ఆశ్రమంలో వృద్ధులతో యోగరాజు
పేగుతెంచుకున్న బంధం కాదుమానవత్వం అనే అనుబంధంఎందరో అనాథలకు తోడైందినేనున్నానంటూ భరోసా కల్పించిందిఅన్నం పెడుతూ..నీడ కల్పిస్తూ..కంటికి రెప్పలా కాపాడుతూ
వృద్ధాప్యంలో బాసటగా నిలుస్తూరాజుగా..మారాజుగా..యోగారాజుబంధువయ్యాడు.ఆ కథంటో చూద్దాం
కొమ్మాది (రామజోగి అగ్రహారం): కనిపెంచిన అమ్మానాన్నలనే ఆదరించని వారున్న ఈ రోజుల్లో అనాథలైన వృద్ధులకు బాసటగా నిలుస్తున్నారు యోగారాజు. కన్నబిడ్డలు వదిలేసిన వృద్ధులందరినీ తన తల్లిదండ్రులుగా భావించి వారి కోసం ఓ వృద్ధాశ్రమం నిర్మించి సేవ చేస్తున్నారు. అంతే కాకుండా గో సంరక్షణ, పలు చోట్ట దేవాలయాలు నిర్మిస్తూ భక్తిభావాన్ని చాటిచెబుతున్నారు. భీమిలి రూరల్ మండలం నిడిగట్టు పంచాయతీ రామజోగి అగ్రహారంలో 2010లో మొదటగా ఇద్దరు వృద్ధులకు నీడనిచ్చిన సద్గురు సేవాశ్రమం (వృద్ధాశ్రమం) ప్రస్తుతం 50 మందికి నీడనిస్తోంది. ఈ సద్గురు సేవాశ్రమాన్ని విశాఖకు చెందిన ఓ సాధారణ ఉద్యోగి ఏర్పాటు చేశారు. 10 ఏళ్ల క్రితం రోడ్డు పక్కన అనాథగా ఉన్న వృద్ధుడి పరిస్థితి చలించిపోయారు యోగారాజు. దీంతో ఇలాంటి వారి కోసం ఏదైనా చేయాలని భావించారు. అనాథాశ్రమం నిర్మించాలని తపించారు. అనుకున్నట్టు ఆయన ఆశయం నెరవేరింది. ఆశ్రమం నిర్మించి...మౌలిక సదుపాయాలు కల్పించారు. 50 మందికి నీడనిచ్చారు. వారంతా ఉమ్మడి కుటుంబంలా కలిసిపోయారు. ఏ చీకూచింత లేకుండా ప్రశాంత జీవనం గడుపుతున్నారు.
ప్రశాంత జీవనం
అన్ని వసతులతో కూడిన 24 గదులను ఇక్కడ ఏర్పాటు చేశారు. కింద గదులలో ఇద్దరు చొప్పున మహిళలు, మేడపై పురుషులు ఉంటారు. ప్రశాంత వాతావరణంతో పాటు మౌలిక సౌకర్యాలు సంపూర్ణంగా ఏర్పాటు చేశారు. వీరికి ధ్యానం చేసుకునేందుకు ధ్యాన మందిరం కూడా నిర్మించారు.
ఆశ్రమంలో ఆధ్యాత్మిక వాతావరణం
ఆశ్రమంలో సర్వమతాల వారు నివసిస్తున్నారు. ఆశ్రమ ప్రాంగణంలో శిర్డి సాయి మందిరం, శ్రీ కృష్ణ మందిరం, మాతాశ్రీ నూకాంబిక ఆలయాలు నిర్మించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆధ్యాత్మిక వాతావరణంలో శేష జీవితాన్ని అనుభవించడం పూర్వజన్మ ఫలంగా భావిస్తున్నారు ఇక్కడ ఉన్న వృద్ధులు. అంతే కాకుండా గో సంరక్షణలో భాగంగా 48 గోవులను పెంచుతున్నారు. ఇక్కడ ఎస్సీకాలనీ, ఉప్పాడ, పుక్కళ్లపాలెం ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి ఆలయాలు, పాడేరు, రాళ్లగడ్డ వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వరస్వామి, శివాలయాలను నిర్మించారు యోగారాజు. ఇక్కడ ఉచిత యోగా తరగతులను నిర్వహిస్తూ అందరికి ఆదర్శవంతంగా నిలుస్తున్నారు.
బాధలన్నీమర్చిపోతున్నాం
నాది హైదరాబాద్. భార్య చనిపోయింది. నా ఒక్క కుమారుడు ఉద్యోగం నిమిత్తం నాగపూర్ వెళ్లిపోయాడు. ఆదరించేవారు లేరు. ఏంచేయాలో తెలియక, ఒంటరిగా ఉండలేక చిన్న చిన్న పనులు చేసుకుంటూ వైజాగ్ చేరా. నా పరిస్థితి అర్థం చేసుకున్న రాజుగారు ఆశ్రమానికి తీసుకుని వెళ్లారు. కన్న కొడుకులా చూసుకుంటున్నారు. ఈ ఆధ్మాత్మిక వాతావరణంలో బాధలన్నీ మరిచిపోతున్నాం.
– జి. మల్లికార్జునరావు,హైదరాబాద్
అమ్మలా ఆదరణ
నా అనుకున్న వారంతా కాదన్నా ఇక్కడ అక్కున చేర్చుకుని సొంత తల్లిలా చూసుకుంటున్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఆరోగ్యం బాగా లేకపోయినా వెంటనే స్పందించి ఆదుకుంటున్నారు. ఎవరికి ఏ లోటుపాట్లు లేకుండా కొడుకులా చూసుకుంటున్నారు. ఈ శేష జీవితాన్ని ఈ సద్గురు సేవాశ్రమంలో గడపడం అదృష్టంగా భావిస్తున్నా.– విన్నకోట అనసూర్య,చీరాల
రుణపడి ఉన్నాం
నాకు ఎవరూ లేరు. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అనుకున్నట్టు ఆ సాయిబాబాయే ఈ రాజుగారి రూపంలో వచ్చి నన్ను అక్కున చేర్చుకున్నారు. ఏనాడు పొందని ఇంత ఆదరణ, సదుపాయాలు అభించడం ఊహించని అదృష్టంగా భావిస్తున్నా. మేమంతా రాజుగారికి రుణపడి ఉన్నాం.– బి. మనోరమ,వైజాగ్
సేవ చేయడం భాగ్యం
50 మంది వృద్ధులకు సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడే ప్రసాదించాడు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు నాకు తల్లి దండ్రులతో సమానం. ఆదరణ కోల్పోయిన వీరందరూ శేష జీవితాన్ని సంతోషంగా గడపాలన్నదే నా ఆశయం. దైవ సేవ, మరో పక్క గో సేవ చేస్తూ, వైజాగ్‌లో యోగా తరగతులు నిర్వహిస్తూ ఆ భగవంతుని కృపలో విజయ వంతంగా ముందుకు వెళ్తున్నాను. నేడు ఈ ఆశ్రమంలో నెలకు సుమారు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. కొంత మంది దాతలు సహకారం మరువలేనిది.– యోగా రాజు,ఆశ్రమ వ్యవస్థాపక నిర్వాహకులు,జిల్లా యోగా సంఘంఅధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment