చెంచు మహిళపై దాడి అమానుషం
మొలచింతలపల్లి బాధితురాలిని పరామర్శించిన మంత్రి జూపల్లి
నాగర్‌కర్నూల్: చెంచు మహిళపై జరిగిన దాడి ఘటన ఆటవిక చర్య అని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మొలచింతలపల్లి తండాకు చెందిన బాధిత మహిళను మంత్రి శనివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నలుగురు వ్యక్తులు బాధిత మహిళపై పాశవికంగా దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించారని, ఘటనకు పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్పందించామని, నిందితులను అరెస్ట్ చేసి కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు వివరించారు. నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించినట్లు పేర్కొన్నారు.
ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని ఊపేక్షించేది లేదని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. వారి ముగ్గురు ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్‌లో విద్యను అందిస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రస్తుతం రెండెకరాల భూమి ఉందని, ప్రభుత్వం తరఫున మరికొంత భూమిని కూడా ఇచ్చి ఆదుకుంటామని జూపల్లి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment