దత్తత ఇవ్వాలని రాష్ట్రంలో 1,018 దరఖాస్తులు పెండింగ్
14 శిశు గృహాల్లో ఉన్నది 110 మంది పిల్లలే
నిబంధనలకు లోబడి ఆచి తూచి అర్హుల ఎంపిక
2020 నుంచి 2024 వరకు 325 మంది పిల్లలు దత్తత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శిశువుల (పిల్లల) దత్తతకు డిమాండ్ పెరుగుతోంది. సంతాన భాగ్యంలేని వేలాది మంది దంపతులు అనాధ బిడ్డలను పెంచుకొనేందుకు పోటీ పడుతున్నారు. తమకు శిశువులను దత్తత ఇస్తే వారిని బాధ్యతగా పెంచి ప్రయోజకులను చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీకి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దత్తత ప్రక్రియను నిర్వహిస్తుంది. సమీకృత బాలల సంరక్షణ పథకం(ఐసీపీఎస్)లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లోని 14 ప్రత్యేక దత్తత ఏజేన్సీలు (శిశు గృహాలు) ఉన్నాయి. వాటి పరిధిలో 110 మంది పిల్లలు (శిశువులు) ఉన్నారు.
కాగా, శిశువుల దత్తత కోసం ఏకంగా 1,018 మంది దంపతులు చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దత్తత నిబంధనలకు లోబడి అధికారులు అర్హులైన దంపతులను ఆచి తూచి ఎంపిక చేస్తారు. 2020 నుంచి 2024 వరకు మొత్తం 325 మంది పిల్లలను దత్తత ఇవ్వగా వారిలో 186 ఆడ శిశువులు ఉండటం గమనార్హం.
నిర్లక్ష్యానికి గురైన బిడ్డలకు వరం దత్తత..
కుటుంబ నేపధ్యంలో వదిలివేసిన, నిరాశ్రయమైన, నిర్లక్ష్యానికి గురైన పిల్లల సంరక్షణ, రక్షణకు దత్తత అనేది గొప్ప వరం. అటువంటి పిల్లలకు ప్రేమతో కూడిన కుటుంబ వాతావరణం లభిస్తుంది. అనాథ పిల్లలను దత్తత ద్వారా కుటుంబాల్లోకి తిరిగి చేర్చడమే ముఖ్య ఉద్ధేశం. దత్తత అనేది కుటుంబాల కోసం పిల్లలను ఇవ్వడం కాదు.. పిల్లల కోసం కుటుంబాలను అందించడమే ప్రధానంగా ఉంటుంది.
అనాథలైన బిడ్డలకు వసతి, విద్య, వారి ప్రతిభా సామర్థ్యాలు పెంపొందించడంతోపాటు వారికి ప్రేమ, వాత్సల్యం అందించేందుకు దోహదం చేస్తుంది. పిల్లల సరైన అభివృద్ధికి అవసరమైన భావోద్వేగ, శారీరక, మానసిక భద్రతను అందిస్తుంది. పిల్లలు సామాజిక దుర్వినియోగానికి గురికాకుండా నివారిస్తుంది.
జాతీయ స్థాయిలో ప్రత్యేక ఏజెన్సీ
దత్తతకు సంబంధించిన అన్ని విషయాలను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం 1990 జూలై 3న జాతీయ స్థాయిలో ‘సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ (సీఏఆర్‌ఏ)’ ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయిలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. సీఏఆర్‌ఏ 2011 ఫిబ్రవరిలో ‘చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ – గైడెన్స్ సిస్టమ్ (కేరింగ్స్)’ పేరుతో ప్రత్యేకంగా అధికారికంగా https://cara.wcd.gov.in అనే వెబ్‌సైట్ ప్రారంభించింది.
ఈ వెబ్‌సైట్ ద్వారా దత్తతకు ఆన్‌లైన్ దరఖాస్తులు, గైడ్‌లైన్స్ వంటి అనేక అంశాలను పారదర్శకంగా పర్యవేక్షిస్తుంది. దత్తత ప్రక్రియ సులభతరం చేయడంతోపాటు వాటిలో కీలకపాత్ర పోషించే ఏజెన్సీల జవాబుదారీతనాన్ని పెంచుతుంది. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో దత్తతకు ముందు తర్వాత కూడా ఆన్‌లైన్ పర్యవేక్షణ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment