సాక్షి, అమరావతి: చిన్నారుల సంరక్షణకు నిధుల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి చిన్నచూపు చూసింది. గత ఆర్థిక సంవత్సరం మహిళా, శిశు సంక్షేమానికి రూ.30,000 కోట్లు కేటాయించిన కేంద్రం.. తాజా బడ్జెట్‌లో మాత్రం రూ.24,435 కోట్లే కేటాయించింది. అంతే కాకుండా 15వ ఆర్థిక సంఘం సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పథకాలకు కూడా కత్తెర వేశారు. అలాగే రెండు, మూడు పథకాలను కలిపి ఒక మిషన్ కిందకు తీసుకొచ్చారు. మహిళలు, పిల్లలకు సంబంధించి మూడు ముఖ్యమైన మిషన్లు.. వాత్సల్య(పిల్లల రక్షణ, సంరక్షణ, సంక్షేమ), శక్తి(మహిళల రక్షణ, సంక్షేమం), సంబల్(ఉజ్వల హోమ్స్, వన్‌స్టాఫ్ సెంటర్స్, హెల్ప్‌లైన్స్, స్వధార్)ను ఏర్పాటు చేశారు.
మిషన్ వాత్సల్యలో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ పథకం(ఐసీపీఎస్) ఒక భాగం. గత బడ్జెట్‌లో ఐసీపీఎస్‌కు రూ.1,500 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈసారి రూ.900 కోట్లే కేటాయించింది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో–2019 నివేదిక ప్రకారం మన దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక బాలుడు లేదా బాలిక అదృశ్యమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారి రక్షణకు సంబంధించిన మిషన్ వాత్సల్యకు నిధుల కోత విధించారు. అలాగే కరోనా విజృంభణ సమయంలో సంరక్షణ గృహాల్లో ఉన్న 1,48,788 మంది పిల్లలను వారి సంబంధీకుల వద్దకు పంపించారు. అయితే లాక్‌డౌన్ దెబ్బకు వీరిని పోషించాల్సిన వారు ఉపాధి కోల్పోవడంతో.. ఈ చిన్నారుల్లో అత్యధిక మంది బాలకార్మీకులుగా మారిపోయారు. మరోవైపు స్కూల్ ఎడ్యుకేషన్‌కు కూడా గత ఆర్థిక సంవత్సరం కన్నా 9.71 శాతం తక్కువ నిధులు కేటాయించారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారుల సంరక్షణ, అభివృద్ధి ఎలా సాధ్యమని విద్యా రంగ నిఫుణులు ప్రశ్నిస్తున్నారు.
చిన్నారులపై చిన్న చూపు!
Published Sat, Feb 13 2021 5:37 AM | Last Updated on Sat, Feb 13 2021 5:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment