oldage home
-
రామ్- లక్ష్మణ్ చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్
టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ ఫైట్ మాస్టర్స్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చే పేర్లు రామ్- లక్ష్మణ్. సినీ పరిశ్రమలో బీజీగా ఉండే వారిద్దరు ఖాళీ టైమ్ దొరికితే చాలు సొంత గ్రామమైన చీరాల చేరుకుంటారు . అక్కడ వారు సేవ కార్యక్రమాలు చేపడుతుంటారు. ఈ క్రమంలోనే మరోసారి ఈ బ్రదర్స్ తమ మానవత్వాన్ని చాటుకున్నారు. చీరాలలో ఉండే 'కోటయ్య వృద్ధాశ్రమం' కోసం ఈ బ్రదర్స్ జోలి పట్టి బిక్షాటన చేశారు. (ఇదీ చదవండి: 27 ఏళ్ల తర్వాత ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు.. రిజిస్ట్రేషన్ ఇలా చేయండి) వృద్ధాశ్రమానికి ఒక ఆటో అవసరం కావడంతో చీరాలలోని ప్రధాన రహాదారుల్లో బిక్షాటన చేసి.. ప్రజలు నుంచి నగదు సేకరించారు. వచ్చిన డబ్బుతో పాటు వారు కూడా కొంత డబ్బును కలిపి ఆశ్రమానికి అందించారు. అదేంటి..? సినిమాల్లో బాగానే సంపాదిస్తున్నారు కదా? సొంత డబ్బు ఇస్తే సరిపోతుంది కదా? ఇదంతా ఎందుకు అని ప్రశ్నించే వారికి ఇలా సమాధానం చెప్పారు. 'ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. అందుకే తాము బిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టాము.'మానవసేవే మాధవసేవ' అనే సూక్తిని ప్రతి ఒక్కరు పాటించాలి.అపుడే సమాజం బాగుంటుంది' అని అన్నారు. నిస్వార్థ సేవతో ఎంతోమంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న నిర్వహకురాలు స్వర్గీయ కోటయ్య సతీమణి ప్రకాశమ్మను ఫైట్ మాస్టర్లు అభినందించారు. వారు చేస్తున్న పనిని మెచ్చుకుంటూ.. ఫ్యాన్స్‌తో పాటు పలువురు షోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. (ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్ హీరోయిన్) -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మెగా మేనల్లుడు
సినిమాల్లో హీరోలు అనేకం ఉంటారు. కానీ నిజ జీవితంలో హీరోలు మాత్రం కొంతమందే. సాయం అని కోరిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ ఇటీవల రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. ఈ క్రమలో తాజాగా మరో హీరో ఇచ్చిన మాటలను నిలబెట్టుకొని రియల్ హీరో అయ్యారు. అతనే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. ఇంతకీ ఈ సుపప్రీమ్ హీరో ఏ మాట నిలబెట్టుకున్నాడని అనుకుంటున్నారా.. గతేడాది విజయవాడలోని ‘అమ్మా ఆదరణ సేవా ఓల్డేజ్ హోమ్’ వారు తమను ఆదుకోవాలని.. ఓల్డేజ్ హోమ్ నిర్మాణానికి ఆర్ధిక సాయం చేయాలని పలువురు సినీ ప్రముఖులను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ వేదికగా కోరారు. (‘అమృత ప్రేమలో విరాట్.. మనసులో మాట’) దీనిపై స్పందించిన సాయి ధరమ్ తేజ్ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం తేజ్ తన సొంత ఖర్చులతో రెండు అంతస్థుల భవనాన్ని నిర్మించి వృద్దులకు ఓ నీడను కల్పించాడు. అంతేగాక ఒక ఏడాదిపాటు ఆ ఓల్డేజ్ హోమ్‌కు స్పాన్సర్షిప్ అందిసస్తున్నట్లు పేర్కొన్నాడు. అలాగే ఈ మంచి పనిలో తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ రుణపడి ఉంటానని సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నాడు. కాగా ఈ హీరో చేసిన పనికి నెజినట్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో సాయి ధరమ్‌కు జోడిగా ఇస్మార్ట్ భామ నభా నటేష్ నటిస్తున్నారు. ()అమృతను చూశాక విరాట్‌కు ఏమైంది?) -
అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. రెండు ముసలి ప్రాణాలు
అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. అందులో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న రెండు ముసలిప్రాణాలు.. పలకరించే నాథులు లేరు.. అవసరమైతే ఆదుకునే ఆప్తులు కరువు.. పిల్లలు ఉన్నా ఎక్కడో.. ఏ దేశంలోనో, ఇతర ప్రాంతాల్లోనో ఉద్యోగాలు చేస్తూ వారి బతుకు వారిది.. వీరి బతుకు వీరిది.. ఒంటరి జీవితం.. నేడు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.. కొడుకులూ, కోడళ్లూ.. కూతుళ్లూ, అల్లుళ్లూ.. మనవళ్లు, మనవరాళ్లు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని గొప్పగా చెప్పుకుంటున్నా.. లోలోపల తమ బిడ్డలు తమతో లేకపోతిరే అనే ఆవేదన ఏదో ఒక మూలన ఆ ముసలి ప్రాణాలను తోడేస్తూనే ఉంటుంది.. ఇలా వృద్ధదంపతులు నేడు ఒంటరి పక్షులుగా మారిపోయారు.. మీరక్కడ.. మేమిక్కడ అన్నట్లుగా తల్లిదండ్రులు.. పిల్లలూ తలొకచోట ఏకాకులుగా మారి కుటుంబ వ్యవస్థ కడు దయనీయంగా మారింది. సాక్షి, నెల్లూరు(బారకాసు): ప్రతి ఒక్కరికి జీవితంలో వారి కుటుంబం ముఖ్య భూమిక పోషిస్తుంది. కానీ నేడు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నామైపోతోంది. ఉమ్మడి కుటుంబాలు అసలు కనిపించని పరిస్థితి. ఆర్థిక, సామాజిక స్థితిగతులు, మారిన జీవన విధానం, సంపాదన, ఉద్యోగంతో చెట్టుకొకరు.. పుట్టకొకరుగా మారారు. బంధుత్వాలు తగ్గాయి. బంధువులు దూరమవుతున్నారు. చిన్నారులు, యువత.. చదువు, ఉద్యోగాల నేపథ్యంలో తల్లిదండ్రులను ఒంటరిగా వదిలి ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నారు. ఒకప్పుడు పట్టణాల్లోనే ఈ పరిస్థితి ఉండగా నేడు పల్లెల్లోనూ ఇలాంటి కుటుంబాలు చాలా కనిపిస్తున్నాయి. రెక్కలొచ్చిన పక్షుల్లా పిల్లలు విదేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతుండగా తల్లిదండ్రులు ఏకాకులుగా మిగిలిపోతున్నారు. మారిన పరిస్థితులతో.. ఆర్థిక సమస్యలు కూడా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పరంగా సమస్యలు సృష్టించి మనుషులను వేరు చేస్తున్నాయి. ప్రస్తుత నాగరిక సమాజంలో రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. దీంతో ఆర్థిక వనరులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ధరల ప్రభావంతో ఖర్చులు పెరిగిపోతున్నాయి. జల్సాలు, ఉన్నతమైన జీవనం అలవడుతున్నాయి. దీంతో సంపాదనపై మోజు పెరిగింది. వృత్తిరీత్యా ఇతర ప్రాంతాలకు ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వెళుతున్నారు. పొద్దున లేచినప్పటి నుంచి ఈ కార్యక్రమాలతో బిజీగా కాలం వెళ్లదీస్తున్నారు. కొంతమంది ఇతర దేశాలకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లితండ్రులు ఒంటరిగా మారడం, కుటుంబాలు విడిపోవడం జరుగుతోంది. ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. తమ పిల్లలు రూ.లక్షలు సంపాదించారని తల్లిదండ్రులు గర్వంగా చెబుతున్నారు. పిల్లలు ఎంతో ఎత్తుకు ఎదగడం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ పిల్లలు తమ వద్ద లేని తమ కుటుంబాలు ఆనందంగా ఉంటున్నాయని చెప్పేవారు చాలా తక్కువగా ఉన్నారు. సంపాదన, ఉన్నత స్థానానికి చేరడం నిజమైన ఆనందం కలిగించదని, తరచి చూస్తే అదంతా నీటిబుడగే అని చెబుతున్నారు. కన్నబిడ్డలు ఎంత ఎత్తుకు ఎదిగినా తమ కళ్ల ఎదుటే ఉంటే తల్లితండ్రులు ఆనందపడతారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. విదేశాల్లో ఏడాది పొడవునా బిజీగా గడిపినా ఏదైనా పండగకు పది రోజులు వచ్చి వెళితే.. మిగిలిన 355 రోజులు ఆ జ్ఞాపకాలతో బతికేస్తున్నామని చెప్పుకుంటుంటారు. కానీ విదేశాలకు వెళ్లిన వారిలో ఎక్కువ మంది రెండు మూడేళ్ల కొకసారి వచ్చి వెళుతుంటారు. మళ్లీ ఎప్పుడు వస్తారా అని కన్నీటితో ఎదురుచూస్తున్న తల్లితండ్రులు అనేక మంది ఉంటున్నారు. ఆదరణ లేని కొందరు తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలను సైతం ఆశ్రయిస్తున్నారు. ఇరుగుపొరుగుతో మాటలు కలపాలి గతంలో గ్రామీణ ప్రాంతాల్లో అందరూ రచ్చబండ, వీధుల్లో కూర్చొని కష్టసుఖాలు చెప్పుకునే వారు. ఇరుగుపొరుగు వారు కలసిమెలసి జీవనం సాగించేవారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో ఇరుగుపొరుగు వారితో మాటలు కరువయ్యాయి. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా జీవిస్తున్నారు. జీవితం సాఫీగా సాగాలంటే పది రూపాయలతో కాదు పది మందితో జీవితం పంచుకోవాలన్న మాట వాస్తమనేది గ్రహించాలి. అది బలపడితే కష్టసుఖాలు పంచుకునేందుకు కొంత ఆస్కారం ఉంటుంది. అందరూ ఉన్నా ఏకాకులే కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరంలో ఇంటి చుట్టూ పదుల సంఖ్యలో కుటుంబాలు ఉన్నా.. అగ్గిపెట్టెలాంటి గదుల్లో ఇరుక్కుపోయి జీవనం సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పండగ, పబ్బాల సమయంలో ఒకరినొకరు చూసుకునే వింత ధోరణిలో అపార్ట్మెంట్ జీవితాలు సాగుతున్నాయి. కలసి ఉన్నా కలివిడితనం తక్కువగానే ఉంటోంది. పక్కింట్లో ఏమి జరుగుతున్నా పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నారంటే మానవీయ విలువలు ఎంత దిగజారుతున్నాయో అర్థమవుతోంది. ఏటా వృద్ధుల శాతం కూడా పెరుగుతోంది. వారు 2001లో 4.5 శాతం ఉండగా నేడు అది 6.0 శాతానికి చేరింది. 2050 నాటికి 30 శాతానికి చేరుతుందని అంచనా. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక శాతం వయోవృద్ధులు ఉన్నారని అంచనాలు చెబుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఒకరి విలువ ఒకరికి తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. మంచి ఉద్యోగం కోసం తల్లిదండ్రులకు దూరంగా వెళ్లిపోతున్నారు. ఇది తప్పని అనుకోకూడదు. ఎవరికైనా భవిష్యత్ ముఖ్యమే. అలా అని తల్లిదండ్రులను దూరం చేసుకోవడం చాలా తప్పు. లేటు వయస్సులో వారికి కావాల్సింది డబ్బు, సౌకర్యాలు కాదు. స్వాంతన కలిగించాలి. పిల్లల నుంచి వారు ప్రేమను మాత్రమే ఆశిస్తారు. అప్పుడే వారి చివరి మజిలీ ఆనందంగా సాగిపోతుంది. చాలామంది తల్లిదండ్రులు ఆ కోరిక తీరకుండానే మరణిస్తున్నారు. – డాక్టర్ శ్రీనివాసతేజ, మానసిక వ్యాధుల నిపుణుడు నెల్లూరు జిల్లాలో ప్రస్తుత జనాభా – సుమారు 32 లక్షలు 2011 లెక్కల ప్రకారం జిల్లాలో జనాభా 29 లక్షలు జిల్లాలో ఉన్న వృద్ధాశ్రమాలు – సుమారు 150 వీరిలో వృద్ధులు – సుమారు 7 లక్షలు ఆశ్రయం పొందుతున్న వృద్ధులు – సుమారు 3000 మంది -
వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది: తానేటి వనిత
సాక్షి, అమరావతి : వికలాంగుల పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. దివ్యాంగులకు, వృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. దివ్యాంగులకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సమర్థవంతంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వృద్ధులకు గ్రామ వాలంటీర్ల ద్వారా పథకాలు అందజేస్తామని, భవిష్యత్తులో జిల్లాకు ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తానేటి వనిత హామీ ఇచ్చారు. అదే విధంగా అంగన్వాడీ కేంద్రాలలో, గర్భిణీలకు, బాలింతలకు నాణ్యమైన భోజనం అందకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 53 శాతం ఎనీమియా ఉందని నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చిందని, దీనిని త్వరలో మంచి విధానం ద్వారా తగ్గించేందుకు కృషి చేస్తామని ఆమె అన్నారు. -
అవ్వ నవ్వుకు ‘సాక్షి’
సాక్షి, పొన్నూరు : చుట్టూ తన వయసు వాళ్లు.. అందరి మోముల్లో బోసినవ్వులు.. ఇంత కాలం తనకు దూరమైన ఆ నవ్వుల వనంలో తానూ వచ్చి చేరింది. వేళకు నాలుగు మెతుకులు బువ్వ పెట్టే దారి దొరికింది. జీవన చరమాంకంలో నిడుబ్రోలులోని గోతాలస్వామి ఆశ్రమం అండగా నిలిచింది. మండలంలోని తాళ్లపాలేనికి చెందిన దీనమ్మ అనాథగా అవస్థలు పడుతున్న విషయాన్ని సాక్షి జిల్లా ఎడిషన్‌లో ఆదివారం దీన గాథ పేరుతో కథనం ప్రచురితమైంది. దీనికి గోతాల స్వామి ఆశ్రమ నిర్వాహకులు స్పందించారు. ఆమెను ఆశ్రమానికి తీసుకెళ్లి అక్కున చేర్చుకున్నారు. ఇది చదవండి : పండుముసలి దీన గాథ -
హోమ్లీ హోమ్
నలభై ఏళ్లుగా అనాథ బాలలు, వృద్ధులు, వికలాంగులకు ఆశ్రయం ఇస్తున్న డాక్టర్ గీత దంపతులు.. ఇప్పుడు మరొక హోమ్లీ హోమ్‌తో ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు. ఓ పదమూడేళ్ల అమ్మాయి. తమ ఊరికి వచ్చిన డాక్టర్ల బృందాన్ని ఆశ్చర్యంగా చూసింది. ఆ మెడికల్ టీమ్ ఆ ఊరి వాడల్లో పర్యటిస్తోంది. ఒక్కొక్కరు వచ్చి తమ అనారోగ్యం గురించి చెబుతున్నారు. డాక్టర్లు మందులు ఇచ్చి ఎలా వాడాలో చెబుతున్నారు. అప్పుడే టీనేజ్లోకొచ్చిన ఆ అమ్మాయికి ఆ సన్నివేశం అద్భుతంగా అనిపిస్తోంది. మెడికల్ టీమ్ పని పూర్తి చేసుకుని తిరిగి పట్నం పోవడానికి సిద్ధమైంది. వాళ్ల వెంటే వెళ్తున్న అమ్మాయికి ఓ గుడిసెలో నుంచి మూలుగు వినిపించింది. లోపలికి వెళ్లి చూస్తే మంచం మీద ముడుచుకుని పడుకుని ఉన్న ఒక అమ్మాయి కనిపించింది. ‘‘డాక్టర్లొచ్చారు చూపించుకుందువు గాని రా’’ అని ఆ అమ్మాయిని లేపింది. లేచే పరిస్థితిలో లేదా అమ్మాయి. ఆమెను లేపి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు. గుడిసె బయటకు వచ్చి చూస్తే మెడికల్ టీమ్ ముందుకు వెళ్లిపోయింది. పరుగెత్తుకుంటూ వెళ్లి ‘‘ఓ అమ్మాయి మంచం మీద నుంచి లేవలేకపోతోంది. వైద్యం చేద్దురు రండి’’ అని చెప్పి, మెడికల్ టీమ్‌ను వెనక్కు తీసుకు వచ్చి, జ్వరంతో బాధపడుతున్న అమ్మాయికి వైద్యం చేయించింది. ఇది జరిగి యాభై ఏళ్లవుతోంది. ఆ రోజే నిర్ణయించుకుంది ఆ అమ్మాయి తాను డాక్టర్ని కావాలని, వైద్యం అందని వాళ్లకు వైద్యం చేయాలని. అనుకున్నట్లే డాక్టర్ అయ్యి, దేశం నలుమూలలా పర్యటిస్తూ ప్రభుత్వ వైద్యం అందని, ప్రైవేట్ వైద్యం చేయించుకోలేని పేదలకు వైద్యం చేస్తోంది. ఆమే.. డాక్టర్ గీతా ఏరువ. గీత.. ఆధ్యాత్మిక సేవామార్గం పట్టడానికి ప్రేరేపించిన సందర్భం అది. ఏదీ వృథా కాకూడదు డాక్టర్ గీత సొంతూరు కర్నూలు జిల్లా కౌలూరు. ఆమె పెరిగింది అనంతపురం జిల్లా తాడిపత్రిలో. తండ్రి బాలిరెడ్డి మిలటరీ ఆఫీసర్. ఆయన పెంపకం తనకు ‘ఇవ్వడాన్ని’ నేర్పిందని అంటారు గీత. ‘‘నేనీ గౌను వేసుకోను అంటే మా నాన్న వెంటనే ‘మరి దీనిని ఏం చేద్దాం’ అని అడిగేవారు. ఈ గౌనులో పత్తి పండించిన రైతు శ్రమ ఉంది, రంగులద్దిన కార్మికుని శ్రమ ఉంది. కుట్టిన టైలర్ పని ఉంది. ఇంతమంది పని ఉంది ఈ గౌను వెనుక. అలాగే నేను పడిన శ్రమతో సంపాదించిన డబ్బుతో కొన్నాను. అంతకంటే ఎక్కువగా... ప్రకృతి నుంచి మనం తీసుకున్న వనరు. దీనిని ఉపయోగించకపోవడం తప్పు. నువ్వు వేసుకోకపోతే మరొకరికి ఇవ్వు. వనరులను వృథా చేయకూడదు’ అని చెప్పారు. మిలటరీలో పనిచేయడం వల్ల ఆయనలో వెల్లివిరిసిన సేవాభావం అది. మాకూ అవే నేర్పించారు. ఇప్పటికీ మాకెంతవరకు అవసరమో అంతవరకు ఉంచుకుని మిగిలినది లేని వాళ్లకు ఇవ్వడం అలవాటైంది. టామ్ (భర్త థామస్ రెడ్డి) క్రైస్తవ మిషనరీ నేర్పించిన కరుణ, సేవా ప్రభావంతో పెరిగిన వారు కావడంతో మా ఇద్దరికీ సేవ చేయడమే జీవితం అయింది’’ అన్నారు డాక్టర్ గీత. మా తర్వాత కూడా పిల్లల్లేని దంపతులు తమకు పిల్లల్లేని కారణంగా అనాథాశ్రమాలకు వెళ్లి ఒక బిడ్డను దత్తత తీసుకుని పెంచుకుంటారు. టామ్– గీత దంపతులు ఏకంగా అనాథాశ్రమాలనే దత్తత తీసుకున్నారు. స్వయంగా ‘ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ (ఎఫ్సీఎన్)’ను స్థాపించి అనాథ, పేద పిల్లల కోసం స్కూళ్లు, కాలేజీలు పెట్టారు. తల్లిదండ్రులు ఉండి పై చదువులకు ఫీజు కట్టుకోలేని పిల్లలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండువేల ఐదు వందల మంది విద్యార్థులు వీళ్ల సంస్థల ద్వారా జీవితాలను నిలబెట్టుకున్నారు. ఇంత విస్తృతమైన సర్వీస్ చేయాలంటే డబ్బవసరం పెద్ద మొత్తంలోనే ఉంటుంది. అందుకు ఈ దంపతులు ఇక్కడి పిల్లలను అమెరికా నుంచి దాతలతో అనుసంధానం చేశారు. ‘‘మాకు విరాళాలిస్తున్న వాళ్లలో ఎక్కువ మంది మేము అమెరికాలో ఉద్యోగం చేసినప్పటి మా ఫ్రెండ్సే. ఫండ్ రైజింగ్ కోసం ఏటా ఆరు నెలలు అమెరికాలో ఉంటున్నాం. మాకు వయసై పోయిన తర్వాత ఈ సర్వీస్ ఆగిపోకుండా కొనసాగేటట్లు సిస్టమ్‌ను డెవలప్ చేయడమే ఇప్పుడు మా ముందున్న ఆలోచన. అందుకే అవకతవకలకు అవకాశం లేని విధంగా ఒక సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం’’ అన్నారు డాక్టర్ గీత. – వాకా మంజులారెడ్డి రెండు వందల మందికి మా అమ్మానాన్నలు ఆంతోనమ్మ, శౌరిరెడ్డిల జ్ఞాపకార్థం పోరుమామిళ్ల, ధర్మవరం, గుంటూరు, జడ్చర్ల, నంద్యాల, మైదుకూరు, స్టేషన్‌ఘన్‌పూర్, కడప, హైదరాబాద్‌లలో విద్యాసంస్థలు, హోమ్‌లను స్థాపించాం. ఇప్పుడు షాద్ నగర్లో నిర్మించిన హోమ్‌లో ఒక్కో గదికి ఒక్కో దాత పేరు ఉంటుంది. ఇందులో ఆశ్రయం పొందుతున్న వాళ్లు తాము ఉంటున్న గదికి ఆర్థిక సహాయం చేసిన వాళ్ల పేరును రోజూ గుర్తు చేసుకుంటారు. అలా పెరిగిన పిల్లలు పెద్దయిన తర్వాత ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారని మా విశ్వాసం. సేవాశ్రమంలో రెండు వందల మందికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. ఆశ్రయం అవసరమైన వాళ్లకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. – థామస్‌రెడ్డి, ఎఫ్సీఎన్ నిర్వాహకులు పిల్లలకు అందరూ ఉండాలి హైదరాబాద్‌కు సమీపంలోని షాద్‌నగర్‌లో స్థాపించిన మా ‘సేవాశ్రమం’ జనవరి 23న ప్రారంభం అవుతోంది. మా ముఖ్య ఉద్దేశం ఉమ్మడి కుటుంబంలో ఉండే బంధాలను పిల్లలకు అనుభవంలోకి తేవడమే. పిల్లలు తమకు ఎవరూ లేరనే నిస్పృహలో పెరగకూడదు. వృద్ధులు కూడా మరణం కోసం ఎదురు చూస్తూ రోజులు గడపకూడదు. జీవించి ఉన్నన్ని రోజులూ సంతోషంగా గడపాలి. అలాగే దివ్యాంగులు కూడా ఏదో బతుకీడుస్తున్నాం అనే నిర్వేదంలో మునిగిపోకుండా తాము చేయగలిగిన సర్వీస్ ఇతరులకు చేయగలుగుతున్నామనే మానసికానందంతో జీవించాలి. అందుకోసం పిల్లలకు, వృద్ధులకు, దివ్యాంగులకు హోమ్‌లను ఒకే ప్రాంగణంలో నిర్మించాం. – డాక్టర్ గీత, ఎఫ్సీఎన్ నిర్వాహకురాలు -
ప్రభుత్వానికి విరాళంగా వృద్ధాశ్రమం
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్దకొండూరులో నిర్మించిన మేరెడ్డి సత్యనారాయణరెడ్డి జానకమ్మ వానప్రస్థాశ్రమాన్ని ఆశ్రమ నిర్వాహకులు ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు మేరెడ్డి సత్యనారాయణరెడ్డి, జానకమ్మ దంపతులు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావును గురువారం కలిసి పూర్తి వివరాలు అందిం చారు. ‘ఎకరంన్నర భూమిలో 6 వేల చదరపు అడుగుల భవనాన్ని సొంత ఖర్చులతో నిర్మిం చాం. అనారోగ్యం కారణంగా భవనంతో పాటు పూర్తి ఆశ్రమాన్ని ప్రభుత్వానికి విరాళం గా ఇవ్వడంతో వృద్ధులకు సేవలు కొనసాగేలా చూడాలి’అని కేటీఆర్‌ను కోరారు. ఈ అంశం పై ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌తో మాట్లాడతారని కేటీఆర్ చెప్పారు. వృద్ధ దంపతులు ప్రారంభించిన సేవా కార్యక్రమాన్ని కొనసాగించేలా ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందేలా చూస్తామని దంపతులకు కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌తో కేటీఆర్ మాట్లాడారు. వృద్ధ దంపతుల సేవా దృక్పథాన్ని, దాతృత్వాన్ని కేటీఆర్ కొనియాడారు. -
ఒంగోలులో సందడి చేసిన ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్
-
వృద్ధాశ్రమానికి తల్లి తరలింపు.. అంతలోనే!
ప్రియురాలి మోజులో పడి తల్లిని నిర్లక్ష్యం చేశాడు. నానా హింసకు ఆమెను గురిచేశాడు. చివరకు వదిలించుకోవాలని యత్నించిన కొడుక్కి.. ఆ తల్లి శిక్ష విధించింది. అది మరణ శిక్ష... వాషింగ్టన్: అరిజోనా రాష్ట్ర రాజధాని ఫియోనెక్స్ పట్టణం.. ఫౌంటేన్ హిల్స్‌లో 92 ఏళ్ల అన్నా మే బ్లెస్సింగ్,తన కొడుకు(72) తో జీవిస్తోంది. అయితే ఆరు నెలలుగా ఓ అమ్మాయి(25 ఏళ్ల లోపు)తో ఆ పెద్దాయన డేటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తల్లిని నిర్లక్ష్యం చేయగా.. ఆమె సహించింది. నిత్యం తులనాడుతూ కొడుకు ప్రియురాలు అవమానించినా భరించింది. చివరకు ఆమెను వృద్ధాశ్రమానికి తరలించాలని యత్నించటంతో తట్టుకోలేకపోయింది. సోమవారం తల్లిని ఓల్డేజ్ హోమ్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమైన తరుణంలో ఆమె తన వద్ద దాచుకున్న తుపాకీతో కొడుకు, అతని ప్రియురాలిపై కాల్పులు జరిపింది. కొడుకు మెడలోంచి బుల్లెట్లు దూసుకుపోవటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. ప్రియురాలు తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి కొడుకు శవం ముందు ఆ తల్లి ఈ వీల్ ఛైర్లో కూర్చుని ఉంది. ‘నా జీవితాన్ని నువ్వు లాగేసుకున్నావ్.. ఇప్పుడు నీ బతుకును నేను తీసేసుకున్నా’ అంటూ ఆమె కంటతడి పెట్టుకుంది. జరిగిందంతా అక్కడున్న వారికి వివరించింది. ఆపై ఆమె నుంచి వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆమె తరపున కేసును ఉచితంగా వాదించేందుకు ఓ న్యాయవాది(అటార్నీ) ముందుకు రావటం విశేషం. -
అనుబంధాల రా‘రాజు’
పేగుతెంచుకున్న బంధం కాదుమానవత్వం అనే అనుబంధంఎందరో అనాథలకు తోడైందినేనున్నానంటూ భరోసా కల్పించిందిఅన్నం పెడుతూ..నీడ కల్పిస్తూ..కంటికి రెప్పలా కాపాడుతూ వృద్ధాప్యంలో బాసటగా నిలుస్తూరాజుగా..మారాజుగా..యోగారాజుబంధువయ్యాడు.ఆ కథంటో చూద్దాం కొమ్మాది (రామజోగి అగ్రహారం): కనిపెంచిన అమ్మానాన్నలనే ఆదరించని వారున్న ఈ రోజుల్లో అనాథలైన వృద్ధులకు బాసటగా నిలుస్తున్నారు యోగారాజు. కన్నబిడ్డలు వదిలేసిన వృద్ధులందరినీ తన తల్లిదండ్రులుగా భావించి వారి కోసం ఓ వృద్ధాశ్రమం నిర్మించి సేవ చేస్తున్నారు. అంతే కాకుండా గో సంరక్షణ, పలు చోట్ట దేవాలయాలు నిర్మిస్తూ భక్తిభావాన్ని చాటిచెబుతున్నారు. భీమిలి రూరల్ మండలం నిడిగట్టు పంచాయతీ రామజోగి అగ్రహారంలో 2010లో మొదటగా ఇద్దరు వృద్ధులకు నీడనిచ్చిన సద్గురు సేవాశ్రమం (వృద్ధాశ్రమం) ప్రస్తుతం 50 మందికి నీడనిస్తోంది. ఈ సద్గురు సేవాశ్రమాన్ని విశాఖకు చెందిన ఓ సాధారణ ఉద్యోగి ఏర్పాటు చేశారు. 10 ఏళ్ల క్రితం రోడ్డు పక్కన అనాథగా ఉన్న వృద్ధుడి పరిస్థితి చలించిపోయారు యోగారాజు. దీంతో ఇలాంటి వారి కోసం ఏదైనా చేయాలని భావించారు. అనాథాశ్రమం నిర్మించాలని తపించారు. అనుకున్నట్టు ఆయన ఆశయం నెరవేరింది. ఆశ్రమం నిర్మించి...మౌలిక సదుపాయాలు కల్పించారు. 50 మందికి నీడనిచ్చారు. వారంతా ఉమ్మడి కుటుంబంలా కలిసిపోయారు. ఏ చీకూచింత లేకుండా ప్రశాంత జీవనం గడుపుతున్నారు. ప్రశాంత జీవనం అన్ని వసతులతో కూడిన 24 గదులను ఇక్కడ ఏర్పాటు చేశారు. కింద గదులలో ఇద్దరు చొప్పున మహిళలు, మేడపై పురుషులు ఉంటారు. ప్రశాంత వాతావరణంతో పాటు మౌలిక సౌకర్యాలు సంపూర్ణంగా ఏర్పాటు చేశారు. వీరికి ధ్యానం చేసుకునేందుకు ధ్యాన మందిరం కూడా నిర్మించారు. ఆశ్రమంలో ఆధ్యాత్మిక వాతావరణం ఆశ్రమంలో సర్వమతాల వారు నివసిస్తున్నారు. ఆశ్రమ ప్రాంగణంలో శిర్డి సాయి మందిరం, శ్రీ కృష్ణ మందిరం, మాతాశ్రీ నూకాంబిక ఆలయాలు నిర్మించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆధ్యాత్మిక వాతావరణంలో శేష జీవితాన్ని అనుభవించడం పూర్వజన్మ ఫలంగా భావిస్తున్నారు ఇక్కడ ఉన్న వృద్ధులు. అంతే కాకుండా గో సంరక్షణలో భాగంగా 48 గోవులను పెంచుతున్నారు. ఇక్కడ ఎస్సీకాలనీ, ఉప్పాడ, పుక్కళ్లపాలెం ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి ఆలయాలు, పాడేరు, రాళ్లగడ్డ వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వరస్వామి, శివాలయాలను నిర్మించారు యోగారాజు. ఇక్కడ ఉచిత యోగా తరగతులను నిర్వహిస్తూ అందరికి ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. బాధలన్నీమర్చిపోతున్నాం నాది హైదరాబాద్. భార్య చనిపోయింది. నా ఒక్క కుమారుడు ఉద్యోగం నిమిత్తం నాగపూర్ వెళ్లిపోయాడు. ఆదరించేవారు లేరు. ఏంచేయాలో తెలియక, ఒంటరిగా ఉండలేక చిన్న చిన్న పనులు చేసుకుంటూ వైజాగ్ చేరా. నా పరిస్థితి అర్థం చేసుకున్న రాజుగారు ఆశ్రమానికి తీసుకుని వెళ్లారు. కన్న కొడుకులా చూసుకుంటున్నారు. ఈ ఆధ్మాత్మిక వాతావరణంలో బాధలన్నీ మరిచిపోతున్నాం. – జి. మల్లికార్జునరావు,హైదరాబాద్ అమ్మలా ఆదరణ నా అనుకున్న వారంతా కాదన్నా ఇక్కడ అక్కున చేర్చుకుని సొంత తల్లిలా చూసుకుంటున్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఆరోగ్యం బాగా లేకపోయినా వెంటనే స్పందించి ఆదుకుంటున్నారు. ఎవరికి ఏ లోటుపాట్లు లేకుండా కొడుకులా చూసుకుంటున్నారు. ఈ శేష జీవితాన్ని ఈ సద్గురు సేవాశ్రమంలో గడపడం అదృష్టంగా భావిస్తున్నా.– విన్నకోట అనసూర్య,చీరాల రుణపడి ఉన్నాం నాకు ఎవరూ లేరు. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అనుకున్నట్టు ఆ సాయిబాబాయే ఈ రాజుగారి రూపంలో వచ్చి నన్ను అక్కున చేర్చుకున్నారు. ఏనాడు పొందని ఇంత ఆదరణ, సదుపాయాలు అభించడం ఊహించని అదృష్టంగా భావిస్తున్నా. మేమంతా రాజుగారికి రుణపడి ఉన్నాం.– బి. మనోరమ,వైజాగ్ సేవ చేయడం భాగ్యం 50 మంది వృద్ధులకు సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడే ప్రసాదించాడు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు నాకు తల్లి దండ్రులతో సమానం. ఆదరణ కోల్పోయిన వీరందరూ శేష జీవితాన్ని సంతోషంగా గడపాలన్నదే నా ఆశయం. దైవ సేవ, మరో పక్క గో సేవ చేస్తూ, వైజాగ్‌లో యోగా తరగతులు నిర్వహిస్తూ ఆ భగవంతుని కృపలో విజయ వంతంగా ముందుకు వెళ్తున్నాను. నేడు ఈ ఆశ్రమంలో నెలకు సుమారు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. కొంత మంది దాతలు సహకారం మరువలేనిది.– యోగా రాజు,ఆశ్రమ వ్యవస్థాపక నిర్వాహకులు,జిల్లా యోగా సంఘంఅధ్యక్షుడు -
వృద్ధాశ్రమంలో టీఎన్ శేషన్
సాక్షి, చెన్నై : దేశంలో ఎన్నికల సంస్కరణలకు బాటలు వేసిన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ ప్రస్తుతం చెన్నైలోని వృద్ధాశ్రమంలో శేషజీవితాన్ని గడుపుతున్నారు. నగరంలోని గురుకులం ఓల్డేజ్ హోంలో భార్య జయలక్ష్మితో కలిసి శేషన్ నివసిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శేషన్ దంపతులను చూసేవారు లేకపోవడంతో వృద్ధాశ్రమంలో కాలం వెళ్లదీస్తున్నారు. కేరళలోని పాలక్కాడ్‌లో వారికి ఇల్లు ఉన్నా పిల్లలు లేకపోవడంతో వృద్ధాశ్రమంలో నివసించేందుకు మొగ్గుచూపారని తెలిసింది. గత ఏడాది డిసెంబర్ 15న శేషన్ గురుకులం ఆశ్రమ సహచరులతో తన 85వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. శేషన్ దంపతులు తమ ఆదాయంలో నుంచి ఆశ్రమంలోని సహచరుల వైద్య సేవలు, ఇతర అవసరాలను తీరుస్తున్నారు. పుట్టపర్తి సాయిబాబా భక్తుడైన శేషన్ బాబా మరణించిన అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో వృద్ధాశ్రమంలో సేదతీరుతున్నారు. కాగా, గతంలో చెన్నై ఆశ్రమంలో మూడేళ్లు గడిపిన శేషన్ మధ్యలో కొంత కాలం ఇంటికి వెళ్లారని ఇటీవల తిరిగి భార్యతో కలిసి వృద్ధాశ్రమానికి వచ్చారని తెలిసింది. ప్రభుత్వంలో అత్యున్నత సేవలు అందించినందుకు గాను 1996లో శేషన్‌కు ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు లభించింది. -
వృద్ధుల సేవలో జబర్దస్త్ వెంకీ
కాజీపేట: ప్రశాంత్ నగర్ లోని సహృదయ వృద్ధాశ్రమంలో మంగళవారం జబర్దస్త్ ఫేమ్ వెంకీ వృద్ధులకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వృద్ధులకు అల్పాహారం ఏర్పాటు చేసిన వెంకీ.. అందరినీ ఆత్మీయంగా పలకరించారు. అనంతరం శాంతిదూత అవార్డును అందుకున్న నిర్వాహకురాలు ఎండీ. యాకూబీకి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కునూర్ శేఖర్ గౌడ్, మధుసూధన్, అమృత రెడ్డి , చోటులు పాల్గొన్నారు. -
వృద్ధాశ్రమానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేయూత
ప్రకాశం జిల్లా: ఒంగోలులోని ఓ వృద్ధాశ్రమానికి వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేయూతను అందించారు. శనివారం ఉదయం బ్రాహ్మణుల వృద్ధాశ్రమాన్ని స్వయంగా సందర్శించిన ఆయన నిర్వాహకులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. అక్కడ ఉన్న వృద్ధుల యోగక్షేమాలను వైవీ సుబ్బారెడ్డి అడిగి తెలుసుకున్నారు. -
ఆర్నెళ్ల తర్వాత ఆచూకీ లభ్యం
కెరమెరి : మతిస్థిమితం కోల్పోయిన గిరిజన మహిళ ఇంటి నుంచి అదృశ్యమైంది. ఆరు నెలలపాటు భర్త, కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు కనిపించగా వారు ఐసీపీఎస్ అధికారులకు అప్పగించారు. వారు ఆమె ఆచూకీ కనుగొని ఇంటికి చేర్చడంతో కథ సుఖాంతమైంది. మండలంలోని కొఠారి గ్రామానికి చెందిన మడావి దేవ్‌రావు, పగ్గుబాయి దంపతులు కొంతకాలంగా కెరమెరి సమీపంలోని చిన్నుగూడలో ఉంటున్నారు. కుటుంబ కలహాలతో ఏడాది క్రితం పగ్గుబాయి భర్త నుంచి విడిపోయింది. చిన్నుగూడలోని తన అన్నయ్య కుడ్మిత పోసిగా ఇంట్లో ఉంటోంది. ఆరు నెలల క్రితం ఆకస్మాత్తుగా జాడ లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త, అన్నయ్యలు చాలా చోట్ల వెతికినా ఆచూకీ లభించ లేదు. పదిహేను రోజుల క్రితం హాజీపూర్ పోలీసులు అడవుల్లో పెట్రోలింగ్ చేస్తుండగా పగ్గుబాయి కనిపించింది. వారు ఆమెను ఆదిలాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్‌ప్రొటెక్షన్ స్కీం(ఐసీపీఎస్) అధికారులకు అప్పగించారు. వారు ఓల్డేజ్ హోంలో ఆశ్రయం కల్పించి కుటుంబ సభ్యుల విషయమై ఆరా తీశారు. చివరికి సగ్గుబాయి చిన్నుగూడలోని తన భర్త, అన్నయ్య పేరు చెప్పడంతో ఐసీపీఎస్ అధికారి సురేఖ కెరమెరి ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజశ్రీకి సమాచారం అందించారు. శుక్రవారం రాత్రి రాజశ్రీ, కేస్లాగూడ అంగన్వాడీ కార్యకర్త తింగుబాయి కెరమెరి పోలీసుస్టేషన్లో ఇన్చార్జి ఎస్సై దేవిదాస్ సమక్షంలో పగ్గుబాయిని ఆమె భర్త దేవ్‌రావుకు అప్పగించారు. వీరికి మూడేళ్ల కూతురు కన్నిబాయి ఉంది.