Baby selling
-
కన్నతల్లి నిర్వాకం.. అడ్డుకున్న యంత్రాంగం
పెనమలూరు : విజయవాడ చుట్టుగుంట గులామ్ ఉద్దీన్‌నగర్‌లో పది రోజుల మగ శిశువును విక్రయించిన సంఘటన సంచలనం రేపింది. ఈ విషయాన్ని జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి కె.ఉమారాణి గురువారం కానూరులోని తన కార్యాలయంలో వెల్లడించారు. ‘శిశువు తల్లి వేట బాలనాగమ్మ ఈనెల 7వ తేదీన పాత ప్రభుత్వాస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చారు. బాలనాగమ్మను శిశువును పెంచుకునే ఉద్దేశం లేదనే విషయం తెలుసుకున్న ఆస్పత్రిలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వైఎస్సార్ కాలనీకి చెందిన బి.రాణి.. ఆమెను సంప్రదించారు. వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈనెల 15న బాలనాగమ్మ ఆస్పత్రి నుంచి స్వచ్ఛందంగా డిచార్జ్ అయ్యారు. రూ.16 వేలు తీసుకుని శిశువును సెక్యూరిటీ గార్డుకి అప్పగించారు. అనంతరం రాణి శిశువును గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని డోలాస్‌నగర్‌లోని బంధువుల ఇంట్లో ఉంచారు. అయితే అంగన్వాడీ కార్యకర్తలకు అనుమానం రావడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ ఐసీడీఎస్ సిబ్బంది రంగంలోకి దిగి విచారణ చేయగా శిశువు విక్రయం వెలుగుచూసింది. శిశువును రక్షించి అత్యవసర వైద్యం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చట్టవిరుద్ధంగా శిశువును విక్రయించినందుకు పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని పీడీ ఉమారాణి తెలిపారు. -
హైదరాబాద్‌లో మరో కొత్త ముఠా
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మరో కొత్త ముఠా వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన శిశువులను విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వీరు ఒక్కో శిశువును రూ. 10 లక్షల నుంచి రూ. 14 లక్షల వరకు విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠాకు పలు సంతానసాఫల్య కేంద్రాలు సహకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. పిల్లలు లేనివారే లక్ష్యంగా ఈ ముఠా సభ్యులు దందా సాగిస్తున్నారు. పిల్లలను అమ్మే తల్లికి మాత్రం కేవలం రూ. 70 వేల ఇచ్చి మోసం చేస్తున్నారు. ఈ ముఠాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9 మందిని పోలీసులు గుర్తించారు. వీరు ఇప్పటివరకు 14 మంది శిశువులను అమ్మినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే శిశు విక్రయాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. -
శిశువును రూ. 20 వేలకు అమ్మడానికి సిద్ధపడింది
సాక్షి, జగిత్యాల : జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో పసికందు అమ్మకానికి సిద్ధపడ్డ శిశువు కథ కొలిక్కిరానుంది. సుమారు 20 రోజులక్రితం కరీంనగర్‌లోని స్వధార్‌హోమ్ నుంచి పారిపోయిన గంగజ్యోతి ఆర్మూర్ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. విచారణలో చిన్నారిని అపహరించానని ఒప్పుకున్నట్లు తెలిసింది. నిర్మల్ జిల్లా కడెంకు చెందిన పుట్ట గంగజ్యోతి, మహారాష్ట్రకు చెందిన నవీన్ దంపతులు. ఇద్దరు ఆర్మూర్ బస్టాండ్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు స్నేహ ఉంది. నవీన్ భార్యను విడిచిపెట్టి పోవడంతో జ్యోతి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో నెలరోజుల పసికందును రూ.20 వేలకు అమ్మడానికి సిద్ధపడుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు, ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చి పాపను అప్పగించారు. అధికారుల విచారణలో జ్యోతి పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి లోతుగా విచారణ చేపట్టారు. శిశువును, జ్యోతిని, నక్షితను కూడా స్వధార్‌హోమ్‌కు తరలించారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. కాగా 20 రోజుల క్రితం గంగజ్యోతి తన కూతురు నక్షితను స్వధార్‌హోమ్‌లోనే వదిలిపెట్టి పారిపోయింది. శుక్రవారం గంగజ్యోతి ఆర్మూర్‌లో పట్టుబడగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జరిగిన సంఘటనపై విచారణ చేపడుతున్నారు. అయితే మెట్పల్లిలో అమ్మకానికి పెట్టిన పాప నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన గందం సుమలత బిడ్డగా తెలుస్తోంది. దీనిపై ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. గందం సుమలత పాపనే ఎత్తుకెళ్లినట్లు గంగజ్యోతి చెప్పినప్పటికీ డీఎన్ఏ పరీక్షల నివేదిక కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం పాప కరీంనగర్‌లోని శిశుగృహలో ఉంది. -
రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టడంతో..
సాక్షి, తిరుమలగిరి(నాగార్జునసాగర్) : గిరిజన దంపతులు రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టడంతో ఇతరులకు విక్రయించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం సుంకిశాలతండాలో శనివారం వెలుగులోకి వచ్చింది. తండాకు చెందిన రమావత్ బాలు, సునిత దంపతులకు మొదటి కాన్పులో ఆడబిడ్డ జన్మించింది. వారసుడి కోసం రెండో దఫా గర్భం దాల్చింది. అక్టోబర్ 17వ తేదీన హాలియాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రెండో కాన్పులోనూ ఆడబిడ్డకు జన్మనివ్వడంతో పాపను తాము సాకలేమని ఇతరులకు అమ్మేశారు. కొన్ని రోజులనుంచి సునిత వద్ద పాప కని పించకపోవడంతో అంగన్వాడీ కార్యకర్తకు అనుమానం వచ్చి డిసెంబర్ 27న సూపర్వైజర్ నాగమణికి సమాచారం చేరవేసింది. నాగమణి తండా కు చేరుకొని ఆరా తీయగా పసికందును అమ్మిన ట్లు తెలిసింది. అమ్మిన పసికందును ఐదు రోజు ల్లో తీసుకురావాలని, లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది. అయినా శిశువు తల్లి ఒడికి చేరకపోవడంతో శనివారం నాగమణి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాలు, సునిత దంపతులపై ఫిర్యా దు చేసింది. ఏఎస్ఐ, సూపర్ వైజర్ తండాకు చేరుకున్నారు. బాలు సునిత దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పాప ఎక్కడున్నా మరో ఐదు రోజుల్లో తండాకు తీసుకురావాలని, లేనిపక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పాపను సాకే ఆర్థిక స్థోమత, ఇష్టం లేకపోతే ఆరు నెలల వరకు సాకి తరువాత శిశుగృహకు అప్పగించవచ్చని తెలిపారు. అవగాహన కల్పించినా.. మారని తీరు ప్రభుత్వ పథకాలపై అధికారులు తండాల్లో అవగాహన కల్పిస్తున్నా అది మూణ్నాళ్లముచ్చటగానే మిగిలిపోతోంది. గడిచిన రెండేళ్ల కాలంలో 13మంది దంపతులు ఆడపిలల్లను వదిలించుకున్న ఘటనలే దీనికి నిదర్శనం.గిరిజనులకు ఆడపిల్ల భారం కాకుడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతనంగా గిరిపుత్రిక పేరుతో గిరిజన బాలికలకు రూ. లక్ష డిపాజిట్ చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం బాలికల సంక్షేమానికి సుకన్యయోజన, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల చదువుతో పాటు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తుందని అవగాహన కల్పించినా గిరిజనుల్లో మార్పు రాకపోవడం గమనార్హం. -
రూ.5 వేలకు ఆడశిశువు అమ్మకం!
- తల్లి యాచకురాలు.. - ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో కలకలం ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం ఓ ఆడశిశువును విక్రయించిన ఘటన కలకలం సృష్టించింది. ఖమ్మం నగరంలోని రంగనాయకులగుట్ట ప్రాంతానికి చెందిన చామల సమ్మక్క శనివారం సాయంత్రం ఈ ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమెకు అప్పటికే ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వికలాంగురాలైన ఈమె యాచక వృత్తితో జీవిస్తోంది. భర్త భగవాన్ రిక్షా కార్మికుడు. దీంతో పుట్టిన ఆడపిల్లను వది లించుకోవాలనుకొని ఆస్పత్రి స్వీపర్ జె.జ్యోతిని సంప్రదించి అమ్మిపెట్టాలని ప్రాధేయ పడింది. ఈమె ద్వారా కొత్త గూడెం పాలకేంద్రం ప్రాంతానికి చెందిన రాచర్ల భారతమ్మ, ఆమె కోడలు వెంకట రమణ ఆదివారం ఉదయం ఆస్పత్రికి వచ్చి సమ్మక్కకు రూ.5 వేలు ఇచ్చి శిశువును తమ వెంట తీసుకెళ్లారు. సెక్యూరిటీ గార్డు ద్వారా వెలుగులోకి.. సమ్మక్క తన రెండేళ్ల కూతురు లక్ష్మిని ఎత్తు కొని వెళ్తుండగా హాస్పిటల్ ప్రవేశ ద్వారం వద్ద సెక్యూరిటీగార్డు నాగేశ్వరరావు అడ్డ గించి విచారించగా అసలు విషయం బయటపడింది. ఆడపిల్ల అమ్మకం సమాచారం తెలుసుకున్న టూటౌన్ సీఐ రాజి రెడ్డి ఆస్పత్రికి చేరుకొని స్వీపర్ జ్యోతిని అదుపు లోకి తీసుకొని విచారించారు. కొనుగోలు చేసిన వారికి ఈమె ద్వారా ఫోను చేయిం చారు. అప్పటికే తల్లాడ వరకు బస్సులో వెళ్లిన అత్తాకోడళ్లు వెనుతిరిగి వచ్చి శిశువును అప్పగించగా తల్లి ఒడికి చేరింది. యాచకురాలైన తల్లితో ఐసీడీఎస్ అధికారులు, సామాజిక వేత్త అన్నం శ్రీని వాసరావు మాట్లాడి ఆరుగురు సంతానా న్ని బాలల సదన్‌కు తరలించాలని సమ్మక్కను కోరగా అంగీకరించకపోవడంతో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. -
‘బంగారు తల్లి’ భారమా
సాక్షి, సంగారెడ్డి: ఇంకా పుట్టక ముందే ఆ పసిగుడ్డుల ధర నిర్ణయమవుతోంది. తల్లి గర్భం నుంచి ‘వేరుపడి’న మరుక్షణమే అంగడి సరుకులా చేతులు మారిపోతున్నారు. ఆడ పిల్ల పుట్టిందని కన్నవాళ్లే ఆ బంగారు తల్లులను అమ్మేస్తున్నారు. బారసాలలో జోల పాటలు వినాల్సిన పసిప్రాయం బేరసారాల లెక్కలు విని వెక్కివెక్కి ఏడుస్తోంది. అధికారులు అప్పుడప్పుడూ దాడులు చేసినా అమ్మలు మారడం లేదు...అమ్మేయడాలు ఆగడం లేదు. సాక్షాత్తు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సొంత ఇలాఖాలోనే ముక్కు పచ్చలారని శిశువు విక్రయాల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇక ఆమె సొంత నియోజకవర్గమైన నర్సాపూర్‌లోని కౌడిపల్లి మండలంలో శిశువు విక్రయాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అమాయక గిరిజనులు కన్న బిడ్డలను గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకున్న ఘటనలు ఇక్కడి తండాల్లో అనేకం. మే 2012 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఇప్పటి వరకు 12 శిశు విక్రయాలు వెలుగు చూశాయి. వీటిలో ఏడు ఘటనలు కౌడిపల్లి మండల పరిధిలో జరగ్గా, నర్సాపూర్, శివ్వంపేట, చిన్నశంకరంపేట, వర్గల్, రామాయంపేటలలో ఒక్కో ఘటన వెలుగు చూసింది. ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు 9 శిశు విక్రయాలు జరగడంతో అధికారులు రంగంలో దిగి వారిని రక్షించ గలిగారు. అందులో 8 మంది బంగారుతల్లులే(ఆడ శిశువులు) కావడం గమనార్హం. ఇక జిల్లాలో 2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 42 నవజాత శిశువులు అనాథలుగా రోడ్డుపాలు కావడంతో అధికారులు సంగారెడ్డిలోని శిశు గృహంలో చేర్పించారు. అందులోనూ 33 మంది బంగారుతల్లులే ఉన్నారు. ఆస్పత్రి ఖర్చులు చాలు ! రెక్కాడితే డొక్కాడని పేద గిరిజనులు ఆడ పిల్లను పెంచి పెళ్లి చేసే స్థోమత లేక పుట్టిన వెంటనే వదిలించుకునే మార్గాలు చూస్తున్నారు. కనీసం ఆస్పత్రి ఖర్చులు ఇస్తే చాలన్నట్లు అత్యంత చౌకగా ఆడ శిశువులను అమ్మేసిన ఘటనలూ జిల్లాలో వెలుగు చూశాయి. ఎన్నో వ్రతాలు చేసి...ఎన్నెన్నో నోములు నోచి...కనబడ్డ దేవుళ్లందరికీ మొక్కినా సంతానప్రాప్తి కలగక విసిగి వేసారిన జంటలు శిశువులను కొనేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ దత్తత తీసుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా చాలా మంది శిశువుల కొనుగోలుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో కౌడిపల్లిలోని కొందరు దళారులను ఆశ్రయించి పిల్లలు పుట్టక ముందే బేరసారాలు చేస్తున్నట్లు సమాచారం. విషయం బయటకు పొక్కితేనే అధికారులు దాడులు చేసి ఆ చిన్నారులను రక్షించగలుగుతున్నారు. ఎవరికీ తెలియకుండా గుట్టుగా నిత్యం ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కౌడిపల్లిలో శిశు విక్రయాలను అరికట్టడం కోసం ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా ..ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు. తల్లి పొత్తిళ్లలో ఒలలాడాల్సిన పసికూనలు అంగట్లో సరుకులా అమ్ముడవుతూనే ఉన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇలాఖాలో జరిగిన కొన్ని శిశు విక్రయాలు.. కౌడిపల్లి మండలం వెలిమకన్నకు చెందిన గిరిజన దంపతులు మెదక్ మండలం వాడితండాకు చెందిన కుటుంబానికి రూ.4 వేలకు ఆడ శిశువును విక్రయించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో గత నెల 24న అధికారులు శిశువును తీసుకువచ్చి శిశు గృహంలో చేర్పించారు. దయ్యాలతండాకు చెందిన ఓ జంట అక్టోబర్ 11న ఆడ శిశువును హైదరాబాద్‌కు చెందిన ఉపాధ్యాయురాలికి అమ్మేశారు. కేసు పెడతామని అధికారులు హెచ్చరించడంతో తల్లిదండ్రులు శిశువును వెనక్కి తీసుకొచ్చి పెంచుకుంటున్నారు. గౌతాపూర్లోని దంపతులు తమ ఆడ శిశువును చండూరుకు చెందిన ఓ కుటుంబానికి విక్రయించారు. అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో వెనక్కి తెచ్చుకున్నారు. సదాశివపల్లిలో మార్చి 10న కొల్లి యశోద అనే మహిళ దేవులపల్లికి చెందిన కుటుంబానికి తన శిశువును అమ్ముకుంది. శిశు రక్షణ కమిటీ శిశువును రక్షించి వెనక్కి తీసుకొచ్చింది. కౌడిపల్లి మండలంలోని ఓ యువతి పుట్టకముందే తన శిశువును అమ్మకానికి పెట్టింది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు ఆమెను స్వధార్ హోంలో చేర్పించారు. శిశువు పుట్టిన తర్వాత శిశు గృహంలో చేర్పించిన ఆమె ఎక్కడికో వెళ్లిపోయింది. నర్సాపూర్ మండలం ఎల్లాపూర్‌లో గత మార్చి 22న ఓ జంట అప్పుడేపుట్టిన తమ ఆడ శిశువును అమ్మేశారు. పత్రికల్లో వార్తలు రావడంతో అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఆ దంపతులు పాపను వెనక్కి తీసుకున్నారు.