Beauty clinic
-
అందానికి ఏఐ టచ్!
రమ్య తన పొడి చర్మానికి తగిన సౌందర్య ఉత్పత్తుల కోసం ఆన్లైన్లో వెతుకుతోంది. ఒక కంపెనీ వెబ్‌సైట్‌లోని టూల్ ఆకట్టుకుంది. రకరకాల యాంగిల్స్‌లో సెల్ఫిలను క్యాప్చర్ చేసి పంపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఆమె ముఖాన్ని విశ్లేషించి తగిన ప్రోడక్టులను సిఫార్సు చేయడం.. వాటిని కొనుగోలు చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ కాస్మెటిక్స్ బాగా పనిచేయడంతో చాన్నాళ్లుగా వెంటాడుతున్న తన సమస్యకు పరిష్కారం లభించింది. సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ (బీపీసీ) రంగంలో టెక్నాలజీ కొత్త పుంతలకు ఇది ఓ మచ్చుతునక మాత్రమే!బ్యూటీ, పర్సనల్ కేర్ రంగంలో ఇప్పుడు హైపర్ పర్సనలైజేషన్ గేమ్ చేంజర్‌గా మారుతోంది. చర్మ స్వభావానికి అనుగుణంగా వ్యక్తిగత ప్రొడక్టుల వాడకానికి డిమాండ్ జోరందుకోవడంతో కంపెనీలు ఏఐ, మెషీన్ లెర్నింగ్ ఇతరత్రా అధునాతన టెక్నాలజీల బాట పడుతున్నాయి. ఏఐతో అందానికి వన్నెలద్దుతున్నాయి. వినియోగదారులకు కూడా ఈ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తెగ నచ్చేస్తుండటంతో పాటు మంచి ఫలితాలు కూడా ఇస్తున్నాయి. దీంతో బ్యూటీ బ్రాండ్స్‌లో స్టార్టప్‌లు మొదలు.. ఇప్పటికే బాగా పాతుకుపోయిన పెద్ద కంపెనీలు సైతం ఏఐ మంత్రాన్ని జపిస్తున్నాయి. ఎవరైనా సరే తమ సెల్ఫిలను తీసి పంపితే చాలు.. ఏఐ మోడల్ వాటిని ప్రాసెస్ చేసి, అత్యంత నిశితమైన సమస్యలను సైతం గుర్తిస్తుంది. చర్మం రకం, మొటిమలు, నలుపు మచ్చలు, రంగు మారడం, పొడిబారడం, ఎగుడుదిగుడు చర్మం, ముడతలు, గుంతలను గుర్తించి, రియల్ టైమ్‌లో వ్యక్తిగతంగా సరైన సిఫార్సులు అందిస్తుంది.డేటా ఎనలిటిక్స్ దన్ను... బ్యూటీ స్టార్టప్‌లు గత రెండు మూడేళ్లుగా వినియోగదారుల నుంచి పెద్ద మొత్తంలో సేకరించిన డేటా ఆధారంగా ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకోగలుగుతున్నాయి. వేలాది మంది వ్యక్తిగత డేటాలోని అంశాలను విశ్లేషించి యూజర్లను పొడి చర్మం, పిగ్మెంటెడ్ స్కిన్, మొటిమలు, జిడ్డు చర్మం వంటి వివిధ విభాగాలుగా విభజిస్తున్నాయి. ఆపై ఏఐ టెక్నాలజీ పని మొదలుపెడుతుంది. వినియోగదారులు పంపించే తాజా ఫేస్ ఇమేజ్‌లను ఇప్పటికే గుర్తించి, విభజించిన లక్షణాల ఆధారంగా సరిపోల్చడం ద్వారా వారి చర్మ స్వభావాన్ని అంచనా వేస్తుంది. ఈ ప్రక్రియతో బ్యూటీ కంపెనీలు ఒక్క చర్మాన్ని మాత్రమే కాకుండా పెదాలు, శిరోజాలను కూడా విశ్లేషించి, తదనుగుణంగా ఉత్పత్తులను సూచిస్తున్నాయి. ఉదాహరణకు, ట్రాయా, రావెల్ వంటి హెయిర్ కేర్ స్టార్టప్‌లు క్విక్ ఆన్లైన్ సర్వే నిర్వహించి, మెషీన్ లెరి్నంగ్ ద్వారా ఎవరికి ఎలాంటి పదార్థాలతో కూడిన ప్రొడక్టు అవసరమనేది కొద్ది నిమిషాల్లోనే సిఫార్పు చేస్తుండడం విశేషం!స్మార్ట్ టూల్స్..ఆన్లైన్ బ్యూటీ స్టోర్ పర్పుల్.. సొంతంగా పర్పుల్ స్కిన్ ఎనలైజర్ అనే ఏఐ ఇమేజ్ రికగి్నషన్ టూల్‌ను అభివృద్ధి చేసింది. ఇది యూజర్ల చర్మాన్ని రియల్ టైమ్‌లో విశ్లేషిస్తుంది. ఆపై దీని స్మార్ట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం) టూల్ మెషీన్ లెర్నింగ్‌ను ఉపయోగించి హైపర్ పర్సనలైజ్డ్ ఉత్పత్తులను సిఫార్సు చేస్తుందని సంస్థ ఇంజినీరింగ్ హెడ్ వివేక్ పరిహార్ చెబుతున్నారు. ఇక లోరియల్ ప్రొడక్టులను విక్రయించే నైకా కూడా అధునాతన ఏఐ ఆధారిత వర్చువల్ టెక్నాలజీ ‘మోడిఫేస్’ను ఉపయోస్తోంది. వినియోగదారులు ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) అనుభవం ద్వారా తమకు సరిపడే ప్రొడక్టులను ఎంచుకునే అవకాశం ఇది కల్పిస్తుంది. ఈ సాఫ్ట్వేర్ దాదాపు 88 శాతం ఖచ్చితత్వంతో ఫేస్ ఆకారం, స్కిన్ టోన్, శిరోజాల రంగుతో సహా అనేక అంశాలను గుర్తించగలదు. అడ్వాన్స్డ్ డిజిటల్ ఫీచర్లు కస్టమర్లతో మరింతగా అనుసంధానమయ్యేందుకు, వారికి మరింత ప్రభావవంతమైన, ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు దోహదం చేస్తున్నాయని బ్యూటీ స్టార్టప్ షుగర్ కాస్మెటిక్స్ సీఈఓ వినీతా సింగ్ పేర్కొన్నారు. ‘యూజర్ల కొనుగోలు హిస్టరీ ఆధారంగా సిఫార్సులు చేసేందుకు మెషీన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ఉపయోగపడుతున్నాయి. ఫేస్ ఫౌండేషన్ కొన్న వారు మస్కారాను కూడా కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది’ అని కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జాస్మిన్ గోహిల్ పేర్కొన్నారు.ఫీడ్ బ్యాక్, సందేహాలు, డెలివరీలోనూ...కస్టమర్ల ఫీడ్‌బ్యాక్, సందేహాలు, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ వంటి అన్ని దశల్లోనూ టెక్నాలజీ అక్కరకొస్తోంది. యూజర్ల సందేహాలను మరింత సమర్థవంతంగా విభజించి, విశ్లేషించేందుకు పెప్ బ్రాండ్స్ క్యాప్చర్ అనే ఏఐ ఆధారిత టూల్‌ను ఉపయోగిస్తోంది. అలాగే సెల్ఫ్ లెర్నింగ్ బ్యూటీ డిక్షనరీతో కూడిన సెర్చ్ ఇంజిన్‌ను పర్పుల్ అందుబాటులోకి తెచ్చింది. దీనిలోని జీపీటీ ఆధారిత టూల్ వల్ల యూజర్లు సెర్చ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా స్పెల్లింగ్ కరెక్ట్ చేయడం వంటివి చేస్తుంది. ఇక చాలా మందికి ఇంగ్లిష్‌లో తమ సందేహాలు చెప్పడం పెద్ద సమస్య. వారికోసం పర్పుల్ స్థానిక భాషలో సెర్చ్‌ను కూడా ప్రవేశపెట్టింది. యూజర్లకు వీలైనంత త్వరగా డెలివరీ చేసేందుకు సరైన వేర్‌హౌస్, రవాణా సంస్థలను ఎంచుకోవడంలోనూ స్టార్టప్‌లకు ఏఐ, ఎంఎల్ టూల్స్ తోడ్పడుతున్నాయి. 34 బిలియన్ డాలర్లు 2028 నాటికి భారత బ్యూటీ, పర్సనల్ కేర్ మార్కెట్ విలువ అంచనా. 25శాతంఆన్లైన్ ద్వారా సౌందర్య ఉత్పత్తుల అమ్మకాల వార్షిక వృద్ధి అంచనా (ఆఫ్‌లైన్ స్టోర్లలో 14 శాతమే).– సాక్షి, బిజినెస్‌డెస్క్ -
తమన్నా బ్యూటీ క్లినిక్‌లో సందడి చేసిన పేజ్–3 సెలబ్రిటీలు... (ఫొటోలు)
-
Geetha Madhuri Latest Photos: ‘లాఫ్లోర్’ క్లినిక్‌ని ప్రారంభించిన గీతా మాధురి (ఫొటోలు)
-
పెరాలసిస్‌తో వీల్ చైర్‌కు పరిమితమైనా..
పదే పదే కొట్టుకువచ్చే కష్టాల వరదను దాటుకుంటూ ఎదిగిన మహిళ ప్రజ్ఞావేదాంత్. ఒక చిన్నగదిలో బ్యూటీషియన్ గా జీవితం మొదలుపెట్టిన ఆమె, పదేళ్లక్రితం వరదల్లో తన సెలూన్, ఇల్లు కొట్టుకుపోవడంతో పెరాలసిస్ వచ్చి, వీల్ చైర్‌కు పరిమితం అయ్యింది. అయినా, కోలుకొని వీల్ చైర్ నుంచి తిరిగి జీవితం మొదలుపెట్టింది. ఇప్పటివరకు 35,000 మంది మహిళలకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇచ్చింది. డబ్బులేని మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ వారిని ఆర్థికంగా నిలబట్టింది. ప్రజ్ఞా వేదాంత వెస్ట్ ముంబైలో ప్రముఖ బ్యూటీ కన్సల్టెంట్. ములుంద్‌లో ఆమె పేరుతో బ్యూటీ అండ్ హెయిర్ అకాడమీ ఉంది. దాదాపు పదేళ్లుగా వేలాది మంది మహిళలకు ఆమె బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇస్తోంది. బ్యూటీ ప్రొడక్ట్స్‌తో ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రజ్ఞా వేదాంత్ ఒక అకాడమినీ నిర్వహించే స్థాయికి చేరుకోవడం, డాక్టరేట్ పొందడం అంత సులభం కాలేదు. చిన్న వయసులో పెళ్లి గుజరాత్లో పుట్టి పెరిగిన ప్రజ్ఞా స్కూల్ చదువు కొనసాగుతున్న సమయంలోనే పెళ్లి జరిగినా చదువాపలేదు. గుజరాత్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా తీసుకుంది. చిన్ననాటి నుంచి బ్యూటీషియన్ అవ్వాలన్న కలను నెరవేర్చుకోవడానికి ముంబయ్ చేరుకుంది. రెండు గదుల ఇంటిని అద్దెకు తీసుకొని, ఒక గదిని వంట చేసుకోవడానికి, మరొక గదిని సెలూన్‌గా మార్చుకుంది. అక్కడే చుట్టుపక్కల మహిళలకు థ్రెడింగ్, ట్రిమింగ్.. వంటివి చేయడం. మెహెందీ పెట్టడం వంటివి ప్రారంభించింది. దాంతో పాటే బ్యూటిషియన్, మెహెందీ క్లాసులు కూడా తీసుకునేది. ఈ పని చేయగా వచ్చిన డబ్బును పొదుపు చేసి, బ్యూటీషియన్లో ప్రొఫెషనల్ కోర్సులు తీసుకుంది. కోర్సు పూర్తయ్యాక సొంతంగా బ్యూటీపార్లర్‌ను ప్రారంభించింది. పదేళ్లు విజయవంతంగా బ్యూటీపార్లర్‌ను నడిపింది. జీవితాన్ని ముంచేసిన వరదలు 2005లో ముంబైలో విపరీతమైన వరద పోటెత్తింది. ఆ వరదల్లో ప్రజ్ఞా సెలూన్, ఇల్లు రెండూ కొట్టుకుపోయాయి. తను కలగన్న ప్రపంచం తలకిందులు అవ్వడంతో ప్రజ్ఞాకు పెరాలసిస్ వచ్చింది. ఆ సమయంలో కంటిచూపు కూడా మందగించింది. మూడు నెలలపాటు ఫిజియోథెరపీ చేయించుకుంది. కొద్ది కొద్దిగా కోలుకుంటూ వీల్‌చైర్ సాయంతో మరోసారి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పడి లేచిన కెరటం ప్రజ్ఞా వేదాంత్ బ్యూటీ అండ్ హెయిర్ అకాడమీ ఏర్పాటు చేసింది. బ్యూటీ కన్సల్టెంట్‌గా మహిళలకు బ్యూటీషియన్ కోర్సులు ఇవ్వడం ప్రారంభించింది. ఆమె కృషి, ధైర్యం, మనోబలం ఆమెను మరోసారి విజయవంతంగా నిలబెట్టాయి. ఈ పదేళ్లలో ఆమె తన అకాడమీలో 35,000 మంది మహిళలకు శిక్షణ ఇచ్చింది. ఈ కోర్సులు చేయడానికి ఎవరైనా మహిళలకు డబ్బు లేకపోతే, అలాంటి వారికి ఉచితంగా బ్యూటీషియన్ శిక్షణ ఇస్తోంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ దిగ్విజయంగా నడుపుతున్నందుకు యూనివర్శిటీ స్థాయి నుంచి గౌరవడాక్టరేట్ పొందింది. -
పార్లర్‌తో పనిలేదు
రోమాలు లేని మృదువైన చర్మం కోసం మగువలు ఎంతగానో తాపత్రయపడుతుంటారు. అందుకే నెలకోసారి ఐబ్రోస్ (కనుబొమ్మలు), అప్పర్ లిప్ (పై పెదవి), ఫోర్ హెడ్ (నుదురు), ఆర్మ్స్ అండ్ లెగ్స్ (కాళ్లు చేతులు) ఇలా బ్యూటీ పార్లర్స్‌కి వెళ్లి మరీ.. ఏదొకటి చేయించుకుంటూ ఉంటారు. త్రెడ్డింగ్ (దారంతో వెంట్రుకలను తొలగించడం), వ్యాక్సింగ్ (మైనం మిశ్రమాన్ని వెంట్రుకలున్న చర్మానికి రాసి లాగడం) ఇలా నచ్చిన పద్ధతిలో తమ అందాన్ని మెరుగులు పరచుకుంటూ ఉంటారు. కొందరు ఫేస్‌కి త్రెడ్డింగ్ చేయించుకుంటే..మరికొందరు టోటల్ బాడీ వ్యాక్సింగ్ చేయించుకుంటారు. అలాంటి వారికోసమే ఈ మినీ హెయిర్ రిమూవర్. దీనికి ఫుల్ చార్జింగ్ పెట్టుకుంటే చాలు. దీన్ని పెన్ ఓపెన్ చేసుకున్నట్లుగా ఓపెన్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. వెంట్రుకలు ఉన్న చోట గుండ్రంగా తిప్పుతూ ఉంటే వెంట్రుకలన్నీ లోతుకు తెగిపోతాయి. కనుబొమలను ముందుగా పెన్సిల్‌తో షేప్ హైలెట్ చేసుకుని, ఈ రిమూవర్‌తో జాగ్రత్తగా కనుబొమలను షేప్ చేసుకోవచ్చు. ఇక దీనితో అండర్ ఆర్మ్స్ తో సహా... అన్నీ ఈజీగా చేసుకోవచ్చు. ఈ రిమూవర్‌కి అతి సూక్ష్మమైన ఒక బ్లేడ్ అటాచ్ అయి ఉంటుంది. ఇది చర్మానికి ఎలాంటి హానీ చేయకుండా వెంట్రుకలను సుతారంగా కట్ చేస్తుంది. దీన్ని లిప్‌స్టిక్ లాగా హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకుని వెళ్లిపోవచ్చు. త్రెడ్డింగ్ లేదా వ్యాక్సింగ్ చేయిస్తే ఎలాంటి గ్రోయింగ్ ఉంటుందో.. ఈ రిమూవర్‌ని ఉపయోగించినప్పుడు కూడా అదే గ్రోయింగ్ ఉంటుంది. సో.. ఇది ఎలాంటి ఇబ్బందులకు కారణం కాదు. ఇదే మోడల్లో బ్యాటరీతో నడిచే రిమూవర్స్ కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. ఎక్కడైతే వెంట్రుకలు తొలగించాలో అక్కడ దీన్ని ఆన్ చేస్తే ఒక చిన్న లైట్(వెలుగు) వస్తుంది. (రిమూవర్‌కి మధ్యలో ఒక చిన్న లైట్ అమర్చి ఉంటుంది) దాంతో వెంట్రుకలు ఉన్న చోట మనకి చక్కగా కనిపిస్తుంది. వెంటనే ఈ రిమూవర్‌తో రబ్ చేసుకుంటే సరిపోతుంది. దీని ధర సుమారు 28 డాలర్ల(రూ. 2,000) వరకూ అమ్ముడుపోతున్నాయి. అయితే కొన్ని మరింత చౌక ధరల్లో కూడా లభిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఈ రిమూవర్ చక్కగా ఉపయోగపడుతుంది కదూ! -
అక్కడికెళితే అవమానాలే : ట్రాన్స్జెండర్లు
సాక్షి, న్యూఢిల్లీ: సమాజంలో తమకంటూ ఒక స్థానాన్ని, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ట్రాన్స్జెండర్లు అడుగులేస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకుని సెలూన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. తమకు అవసరమైన సేవలు ‘మామూలు’ బ్యూటీపార్లర్లు అందించడం లేదని ఆరోపిస్తున్నారు. ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా స్పా, బ్యూటీ సెంటర్లు ఏర్పాటుచేసుకుని దూసుకుపోతున్నారు. సగం ధరలకే సేవలు.. ‘నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం. బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన ప్రతీసారి అవమానాలు ఎదురయ్యేవి. అందుకే స్వయంగా నొయిడాలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకున్నాన’ని కాజల్ అనే ట్రాన్స్‌జెండర్, సెక్స్‌వర్కర్ తెలిపారు. తనలాగే ఇబ్బందులు పడుతున్న ట్రాన్స్జెండర్లకు ఇది ఎంతో ఉపయోగపడుతోందనీ, బయటితో పోల్చుకుంటే సగం ధరలకే ఇక్కడ సేవలందిస్తామమని ఆమె వెల్లడించారు. ఇక్కడే బ్యూటీకేర్ చేయించుకుంటున్న ఓ ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ.. పొద్దంతా కష్టపడినా పూట గడవదు. అందుకే ఈ వ్యభిచార కూపంలో చిక్కుకున్నా. తలెత్తుకుని జీవించేందుకు బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటున్నానని కనికా తెలిపారు. కాజల్ బ్యూటీపార్లర్ మా అందరికీ రిక్రియేషన్ సెంటర్‌గా కూడా ఉపయోగపడుతోందని తెలిపారు. రోజూ సాయంత్రం ఎంతో మంది ట్రాన్స్జెండర్లం ఇక్కడ కలులుసుకొని కష్టసుఖాలను పంచుకుంటామనీ, త్వరలోనే జీనత్ ప్రాతంలో బ్యూటీకేర్ సెంటర్ ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. ఆ పని చేయలేం.. బ్యూటీకేర్ అయితే ఓకే.. ట్రాన్స్జెండర్లకు ఒక ఎన్జీవో చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది. నొయిడాలోని ‘బసీరా సామాజిక్ సంస్థాన్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ రాంకాళీ మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధికి శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పిస్తామంటే.. వారు వెనకడుగేశారు. కానీ, బ్యూటీ సెలూన్ల ఏర్పాటుచేసుకోవడానికి మొగ్గు చూపారని ఆయన తెలిపారు. బ్యూటీకేర్ సెంటర్ల నిర్వహణలో మంచి ప్రావీణ్యం సంపాదిస్తున్న ట్రాన్స్జెండర్లు.. వారి అలంకరణ అవసరాలను తీర్చుకోవడంతో పాటు, రానున్న రోజుల్లో మహిళలకు కూడా తమ సేవల్ని అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఇల్లే బ్యూటీ క్లినిక్
బ్యూటిప్స్ ►మెటిమలు, నల్లమచ్చలు పోవాలంటే... ఒక స్పూను నిమ్మరసంలో అంతే మోతాదులో తేనె కలిపి ముఖానికి రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. పొడి చర్మం అయితే నిమ్మరసం బదులు కీరదోస రసం కలుపుకోవచ్చు. ►చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంటే... రాత్రి పడుకునే ముందు స్వచ్ఛమైన నెయ్యిని ముఖానికి రాయాలి. కోడిగుడ్డులోని పచ్చసొనను కూడా రాయవచ్చు. ఎగ్ ప్యాక్ ఆరిన తరవాత గోరువెచ్చటి నీటితో కడిగి ముఖానికి పన్నీరు అద్దాలి. ► మోచేతులు, మెడ, బాహుమూలల్లో నలుపు వదలాలంటే నిమ్మరసం లేదా కీరదోస రసం రాయాలి. కీరదోస ముక్కతో మసాజ్ చేసినట్లు రుద్దినా ఫలితం ఉంటుంది. సున్నితమైన చర్మానికి నిమ్మరసం రాస్తే మంటపుడుతుంది. కాబట్టి ముందుగా కొద్దిగా రాసి పరీక్షించుకోవాలి. నిమ్మరసం పడకపోతే కీరదోస వాడడమే మంచిది. ►వాతావరణంలో కాలుష్యం చర్మం మీద తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి బయటకు వెళ్లి వచ్చిన వెంటనే సబ్బుతో ముఖం కడుక్కుని తుడిచిన తర్వాత పన్నీటిని అద్దాలి. దూదిని పన్నీటిలో ముంచి అద్దితే, పన్నీరు ముఖమంతా సమంగా పడుతుంది.