స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలపై నిత్యం నిఘా ఉంచాల్సిన జిల్లా సమగ్ర బాలల పర్యవేక్షణ విభాగం(ఐసీపీఎస్) మొద్దు నిద్ర పోతుంది. జిల్లాలో ఏదో ఒక చోట ఆకస్మిక సంఘటన చోటుచేసుకున్నప్పుడు మాత్రమే ఉరుకులు పరుగులు పెడుతూ మిగతా సమయాల్లో జిల్లా కేంద్రం గడప దాటి బయటకి వెళ్లడం లేదు. దీంతో పుట్టగొడుగొల్లా పుట్టుకొస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలు సేవల ముసుగులో అనేక అక్రమాలకు పాల్పడుతున్నాయి. తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి.
సమగ్ర బాలల పర్యవేక్షణ విభాగాన్ని భారత ప్రభుత్వం 2010లో ఏర్పాటు చేసింది. దీంట్లో రెండు విభాగాలు ఉంటాయి. మొదటిది ఇనిస్ట్యూటేషన్ కేర్, రెండోది నాన్ ఇనిస్ట్యూటేషన్ కేర్. ఈ రెండు విభాగాలకు డీసీపీఓ, ఏపీడీ, ప్రోగాం ఆఫీసర్లు ఉంటారు. ఇనిస్ట్యూటేషన్ కేర్ ఆధ్వర్యంలో స్వచ్ఛం ద సంస్థలకు అనుమతులివ్వడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నడుస్తున్న ఉజ్వల, స్వధార్, షార్ట్ స్టే హోం సంస్థలను పర్యవేక్షించాలి. అదే విధంగా జిల్లాలో ఎక్కడెక్కడ ట్రస్టులు ఉన్నాయి..? వాటికి అనుమతులు ఉన్నాయా..? లేదా..? అన్నది ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సీడీపీఓలు, అంగన్‌వాడీ కార్యకర్తలు పని చేస్తున్న ప్రాంతాల్లో అనుమతిలేకుండా పనిచేస్తున్న సంస్థల వివరాలను తక్షణమే ఐసీపీఎస్‌కు తెలియజేయాలి. ఐసీపీఎస్ సిబ్బంది కూడా ఎప్పటిక ప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉంటుంది. అలా కాకుండా జిల్లా కార్యాలయానికే పరిమితమై టూర్ల పేరుతో బిల్లులు స్వాహా చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక నాన్ ఇనిస్ట్యూటేషన్ కేర్ ఆధ్వర్యంలో వీధి బాలలు, తప్పిపోయిన పిల్లలను తమ ఆధీనంలోకి తీసుకుని సంరక్షిండంతో పాటు వారి తల్లిదండ్రులకు అప్పగించాల్సిన బాధ్యత దీనిపై ఉంటుంది. ఈ రెండు కేర్‌లు ఏర్పాటై ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి కేసులు, తనిఖీలు నిర్వహించలేదంటే ఈ విభాగం పనితీరు ఏపాటిదో తెలిసిపోతుంది.
నేర్వని గుణపాఠం
పెద్దవూర మండలం ఏనమీద తండాలో బాలికలపై జరిగిన హత్యాచార ఘటన నుంచి సమగ్ర బాలల పర్యవేక్షణ విభాగం గుణపాఠం నేర్వలేదనిపిస్తోంది. ఏనమీద తండా సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించడమేగాక జిల్లా యంత్రాంగానికి ముచ్చెటమలు పట్టిచ్చింది. సేవా ముసుగులో ఇక్కడ పనిచేసిన సంస్థకు కూడా ఐసీపీఎస్ నుంచి లెసైన్స్ లేదనే సంగతి సంఘటన జరిగిన తర్వాత గానీ వెలుగులోకి రాలేదు. జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగా స్వచ్ఛంద సేవా సంస్థలు ఉండగా కేవలం 37 సంస్థలకు మాత్రమే ఐసీపీఎస్ అనుమతి ఉండ టం విస్మయానికి గురిచేస్తోంది.
ఉలిక్కిపడిన అధికారులు..
మోత్కూరులో శుక్రవారం చోటుచేసుకున్న సంఘటనతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్మైల్ వెల్ఫేర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అబ్బాస్ చిల్డ్రన్ హోంకు ఎలాంటి అనుమతుల్లేవు. ఐసీపీఎస్ నుంచి లెసైన్స్ పొందిన సంస్థలకు మాత్రమే సేవా కార్యక్రమాలు నిర్వహించే అధికారం ఉంటుంది. అలాంటిది మోత్కూరు, మునగాల మండల కేంద్రాల్లో ‘అబ్బాస్ చిల్డ్రన్ హోం’ అనే సంస్థ గత కొంత కాలంగా పొరుగు జిల్లాల నుంచి పిల్లలను తీసుకొచ్చి రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇందులో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల్లో 27 మంది హఠాత్తుగా కనిపించకపోవడంతో పోలీస్ యంత్రాంగం, జిల్లా విద్యాశాఖ ఆగమేఘాల మీద పరుగెత్తాల్సి వచ్చింది. మండల కేంద్రంలో ప్రధాన రహాదారిపై పెద్ద పెద్ద బోర్డులు పెట్టి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ వైపు సీడీపీఓలు కానీ, ఐసీపీఎస్ విభాగం కన్నెత్తి కూడా చూడకపోవడం విచారకరం.
నోటీసులు ఇచ్చాం..
జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలతో పలు మార్లు సమావేశాలు నిర్వహిం చాం. లెసైన్స్‌లు తీసుకోవాలని ఆదేశించాం. లెసైన్స్ లేకుండా నిర్వహిస్తున్న సంస్థలకు గతంలో నోటీసులు కూడా జారీ చేశాం. జిల్లాలో 73 సేవా సంస్థలు లెసైన్స్ కోసం ఐసీపీఎస్‌కు దరఖాస్తు చేశాయి. వీటిలో 7దరఖాస్తులు తిరస్కరించాం. 37 సంస్థలకు అనుమతిచ్చాం. మిగతా దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. సీడీపీఓలు, అంగన్‌వాడీ వర్కర్లు తమ పరిధిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న సంస్థ వివరాలు తెలియజేయాలి. లెసైన్స్ లేని సంస్థల పై కఠిన చర్యలు తీసుకుంటాం.
-మోతీ, ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ పీడీ
నిద్దురపోతున్న నిఘా
Published Sun, Nov 2 2014 4:38 AM | Last Updated on Thu, Mar 28 2019 5:39 PM
Advertisement