ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: సమాజంలో తమకంటూ ఒక స్థానాన్ని, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ట్రాన్స్‌జెండర్లు అడుగులేస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకుని సెలూన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. తమకు అవసరమైన సేవలు ‘మామూలు’ బ్యూటీపార్లర్లు అందించడం లేదని ఆరోపిస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా స్పా, బ్యూటీ సెంటర్లు ఏర్పాటుచేసుకుని దూసుకుపోతున్నారు.
సగం ధరలకే సేవలు..
‘నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం. బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన ప్రతీసారి అవమానాలు ఎదురయ్యేవి. అందుకే స్వయంగా నొయిడాలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకున్నాన’ని కాజల్ అనే ట్రాన్స్‌జెండర్, సెక్స్‌వర్కర్ తెలిపారు. తనలాగే ఇబ్బందులు పడుతున్న ట్రాన్స్‌జెండర్లకు ఇది ఎంతో ఉపయోగపడుతోందనీ, బయటితో పోల్చుకుంటే సగం ధరలకే ఇక్కడ సేవలందిస్తామమని ఆమె వెల్లడించారు. ఇక్కడే బ్యూటీకేర్ చేయించుకుంటున్న ఓ ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ.. పొద్దంతా కష్టపడినా పూట గడవదు. అందుకే ఈ వ్యభిచార కూపంలో చిక్కుకున్నా. తలెత్తుకుని జీవించేందుకు బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటున్నానని కనికా తెలిపారు. కాజల్ బ్యూటీపార్లర్ మా అందరికీ రిక్రియేషన్ సెంటర్‌గా కూడా ఉపయోగపడుతోందని తెలిపారు. రోజూ సాయంత్రం ఎంతో మంది ట్రాన్స్‌జెండర్లం ఇక్కడ కలులుసుకొని కష్టసుఖాలను పంచుకుంటామనీ, త్వరలోనే జీనత్ ప్రాతంలో బ్యూటీకేర్ సెంటర్ ఏర్పాటు చేస్తానని వెల్లడించారు.
ఆ పని చేయలేం.. బ్యూటీకేర్ అయితే ఓకే..
ట్రాన్స్‌జెండర్లకు ఒక ఎన్‌జీవో చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది. నొయిడాలోని ‘బసీరా సామాజిక్ సంస్థాన్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ రాంకాళీ మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధికి శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పిస్తామంటే.. వారు వెనకడుగేశారు. కానీ, బ్యూటీ సెలూన్ల ఏర్పాటుచేసుకోవడానికి మొగ్గు చూపారని ఆయన తెలిపారు. బ్యూటీకేర్ సెంటర్ల నిర్వహణలో మంచి ప్రావీణ్యం సంపాదిస్తున్న ట్రాన్స్‌జెండర్లు.. వారి అలంకరణ అవసరాలను తీర్చుకోవడంతో పాటు, రానున్న రోజుల్లో మహిళలకు కూడా తమ సేవల్ని అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment