కెరమెరి : మతిస్థిమితం కోల్పోయిన గిరిజన మహిళ ఇంటి నుంచి అదృశ్యమైంది. ఆరు నెలలపాటు భర్త, కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు కనిపించగా వారు ఐసీపీఎస్ అధికారులకు అప్పగించారు. వారు ఆమె ఆచూకీ కనుగొని ఇంటికి చేర్చడంతో కథ సుఖాంతమైంది. మండలంలోని కొఠారి గ్రామానికి చెందిన మడావి దేవ్‌రావు, పగ్గుబాయి దంపతులు కొంతకాలంగా కెరమెరి సమీపంలోని చిన్నుగూడలో ఉంటున్నారు. కుటుంబ కలహాలతో ఏడాది క్రితం పగ్గుబాయి భర్త నుంచి విడిపోయింది. చిన్నుగూడలోని తన అన్నయ్య కుడ్మిత పోసిగా ఇంట్లో ఉంటోంది.
ఆరు నెలల క్రితం ఆకస్మాత్తుగా జాడ లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త, అన్నయ్యలు చాలా చోట్ల వెతికినా ఆచూకీ లభించ లేదు. పదిహేను రోజుల క్రితం హాజీపూర్ పోలీసులు అడవుల్లో పెట్రోలింగ్ చేస్తుండగా పగ్గుబాయి కనిపించింది. వారు ఆమెను ఆదిలాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్‌ప్రొటెక్షన్ స్కీం(ఐసీపీఎస్) అధికారులకు అప్పగించారు. వారు ఓల్డేజ్ హోంలో ఆశ్రయం కల్పించి కుటుంబ సభ్యుల విషయమై ఆరా తీశారు. చివరికి సగ్గుబాయి చిన్నుగూడలోని తన భర్త, అన్నయ్య పేరు చెప్పడంతో ఐసీపీఎస్ అధికారి సురేఖ కెరమెరి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రాజశ్రీకి సమాచారం అందించారు. శుక్రవారం రాత్రి రాజశ్రీ, కేస్లాగూడ అంగన్‌వాడీ కార్యకర్త తింగుబాయి కెరమెరి పోలీసుస్టేషన్‌లో ఇన్‌చార్జి ఎస్సై దేవిదాస్ సమక్షంలో పగ్గుబాయిని ఆమె భర్త దేవ్‌రావుకు అప్పగించారు. వీరికి మూడేళ్ల కూతురు కన్నిబాయి ఉంది.
ఆర్నెళ్ల తర్వాత ఆచూకీ లభ్యం
Published Sun, Oct 19 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM
Advertisement
Advertisement