సమిధలవుతున్న సమరాంగనలు | Heavily armed women die in encounters | Sakshi
Sakshi News home page

సమిధలవుతున్న సమరాంగనలు

Published Mon, Oct 21 2024 3:47 AM | Last Updated on Mon, Oct 21 2024 3:47 AM

Heavily armed women die in encounters

ఆపరేషన్‌ కగార్‌తో నేలకొరుగుతున్న ఆదివాసీ మహిళలు 

బస్తర్‌లో పెరిగిన ఎదురుకాల్పులు    

ఎన్‌కౌంటర్లలో భారీగా సాయుధ మహిళల మరణం 

వెనుకబాటుతనంతో ఉద్యమం వైపు ఆదివాసీ స్త్రీలు   

ఇరవై ఏళ్లలో సాయుధ దళాల్లో భారీగా చేరిక 

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టుల ను నిర్మూలించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ అమల్లో.. ఈ ఏడాది ఆరంభం నుంచి కేంద్రప్రభుత్వం వేగం పెంచింది. దీంతో బస్తర్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్లు నిత్యకృత్యంగా మారాయి. అయితే, ఈ ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టులు ఎ క్కువగా చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.  

ప్రభుత్వ వ్యతిరేకతతోనే దళాల్లోకి.. 
ఆది నుంచీ విప్లవ పోరాటాలు మహిళలకు ప్రాధాన్యమిస్తూనే వచ్చాయి. సాధారణ మహిళల సమస్యలకు తోడు.. పితృస్వామ్య వ్యవస్థ కారణంగా ఎదుర్కొనే ఇబ్బందులపై మార్క్సిస్టు పార్టీ లు గళం విప్పాయి, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇదే విధానాన్ని నాటి నక్సలైట్లు, నేటి మావోయిస్టులు అనుసరించారు. 

అయితే మార్క్సిస్టు విధానం చెప్పే సామాజిక మార్పులపై ఆకర్షితులైన మహిళలు ఆరంభంలో చేతన నాట్యమంచ్‌ (సీఎన్‌ఎం), దండకారణ్య క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘాల్లోనే ఎక్కువగా ఉండేవారు. కానీ 2006లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌ సర్కారు నెలకొల్పిన సల్వాజుడుం, అందులోని కొందరు స్పెషల్‌ పోలీస్‌ అధికారులు (ఎస్పీవోలు) అడవుల్లోని ఆదివాసీ గూడేలపై దాడి చేసి గ్రామాలను తగులబెట్టడం, అక్కడ కనిపించిన మహిళలపై అకృత్యాలకు పాల్పడటం వంటివి చేశారు. 

దీంతో ప్రభుత్వ బలగాలపై ఆదివాసీ మహిళల్లో వ్యతిరేకత పెరిగింది. ఫలితంగా ఆదివాసీ స్త్రీలలో దళాల్లోకి చేరాలన్న ఆసక్తి పెరగడంతో.. మావోయిస్టు సాయుధ దళాల్లో మహిళల సంఖ్య ఎక్కువైంది. 

40 శాతం మహిళలు 
ఇరవై ఏళ్ల చరిత్ర కలిగి మావోయిస్టు పార్టీ సాయుధ దళాల్లో ప్రస్తుతం 40 శాతం మేర మహిళలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్‌ కగార్‌ ప్రారంభించడానికి ముందు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు వివిధ సందర్భాల్లో వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 2,500 మంది సాయుధ మావోయిస్టులు ఉండగా.. ఇందులో మహిళల సంఖ్య సుమారు వెయ్యికి పైగానే ఉన్నట్టు సమాచారం. 

ఇందులో దక్షిణ బస్తర్‌ డివిజన్‌ ప్రాంతంలో 300కు పైగా, పశ్చిమ బస్తర్‌లో 150 మందికి పైగా, ఉత్తర బస్తర్‌ డివిజన్‌లో 100 మందికి పైగా మహిళా మావోయిస్టులున్నట్టు సమాచారం. ఇక మావోయిస్టుల షెల్టర్‌ జోన్‌గా పరిగణించే మాడ్‌ డివిజన్‌లో 350 మంది వరకు మహిళా మావోయిస్టులున్నట్టు పోలీసుల వర్గాల అంచనా. మిగిలిన మహారాష్ట్ర, ఒడిశా, ఝార్ఖండ్, ఏవోబీల్లో తక్కువ సంఖ్యలోనే ఉన్నట్టు భావిస్తున్నారు. 
 
మృతుల్లో పెరుగుతున్న మహిళలు 
సాధారణంగా పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన సందర్భాల్లో.. సాయుధులైన పురుష మావోయిస్టులే ఎక్కువగా చనిపోతుంటారు. కానీ ఈ ఏడాది జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో మహిళా మావోయిస్టులు భారీగా చనిపోతుండటం మానవతావాదులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈనెల 4న జరిగిన తుల్‌తులీ ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు చనిపోగా.. వారిలో 14 మంది మహిళలు ఉన్నారు. 

అంతకుముందు ఏప్రిల్‌ 16న కాంకేర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు చనిపోతే.. అందులో 15 మంది మహిళలున్నారు. వీటితో పాటు సెపె్టంబర్‌ 3న బీజాపూర్‌/దంతెవాడల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 9 మంది చనిపోతే.. వారిలో ఆరుగురు మహిళలున్నారు. సెపె్టంబర్‌ 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు నేలకొరిగిపోతే.. వారిలో ఇద్దరు మహిళలున్నారు.  

వెనుకబాటులో ఆదివాసీలే అధికం 
సామాజికంగా, ఆర్థికంగా, విద్య, వైద్యం తదితర అనేక అంశాల్లో దేశంలో ఆదివాసీలే ఎక్కువగా వెనుకబాటుకు గురయ్యారు. అందులో ఆదివాసీ స్త్రీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. దుర్భర పరిస్థితుల మధ్య విప్లవ బాట పట్టి దళాల్లో చేరిన మహిళలపై పారా మిలిటరీ బలగాలతో దాడులు చేయించడం, నలువైపులా చుట్టుముట్టి ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టడం సరికాదనే అభిప్రాయాన్ని ప్రజాస్వామికవాదులు వ్యక్తం చేస్తున్నారు. 

ఎన్‌కౌంటర్లలో పెద్ద సంఖ్యలో ఆదివాసీ మహిళలు చనిపోతుండడాన్ని దేశ అంతర్గత భద్రత సమస్యగా కాకుండా.. సామాజిక వెనుకబాటు సమస్యగా ప్రభుత్వం పరిగణించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అత్యంత వెనుకబడిన ఆదివాసీ స్త్రీలపై కర్కశంగా ఉక్కుపాదం మోపడం సరికాదంటున్నారు. ఎన్‌కౌంటర్లలో ఆదివాసీ స్త్రీల మరణాలు ఎక్కువగా ఉంటున్న నేప«థ్యాన.. ఆయుధం పట్టిన ఆదివాసీ మహిళల భద్రత, ప్రాణ రక్షణ, వారి సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చ మొదలైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement