స్టే హోం సంస్థలను పర్యవేక్షించాలి. అదే విధంగా జిల్లాలో ఎక్కడెక్కడ ట్రస్టులు ఉన్నాయి..? వాటికి అనుమతులు ఉన్నాయా..? లేదా..? అన్నది ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సీడీపీఓలు, అంగన్వాడీ కార్యకర్తలు పని చేస్తున్న ప్రాంతాల్లో అనుమతిలేకుండా పనిచేస్తున్న సంస్థల వివరాలను తక్షణమే ఐసీపీఎస్‌కు తెలియజేయాలి. ఐసీపీఎస్ సిబ్బంది కూడా ఎప్పటిక ప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉంటుంది. అలా కాకుండా జిల్లా కార్యాలయానికే పరిమితమై టూర్ల పేరుతో బిల్లులు స్వాహా చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక నాన్ ఇనిస్ట్యూటేషన్ కేర్ ఆధ్వర్యంలో వీధి బాలలు, తప్పిపోయిన పిల్లలను తమ ఆధీనంలోకి తీసుకుని సంరక్షిండంతో పాటు వారి తల్లిదండ్రులకు అప్పగించాల్సిన బాధ్యత దీనిపై ఉంటుంది. ఈ రెండు కేర్లు ఏర్పాటై ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి కేసులు, తనిఖీలు నిర్వహించలేదంటే ఈ విభాగం పనితీరు ఏపాటిదో తెలిసిపోతుంది. నేర్వని గుణపాఠం పెద్దవూర మండలం ఏనమీద తండాలో బాలికలపై జరిగిన హత్యాచార ఘటన నుంచి సమగ్ర బాలల పర్యవేక్షణ విభాగం గుణపాఠం నేర్వలేదనిపిస్తోంది. ఏనమీద తండా సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించడమేగాక జిల్లా యంత్రాంగానికి ముచ్చెటమలు పట్టిచ్చింది. సేవా ముసుగులో ఇక్కడ పనిచేసిన సంస్థకు కూడా ఐసీపీఎస్ నుంచి లెసైన్స్ లేదనే సంగతి సంఘటన జరిగిన తర్వాత గానీ వెలుగులోకి రాలేదు. జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగా స్వచ్ఛంద సేవా సంస్థలు ఉండగా కేవలం 37 సంస్థలకు మాత్రమే ఐసీపీఎస్ అనుమతి ఉండ టం విస్మయానికి గురిచేస్తోంది. ఉలిక్కిపడిన అధికారులు.. మోత్కూరులో శుక్రవారం చోటుచేసుకున్న సంఘటనతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్మైల్ వెల్ఫేర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అబ్బాస్ చిల్డ్రన్ హోంకు ఎలాంటి అనుమతుల్లేవు. ఐసీపీఎస్ నుంచి లెసైన్స్ పొందిన సంస్థలకు మాత్రమే సేవా కార్యక్రమాలు నిర్వహించే అధికారం ఉంటుంది. అలాంటిది మోత్కూరు, మునగాల మండల కేంద్రాల్లో ‘అబ్బాస్ చిల్డ్రన్ హోం’ అనే సంస్థ గత కొంత కాలంగా పొరుగు జిల్లాల నుంచి పిల్లలను తీసుకొచ్చి రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇందులో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల్లో 27 మంది హఠాత్తుగా కనిపించకపోవడంతో పోలీస్ యంత్రాంగం, జిల్లా విద్యాశాఖ ఆగమేఘాల మీద పరుగెత్తాల్సి వచ్చింది. మండల కేంద్రంలో ప్రధాన రహాదారిపై పెద్ద పెద్ద బోర్డులు పెట్టి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ వైపు సీడీపీఓలు కానీ, ఐసీపీఎస్ విభాగం కన్నెత్తి కూడా చూడకపోవడం విచారకరం. నోటీసులు ఇచ్చాం.. జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలతో పలు మార్లు సమావేశాలు నిర్వహిం చాం. లెసైన్స్‌లు తీసుకోవాలని ఆదేశించాం. లెసైన్స్ లేకుండా నిర్వహిస్తున్న సంస్థలకు గతంలో నోటీసులు కూడా జారీ చేశాం. జిల్లాలో 73 సేవా సంస్థలు లెసైన్స్ కోసం ఐసీపీఎస్‌కు దరఖాస్తు చేశాయి. వీటిలో 7దరఖాస్తులు తిరస్కరించాం. 37 సంస్థలకు అనుమతిచ్చాం. మిగతా దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. సీడీపీఓలు, అంగన్వాడీ వర్కర్లు తమ పరిధిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న సంస్థ వివరాలు తెలియజేయాలి. లెసైన్స్ లేని సంస్థల పై కఠిన చర్యలు తీసుకుంటాం. -మోతీ, ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ -
ఆర్నెళ్ల తర్వాత ఆచూకీ లభ్యం
కెరమెరి : మతిస్థిమితం కోల్పోయిన గిరిజన మహిళ ఇంటి నుంచి అదృశ్యమైంది. ఆరు నెలలపాటు భర్త, కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు కనిపించగా వారు ఐసీపీఎస్ అధికారులకు అప్పగించారు. వారు ఆమె ఆచూకీ కనుగొని ఇంటికి చేర్చడంతో కథ సుఖాంతమైంది. మండలంలోని కొఠారి గ్రామానికి చెందిన మడావి దేవ్‌రావు, పగ్గుబాయి దంపతులు కొంతకాలంగా కెరమెరి సమీపంలోని చిన్నుగూడలో ఉంటున్నారు. కుటుంబ కలహాలతో ఏడాది క్రితం పగ్గుబాయి భర్త నుంచి విడిపోయింది. చిన్నుగూడలోని తన అన్నయ్య కుడ్మిత పోసిగా ఇంట్లో ఉంటోంది. ఆరు నెలల క్రితం ఆకస్మాత్తుగా జాడ లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త, అన్నయ్యలు చాలా చోట్ల వెతికినా ఆచూకీ లభించ లేదు. పదిహేను రోజుల క్రితం హాజీపూర్ పోలీసులు అడవుల్లో పెట్రోలింగ్ చేస్తుండగా పగ్గుబాయి కనిపించింది. వారు ఆమెను ఆదిలాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్‌ప్రొటెక్షన్ స్కీం(ఐసీపీఎస్) అధికారులకు అప్పగించారు. వారు ఓల్డేజ్ హోంలో ఆశ్రయం కల్పించి కుటుంబ సభ్యుల విషయమై ఆరా తీశారు. చివరికి సగ్గుబాయి చిన్నుగూడలోని తన భర్త, అన్నయ్య పేరు చెప్పడంతో ఐసీపీఎస్ అధికారి సురేఖ కెరమెరి ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజశ్రీకి సమాచారం అందించారు. శుక్రవారం రాత్రి రాజశ్రీ, కేస్లాగూడ అంగన్వాడీ కార్యకర్త తింగుబాయి కెరమెరి పోలీసుస్టేషన్లో ఇన్చార్జి ఎస్సై దేవిదాస్ సమక్షంలో పగ్గుబాయిని ఆమె భర్త దేవ్‌రావుకు అప్పగించారు. వీరికి మూడేళ్ల కూతురు కన్నిబాయి ఉంది. -
అమ్మకానికి ఆడబిడ్డలు
