అందానికి ఏఐ టచ్‌! | AI in the beauty industry boost cosmetics and self-care product sales | Sakshi
Sakshi News home page

అందానికి ఏఐ టచ్‌!

Published Thu, Jan 16 2025 4:58 AM | Last Updated on Thu, Jan 16 2025 7:58 AM

AI in the beauty industry boost cosmetics and self-care product sales

టెక్నాలజీతో రియల్‌ టైమ్‌ ఎక్స్‌పీరియన్స్‌ 

చర్మ స్వభావాన్ని విశ్లేషించేందుకు ఆన్‌లైన్‌ టూల్స్‌ 

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ తోడు... 

తదనుగుణంగా సౌందర్య ఉత్పత్తుల సిఫార్సు 

బ్యూటీ స్టార్టప్‌లతో పాటు పెద్ద కంపెనీలదీ ఇదే రూటు...

షుగర్‌ కాస్మెటిక్స్, మామాఎర్త్, ప్లమ్, పర్పుల్, నైకా జోరు

రమ్య తన పొడి చర్మానికి తగిన సౌందర్య ఉత్పత్తుల కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతోంది. ఒక కంపెనీ వెబ్‌సైట్‌లోని టూల్‌ ఆకట్టుకుంది. రకరకాల యాంగిల్స్‌లో సెల్ఫిలను క్యాప్చర్‌ చేసి పంపింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో ఆమె ముఖాన్ని విశ్లేషించి తగిన ప్రోడక్టులను సిఫార్సు చేయడం.. వాటిని కొనుగోలు చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ కాస్మెటిక్స్‌ బాగా పనిచేయడంతో చాన్నాళ్లుగా వెంటాడుతున్న తన సమస్యకు పరిష్కారం లభించింది. సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ (బీపీసీ) రంగంలో టెక్నాలజీ కొత్త పుంతలకు ఇది ఓ మచ్చుతునక మాత్రమే!

బ్యూటీ, పర్సనల్‌ కేర్‌ రంగంలో ఇప్పుడు హైపర్‌ పర్సనలైజేషన్‌ గేమ్‌ చేంజర్‌గా మారుతోంది. చర్మ స్వభావానికి అనుగుణంగా వ్యక్తిగత ప్రొడక్టుల వాడకానికి డిమాండ్‌ జోరందుకోవడంతో కంపెనీలు ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ ఇతరత్రా అధునాతన టెక్నాలజీల బాట పడుతున్నాయి. ఏఐతో అందానికి వన్నెలద్దుతున్నాయి. వినియోగదారులకు కూడా ఈ రియల్‌ టైమ్‌ ఎక్స్‌పీరియన్స్‌ తెగ నచ్చేస్తుండటంతో పాటు మంచి ఫలితాలు కూడా ఇస్తున్నాయి. 

దీంతో బ్యూటీ బ్రాండ్స్‌లో స్టార్టప్‌లు మొదలు.. ఇప్పటికే బాగా పాతుకుపోయిన పెద్ద కంపెనీలు సైతం ఏఐ మంత్రాన్ని జపిస్తున్నాయి. ఎవరైనా సరే తమ సెల్ఫిలను తీసి పంపితే చాలు.. ఏఐ మోడల్‌ వాటిని ప్రాసెస్‌ చేసి, అత్యంత నిశితమైన సమస్యలను సైతం గుర్తిస్తుంది. చర్మం రకం, మొటిమలు, నలుపు మచ్చలు, రంగు మారడం, పొడిబారడం, ఎగుడుదిగుడు చర్మం, ముడతలు, గుంతలను గుర్తించి, రియల్‌ టైమ్‌లో వ్యక్తిగతంగా సరైన సిఫార్సులు అందిస్తుంది.

డేటా ఎనలిటిక్స్‌ దన్ను... 
బ్యూటీ స్టార్టప్‌లు గత రెండు మూడేళ్లుగా వినియోగదారుల నుంచి పెద్ద మొత్తంలో సేకరించిన డేటా ఆధారంగా ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్‌డేట్‌ చేసుకోగలుగుతున్నాయి. వేలాది మంది వ్యక్తిగత డేటాలోని అంశాలను విశ్లేషించి యూజర్లను పొడి చర్మం, పిగ్మెంటెడ్‌ స్కిన్, మొటిమలు, జిడ్డు చర్మం వంటి వివిధ విభాగాలుగా విభజిస్తున్నాయి. ఆపై ఏఐ టెక్నాలజీ పని మొదలుపెడుతుంది.

 వినియోగదారులు పంపించే తాజా ఫేస్‌ ఇమేజ్‌లను ఇప్పటికే గుర్తించి, విభజించిన లక్షణాల ఆధారంగా సరిపోల్చడం ద్వారా వారి చర్మ స్వభావాన్ని అంచనా వేస్తుంది. ఈ ప్రక్రియతో బ్యూటీ కంపెనీలు ఒక్క చర్మాన్ని మాత్రమే కాకుండా పెదాలు, శిరోజాలను కూడా విశ్లేషించి, తదనుగుణంగా ఉత్పత్తులను సూచిస్తున్నాయి. ఉదాహరణకు, ట్రాయా, రావెల్‌ వంటి హెయిర్‌ కేర్‌ స్టార్టప్‌లు క్విక్‌ ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించి, మెషీన్‌ లెరి్నంగ్‌ ద్వారా ఎవరికి ఎలాంటి పదార్థాలతో కూడిన ప్రొడక్టు అవసరమనేది కొద్ది నిమిషాల్లోనే సిఫార్పు చేస్తుండడం విశేషం!

స్మార్ట్‌ టూల్స్‌..
ఆన్‌లైన్‌ బ్యూటీ స్టోర్‌ పర్పుల్‌.. సొంతంగా పర్పుల్‌ స్కిన్‌ ఎనలైజర్‌ అనే ఏఐ ఇమేజ్‌ రికగి్నషన్‌ టూల్‌ను అభివృద్ధి చేసింది. ఇది యూజర్ల చర్మాన్ని రియల్‌ టైమ్‌లో విశ్లేషిస్తుంది. ఆపై దీని స్మార్ట్‌ కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ (సీఆర్‌ఎం) టూల్‌ మెషీన్‌ లెర్నింగ్‌ను ఉపయోగించి హైపర్‌ పర్సనలైజ్డ్‌ ఉత్పత్తులను సిఫార్సు చేస్తుందని సంస్థ ఇంజినీరింగ్‌ హెడ్‌ వివేక్‌ పరిహార్‌ చెబుతున్నారు. ఇక లోరియల్‌ ప్రొడక్టులను విక్రయించే నైకా కూడా అధునాతన ఏఐ ఆధారిత వర్చువల్‌ టెక్నాలజీ ‘మోడిఫేస్‌’ను ఉపయోస్తోంది. 

వినియోగదారులు ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌) అనుభవం ద్వారా తమకు సరిపడే ప్రొడక్టులను ఎంచుకునే అవకాశం ఇది కల్పిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ దాదాపు 88 శాతం ఖచ్చితత్వంతో ఫేస్‌ ఆకారం, స్కిన్‌ టోన్, శిరోజాల రంగుతో సహా అనేక అంశాలను గుర్తించగలదు. అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ ఫీచర్లు కస్టమర్లతో మరింతగా అనుసంధానమయ్యేందుకు, వారికి మరింత ప్రభావవంతమైన, ఆహ్లాదకరమైన షాపింగ్‌ అనుభవాన్ని అందించేందుకు దోహదం చేస్తున్నాయని బ్యూటీ స్టార్టప్‌ షుగర్‌ కాస్మెటిక్స్‌ సీఈఓ వినీతా సింగ్‌ పేర్కొన్నారు. ‘యూజర్ల కొనుగోలు హిస్టరీ ఆధారంగా సిఫార్సులు చేసేందుకు మెషీన్‌ లెర్నింగ్‌ ఆల్గోరిథమ్స్‌ ఉపయోగపడుతున్నాయి. ఫేస్‌ ఫౌండేషన్‌ కొన్న వారు మస్కారాను కూడా కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది’ అని  కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ జాస్మిన్‌ గోహిల్‌ పేర్కొన్నారు.

ఫీడ్‌ బ్యాక్, సందేహాలు, డెలివరీలోనూ...
కస్టమర్ల ఫీడ్‌బ్యాక్, సందేహాలు, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్‌ వంటి అన్ని దశల్లోనూ టెక్నాలజీ అక్కరకొస్తోంది. యూజర్ల సందేహాలను మరింత సమర్థవంతంగా విభజించి, విశ్లేషించేందుకు పెప్‌ బ్రాండ్స్‌ క్యాప్చర్‌ అనే ఏఐ ఆధారిత టూల్‌ను ఉపయోగిస్తోంది. అలాగే సెల్ఫ్‌ లెర్నింగ్‌ బ్యూటీ డిక్షనరీతో కూడిన సెర్చ్‌ ఇంజిన్‌ను పర్పుల్‌ అందుబాటులోకి తెచ్చింది. దీనిలోని జీపీటీ ఆధారిత టూల్‌ వల్ల యూజర్లు సెర్చ్‌ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా స్పెల్లింగ్‌ కరెక్ట్‌ చేయడం వంటివి చేస్తుంది. ఇక చాలా మందికి ఇంగ్లిష్‌లో తమ సందేహాలు చెప్పడం పెద్ద సమస్య. వారికోసం పర్పుల్‌ స్థానిక భాషలో సెర్చ్‌ను కూడా ప్రవేశపెట్టింది. యూజర్లకు వీలైనంత త్వరగా డెలివరీ చేసేందుకు సరైన వేర్‌హౌస్, రవాణా సంస్థలను ఎంచుకోవడంలోనూ  స్టార్టప్‌లకు ఏఐ, ఎంఎల్‌ టూల్స్‌ తోడ్పడుతున్నాయి.  

34 బిలియన్‌ డాలర్లు 
2028 నాటికి భారత బ్యూటీ, పర్సనల్‌ కేర్‌ మార్కెట్‌ విలువ అంచనా. 

25శాతం
ఆన్‌లైన్‌ ద్వారా సౌందర్య ఉత్పత్తుల అమ్మకాల వార్షిక వృద్ధి అంచనా (ఆఫ్‌లైన్‌ స్టోర్లలో 14 శాతమే).

– సాక్షి, బిజినెస్‌డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement