‘బంగారు తల్లి’ భారమా | Baby selling in medak district | Sakshi
Sakshi News home page

‘బంగారు తల్లి’ భారమా

Published Fri, Dec 13 2013 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM

‘బంగారు తల్లి’ భారమా

‘బంగారు తల్లి’ భారమా

 సాక్షి, సంగారెడ్డి: ఇంకా పుట్టక ముందే ఆ పసిగుడ్డుల ధర నిర్ణయమవుతోంది. తల్లి గర్భం నుంచి ‘వేరుపడి’న మరుక్షణమే అంగడి సరుకులా చేతులు మారిపోతున్నారు. ఆడ పిల్ల పుట్టిందని కన్నవాళ్లే ఆ బంగారు తల్లులను అమ్మేస్తున్నారు. బారసాలలో జోల పాటలు వినాల్సిన పసిప్రాయం బేరసారాల లెక్కలు విని వెక్కివెక్కి ఏడుస్తోంది. అధికారులు అప్పుడప్పుడూ దాడులు చేసినా అమ్మలు మారడం లేదు...అమ్మేయడాలు ఆగడం లేదు. సాక్షాత్తు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సొంత ఇలాఖాలోనే ముక్కు పచ్చలారని శిశువు విక్రయాల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.
 
 ఇక ఆమె సొంత నియోజకవర్గమైన నర్సాపూర్‌లోని కౌడిపల్లి మండలంలో శిశువు విక్రయాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అమాయక గిరిజనులు కన్న బిడ్డలను గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకున్న ఘటనలు ఇక్కడి తండాల్లో అనేకం. మే 2012 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఇప్పటి వరకు 12 శిశు విక్రయాలు వెలుగు చూశాయి. వీటిలో ఏడు ఘటనలు కౌడిపల్లి మండల పరిధిలో జరగ్గా,  నర్సాపూర్, శివ్వంపేట, చిన్నశంకరంపేట, వర్గల్, రామాయంపేటలలో ఒక్కో ఘటన వెలుగు చూసింది. ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు 9 శిశు విక్రయాలు జరగడంతో అధికారులు రంగంలో దిగి వారిని రక్షించ గలిగారు. అందులో 8 మంది బంగారుతల్లులే(ఆడ శిశువులు) కావడం గమనార్హం. ఇక జిల్లాలో 2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 42 నవజాత శిశువులు అనాథలుగా రోడ్డుపాలు కావడంతో అధికారులు సంగారెడ్డిలోని శిశు గృహంలో చేర్పించారు. అందులోనూ 33 మంది బంగారుతల్లులే ఉన్నారు.
 
 ఆస్పత్రి ఖర్చులు చాలు !
 రెక్కాడితే డొక్కాడని పేద గిరిజనులు ఆడ పిల్లను పెంచి పెళ్లి చేసే స్థోమత లేక పుట్టిన వెంటనే వదిలించుకునే మార్గాలు చూస్తున్నారు. కనీసం ఆస్పత్రి ఖర్చులు ఇస్తే చాలన్నట్లు అత్యంత చౌకగా ఆడ శిశువులను అమ్మేసిన ఘటనలూ జిల్లాలో వెలుగు చూశాయి. ఎన్నో వ్రతాలు చేసి...ఎన్నెన్నో నోములు నోచి...కనబడ్డ దేవుళ్లందరికీ మొక్కినా సంతానప్రాప్తి కలగక విసిగి వేసారిన జంటలు శిశువులను కొనేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ దత్తత తీసుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా చాలా మంది శిశువుల కొనుగోలుకు ఇష్టపడుతున్నారు.

ఈ క్రమంలో కౌడిపల్లిలోని కొందరు దళారులను ఆశ్రయించి పిల్లలు పుట్టక ముందే బేరసారాలు చేస్తున్నట్లు సమాచారం. విషయం బయటకు పొక్కితేనే అధికారులు దాడులు చేసి ఆ చిన్నారులను రక్షించగలుగుతున్నారు. ఎవరికీ తెలియకుండా గుట్టుగా నిత్యం ఇలాంటి  ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కౌడిపల్లిలో శిశు విక్రయాలను అరికట్టడం కోసం ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా ..ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు. తల్లి పొత్తిళ్లలో ఒలలాడాల్సిన పసికూనలు అంగట్లో సరుకులా అమ్ముడవుతూనే ఉన్నారు.
 
  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇలాఖాలో జరిగిన కొన్ని శిశు విక్రయాలు..
  కౌడిపల్లి మండలం వెలిమకన్నకు చెందిన గిరిజన దంపతులు మెదక్ మండలం వాడితండాకు చెందిన కుటుంబానికి రూ.4 వేలకు ఆడ శిశువును విక్రయించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో గత నెల 24న అధికారులు శిశువును తీసుకువచ్చి శిశు గృహంలో చేర్పించారు.  
 
  దయ్యాలతండాకు చెందిన ఓ జంట అక్టోబర్ 11న ఆడ శిశువును హైదరాబాద్‌కు చెందిన ఉపాధ్యాయురాలికి అమ్మేశారు. కేసు పెడతామని అధికారులు హెచ్చరించడంతో తల్లిదండ్రులు శిశువును వెనక్కి తీసుకొచ్చి పెంచుకుంటున్నారు.
 
  గౌతాపూర్‌లోని దంపతులు తమ ఆడ శిశువును చండూరుకు చెందిన ఓ కుటుంబానికి విక్రయించారు. అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో వెనక్కి తెచ్చుకున్నారు.  
 
  సదాశివపల్లిలో మార్చి 10న కొల్లి యశోద అనే మహిళ దేవులపల్లికి చెందిన కుటుంబానికి తన శిశువును అమ్ముకుంది. శిశు రక్షణ కమిటీ శిశువును రక్షించి వెనక్కి తీసుకొచ్చింది.
 
     కౌడిపల్లి మండలంలోని ఓ యువతి పుట్టకముందే తన శిశువును అమ్మకానికి పెట్టింది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు ఆమెను స్వధార్ హోంలో చేర్పించారు. శిశువు పుట్టిన తర్వాత శిశు గృహంలో చేర్పించిన ఆమె ఎక్కడికో వెళ్లిపోయింది.
 
     నర్సాపూర్ మండలం ఎల్లాపూర్‌లో గత మార్చి 22న ఓ జంట అప్పుడేపుట్టిన తమ ఆడ శిశువును అమ్మేశారు. పత్రికల్లో వార్తలు రావడంతో అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఆ దంపతులు పాపను వెనక్కి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement