న్యూఢిల్లీ: వేగంగా వృద్ధి చెందుతున్న సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల (బీపీసీ) వ్యాపార కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌వీఎల్) దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అరవింద్ ఫ్యాషన్‌కి చెందిన అరవింద్ బ్యూటీ బ్రాండ్స్ రిటైల్‌ను కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఆర్‌ఆర్‌వీఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్‌తో షేర్ల కొనుగోలు ఒప్పందం (ఎస్‌పీఏ) కుదిరినట్లు అరవింద్ ఫ్యాషన్ వెల్లడించింది.
ఈక్విటీ వాటా విక్రయ విలువ రూ. 99.02 కోట్లుగా ఉండనున్నట్లు పేర్కొంది. చెల్లించాల్సిన రుణాలు, ఈక్విటీ అంతా కలిపి సంస్థ మొత్తం విలువను రూ. 216 కోట్లుగా లెక్కగట్టినట్లు వివరించింది. డీల్‌లో భాగంగా అరవింద్ ఫ్యాషన్స్ నిర్వహిస్తున్న ఫ్రాన్స్ బ్యూటీ రిటైల్ బ్రాండ్ సెఫోరాకు భారత్‌లో ఉన్న 26 స్టోర్స్ కూడా ఆర్‌ఆర్‌వీఎల్‌కు దక్కుతాయి. ఇకపై తాము పూర్తిగా ఫ్యాషన్ (యూఎస్ పోలో, యారో మొదలైన 5 బ్రాండ్స్) పైనే దృష్టి పెట్టనున్నట్లు అరవింద్ ఫ్యాషన్స్ తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరంలో అరవింద్ బ్యూటీ బ్రాండ్స్ రిటైల్ టర్నోవరు రూ. 336.70 కోట్లుగా నమోదైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌లోని రిటైల్ కంపెనీలన్నింటికీ ఆర్‌ఆర్‌వీఎల్ హోల్డింగ్ సంస్థగా ఉంది. బ్యూటీ రిటైల్ ప్లాట్‌ఫాం ’టిరా’ కొనుగోలుతో సౌందర్య సాధనాల వ్యాపారంలోకి ప్రవేశించింది. నైకా, టాటా, హిందుస్తాన్ యూనిలీవర్‌కి చెందిన లాక్మే మొదలైన దిగ్గజ బ్రాండ్స్‌తో పోటీపడుతోంది. రెడ్‌సీర్ స్ట్రాటెజీ కన్సల్టెంట్, పీక్ 15 సంయుక్త నివేదిక ప్రకారం 2022లో 19 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల మార్కెట్ 2027 నాటికి 30 బిలియన్ డాలర్లకు చేరనుంది.
Comments
Please login to add a commentAdd a comment