పిల్లలను విక్రయించే ముఠా గుట్టు రట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం మహిళను ప్రశ్నిస్తున్న ఐసీడీఎస్ అధికారులు దూలపల్లి: సూరారం కాలనీలో చంటి పిల్లలను విక్రయించే ముఠా గుట్టు రట్టయింది. ఓ బిడ్డను విక్రయించేందుకు యత్నిస్తుండగా ఐసీపీఎస్, ఐసీడీఎస్ అధికారులు వలపన్ని ముఠాను పట్టుకున్నారు. చంటిబిడ్డను శిశువిహార్‌కు తరలించారు. వివరాలివీ... తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన రత్నకుమారి, శర్మ దంపతులు రెండు నెలల క్రితం నగరానికి వ చ్చారు. సూరారం కాలనీలోని రాజిరెడ్డి నగర్‌లోగల అంగన్వాడీ-05 సెంటర్ వద్ద అద్దె ఇంట్లో ఉంటున్నారు. స్థానిక అంగన్వాడీ కార్యకర్తను రత్నకుమారి పరిచయం చేసుకుని తాను 8 నెలల గర్భిణినని, తన పేరు జాబితాలో రాసుకోవాలని పదే పదే కోరింది. డాక్టర్ పరీక్ష చేసిన తరువాతనే నమోదు చేస్తామని అంగన్వాడీ కార్యకర్త ఆమెకు తేల్చి చెప్పింది. మరో వారం తరువాత రత్నకుమారి 45 రోజుల చంటిబిడ్డతో కనిపించింది. అంగన్వాడీ కార్యకర్త ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానం చెప్పింది. ఈ విషయాన్ని ఐసీడీఎస్ అధికారి జ్యోతి పద్మ దృష్టికి ఆమె తీసుకెళ్లింది. దీంతో ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులు రత్నకుమారిని రెండు రోజుల క్రితం నిలదీయగా..సరైన సమాధానం రాలేదు. దీంతో వారు పాపను స్వాధీనం చేసుకొని, శిశు విహార్‌కు తరలించారు. మరో సంఘటన ఇలా.. ఆనంద్‌నగర్‌కు చెందిన అమీనాబేగం కూతురు ఆషాబేగంకు ఐడీపీఎల్‌కు చెందిన సలీంతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లుగా సలీం వేరే మహిళతో ఉంటున్నాడు. ఆషాబేగం ఒక్కతే ఉంటోంది. ఈనెల 8న ఆషాబేగంకు పాప పుట్టింది. గర్భవతులు, చిన్నారుల వివరాలు సేకరించే క్రమంలో ఓ అంగన్వాడీ కార్యకర్త.. ఆషాబేగం వద్ద చిన్నారి లేకపోవడం చూసి ప్రశ్నించింది. ఇక్కడా పొంతన లేని సమాధానం వచ్చింది. అనుమానం వచ్చిన కార్యకర్త తమ అధికారి అధికారి జ్యోతి పద్మ దృష్టికి తీసుకువెళ్లింది. ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులు విచారించగా... జగద్గిరిగుట్టలోని రాజీవ్ గృహకల్పకు చెందిన తపస్వి, విష్ణు సర్కార్లకు పాపను రూ.25 వేలకు విక్రయించినట్టు ఆషా చెప్పింది. దీంతో పాపను కొనుగోలు చేసిన వారిని రప్పించారు. వారు జీడిమెట్ల పీఎస్‌కు వచ్చి, పాపను తిరిగి ఇచ్చేది లేదని మొండికేశారు. ఈ ఘటనపై దుండిగల్ పీఎస్‌లో కేసు నమోదైంది. అక్కడే సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి పోలీసులు వారిని పంపించారు. అధికారుల దర్యాప్తులో సూరారం కాలనీలో ఉంటున్న రత్నకుమారి కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో ఆనంద్‌నగర్‌లోని ఆషా బేగం ఇంటికి వస్తున్నట్టు తేలింది. రెండు నెలలకోసారి ఇల్లు మార్చడం.. ఇప్పటికే ఓ చంటిబిడ్డతో పట్టుబడినే నేపథ్యంలో ఐసీడీఎస్ అధికారులు ఆమెపై అనుమానంతో కూపీ లాగుతున్నారు.