సాక్షి, చెన్నై : దేశంలో ఎన్నికల సంస్కరణలకు బాటలు వేసిన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ ప్రస్తుతం చెన్నైలోని వృద్ధాశ్రమంలో శేషజీవితాన్ని గడుపుతున్నారు. నగరంలోని గురుకులం ఓల్డేజ్ హోంలో భార్య జయలక్ష్మితో కలిసి శేషన్ నివసిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శేషన్ దంపతులను చూసేవారు లేకపోవడంతో వృద్ధాశ్రమంలో కాలం వెళ్లదీస్తున్నారు.
కేరళలోని పాలక్కాడ్‌లో వారికి ఇల్లు ఉన్నా పిల్లలు లేకపోవడంతో వృద్ధాశ్రమంలో నివసించేందుకు మొగ్గుచూపారని తెలిసింది. గత ఏడాది డిసెంబర్ 15న శేషన్ గురుకులం ఆశ్రమ సహచరులతో తన 85వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. శేషన్ దంపతులు తమ ఆదాయంలో నుంచి ఆశ్రమంలోని సహచరుల వైద్య సేవలు, ఇతర అవసరాలను తీరుస్తున్నారు.
పుట్టపర్తి సాయిబాబా భక్తుడైన శేషన్ బాబా మరణించిన అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో వృద్ధాశ్రమంలో సేదతీరుతున్నారు. కాగా, గతంలో చెన్నై ఆశ్రమంలో మూడేళ్లు గడిపిన శేషన్ మధ్యలో కొంత కాలం ఇంటికి వెళ్లారని ఇటీవల తిరిగి భార్యతో కలిసి వృద్ధాశ్రమానికి వచ్చారని తెలిసింది. ప్రభుత్వంలో అత్యున్నత సేవలు అందించినందుకు గాను 1996లో శేషన్‌కు ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment