Personal Care Business
-
అందానికి ఏఐ టచ్!
రమ్య తన పొడి చర్మానికి తగిన సౌందర్య ఉత్పత్తుల కోసం ఆన్లైన్లో వెతుకుతోంది. ఒక కంపెనీ వెబ్‌సైట్‌లోని టూల్ ఆకట్టుకుంది. రకరకాల యాంగిల్స్‌లో సెల్ఫిలను క్యాప్చర్ చేసి పంపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఆమె ముఖాన్ని విశ్లేషించి తగిన ప్రోడక్టులను సిఫార్సు చేయడం.. వాటిని కొనుగోలు చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ కాస్మెటిక్స్ బాగా పనిచేయడంతో చాన్నాళ్లుగా వెంటాడుతున్న తన సమస్యకు పరిష్కారం లభించింది. సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ (బీపీసీ) రంగంలో టెక్నాలజీ కొత్త పుంతలకు ఇది ఓ మచ్చుతునక మాత్రమే!బ్యూటీ, పర్సనల్ కేర్ రంగంలో ఇప్పుడు హైపర్ పర్సనలైజేషన్ గేమ్ చేంజర్‌గా మారుతోంది. చర్మ స్వభావానికి అనుగుణంగా వ్యక్తిగత ప్రొడక్టుల వాడకానికి డిమాండ్ జోరందుకోవడంతో కంపెనీలు ఏఐ, మెషీన్ లెర్నింగ్ ఇతరత్రా అధునాతన టెక్నాలజీల బాట పడుతున్నాయి. ఏఐతో అందానికి వన్నెలద్దుతున్నాయి. వినియోగదారులకు కూడా ఈ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తెగ నచ్చేస్తుండటంతో పాటు మంచి ఫలితాలు కూడా ఇస్తున్నాయి. దీంతో బ్యూటీ బ్రాండ్స్‌లో స్టార్టప్‌లు మొదలు.. ఇప్పటికే బాగా పాతుకుపోయిన పెద్ద కంపెనీలు సైతం ఏఐ మంత్రాన్ని జపిస్తున్నాయి. ఎవరైనా సరే తమ సెల్ఫిలను తీసి పంపితే చాలు.. ఏఐ మోడల్ వాటిని ప్రాసెస్ చేసి, అత్యంత నిశితమైన సమస్యలను సైతం గుర్తిస్తుంది. చర్మం రకం, మొటిమలు, నలుపు మచ్చలు, రంగు మారడం, పొడిబారడం, ఎగుడుదిగుడు చర్మం, ముడతలు, గుంతలను గుర్తించి, రియల్ టైమ్‌లో వ్యక్తిగతంగా సరైన సిఫార్సులు అందిస్తుంది.డేటా ఎనలిటిక్స్ దన్ను... బ్యూటీ స్టార్టప్‌లు గత రెండు మూడేళ్లుగా వినియోగదారుల నుంచి పెద్ద మొత్తంలో సేకరించిన డేటా ఆధారంగా ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకోగలుగుతున్నాయి. వేలాది మంది వ్యక్తిగత డేటాలోని అంశాలను విశ్లేషించి యూజర్లను పొడి చర్మం, పిగ్మెంటెడ్ స్కిన్, మొటిమలు, జిడ్డు చర్మం వంటి వివిధ విభాగాలుగా విభజిస్తున్నాయి. ఆపై ఏఐ టెక్నాలజీ పని మొదలుపెడుతుంది. వినియోగదారులు పంపించే తాజా ఫేస్ ఇమేజ్‌లను ఇప్పటికే గుర్తించి, విభజించిన లక్షణాల ఆధారంగా సరిపోల్చడం ద్వారా వారి చర్మ స్వభావాన్ని అంచనా వేస్తుంది. ఈ ప్రక్రియతో బ్యూటీ కంపెనీలు ఒక్క చర్మాన్ని మాత్రమే కాకుండా పెదాలు, శిరోజాలను కూడా విశ్లేషించి, తదనుగుణంగా ఉత్పత్తులను సూచిస్తున్నాయి. ఉదాహరణకు, ట్రాయా, రావెల్ వంటి హెయిర్ కేర్ స్టార్టప్‌లు క్విక్ ఆన్లైన్ సర్వే నిర్వహించి, మెషీన్ లెరి్నంగ్ ద్వారా ఎవరికి ఎలాంటి పదార్థాలతో కూడిన ప్రొడక్టు అవసరమనేది కొద్ది నిమిషాల్లోనే సిఫార్పు చేస్తుండడం విశేషం!స్మార్ట్ టూల్స్..ఆన్లైన్ బ్యూటీ స్టోర్ పర్పుల్.. సొంతంగా పర్పుల్ స్కిన్ ఎనలైజర్ అనే ఏఐ ఇమేజ్ రికగి్నషన్ టూల్‌ను అభివృద్ధి చేసింది. ఇది యూజర్ల చర్మాన్ని రియల్ టైమ్‌లో విశ్లేషిస్తుంది. ఆపై దీని స్మార్ట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం) టూల్ మెషీన్ లెర్నింగ్‌ను ఉపయోగించి హైపర్ పర్సనలైజ్డ్ ఉత్పత్తులను సిఫార్సు చేస్తుందని సంస్థ ఇంజినీరింగ్ హెడ్ వివేక్ పరిహార్ చెబుతున్నారు. ఇక లోరియల్ ప్రొడక్టులను విక్రయించే నైకా కూడా అధునాతన ఏఐ ఆధారిత వర్చువల్ టెక్నాలజీ ‘మోడిఫేస్’ను ఉపయోస్తోంది. వినియోగదారులు ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) అనుభవం ద్వారా తమకు సరిపడే ప్రొడక్టులను ఎంచుకునే అవకాశం ఇది కల్పిస్తుంది. ఈ సాఫ్ట్వేర్ దాదాపు 88 శాతం ఖచ్చితత్వంతో ఫేస్ ఆకారం, స్కిన్ టోన్, శిరోజాల రంగుతో సహా అనేక అంశాలను గుర్తించగలదు. అడ్వాన్స్డ్ డిజిటల్ ఫీచర్లు కస్టమర్లతో మరింతగా అనుసంధానమయ్యేందుకు, వారికి మరింత ప్రభావవంతమైన, ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు దోహదం చేస్తున్నాయని బ్యూటీ స్టార్టప్ షుగర్ కాస్మెటిక్స్ సీఈఓ వినీతా సింగ్ పేర్కొన్నారు. ‘యూజర్ల కొనుగోలు హిస్టరీ ఆధారంగా సిఫార్సులు చేసేందుకు మెషీన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ఉపయోగపడుతున్నాయి. ఫేస్ ఫౌండేషన్ కొన్న వారు మస్కారాను కూడా కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది’ అని కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జాస్మిన్ గోహిల్ పేర్కొన్నారు.ఫీడ్ బ్యాక్, సందేహాలు, డెలివరీలోనూ...కస్టమర్ల ఫీడ్‌బ్యాక్, సందేహాలు, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ వంటి అన్ని దశల్లోనూ టెక్నాలజీ అక్కరకొస్తోంది. యూజర్ల సందేహాలను మరింత సమర్థవంతంగా విభజించి, విశ్లేషించేందుకు పెప్ బ్రాండ్స్ క్యాప్చర్ అనే ఏఐ ఆధారిత టూల్‌ను ఉపయోగిస్తోంది. అలాగే సెల్ఫ్ లెర్నింగ్ బ్యూటీ డిక్షనరీతో కూడిన సెర్చ్ ఇంజిన్‌ను పర్పుల్ అందుబాటులోకి తెచ్చింది. దీనిలోని జీపీటీ ఆధారిత టూల్ వల్ల యూజర్లు సెర్చ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా స్పెల్లింగ్ కరెక్ట్ చేయడం వంటివి చేస్తుంది. ఇక చాలా మందికి ఇంగ్లిష్‌లో తమ సందేహాలు చెప్పడం పెద్ద సమస్య. వారికోసం పర్పుల్ స్థానిక భాషలో సెర్చ్‌ను కూడా ప్రవేశపెట్టింది. యూజర్లకు వీలైనంత త్వరగా డెలివరీ చేసేందుకు సరైన వేర్‌హౌస్, రవాణా సంస్థలను ఎంచుకోవడంలోనూ స్టార్టప్‌లకు ఏఐ, ఎంఎల్ టూల్స్ తోడ్పడుతున్నాయి. 34 బిలియన్ డాలర్లు 2028 నాటికి భారత బ్యూటీ, పర్సనల్ కేర్ మార్కెట్ విలువ అంచనా. 25శాతంఆన్లైన్ ద్వారా సౌందర్య ఉత్పత్తుల అమ్మకాల వార్షిక వృద్ధి అంచనా (ఆఫ్‌లైన్ స్టోర్లలో 14 శాతమే).– సాక్షి, బిజినెస్‌డెస్క్ -
రిలయన్స్ రిటైల్ చేతికి అరవింద్ బ్యూటీ బ్రాండ్స్
న్యూఢిల్లీ: వేగంగా వృద్ధి చెందుతున్న సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల (బీపీసీ) వ్యాపార కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అరవింద్ ఫ్యాషన్‌కి చెందిన అరవింద్ బ్యూటీ బ్రాండ్స్ రిటైల్‌ను కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఆర్ఆర్వీఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్‌తో షేర్ల కొనుగోలు ఒప్పందం (ఎస్పీఏ) కుదిరినట్లు అరవింద్ ఫ్యాషన్ వెల్లడించింది. ఈక్విటీ వాటా విక్రయ విలువ రూ. 99.02 కోట్లుగా ఉండనున్నట్లు పేర్కొంది. చెల్లించాల్సిన రుణాలు, ఈక్విటీ అంతా కలిపి సంస్థ మొత్తం విలువను రూ. 216 కోట్లుగా లెక్కగట్టినట్లు వివరించింది. డీల్‌లో భాగంగా అరవింద్ ఫ్యాషన్స్ నిర్వహిస్తున్న ఫ్రాన్స్ బ్యూటీ రిటైల్ బ్రాండ్ సెఫోరాకు భారత్‌లో ఉన్న 26 స్టోర్స్ కూడా ఆర్‌ఆర్‌వీఎల్‌కు దక్కుతాయి. ఇకపై తాము పూర్తిగా ఫ్యాషన్ (యూఎస్ పోలో, యారో మొదలైన 5 బ్రాండ్స్) పైనే దృష్టి పెట్టనున్నట్లు అరవింద్ ఫ్యాషన్స్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో అరవింద్ బ్యూటీ బ్రాండ్స్ రిటైల్ టర్నోవరు రూ. 336.70 కోట్లుగా నమోదైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌లోని రిటైల్ కంపెనీలన్నింటికీ ఆర్ఆర్వీఎల్ హోల్డింగ్ సంస్థగా ఉంది. బ్యూటీ రిటైల్ ప్లాట్‌ఫాం ’టిరా’ కొనుగోలుతో సౌందర్య సాధనాల వ్యాపారంలోకి ప్రవేశించింది. నైకా, టాటా, హిందుస్తాన్ యూనిలీవర్‌కి చెందిన లాక్మే మొదలైన దిగ్గజ బ్రాండ్స్‌తో పోటీపడుతోంది. రెడ్‌సీర్ స్ట్రాటెజీ కన్సల్టెంట్, పీక్ 15 సంయుక్త నివేదిక ప్రకారం 2022లో 19 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల మార్కెట్ 2027 నాటికి 30 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా కొత్త అవతారం!
న్యూఢిల్లీ: ఇతర బాలీవుడ్ తారల బాటలో పరిణీతి చోప్రా సైతం అడుగులు వేస్తున్నారు. తాజాగా వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్ క్లెన్స్టాలో ఇన్వెస్ట్ చేశారు. సోషల్ మీడియా యాప్ ఇన్‌స్ట్రాగామ్ ద్వారా ఈ అంశాన్ని పేర్కొన్నప్పటికీ పెట్టుబడి వివరాలు వెల్లడించలేదు. వెరసి బ్యూటీలో 82ఈ, క్లాతింగ్‌లో ఎడ్ ఏ మమ్మా, మేకప్ విభాగంలో కే బ్యూటీ బ్రాండ్ల ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకున్న దీపికా పదుకొణే, అలియా భట్, కత్రినా కైఫ్ బాటలో పరిణీతి చోప్రా సాగుతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. 2016లో పునీత్ గుప్తా ప్రారంభించిన డీటూసీ స్టార్టప్ క్లెన్స్టా.. వాటర్‌లెస్ పర్సనల్ హైజీన్ ప్రొడక్టును తయారు చేస్తోంది. ఇతరులెవరూ రూపొందించని ప్రొడక్టును తయారు చేస్తున్న క్లెన్స్టా బ్రాండులో ఇన్వెస్టర్‌గా, భాగస్వామిగా చేరినందుకు ఉత్సాహపడుతున్నట్లు ఈ సందర్భంగా ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో పరిణీతి చోప్రా పేర్కొన్నారు. -
సౌందర్య సంరక్షణ విభాగంలోకి రిలయన్స్ రిటైల్
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ తాజాగా సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించింది. టిరా పేరిట రిటైల్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. యాప్, వెబ్‌సైట్‌తో పాటు ముంబైలో తొలి టిరా రిటైల్ స్టోర్‌ను కూడా ప్రారంభించింది. 100 పైచిలుకు నగరాల్లో వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ బ్రాండ్‌తో రిలయన్స్ ఇకపై హెచ్‌యూఎల్, నైకా, టాటా, ఎల్వీఎంహెచ్ మొదలైన దిగ్గజాలతో పోటీపడనుందని పేర్కొన్నాయి. అన్ని వర్గాల వినియోగదారులకు మెరుగైన అంతర్జాతీయ, దేశీయ సౌందర్య సంరక్షణ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు టిరా ఉపయోగపడగలదని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఈడీ ఈషా అంబానీ తెలిపారు. ఆన్లైన్ మార్కెట్ డేటా రీసెర్చ్ సంస్థ స్టాటిస్టా ప్రకారం దేశీయంగా బ్యూటీ, పర్సనల్ కేర్ మార్కెట్ 2023లో 27.23 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. ఇందులో 12.7 శాతం వాటా ఆన్లైన్ అమ్మకాల ద్వారా రానుంది. -
పర్సనల్ కేర్ ఉత్పత్తుల్లోకి రిలయన్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో వేగంగా విస్తరిస్తున్న రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్సీపీఎల్) తాజాగా గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను ఆవిష్కరించింది. గ్లిమర్ బ్యూటీ సోప్‌లు, ప్యూరిక్ హైజీన్ సబ్బులు, డోజో డిష్ వాష్ లిక్విడ్లు, హోమ్‌గార్డ్ టాయిలెట్.. ఫ్లోర్ క్లీనర్లు మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఈ ఉత్పత్తులతో ఆయా విభాగాల్లో దిగ్గజాలైన హెచ్‌యూఎల్, పీ అండ్ జీ, రెకిట్ మొదలైన వాటితో రిలయన్స్ పోటీపడనుంది. నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందించాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా వీటిని ఆవిష్కరించినట్లు ఆర్సీపీఎల్ ప్రతినిధి తెలిపారు. -
విప్రో కన్సూమర్ చేతికి స్లా్పష్ కార్పొరేషన్
బెంగళూరు: విప్రో కన్సూమర్ కేర్(డబ్ల్యూసీసీ) కంపెనీ, ఫిలిప్పైన్స్కు చెందిన పర్సనల్ కేర్ సంస్థ, స్లా్పష్ కార్పొరేషన్‌ను కొనుగోలు చేయనున్నది. ఈ మేరకు ఒక నిశ్చయాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని విప్రో కన్సూమర్ కేర్ వెల్లడించింది. తమ కంపెనీ కొనుగోలు చేస్తున్న 11వ కంపెనీ ఇదని డబ్ల్యూసీసీ సీఈఓ వినీత్ అగర్వాల్ పేర్కొన్నారు. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఆయన వెల్లడించలేదు. స్లా్పష్ కార్పొరేషన్ మధ్య ఆసియా దేశాలతో పాటు థాయ్‌ల్యాండ్, మలేసియా, హాంకాంగ్, వియత్నాం, నైజీరియా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని అగర్వాల్ తెలిపారు. ఆసియాలోనే మూడో అతి పెద్ద పర్సనల్ కేర్ సంస్థగా అవతరించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ కంపెనీని కొనుగోలు చేస్తున్నామని వివరించారు. ఈ కంపెనీ కొనుగోలుతో ఫిలిప్పైన్స్ దేశంలో పర్సనల్ కేర్ విభాగంలో అగ్రస్థాయి కంపెనీగా అవతరిస్తామని పేర్కొన్నారు. స్లా్పష్ కంపెనీ ఆదాయం 8 కోట్ల డాలర్లని తెలిపారు. -
బ్యూటీ వ్యాపారంలోకి అరవింద్
ముంబై: ప్రముఖ టెక్స్టైల్స్ కంపెనీ అరవింద్ బ్యూటీ, పర్సనల్ కేర్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. దీని కోసం ఫ్రాన్స్‌కు చెందిన బ్యూటీ రిటైల ర్ సెఫోరాతో జతకట్టింది. ఇకపై భారత్‌లో సెఫోరా కార్యకలాపాలను అరవింద్ నిర్వహిస్తుంది. బ్యూటీ, పర్సనల్ కేర్ మార్కెట్ రూ.15,000 కోట్లుగా ఉందని, అందులో ప్రీమియం మార్కెట్ విలువ రూ.2,500 కోట్లుగా ఉందని అరవింద్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ జె.సురేశ్ తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో సెఫోరా టర్నోవర్ రూ.500 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఇదే సమయంలో 15 పట్టణాల్లో 40-45 వరకు కొత్త సెఫోరా స్టోర్లను ప్రారంభిస్తామని తెలిపారు. కాగా ప్రస్తుతం డీఎల్ ఎఫ్ ఆధ్వర్యంలో ఉన్న నాలుగు సెఫోరా స్టోర్ల నిర్వహణను ఇకపై అరవింద్ చూసుకోనుంది.