cosmetics
-
కోటి రూపాయల జాబ్ వదిలేసి, రూ. 300 కోట్ల కంపెనీ: వినీతా సక్సెస్ స్టోరీ
సొంతంగా వ్యాపారం చేయాలన్న సాహసోపేత నిర్ణయం తీసుకోవడం మాత్రమే కాదు వ్యాపారంలో రాణిస్తున్న మహిళా వ్యాపార వేత్తలు చాలామందే ఉన్నారు. అలాంటి సక్సెస్ ఫుల్బిజినెస్ విమెన్‌లో ఒకరు వినీతా సింగ్. కోటి రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని రిజెక్ట్ చేసి మరీ ఆమె బవ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇపుడు కోట్లాది రూపాయల టర్నోవర్ ఉన్న వ్యాపార సామ్రజ్యానికి సారధి ఆమె. కృషి, సంకల్ప ఉంటే.. కలలు సాకారం కష్టమేమీ కాదని నిరూపించిన షుగర్ కాస్మటిక్స్ సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ వినీతా సింగ్ స్ఫూర్తిదాయక కథ గురించి తెలుసు కుందాం! ఉద్యోగం కోసం ఒకరి దగ్గర పనిచేయడం కాదు...తానే యజమానికిగా పదిమందికి ఉపాధి కల్పించాలని భావించింది వినీతా సింగ్. ఆలోచన వచ్చింది మొదలు క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది. మహిళల చర్మ సౌందర్యానికి సంబంధించి స్వదేశీ బ్రాండ్ షుగర్ కాస్మొటిక్స్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చింది. తనదైన మార్కు వేసి 300 కోట్ల రూపాయల టర్నోవర్‌తో దూసుకుపోతుంది. తనలాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ముఖ్యంగా షార్క్ ట్యాంక్ ఇండియా టీవీ షో ద్వారా వ్యాపారవేత్తగా మరింత పాపులర్ అయింది. అంతేకాదు ఈ షో ద్వారా వినీతా సింగ్ అనేక వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించి విశేషంగా నిలిచారు. ఎవరీ వినీతా సింగ్ వినీత ఐఐటీ మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఐఐఎం అహ్మదాబాద్‌లో తన బిజినెస్ స్టడీస్‌ని కొనసాగించింది. 2005లో అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి MBA పట్టభద్రురాలైంది.లండన్, న్యూయార్క్‌లోని డ్యుయిష్ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్ కూడా చేసింది. ఆమె ఇంటర్న్‌షిప్ సమయంలో, క్యాంపస్ సెలక్షన్స్‌లో కోటి రూపాయల వేతనంతో ఒక ఆఫర్ లభించింది. కానీ వ్యాపారంలో రాణించాలన్న కోరికతో ఉద్యోగంలోని చేరేందుకు సుముఖత చూపించలేదు. వినీత స్వంతంగా ఓ స్టార్టప్‌ను ఏర్పాటు చేయాలని భావించింది. అలా స్నేహితుడు కౌశిక్‌తో కలిసి బ్యూటీ సబ్స్క్రిప్షన్ కంపెనీలను ప్రారంభించింది. అవిపెద్దగా సక్సెస్ కాలేదు. అయినా నిరాశపడలేదు. దేశంలో కాస్మోటిక్స్ బ్రాండ్లు పెద్దగా లేని నేపథ్యంలో మేకప్ బ్రాండ్ సృష్టించాలనే ఆలోచన వచ్చింది. అలా 2015లో డైరెక్ట్-టు-కన్స్యూమర్ మేకప్ బ్రాండ్‌గా కౌశిక్‌తో కలిసి షుగర్ కాస్మెటిక్స్ కంపెనీని ప్రారంభించింది. భారతీయులకోసం ప్రత్యేకంగా ఇండియన్ స్కిన్ టోన్ల కోసం స్వదేశీ మేకప్ ఉత్పత్తులను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2019లో ఉత్తరప్రదేశ్‌లో, తొలి స్టోర్ తెరిచింది. 20-35 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలను లక్ష్యంగా చేసుకుని, సోషల్ మీడియాలో బాగా ప్రచారం నిర్వహించి సక్సెస్ అయింది. ఎంబీఏ చదువుతున్న సమయంలో ప్రేమలో పడిన వినీతా సింగ్ ప్రియుడు కౌశిక్ ముఖర్జీరి 2011లో పెళ్లి చేసుకుంది. కౌశిక్ షుగర్ కాస్మెటిక్స్ కంపెనీకి సీవోవో, కో ఫౌండర్‌గా ఉన్నారు. దంపతులుగానే కాదు, వ్యాపారవేత్తలుగా ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించు కున్నారు. ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. 2023 ఆర్థిక సంవత్సరానికి గాను షుగర్ కాస్మెటిక్స్ ఆదాయం సంవత్సరానికి 89 శాతం పెరిగి రూ. 420 కోట్లకు చేరుకుంది. నికర నష్టం దాదాపు రూ.76 కోట్లుగా ఉంది. మహిళా వ్యాపారవేత్తగా రాణించడం అంత సులువు కాదు అంటారామె. ఒక దశలో ఒక ఇన్వెస్టర్ నన్ను కలవడానికి కూడా ఇష్టపడలేదు. పురుషు వ్యాపారవేత్తల్నే కలవానేది అతని లక్ష్యం కానీ ఈ రోజు తన కంపెనీ బ్రాండ్ వాల్యూ వేల కోట్లకు చేరిందని ఆమె చెప్పుకొచ్చారు. -
హైదరాబాద్‌లో కాస్మొటిక్ మాన్యుఫాక్చరింగ్ హబ్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత కాస్మొటిక్ తయారీ సంస్థ డూసన్ హైద రాబాద్‌లో కాస్మొటిక్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలి కాస్మొటిక్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌ను దాదాపు రూ. 5 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన ఆ సంస్థకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. మంగళవారం సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో డూసన్ ప్రతినిధులు సమావేశమై తమ పెట్టుబడుల గురించి ప్రభుత్వా నికి సవివరమైన నివేదిక (డీపీఆర్)ను అందజే శారు. తాము కల్పించే ఉద్యోగాలు, పెట్టుబడుల ద్వారా స్థానికులకు కలిగే ప్రయోజనాల గురించి మంత్రికి విజువల్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తమ సంస్థ చైనా, వియత్నాం, కంబోడియా తదితర దేశాల్లో 46 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిందని, తమ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అవసర మైన అనుమతులు, కంపెనీ ఏర్పాటుకు భూకేటా యింపులు, రాయితీల గురించి మంత్రితో డూసన్ ప్రతినిధులు చర్చించారు. వేల మందికి ఉపాధి కల్పిస్తాం: డూసన్ ప్రతినిధి తమ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే కాస్మొటిక్ హబ్ ద్వారా ప్రత్యక్షంగా దాదాపు 3 వేల మందికి... పరోక్షంగా మరో 4 వేల మందికి ఉపాధి కల్పిస్తామని డూసన్ ప్రతినిధి మూన్ కీ జూ తెలిపారు. ఒరిజనల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఓఈఎం), ఒరిజనల్ డిజైన్ మాన్యుఫాక్చరర్స్ (ఓడీఎం) పద్ధతిలో తమ సంస్థ కార్యకలాపాలు ఉంటాయన్నారు. సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలను ఉత్పత్తి చేసే రైతుల నుంచే కొనుగోళ్లు చేస్తామని... తద్వారా స్థానిక రైతులు, ఉత్పత్తిదారులకు మరింత ఉపాధి పెరుగుతుందని మంత్రికి వివరించారు. ఇక్కడ ఉత్పత్తి చేసిన వివిధ ఉత్పత్తులను స్థానికంగా వ్యాపారం చేయడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తామని తెలియజేశారు. అనుమతుల మంజూరుకు మంత్రిహామీ దేశంలోకెల్లా తెలంగాణ సులభతర వాణిజ్యంలో మొదటిస్థానంలో ఉందని, పరిశ్రమలకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులను మంజూరు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వారికి తెలియజేశారు. దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయని, హైదరాబాద్ పారిశ్రామిక వాతావరణం, పారిశ్రామిక విధానం ఇతర దేశాలు, వ్యాపార సంస్థలకు స్వర్గధామంగా ఉందని డూసన్ ప్రతినిధులకు వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో సమావేశం ఏర్పాటు చేసి కంపెనీ ఏర్పాటు చేయడానికి కావల్సిన అనుమ తులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. -
సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా.. భారత్‌లోనే
ఈ భూమ్మీదచాలా మందికి అందంగా కనపడాలనే ఆశ ఉంటుంది. పురుషుల కంటే మగువల్లో ఈ అందంగా కనిపించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. కురుల నిగారింపు కోసం షాంపూలు, ఆయిల్లు.. చర్మ సౌందర్యానికి సబ్బులు, లోషన్లు, మాయిశ్చరైజర్లు.. పెదాలకు లిప్ కేర్లు.. కాళ్లు చేతులకు మెహందీలు.. గోర్లకు నెయిల్ పాలిష్‌లు.. కనులకు, కనుబొమ్మలకు ఐ లైనర్లు.. అంటూ మహిళలు నిత్యం అందం కోసం ఆరాటపడుతుంటారు. కాబట్టే భారత్ కాస్మోటిక్ రంగం గణనీయంగా వృద్ది సాధిస్తోంది. ఇటీవల కాంటార్ వరల్డ్ ప్యానెల్ నివేదిక ప్రకారం..ఈ ఏడాది భారతీయ మహిళలు తొలి ఆరు నెలల కాలంలో లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్ నుండి ఐలైనర్ వరకు 100 మిలియన్లకు పైగా కాస్మెటిక్ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఫలితంగా కాస్మోటిక్ సంస్థలు రూ. 5,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. వీటిలో బ్యూటీ ప్రొడక్ట్‌ల కోసం మహిళలు సగటున రూ.1,214 ఖర్చు చేయగా.. దాదాపు 40 శాతం కొనుగోళ్లు ఆన్లైన్లో జరిగాయని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ఈ తరుణంలో అంతర్జాతీయ కాస్మోటిక్ సంస్థలు భారతీయ మహిళల్ని ఆకట్టుకునేలా స్టార్ హీరోయిన్లను తమ బ్రాండ్ ప్రచారకర్తలుగా నియమించుకుంటున్నాయి. ఇక జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2, భోళా శంకర్, జైలర్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నాను జపాన్ కాస్మోటిక్ దిగ్గజం షిసిడో (Shiseido) భారత్ బ్రాండ్ అంబాసీడర్‌గా నియమించింది. షిసిడో బ్రాండ్ అంబాసీడర్‌గా నియాకం ఆశ్చర్యానికి గురి చేసిందన్న మిల్కిబ్యూటీ.. దాదాపూ 100 ఏళ్లకు పైగా కాస్మోటిక్ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతున్న షిసిడో బ్రాండ్ అంబాసీడర్‌గా ఎంపికవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. కాగా, తమన్నా - షిసిడో మధ్య ఒప్పందం భారత్ ఎంటర్టైన్ మెంట్ పాటు కాస్మోటిక్ రంగంలో రాణించేందుకు దోహదం చేస్తుందని షిసిడో యాజమాన్యం భావిస్తుంది. -
నెహ్రూ ఐడియా & జెఆర్‌డీ టాటా విజన్‌తో పుట్టిన కంపెనీ ఇదే!
బ్యూటీమీద ఎక్కువ దృష్టిపెట్టేవారికి 'లాక్మే' (Lakme) బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని రకాల సౌందర్య సాధనాలు, అలంకరణలను సంబంధించిన వస్తువులు ఇక్కడ లభిస్తాయి. నేడు కాస్మొటిక్ రంగంలో దూసుకెళ్తున్న ఈ కంపెనీ నిర్మించడం వెనుక భారతదేశ మొదటి ప్రధాని 'జవహర్ లాల్ నెహ్రూ' ఉన్నట్లు చాలామందికి తెలియకపోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జెఆర్‌డీ టాటాతో చర్చ.. భారతదేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచే మహిళలు సౌందర్య సాధనాలు ఉపయోగించేవారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మేడ్ ఇన్ ఇండియా కంపెనీ అవసరమని భావించిన నెహ్రూ ప్రముఖ పారిశ్రామిక వేత్త జెఆర్‌డీ టాటాతో చర్చించారు. దీనికి ఏకీభవించిన టాటా 1952లో లాక్మేను టాటా ఆయిల్ మిల్స్ అనుబంధ సంస్థగా స్థాపించారు. లాక్మే అనేది భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ కాస్మొటిక్ కంపెనీ. మహిళలు విదేశీ వస్తువులను అధికంగా వినియోగిస్తున్న కారణంగా జవహర్ లాల్ నెహ్రూ దీని ఏర్పాటుకి కారకుడయ్యాడు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయకుండా ఉండాలంటే స్వదేశీ కంపెనీ అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదీ చదవండి: ఇక ఆ జియో రీఛార్జ్ ప్లాన్ లేదు.. కొత్త ప్లాన్ ఏంటంటే? లాక్మే అంటే ఫ్రెంచ్ భాషలో.. నిజానికి జెఆర్‌డీ టాటా ఈ కంపెనీ ప్రారంభించిన సమయంలో సంస్థకు ఏ పేరు పెట్టాలని తీవ్రంగా ఆలోచించాడు. అప్పట్లో సామాన్యులకు కూడా నచ్చే విధంగా ఉండాలని కొంతమంది ప్రతినిధులతో చర్చించి 'లాక్మే' అని నామకరణం చేశారు. లాక్మే అంటే ఫ్రెంచ్ భాషలో 'లక్ష్మీదేవి' అని అర్థం. పురాణాల్లో లక్ష్మీదేవి అందానికి ప్రతిరూపంగా భావించేవారు కావున ఈ పేరునే స్థిరంగా ఉంచేశారు. ఇదీ చదవండి: చంద్రయాన్-3 బడ్జెట్ కంటే ఖరీదైన కారు.. ఇలాంటి మోడల్ ఇప్పటి వరకు చూసుండరు..! ప్రారంభంలో లాక్మే ముంబైలోని ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమైంది. ఇది ప్రారంభమైన అతి తక్కువ సమయంలో మంచి ప్రజాదరణ పొందింది. ఈ కంపెనీ ప్రారంభించిన తరువాత దాదాపు విదేశీ వస్తువుల దిగుమతి భారతదేశంలో ఆగిపోయింది. 1961లో నావల్ టాటా భార్య సిమోన్ టాటా ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సంస్థ అభివృద్ధికి ఈమె ఎంతగానో కృషి చేసింది. -
ఒక్క బిజినెస్.. వందల కోట్ల టర్నోవర్ - వినీత సింగ్ సక్సెస్ స్టోరీ!
Vineeta Singh Success Story: భారతదేశంలో ప్రస్తుతం గొప్ప వ్యాపారవేత్తలుగా పేరుపొందిన వారిలో చాలా మంది ఉన్నత చదువులు చదువుకున్న వారు ఉన్నారు. అలాంటి కోవకు చెందిన వారిలో 'వినీత సింగ్' (Vineeta Singh) ఒకరు. ఐఐఎమ్, ఐఐటి వంటివి పూర్తి చేసిన ఈమె మంచి ప్యాకేజి వదిలి సొంతంగా బిజినెస్ ప్రారంభించి ఇప్పుడు కోట్లలో టర్నోవర్ చేస్తోంది. ఇంతకీ ఈమె చేసే బిజినెస్ ఏది? నెట్ వర్త్ ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరైన వినీత సింగ్ కోటి రూపాయల జాబ్ ఆఫర్ వదిలిపెట్టి 'షుగర్ కాస్మెటిక్' (Sugar Cosmetics) బిజినెస్ ప్రారంభించింది. వినీత 1987 నుంచి 2001 వరకు ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ & ఆర్.కే పురం పాఠశాల విద్యను పూర్తి చేసి ఆ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టా పొందింది. 2004లో మూడు నెలలు పాటు కోల్‌కతాలోని ITC లిమిటెడ్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది. 2005లో అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. లండన్, న్యూయార్క్‌లోని డ్యుయిష్ బ్యాంక్‌లో మూడు నెలల ఇంటర్న్‌షిప్ చేసిన తరువాత స్ట్రాటజిక్ ఈక్విటీ ట్రాన్సాక్షన్స్ యూనిట్, ఎమర్జింగ్ మార్కెట్స్ స్ట్రక్చర్స్ విభాగం ప్రాజెక్ట్‌లపై పనిచేసింది. (ఇదీ చదవండి: ఈ మారుతి కార్లను ఇప్పుడే కోనేయండి.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదేమో!) చిన్నప్పుడు ముంబైలో ఒక చిన్న ఇంట్లో నివాసమున్నప్పుడు వర్షాకాలంలో తరచూ వరదలను ఎదుర్కొని ఇబ్బందులు పడినట్లు నివేదికల ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు పొవాయ్‌లోని ఓ విలాసవంతమైన ఇంట్లో నివసిస్తోంది. చదువు పూర్తయిన తరువాత మంచి జాబ్ వచ్చినప్పటికీ వదులుకుని షుగర్ కాస్మటిక్స్ అనే సంస్థ స్థాపించింది. ఈమె నికర ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 300 కోట్లకంటే ఎక్కువ అని తెలుస్తోంది. (ఇదీ చదవండి: 27 ఏళ్ల తర్వాత ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు.. రిజిస్ట్రేషన్ ఇలా చేయండి) షుగర్ కాస్మెటిక్ కంటే ముందు వినీత సింగ్ మరో రెండు వెంచర్లు ప్రారంభించి సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తరువాత దీనిని 2015లో ప్రారంభించి గొప్ప పురోగతిని పొందింది. అప్పట్లో మార్కెట్లో చెప్పుకోదగ్గ సౌందర్య సాధనాల లేకపోవడం ఆమెకు బాగా కలిసి వచ్చింది. ఈమె రియాలిటీ షో షార్క్ ట్యాంక్ ఇండియాలో జడ్జ్‌గా కూడా పనిచేసింది. చదువుకునే రోజుల్లో ప్రేమించిన కౌశిక్ ముఖర్జీని 2011లో వివాహం చేసుకుంది. ఈయన షుగర్ కాస్మెటిక్స్ సంస్థ కో-ఫౌండర్. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. -
లాయర్ల కుటుంబం నుంచి వచ్చి.. కాస్మోటిక్ బేస్డ్ స్టార్టప్‌తో ఎదిగి..
జార్ఖండ్‌లోని రాంచిలో పుట్టి పెరిగింది రోమిత. తండ్రి న్యాయవాది. తల్లిదండ్రులు తన పట్ల ఎప్పుడూ వివక్ష ప్రదర్శించలేదు. సోదరుడితో సమానంగా పెంచారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో బిజినెస్ ఎకనామిక్స్ చదువుకునే రోజుల్లో కూడా తనకు వివక్ష ఎదురు కాలేదు. హార్బర్ రిడ్జ్ క్యాపిటల్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది రోమిత. ఆ తరువాత వెంచర్ క్యాపిటలిస్ట్(వీసి)గా కూడా తనను తాను నిరూపించుకుంది. ఒకానొకరోజు...తనకు వ్యాపారరంగంలోకి ప్రవేశించాలని ఆలోచన వచ్చింది. లాయర్ల కుటుంబం నుంచి వచ్చిన రోమితకు ఎలాంటి వ్యాపార అనుభవం లేదు. ‘ఎందుకొచ్చిన రిస్క్’ అని అనుకొని ఉంటే తన కలను నెరవేర్చుకునేది కాదు. కాస్మోటిక్స్ బేస్డ్ స్టార్టప్ గురించి ఆలోచనతో నిధుల సమీకరణకు ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు తనను బాధ పెట్టే ఎన్నో అనుభవాలు, ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘మీరు మాత్రమేనా?’ ‘మేల్ కో–ఫౌండర్ ఎవరూ లేరా? ‘మీకు పెళ్లి అయిందా? అయితే పూర్తి సమయం కంపెనీ కోసం ఎలా కేటాయించగలరు?’ ‘మీరు సీరియస్‌గా వ్యాపారరంగంలోకి వచ్చినట్లుగా అనిపించడం లేదు. ఏదో సరదాగా వచ్చినట్లు అనిపిస్తుంది’... ఇవి మనసులోకి తీసుకునే ఉంటే రోమిత మజుందార్ తిరిగి వెనక్కి వెళ్లేదే తప్ప ముందుకు అడుగు వేసేది కాదు. ఎన్నో రకాల అనుమానాలు, అవమానాలను ఎదుర్కొని ఎట్టకేలకు కాస్మోటిక్ బేస్డ్ స్టార్టప్ ‘ఫాక్స్‌టేల్’తో తన కలను నిజం చేసుకుంది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ నాలుగు రకాల ఉత్పత్తులతో మార్కెట్లోకి ప్రవేశించి కొద్దికాలంలోనే విజయకేతనం ఎగరేసింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రోమిత మజుందార్ మంచి పేరు తెచ్చుకుంది. చదవండి: Viral: 13 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా! ఆ తండ్రికి పుత్రికోత్సాహం.. వీడియో వైరల్ -
SOMA BANIK: ఆరోగ్యమే ఆత్మవిశ్వాసం
ఓ భారతీయ యువతీ! తెల్లగా ఉండడమే అందానికి కొలమానం అని ఎవరు నిర్దేశించారు? అందంగా ఉన్న వాళ్లే విజేతలవుతారని నీకు ఎవరు చెప్పారు? ఆత్మవిశ్వాసానికి తెల్లగా ఉండడమే గీటురాయి అనే సూత్రం ఎలా వచ్చింది? మీ రెజ్యూమెలో మార్కులతో రాని ఆత్మవిశ్వాసం అందంతో వస్తుందా? నీకు ఉద్యోగం తెచ్చేది నువ్వు సాధించుకున్న మార్కులే... తెల్లదనం కాదు. తెల్లదనమే అందమనే అపోహ కాస్మెటిక్ మార్కెట్ సృష్టించిన మాయాజాలం. ఈ మాయాజాలం ఇప్పుడు భారతీయ మహిళల ఆరోగ్యాన్ని హరిస్తోంది. అరగంట ఎండను తాళలేకపోతే సమానత్వ పోరాటంలో మహిళ స్థానమెక్కడ? భారతీయ మహిళలు ఆరోగ్యం కోసం చేసే ఖర్చు కంటే అందంగా కనిపించడం కోసం చేసే ఖర్చే ఎక్కువగా ఉంటోంది. భవిష్యత్తులో ప్రమాదకరమైన పరిణామాలకు ఇది తొలి సంకేతం. వైటెనింగ్ క్రీమ్‌లు వాడుతున్న వాళ్లను ముంబయిలో ఓ సంస్థ ప్రశ్నించినప్పుడు ‘తెల్లగా ఉంటే మరింత ఆకర్షణీయంగా ఉంటాననే ఉద్దేశం తో ఫెయిర్నెస్క్రీమ్ని వాడుతున్నాను’ అని కొందరు బదులిచ్చారు. ఇంకా... ‘మా ఇంట్లో వాళ్లు, స్నేహితులు ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడమని చెప్పారు, వాడినప్పుడు బావున్నానని చెప్పారు. అందుకే కంటిన్యూ చేస్తున్నాను... అని, సినిమా వాళ్లు, యాడ్‌లో ఈ క్రీమ్‌లు వాడినందువల్లనే అందంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. కాబట్టి నేను కూడా అలా కనిపించడం కోసం వాడుతున్నాను’... ఇలాంటి సమాధానాలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే... కోల్‌కతాకు చెందిన సోమా బానిక్ చేదు అనుభవం ఇలా ఉంది. ∙∙ అది 2003, సోమా బానిక్కి పద్నాలుగేళ్లు. అప్పుడు సోమా బానిక్ తల్లితో ఓ పక్కింటావిడ అన్న మాటలు ఆ అమ్మాయి జీవితం మీద తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపించాయి. ‘చర్మాన్ని తెల్లబరచడానికి మార్కెట్లో అన్ని క్రీమ్‌లున్నాయి కదా! మీ అమ్మాయికి ప్రయత్నించండి. కొత్తగా ఫలానా క్రీమ్ వచ్చింది. మంచి ఫలితం ఉంటోందట’ అని వైటెనింగ్ క్రీమ్ పేరు కూడా చెప్పిందా పక్కింటావిడ. తెల్లగా ఉంటేనే విజేతలవుతారా! ఒక అమ్మాయి విజేతగా నిలవడానికి దగ్గర దారి తెల్లగా ఉండడమే అన్నంతగా కాస్మెటిక్ కంపెనీలు సమాజాన్ని ప్రభావితం చేస్తున్న రోజులవి. క్రీమ్‌ని వాడడం మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే స్కూల్లో ఫ్రెండ్స్ సోమా చర్మంలో వచ్చిన మార్పును గుర్తించడం, ప్రశంసించడం మొదలైంది. రెండు నెలలు గడిచేటప్పటికి అసలు సమస్య మొదలైంది. ఎండలోకి వెళ్తే చర్మం చిరచిరలాడడం, మంట, దద్దుర్లు రావడం మొదలైంది. వైటెనింగ్ క్రీమ్ వాడేవాళ్లు ఇలాంటి మార్పును స్వచ్ఛందంగా స్వాగతిస్తారు. చర్మం తెల్లగా అయ్యే క్రమంలో ఇలాగే ఉంటుందని తమకు తాముగా సమాధానం చెప్పుకుంటారు. సోమా కూడా అందుకు మినహాయింపు కాలేకపోయింది. ఓ రోజు... క్రీమ్ రాసుకోవడం మరిచిపోయింది. స్కూలుకు వెళ్లిన కొద్ది గంటలకే ఆమె గడ్డం మీద చిన్న మచ్చలా మొదలై మొటిమలా తేలింది. ఇక క్రమం తప్పకుండా క్రీమ్ రాస్తూ ఏడాది పాటు కొనసాగించింది. చెంపల మీద మొదలైన సన్నని వెంట్రుకలు ముఖమంతా రావడాన్ని గమనించిందామె. ఇప్పుడామె వయసు 33. కోల్‌కతాలో స్టేట్గవర్నమెంట్ ఉద్యోగిని. ఇప్పుడామె భర్త ఎపిలేటర్ సహాయంతో ముఖం మీది వెంట్రుకలను తొలగించడంలో సహాయం చేస్తున్నాడు. ఇవన్నీ సోమా బానిక్ తన బ్లాగ్‌లో రాసుకున్న వివరాలు. ఈ లక్షణాలను విశ్లేషించిన డెర్మటాలజిస్టులందరూ ముక్తకంఠంతో చెప్పిన మాట ఒక్కటే... ‘చర్మం తెల్లగా మారడానికి ఆమె వాడిన వైటెనింగ్ క్రీమ్‌లో ఉన్న స్టిరాయిడ్స్ కారణం’ అని. అది కూడా దీర్ఘకాలం వాడడం వల్ల వెంట్రుకల వంటి సమస్యకు దారి తీసిందనీ. రంగు మార్చే క్రీమ్‌లు లేవు! చర్మం రంగును క్రీమ్‌లతో మార్చడం సాధ్యమయ్యే పని కాదన్నారు బెంగళూరుకు చెందిన డెర్మటాలజిస్ట్ ప్రియాంక రెడ్డి. ‘‘డెర్మటాలజీలో ఎంతటి అధునాతనమైన యంత్రాలు, ఔషధాలు వచ్చాయంటే... కోటి రూపాయల మెషినరీ కూడా ఉంది. కానీ చర్మాన్ని తెల్లబరిచే యంత్రం కానీ ఔషధం తయారు కాలేదు, కాదు కూడా. ఎందుకంటే చర్మం రంగు జన్యుపరంగా నిర్ణయమవుతుంది. అలా నిర్ణయమైన చర్మాన్ని ఆరోగ్యకరంగా మార్చడానికి వీలుంటుంది. గ్లూమింగ్తోపాటు చర్మం మెరుపుతో కాంతులీనేటట్లు చేసే ట్రీట్మెంట్లున్నాయి. కానీ తెల్లబరిచే ట్రీట్మెంట్లు లేవు. అది ఆరోగ్యకరం కాదు కూడా. కొంతమంది హీరోయిన్లను ఉదాహరణ గా చూపిస్తూ ఉంటారు. కానీ అది మేకప్, కెమెరా టెక్నిక్స్, ఎడిటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే వాళ్లు ఆరోగ్యకరమైన ట్రీట్మెంట్లు చేయించుకుంటారు తప్ప స్టిరాయిడ్స్, హైడ్రోక్వైనోన్లు ఉండే వైటెనింగ్ క్రీమ్‌ల జోలికి వెళ్లరు. చర్మ సంరక్షణలో ఆరోగ్యకరమైన పద్ధతులనే అవలంబిస్తారు’’ అని చెప్పారామె. స్కిన్ వైటెనింగ్, లైటెనింగ్ వంటి హానికారకమైన డ్రగ్స్ మీద ఆంక్షలు విధించాలని 2017లో ఐఏడివీఎల్ (ఇండియన్ అసోసిÄేæషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్ వెనెరియాలజిస్ట్) ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేసింది. నిషేధిత ఔషధాలు మార్కెట్లో యధేచ్ఛగా లభించడం మనదేశంలో జరుగుతున్న అరాచకమే. ‘అప్పియరెన్స్‌లో ఏముంది’ అని చెప్పడం సులువే, కానీ సమాజం అప్పియరెన్స్నే ప్రధానంగా చూస్తూ తోటివారిని న్యూనతకు గురి చేస్తూనే ఉంటుంది. సమాజం ఆలోచన మారి తీరాల్సిందేనన్నారు ప్రియాంక. అసలు ఈ తెల్లదనపు మాయకు ఆజ్యం పోసింది మన ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మ అంటే ఆశ్చర్యం కలగక మానదు. రవివర్మ చిత్రలేఖనాన్ని డచ్ చిత్రకారుడి దగ్గర నేర్చుకోవడం... మన భారతీయ మహిళల మీద ఈ స్థాయిలో తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపించింది. ఆయన చిత్రించిన బొమ్మల్లో చాలా వరకు తెల్లగా యూరోపియన్ స్కిన్‌టోన్‌తో ఉంటాయి. ఆ బొమ్మల క్యాలెండర్లు దాదాపుగా అన్ని ఇళ్లకూ చేరాయి. అందంగా ఉండడం అంటే చర్మం తెల్లగా ఉండాలనే అపోహ కూడా ఇంటి గోడల నుంచి మెదడుకు దారి తీసింది. సమాజం ఈ అపోహ నుంచి బయటపడాలంటే మేధోవికసితమైన ఉద్యమం ఒకటి మౌనంగానే అయినా మొదలు కావాలి. అప్పుడు వైటెనింగ్, లైటెనింగ్ క్రీమ్‌ల మార్కెట్ మనదేశం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమిస్తుంది. ఆరోగ్యమే అందం వైటెనింగ్ క్రీమ్‌లను రెండు నుంచి మూడు నెలలు వాడినప్పటి నుంచి చర్మం పలుచబడడం, ఎర్రబారడం మొదలవుతుంది. ఎంతగా అంటే.. రక్తనాళాలు కనిపించేటంతగా పలుచబడుతుంది. ఆపేయగానే మొటిమలు, పిగ్మెంటేషన్ (మంగు) మొదలవుతాయి. దీర్ఘకాలం వాడితే చర్మం మీద వెంట్రుకలు మొదలవుతాయి. చర్మ సంరక్షణకు సాధారణంగా అవసరమయ్యేవి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఫేస్ వాష్‌లు మాత్రమే. అంతకు మించి ఏ అవసరం ఏర్పడినా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాల్సిందే. చర్మతత్వాన్ని స్వయంగా పరిశీలించి, సమస్యను, వయసును దృష్టిలో పెట్టుకుని క్రీమ్ లేదా లోషన్లను వాడాల్సి ఉంటుంది. తెల్లదనం కోసం ఖర్చు పెట్టడం వృథా ప్రయాస మాత్రమే. పొల్యూషన్ చర్మానికి హాని కలిగిస్తుంది. కాబట్టి చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దేహం ఆరోగ్యంగా ఉంటే చర్మం కూడా కాంతులీనుతుంది. మంచి ఆహారం, తగినంత నిద్ర, నీరు తీసుకోవడం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. అలాగే ఎక్సర్సైజ్ చేసి చెమట ద్వారా మలినాలు బయటకు పంపించడం కూడా చర్మానికి మెరుపునిస్తుంది. – డాక్టర్ ప్రియాంక రెడ్డి, మెడికల్ డైరెక్టర్, డీఎన్ఏ స్కిన్ క్లినిక్, బెంగళూరు – వాకా మంజులారెడ్డి -
ఇన్నిస్‌ఫ్రీ.. చీటింగ్ ఫుల్!
‘ఉప్పర్ షేర్వానీ.. అందర్ పరేషానీ’ అని ఓ హిందీ సామెత.. సరే తెలుగులో చెప్పుకోవాలంటే.. ‘పైన పటారం.. లోన లొటారం’. పైకి గొప్పగా కనబడ్డా లోపల అంతా డొల్లేనని వీటి అర్థం. దక్షిణ కొరియాకు చెందిన ఇన్నిస్‌ఫ్రీ అనే కాస్మెటిక్స్ కంపెనీకి ఇలాంటి ముచ్చట తెలిసినట్టు లేదు. తెలిసీ తెల్వకనో, కావాలనో గానీ ఆ కంపెనీ చేసిన ఓ పని మాత్రం పెద్ద తలనొప్పే తెచ్చిపెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆ కంపెనీ ఓ గ్రీన్‌టీ ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఈ మధ్యే విడుదల చేసింది. పర్యావరణ హితంగా ఉండేలా పేపర్ బాటిల్లో ప్రొడక్ట్ తెస్తున్నామని ప్రకటించింది. అంతేకాదు.. ఆ బాటిల్‌పై ‘హలో, ఐయామ్ పేపర్ బాటిల్’ అని కూడా పెద్దగా ప్రింట్ చేసింది. అసలే ఈ మధ్య పర్యావరణ పరిరక్షణపై కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్న జనం ఆ ప్రొడక్ట్‌ను బాగానే కొన్నారు. తీరా చూస్తే.. ఓ ప్లాస్టిక్ బాటిల్‌కే కాస్త మందంగా ఉన్న పేపర్ ప్యాకింగ్ చేసి ఉండటం గమనించి గొల్లుమన్నారు. ఇదేం మోసమంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీనిపై స్పందించిన కంపెనీ.. ‘‘అసలు మా ఉద్దేశం వేరు. ఇంతకుముందటి ప్రొడక్ట్ కంటే సగమే ప్లాస్టిక్ ఉండేలా తయారు చేశాం. కానీ జనం మొత్తం పేపర్ బాటిల్ అనుకున్నట్టున్నారు. మేం పెట్టిన పేరు కన్ఫ్యూజ్ చేసినట్టుంది..’’ అని సర్ది చెప్పుకోవడం గమనార్హం. -
సేఫ్టీ ఫస్ట్..సౌందర్యం నెక్ట్స్ !
సాక్షి, హైదరాబాద్ : పది మందిలో ప్రత్యేకంగా ఉండాలని అందరూ ఆరాటపడతారు. ముఖారవిందం మెరిసి పోయేలా సౌందర్య సాధనాలతో మెరుగులు అద్దుతారు.. ఇది నిన్నటి మాట.. మరి నేడు.. దుమ్ము, ధూళితో కాంతి విహీనంగా తయారవుతున్న తమ చర్మాన్ని కాపాడుకునేందుకు యువత ప్రయత్నిస్తోంది. దీంతో ఒకప్పుడు విరివిగా వాడిన సౌందర్య సాధనాల స్థానంలో.. చర్మ సంరక్షణ సాధనాలు వచ్చి చేరాయి. ఇటీవల ఢిల్లీతో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్ వంటి నగరాల్లో పలు మార్కెటింగ్ కంపెనీలు జరిపిన సర్వేల్లో ఈ విష యాలు వెల్లడయ్యాయి. నగర, పట్టణ ప్రాంతాల్లో కాలుష్య ఉద్గా రాలు అధికంగా ఉండటం వల్ల చర్మం పొడి బారుతుండటం, శిరోజాలు రాలిపోతుండటం వంటి కారణాల వల్ల కాంతి విహీనంగా పెరుగుతున్న వారి సంఖ్య అధిక మైందని వెల్లడైంది. దీంతో ఇప్పుడు మహిళలు, పురుషులు అన్న తేడా లేకుండా ఎండ వేడిమి, కాలుష్య కారకాల నుంచి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. దీన్ని గమనించిన కంపెనీలు రెండేళ్లుగా చర్మ సంరక్షణ ఉత్పత్తులను గణనీయంగా పెంచాయి. అంతే కాదు అమ్మకాల్లోనూ భారీగా వృద్ధి రేటు నమోదైంది. 25 నుంచి 30 శాతం వృద్ధి కాలుష్యం, ఎండ వేడిమి నుంచి చర్మాన్ని కాపాడుకోవడంతో పాటు ఇతర ఆరోగ్య సంరక్షణ కోసం కంపెనీలు తయారు చేస్తున్న ఉత్పత్తుల అమ్మకాల్లో ఏకంగా 25 నుంచి 30 శాతం వృద్ధి చోటు చేసుకుందని నీల్సన్ తాజా సర్వేలో తేలింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను ఇటీవల వెల్లడించింది. కాలుష్యం బారి నుంచి కాపాడుకోవడం, ఎండవేడిమి నుంచి చర్మాన్ని సంరక్షించుకోవాలన్న తపన వల్ల వాటి ఉత్పత్తుల అమ్మకాలు పెరిగి, సౌందర్య సాధనాల ఉత్పత్తుల గిరాకీ తగ్గిందని ఆ సర్వే తేల్చింది. ప్రజల్లో వచ్చిన ఈ మార్పు పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిందని హెచ్‌యూఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు. సౌందర్య సాధనాల అమ్మకాల్లో 2 నుంచి 5 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దే సౌందర్య సాధనాల కంటే విష వాయువుల నుంచి రక్షించే సౌందర్య సంరక్షణ సాధనాల వైపు ఎక్కువ ఆసక్తి చూపడమే దీనికి కారణమని ఓ మార్కెటింగ్ నిపుణుడు విశ్లేషించారు. కొంతకాలంగా చర్మ సౌందర్య ఉత్పత్తులు తయారు చేసే బడా సంస్థలు కలర్ కాస్మొటిక్స్ కంటే.. ఫేస్‌వాష్, స్క్రబ్స్ తయారీపై దృష్టిసారించాయి. రాబోయే దశాబ్ద కాలంలో కాలుష్యం బారీ నుంచి కాపాడే ఉత్పత్తుల వినియోగం ఏటా కనీసం 5 శాతం వృద్ధి చెందుతుందని ఫ్యూచర్ మార్కెట్ ఇన్సైట్స్ అనే గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ అంచనా వేసింది. ప్రకృతి, సహాజసిద్ధ (సేంద్రీయ) ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్న ప్రజలు.. కాస్మొటిక్స్‌లోనూ ఈ తరహా సాధనాలకు పెద్దపీట వేస్తున్నారు. -
హాస్టల్ విద్యార్థులకు తీపి కబురు
నెహ్రూనగర్ (గుంటూరు) : సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు విడుదలయ్యాయి. గత టీడీపీ ప్రభుత్వంలో చార్జీల్ని పెంచుతూ ఆర్భాటాలకు పోయారే తప్పా నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారంలోకి రాగానే విద్యార్థులు పడుతున్న కష్టాల్ని తెలుసుకున్న సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేశారు. గత సంవత్సరం నవంబర్ నుంచి బడ్జెట్ విడుదల అయిందని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తెలియజేశారు. మూడు నెలలే ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం మామూలుగా 3 నుంచి 5 తరగతుల బాలురకు నెలకు రూ.50, బాలికలకు రూ.55 చొప్పున కాస్మొటిక్ చార్జీలు ఇచ్చేవారు. కానీ టీడీపీ ప్రభుత్వం 2018లో బాలురకు రూ.100, బాలికలకు రూ.110 చొప్పున పెంచింది. ఇక 7వ తరగతి బాలురకు 50 నుంచి రూ.125, బాలికలకు రూ.55 నుంచి రూ.160కు పెంచింది. ఎనిమిది ఆపైన తరగతుల బాలురకు రూ.50 నుంచి రూ.125, బాలికలకు రూ.75 నుంచి రూ.160కు పెంచింది. హెయిర్ కటింగ్ చార్జీ బాలురకు రూ.12 నుంచి రూ.30 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన చార్జీల్ని 2018 జూలై 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందపడ్డారు. కానీ ముచ్చటగా మూడు నెలలు మాత్రమే ఇచ్చిన టీడీపీ సర్కార్, ఆ తరువాత నుంచి కాస్మోటిక్ చార్జీల్ని పెండింగ్ పెట్టింది. టీడీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల గత సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు చార్జీలు తీసుకోకుండానే వెళ్లిపోయారు. జిల్లాకు భారీగా నిధుల మంజూరు విద్యార్థుల అవస్థలు గుర్తించి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బిల్లులను మంజూరు చేస్తూ జిల్లాకు రూ. 10కోట్ల 85లక్షల 85 వేలను విడుదల చేసింది. డైట్ చార్జీల కింద రూ.7కోట్ల 88లక్షలు, కాస్మోటిక్ చార్జీలు కింద రూ. 94 లక్షలు, ట్యూటర్స్‌కు రూ. 32లక్షలు, బిల్డింగ్ మెయింటెనెన్స్‌కు రూ. 47లక్షలు, అద్దెలకు రూ. 33లక్షలు మంజూరయ్యాయి. 8,415 మంది విద్యార్థులకు లబ్ధి జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 78 ఉన్నాయి. వీటిలో హైస్కూల్ హాస్టల్స్ 72, కాలేజీ హాస్టల్స్ 36 ఉన్నాయి. వీటిలో ప్రీ మెట్రిక్ విద్యార్థులు 4812, పోస్ట్‌మెట్రిక్ విద్యార్థులు 3603 మంది ఉన్నారు. ప్రభుత్వం కాస్మొటిక్ చార్జీలు విడుదల చేయడం వల్ల జిల్లావ్యాప్తంగా 8415 మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. రెండు రోజుల్లో అందరికీ అందిస్తాం గత సంవత్సరం నవంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న కాస్మొటిక్ చార్జీలు, ఇతర బకాయిలు విడుదల అయ్యాయి. ఇప్పటికే విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు చెల్లిస్తున్నాం. రెండు రోజుల్లో అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటాం. –ఎం. రమాదేవి,సాంఘిక సంక్షేమ శాఖ అధికారి -
అమ్మాయికి మొటిమలు వస్తున్నాయి..?
నా జుట్టు బాగా పొడవుగా ఉంటుంది. అయితే ప్రతి ఏడాది వర్షాకాలం రాగానే అది బాగా పొడిబారిపోతోంది. చుండ్రు వల్ల తలంతా దురదగా కూడా ఉంటోంది. వర్షాకాలంలో కూడా నా జుట్టు బాగుండాలంటే ఏం చేయాలో దయచేసి సూచించండి.– ఎమ్. ఉదయలక్ష్మి, కాకినాడ మీ జుట్టు పొడిబారడం అనే సమస్యకు మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మీరు జుట్టుకు రోజువారీ వాడే ఉత్పాదనలు (హెయిర్ ప్రోడక్ట్స్) వంటి అంశాలు కారణమవుతాయి. మీరు రోజూ తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, ఐరన్ పాళ్లు తగ్గడం వల్ల జుట్టు పొడిబారే ప్రమాదం ఉంది. అలాగే వాతావరణంలో తేమ తగ్గినప్పుడు కూడా జుట్టు పొడిబారుతుంది. అంతేకాదు... అది తేలిగ్గా విరిగిపోయేలా (బ్రిటిల్గా) కూడా మారుతుంది. ఇలా అనేక అంశాలు మీ సమస్యకు కారణమవుతుంటాయి. మీ విషయానికి వస్తే మొదట మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు మీ జీవనశైలిని ఆరోగ్యకరమైన రీతిలో మార్పులు చేసుకోవడం, ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా దొరికేలా మీ ఆహారంలో మార్పులు చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేగాక మీరు మెడికేటెడ్ షాంపూ వాడటం మంచిది. మీ మాడు (స్కాల్ప్)తో పాటు మీ జుట్టు కండిషన్‌ను బట్టి మీరు వాడాల్సిన షాంపూను సూచించడం జరుగుతుంది. మీకు చుండ్రు కూడా ఉందంటున్నారు కాబట్టి... డాక్టర్ సూచించిన యాంటీడాండ్రఫ్ లోషన్ కూడా వాడాల్సి ఉంటుంది. చుండ్రుకు చికిత్స చేయకపోతే జుట్టు రాలిపోవడం అనే సమస్య అదేపనిగా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే పైన సూచించిన జాగ్రత్తలు పాటించడంతో పాటు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి. చర్మం పొడిబారకుండా ఉండాలంటే...? నాది బాగా పొడి చర్మం. నా చర్మం గురించి నేను చాలా శ్రద్ధ తీసుకుంటాను. కొద్దిరోజుల్లో నేను పైచదువుల కోసం కెనడాకు వెళ్లబోతున్నాను. అక్కడి వాతావరణానికి నా చర్మంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలియదు. నా చర్మం పాడవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– సునయన, హైదరాబాద్ కెనడా వంటిచోట్ల వాతావరణం బాగా చల్లగా ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం మరింత పొడిబారిపోయే ప్రమాదం ఉంది. సాధారణ సబ్బులు చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి. కాబట్టి మీరు స్నానానికి స్కిన్ పీహెచ్ బ్యాలెన్స్ చేసే మెడికేటెడ్ సబ్బును వాడటం మంచిది. అలాగే మీరు మెడికేటెడ్ మాయిష్చరైజర్ వాడటం కూడా వాడాల్సి ఉంటుంది. దీనివల్ల మీ చర్మం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలతో మీరు మీ చర్మసౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. అమ్మాయికి మొటిమలు వస్తున్నాయి మా అమ్మాయి వయసు 15 ఏళ్లు. ఆమెకు మొటిమలు వస్తున్నాయి. అవి పెరగకుండా ఉండేందుకు ఏమైనా జాగ్రత్తలు ఉంటే చెప్పగలరు.– పద్మ, నిజామాబాద్ టీనేజీలో హార్మోన్ల ప్రభావం వల్ల మొటిమలు రావడం చాలా సాధారణం. కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మొటిమల తీవ్రతను తగ్గించవచ్చు. మొదటగా... ముఖం కడుక్కోడానికి సబ్బు కాకుండా, నాన్సోప్ బేస్డ్ క్లెన్సర్స్ వాడితే మంచిది. అలా చేయడం వల్ల చర్మం పీహెచ్ బ్యాలన్స్ అయ్యి, నూనె గ్రంథులు సరైన విధంగా పనిచేస్తాయి. ముఖం పైన ఏవైనా క్రీమ్స్గానీ లేదా ఇతర ఉత్పాదనలు (ప్రోడక్ట్స్)గానీ వాడే అలవాటు ఉంటే, అవి తప్పనిసరిగా నాన్–కామెడోజెనిక్ అని లేబుల్ చేసినవే వాడాలి. కొంతమందిలో హై గ్లైసిమిక్ ఇండెక్స్ (చక్కెరను తొందరగా విడుదల చేసే పిండిపదార్థాలు) కలిగిన పదార్థాలు తినడం వల్ల కూడా మొటిమలు ఎక్కువగా వస్తాయి. వాటికి దూరంగా ఉండటం లేదా వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మొటిమల తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చు. అంతేకాదు... వాటి కారణంగా వచ్చే మచ్చలు (స్కారింగ్), పిగ్మెంటేషన్ని కూడా అదుపు చేయవచ్చు. చుండ్రు ఎందుకు వస్తుంది? నా వయసు 30 ఏళ్లు. నాకు జుట్టు నుంచి చుండ్రు విపరీతంగా రాలుతోంది. దాంతో నలుగురిలోకి వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉంటోంది. యాంటీ–డాండ్రఫ్ షాంపూలు వాడుతున్నప్పటికీ ప్రయోజనం కనబడటం లేదు. అసలు డాండ్రఫ్ ఎందుకు వస్తుంది? దాన్ని తగ్గించడం ఎలా?– ప్రసాద్, సికింద్రాబాద్ చుండ్రు (డాండ్రఫ్) రావడానికి చాలా కారణాలు ఉంటాయి. సాధారణంగా చర్మంపై గల మలస్సేజియా అనే సూక్ష్మజీవి కారణంగా చర్మంపై రియాక్షన్ వచ్చి డాండ్రఫ్ వస్తుంటుంది. శరీరంలో నూనె గ్రంథులు (ఆయిల్ గ్లాండ్స్) ఎక్కువగా ఉండే చోట చుండ్రు ఎక్కువగా వస్తుంది. ఉదాహరణకు చర్మం (స్కాల్ప్), వీపుభాగం, ముఖం వంటి చోట్ల ఎక్కువగా వస్తుంటుంది. ఇలా శరీరం రియాక్ట్ అవ్వడానికి ఒత్తిడి (స్ట్రెస్), ఆహారపు అలవాట్లు, జీవనశైలి విధానాల వంటివి ముఖ్య కారణాలు. ఉప్పునీరు ఉపయోగించడం, కఠినమైన రసాయనాలు ఉన్న ఉత్పాదనలు వాడటం కూడా డాండ్రఫ్ పెరగడానికి కారణమవుతుంది. మీరు ఒకసారి డాక్టర్‌ను (చర్మవ్యాధి నిపుణులను) సంప్రదించండి. వారు మీకు తగిన / సరిపడే యాంటీ–ఫంగల్ లోషన్స్‌తో తగిన చికిత్సను సూచిస్తారు.డాక్టర్ సుభాషిణి జయం, కన్సల్టెంట్ మెడికల్ కాస్మటాలజిస్ట్, ఎన్ఛాంట్ మెడికల్ కాస్మటాలజీ క్లినిక్, శ్రీనగర్‌కాలనీ, హైదరాబాద్ -
చెదిరిన నవ్వు..చెమర్చిన కళ్లు!
కర్నూలు ,ఆళ్లగడ్డ: ఇంటి దగ్గరయితే అమ్మ శుభ్రంగా స్నానం చేయించి...చక్కగా తలదువ్వి..దిష్టిచుక్క పెట్టి..బాగా చదువుకోవాలని పిల్లలను దీవించి పాఠశాలకు పంపుతుంది. హాస్టళ్లలో ఉండే బాలబాలికలకు ఈ పని ఎవరు చేయాలి? వారి వ్యక్తిగత శుభ్రతకు ఎవరు హామీ ఇవ్వాలి? ఈ ప్రశ్నలకు ఎవరినడిగినా ప్రభుత్వమే అని సమాధానం వస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఈ పని చేయడం లేదు. కాస్మోటిక్ చార్జీలు చెల్లించకుండా..కిట్లు ఇవ్వకుండా చోద్యం చూస్తోంది. చెదిరిన నవ్వుతో..చెమర్చిన కళ్లతో తరగతులకు హాజరవ్వడం విద్యార్థినుల వంతవుతోంది. కస్తూర్బా విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న బాలికలందరూ బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలే. కాస్మోటిక్ చార్జీల కింద ఇచ్చే రూ. 100 వారి బ్యాంక్ అకౌంట్‌కు జమ అవుతోంది. ఆ మొత్తాన్ని తల్లిదండ్రులు వాడుకుంటున్నారని, విద్యార్థినులు కనీస అవసరాలకు సరిపడా వస్తువులు కూడా కొనుగోలు చేయలేకపోతున్నారని ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థినులకు అవసరమైన కాస్మోటిక్ వస్తువులు అన్నీ కొనుగోలు చేసి ప్రతి మూడు నెలనెలకోసారి నేరుగా కిట్లను సరఫరా చేస్తామని ప్రకటించింది. గత విద్యాసంవత్సరం మార్చినుంచి కిట్ల పంపిణి మొదలు పెట్టింది. మార్చి నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని 53 కస్తూర్బా విద్యాలయాలకు ఒక్కో పాఠశాలకు ఒక్క సారి మాత్రమే సరఫరా చేశారు. కిట్లను సరఫరా చేసినప్పుడు వాటిని చూసిన బాలికలు ఎంతో ఆనంద పడ్డారు. అయితే వారి ఆశలు ఎన్నో రోజులు కొనసాగలేదు. ఒక్కసారి సరఫరా చేసిన ప్రభుత్వం అటు తరువాత ఆ ఊసే ఎత్తడం లేదు. పాఠశాలలు పునఃప్రారంభమై ఆరునెలలు కావస్తున్నా ఇంతవరకు కిట్లు కాని కాస్మోటిక్ చార్జీలు కాని ఇవ్వడం లేదు. కిట్స్‌లో ఉండాల్సిన వస్తువులివే... స్నానపు సబ్బులు 6, దుస్తులు ఉతికే సబ్బులు 4, కొబ్బెరనూనె సీసీ 1, డెటాల్ 1, బాడీలోషన్ 1, డిజర్జంట్ పొడి 1, దువ్వెన, పౌడర్ డబ్బా, టూత్ పేస్టు, బ్రష్, టంగ్ క్లీనర్, ప్లాస్టిక్ దువ్వెన, బొట్టు బిల్లలు, ష్యాంపు పాకెట్లు, నైలాన్ రిబ్బన్లు, హెయిర్బ్యాండ్లు, ఆలౌట్.. తదితర 15 రకాలు ఉంటాయి. ఇవీ ఇబ్బందులు.. కిట్లు అందక పోవడంతో విద్యార్థినులు చెదిరిన జుట్టు, మాసిన దుస్తులతోనే తరగతులకు హాజరవుతున్నారు. కొందరు తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లి దాచుకున్న సొమ్మును బాలికలకు ఇస్తున్నారు. ఈ డబ్బుతో సబ్బులు, కొబ్బెరనూనె, పేస్టు తదిత వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఈ డబ్బులు కూడా లేని నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలు తమ బాధను చెప్పులేక పోతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం గతేడాది జనవరి నుంచి కాస్మోటిక్ చార్జీలు ఇవ్వకుండా కిట్స్ ఇచ్చారు. అయితే కాంట్రాక్టర్లు ఒక్కో కేజీబీవీకి ఒక్కోసారి మాత్రమే సరఫరా చేశారు. తరవాత ఇవ్వలేదు. విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.– నాగేశ్వరి, బాలికల సంరక్షణ అధికారి (జీసీడీఓ) ఇంటి నుంచి తెచ్చుకుంటున్నాం గత సంవత్సరం నుంచి కాస్మోటిక్స్ చార్జీలు చెల్లించడం లేదు. పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కాస్మోటిక్ కిట్ ఇచ్చారు. అవీ అప్పుడే అయిపోయినాయి. అప్పటి నుంచి సబ్బులు, నూనె ఇతర వస్తువులు ఇంటిదగ్గర నుంచే తెచ్చుకుంటున్నా. – రజియాబీ, విద్యార్థిని దుస్తులు శుభ్రం చేసుకోవాలంటే ఇబ్బందులు పాఠశాలలో ఉండే వారందరమూ నిరుపేదలమే. కాస్మోటిక్ చార్జీలు కాని, కిట్లుగాని ఇవ్వక పోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా అమ్మనాన్నలు కూలి పనులకు వెళ్లి సంపాదించిన సొమ్ములతో నూనె ఇతర సామగ్రి కొనుగోలు చేసి పంపుతున్నారు. దుస్తులు శుభ్రం చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. సబ్బులు లేక ఉత్త నీళ్లతో ఉతుక్కుంటున్నాం. – మహేశ్వరి, విద్యార్థిని -
ఫంగస్ ఫ్యాక్టరీలు వచ్చేస్తున్నాయి...
వస్త్రం మొదలుకొని రోజువారీ వ్యవహారాల్లో మనం వాడే కాస్మోటిక్స్, సబ్బుల వంటి అనేక వస్తువుల తయారీకి మూల పదార్థం ముడిచ మురు! ఈ చమురేమో పర్యావరణానికి హాని కలిగించేది. ఈ నేపథ్యంలో ఫ్రాన్హోఫర్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కేవలం ఫంగస్ సాయంతో వాణిజ్యస్థాయిలో ఇలాంటి ఉత్పత్తులన్నింటినీ సిద్ధం చేసేందుకు ఓ వినూత్న టెక్నాలజీని అభివద్ధి చేశారు. బ్రెడ్‌లాంటి వాటికి పట్టే బూజు గురించి మీకు తెలిసే ఉంటుంది. తెల, పచ్చ రంగుల్లో ఉండే ఈ బూజే ఫంగస్. ఆస్పెర్గిల్లస్ అనేది ఫంగస్ జాతిలో ఒకటి. వీటికున్న ప్రత్యేకత ఏమిటో తెలుసా? కార్బన్‌డైయాక్సైడ్ వంటి విషవాయువులేవీ విడుదల చేయకుండానే ఇవి అనేక రకాల రసాయనాలను తయారు చేయగలవు. కాకపోతే ఇప్పటివరకూ వీటిని వాణిజ్య స్థాయిలో తయారు చేయడం మాత్రం వీలు కాలేదు. ఈ నేపథ్యంలో ఫంగస్‌కు అవసరమైన ఆహారంలో మార్పులు చేయడం ద్వారా నిర్దిష్టమైన రసాయనాలను ఉత్పత్తి చేయవచ్చునని ఫ్రాన్హోఫర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. తగిన విధంగా వాడుకుంటే ఫంగస్ ద్వారా మాలిక్ ఆసిడ్ నుంచి పాలియేస్టర్ల వరకూ అనేక రసాయనాలను ఉత్పత్తి చేయవచ్చునని వీరు అంటున్నారు. -
చర్మకాంతికి చక్కటి చిట్కా
ఎంత ఖరీదైన కాస్మొటిక్స్ వాడినా ముఖం నిగారింపును కోల్పోతుందా? ఎన్ని లోషన్స్ మార్చినా కళతప్పుతుందా? అయితే చక్కటి సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌లను నమ్ముకోండి. ఇలా ప్రయత్నించండి. ఫేస్‌ప్యాక్ వేసుకునే ముందు క్లీనప్ చేసుకుని, స్క్రబ్ చేసుకుని, ఆవిరి పట్టించుకుంటే వెంటనే ఫలితం కనిపిస్తుంది. కావల్సినవి : క్లీనప్ : పాలు – 1 టేబుల్ స్పూన్బియ్యప్పిండి – 2 టీ స్పూన్లు, తేనె – పావు టీ స్పూన్ స్క్రబ్ : కొబ్బరి నూనె – 3 టీ స్పూన్లు, పంచదార – ఒకటిన్నర టీ స్పూన్లు, పచ్చిపసుపు – పావు టీ స్పూన్ (పసుపు కొమ్ము), పెరుగు – అర టీ స్పూన్ మాస్క్ : టమాటా జ్యూస్ – అర టేబుల్ స్పూన్పుదీనా గుజ్జు – 4 టీ స్పూన్లు, ముల్తాని మట్టి – 2 టీ స్పూన్లు తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని పాలు, బియ్యప్పిండి, తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి నూనె, పంచదార, పచ్చిపసుపు, పెరుగు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు టమాటా జ్యూస్, పుదీనా గుజ్జు, ముల్తాని మట్టి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
భేషైన చిట్కా
కోమలమైన చర్మాన్ని పొందేటందుకు, చర్మకాంతిని రెట్టింపు చేసుకునేటందుకు సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలే భేషైనవంటున్నారు నిపుణులు. ఖరీదైన కాస్మొటిక్స్ కంటే ఇంటి పట్టున దొరికే పసుపు, పెరుగు వంటి పదార్థాలతో తయారుచేసుకునే లేపనాలే చర్మానికి అన్నివిధాలుగా మంచివంటున్నారు. ముఖంలో మెరుపు రావాలంటే ఓన్లీ ఫేస్‌ప్యాక్‌లే కాదు స్క్రబ్ చేసుకోవడం, క్లీనప్ చేసుకోవడం వంటివి తప్పనిసరి. ఇక ఆవిరి పట్టించుకోవడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : టమాటా జ్యూస్ – 2 టీ స్పూన్స్, క్యారెట్ జ్యూస్ – 2 టీ స్పూన్స్, పాలు – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు స్క్రబ్ : ఓట్స్ లేదా బియ్యప్పిండి – 1 టేబుల్ స్పూన్, గడ్డ పెరుగు – అర టేబుల్ స్పూన్నిమ్మరసం – 1 టీ స్పూన్ మాస్క్ : మొక్కజొన్న పిండి – 3 టీ స్పూన్స్, తులసి ఆకుల గుజ్జు – 1 టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్, చిక్కటి పచ్చి పాలు – 3 టీ స్పూన్స్ తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని టమాటా జ్యూస్, క్యారెట్ జ్యూస్, పాలు, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్ లేదా బియ్యప్పిండి ఒక బౌల్లోకి తీసుకుని అందులో గడ్డ పెరుగు, నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని ముఖానికి అప్లై చేసుకుని, మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని, ఐదు నిమిషాల పాటు ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్న పిండి, తులసి ఆకుల గుజ్జు, తేనె, పచ్చిపాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని, ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల పాటు బాగా ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
ఆరోగ్యకరమైన ఆహారంతోనే మేనికి మేలైన నిగారింపు!
స్కిన్ కౌన్సెలింగ్ నా వయసు 18 ఏళ్లు. నాకెందుకో కాస్మటిక్స్ అంటే ఇష్టం ఉండదు. చర్మానికి శాశ్వతమైన మెరుపు రావాలంటే అది నేచురల్‌గానే మెరుస్తుండాలన్నది నా కోరిక. మంచి డైట్‌తోనే చర్మానికి మంచి నిగారింపు వచ్చేందుకు మార్గాలు చెప్పండి. – సుష్మా, హైదరాబాద్ మీరన్నది వాస్తవమే. కాస్మటిక్ ద్వారా వచ్చే నిగారింపు కాసేపే ఉంటుంది. అదే నేచురల్‌గానే మేనిలో మెరుపు ఉంటే దానికి మేకప్‌తో గానీ, కాస్మటిక్స్తోగాని ప్రమేయం ఉండదు. ఆరోగ్యకరమైన కొన్ని ఆహారాలతో మేనిలో స్వాభావికంగానే మెరుపు వచ్చేలా చేసుకోగలగడం సాధ్యమే. అయితే కొన్ని ఆహారాలు చర్మం మెరుపును తగ్గించేందుకు అవకాశం ఉంది. ఆ రెండు ఆహారాల వివరాలు... మేనికి మేలు చేసే ఆహారాలు ఆహారం: తాజా చేపలు, అవిశెలు, బాదం... వీటిల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ప్రయోజనం: ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉండేలా చేస్తాయి. కాస్త గరుగ్గా ఉండే చర్మాన్ని నుపుపుగా చేసేందుకు దోహదపడతాయి. ఆహారం: ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, బార్లీ, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్స్ వీటిల్లో పీచు పదార్థాలు ఎక్కువ. ప్రయోజనం: శరీరంలోని విషాలను తొలగించి బయటకు పంపుతాయి. (డీ–టాక్సిఫై చేస్తాయి). ఇందులోని పీచు పదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి. ఆహారం:వైటమిన్–బి6 ఎక్కువగా ఉండే ఆహారమైన క్యారెట్‌తో పాటు కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్నట్, అవకాడో ప్రయోజనం: హార్మోన్లలోని అసమతౌల్యత వల్ల వచ్చే మొటిమలను వైటమిన్–బి6 నివారిస్తుంది. హార్మోన్ల సమతౌల్యత సక్రమంగా ఉండేలా సహాయపడుతుంది. ఆహారం: ఆపిల్, అరటి, నారింజ, జామ వంటి అన్ని రకాల తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ప్రయోజనం: చర్మాన్ని ముడతలు పడేలా చేసే ఫ్రీ–రాడికల్స్‌ను తొలగించడానికి యాంటీఆక్సిడెంట్లు ఉపయోగపడతాయి. అందుకే చర్మం చాలాకాలం పాటు యౌవనంగా ఉండాలంటే తాజా పండ్లు తినాలి. చర్మానికి కీడు చేసే పదార్థాలు ఆహారం: కాఫీ, టీ, శీతలపానియాలు, కోలా డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్. కీడు: వీటిల్లో కెఫిన్ పాళ్లు ఎక్కువ. ఇది చర్మంలో నుంచి తేమను సంగ్రహించి చర్మం పొడిబారి కనిపించేలా చేస్తుంది. కెఫిన్ ఒంట్లోని నీటిని తొలగిస్తుంది కాబట్టి విషాలు పేరుకుపోయే అవకాశాలు ఎక్కువ. ఆహారం: చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలైన చాక్లెట్లు, సోడా డ్రింక్స్, భోజనం తర్వాత తినే తీపి పదార్థాలు, స్వీట్స్ ఎక్కువగా ఉండే పానియాలు. కీడు: తీపి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఇన్ఫ్లమేషన్ అవకాశాలను పెంచుతుంది. తీపి ఎక్కువగా ఉండే ఆహారంతో మొటిమలు వస్తాయి. ఆహారం: బేకరీ ఫుడ్స్, బర్గర్స్, నిల్వ ఉంచి తీసుకునే క్యాన్డ్ ఫుడ్. కీడు: ఇందులో అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఎక్కువ. అవి చర్మసౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. చర్మం త్వరగా ముడుతలు పడేందుకు దోహదం చేస్తాయి. ఆహారం: నూనె పదార్థాలు, వేపుళ్లు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఉపయోగించే మార్జరిన్ నూనె ఉపయోగించిన పదార్థాలు. కీడు : ఇందులో ట్రాన్స్–ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి రక్తంలో కొవ్వు పదార్థాలను పెంచి చర్మంపై మొటిమలు పెరిగేందుకు దోహదం చేస్తాయి. -
సౌందర్యపు మెరుపులు
సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్సే ముఖానికి సరికొత్త మెరుపునందిస్తుంది. మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ కాస్మొటిక్స్ కంటే ఇంటిపట్టునే సిద్ధం చేసుకోగల చిన్న చిన్న చిట్కాలే అసలైన అందాన్ని సొంతం చేస్తాయి. అయితే కాస్త సమయం ముఖసౌందర్యానికి కేటాయించాల్సి ఉంటుంది. కేవలం ఫేస్ ప్యాక్సే కాకుండా క్లీనప్, ఆవిరి పట్టడం, స్క్రబ్ చేసుకోవడం మంచిది. ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలిగిపోయి, ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. జిడ్డు, నల్లటి మచ్చలు తగ్గి గ్లోయింగ్ వస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : ఆలీవ్ నూనె – టీ స్పూన్, నిమ్మరసం – అర టీ స్పూన్, రోజ్ వాటర్ – అర టీ స్పూన్కొబ్బరి పాలు – పావు టీ స్పూన్ స్క్రబ్ : దానిమ్మ గుజ్జు – 3 టీ స్పూన్, కొబ్బరి నూనె – అర టీ స్పూన్, తేనె – పావు టీ స్పూన్ చిక్కటి పచ్చిపాలు – 1 టీ స్పూన్ మాస్క్ : స్ట్రాబెరీ గుజ్జు – 2 టీ స్పూన్స్, ఖర్జూరం గుజ్జు – 2 టీ స్పూన్స్, టమాటా జ్యూస్ – 3 టీ స్పూన్స్, పెరుగు – పావు టీ స్పూన్ తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో ఆలీవ్ నూనె, నిమ్మరసం, రోజ్ వాటర్, కొబ్బరి పాలు వేసుకుని, బాగా కలుపుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దానిమ్మ గుజ్జు, పాలు, కొబ్బరి నూనె, తేనె ఒక బౌల్లోకి తీసుకుని, బాగా మిక్స్ చేసుకుని మూడు నుంచి ఐడు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత ముఖం చల్లని వాటర్‌తో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు స్ట్రాబెరీ గుజ్జు, ఖర్జూరం గుజ్జు ఒక బౌల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమంలో టమాటా జ్యూస్, పెరుగు కూడా యాడ్ చేసుకుని, బాగా మిక్స్ చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
నత్తలను సంతోష పెట్టండి.. సంతోషంగా ఉండండి
బ్యాంకాక్ : నత్తలను సంతోష పెట్టండి.. మీరు కూడా సంతోషంగా ఉండండి. ఇది నేను చెబుతున్న మాట కాదు థాయ్‌లాండ్‌లోని ప్రముఖ కాస్మోటిక్ కంపెనీలు చెబుతున్న మాట. ఎలాగంటారా?.. థాయ్‌లాండ్‌లో నత్తలతో చేసే వైద్యం బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ఈ మధ్య నత్తల నుంచి ఉత్పత్తి అయ్యే శ్లేష్మానికి కూడా విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో నత్తలను పెంచడానికి థాయ్ రైతులు ఎగబడిపోతున్నారు. కాస్మోటిక్ కంపెనీలు సైతం నత్తల శ్లేష్మం కోసం ఎక్కువ డబ్బు కేటాయిస్తున్నారు. అంతేకాదు రైతులను కూడా నత్తల పెంపకంపై తగిన శ్రద్ధ తీసుకునేలా శిక్షణ ఇస్తున్నాయి. ఈ నత్తల శ్లేష్మంతో తయారైన క్రీములకు దేశ విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉండటంతో డబ్బుకు వెనకాడటం లేదు కంపెనీలు. నత్తల పెంపకంలో స్థిరపడ్డ రైతులు నెలకు వేలల్లో ఆదాయం వస్తోంది. థాయ్‌లాండ్ ప్రజల కనీస ఆదాయానికి మించి ఐదు రెట్లు ఎక్కువ లాభాలు పొందుతున్నారు అక్కడి నత్తల రైతులు. నత్తలను ఆహ్లాదకరమైన వాతారణంలో పెంచడం ద్వారా వాటి నుంచి ఉత్పత్తి అయ్యే శ్లేష్మం కూడా నాణ్యంగా ఉంటుందని, నాణ్యమైన శ్లేష్మానికి ఎక్కువ ధర ఉంటుందని థాయ్ రైతులు అంటున్నారు. ఈ వ్యాపారానికి ఎలాంటి పెట్టుబడి లేకపోవడం కూడా రైతులను ఆకర్షిస్తోంది. దక్షిణ కొరియా, చైనా, థాయ్‌లాండ్ తదితర దేశాలలో ఉపయోగించే సౌందర్య ఉత్పత్తుల్లో నత్తల శ్లేష్మాన్ని ఎక్కువగా వాడుతుంటారు. -
ఉన్న రంగే బంగారం
మార్కెటింగ్ స్కిల్స్ మనిషి మైండ్‌సెట్‌ని సమూలంగా మార్చేస్తాయి. ఉప్పు పండించే రైతు తన గోనెసంచిలోని ఉప్పు పారబోసి జలజలరాలే ప్యాకెట్ ఉప్పు కొనేటట్లు చేస్తాయి. మామిడి రైతు తన తోటలోని పండ్లను పక్కకు తోసేసి బాటిల్లో నిల్వ చేసిన జ్యూస్ తాగి ‘తాజా’ మామిడి రుచి అని లొట్టలేసేటట్లు చేస్తాయి. ఇక ఫెయిర్‌నెస్ క్రీమ్లైతే మనిషిలో స్వతహాగా, సహజంగా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని సమూలంగా పెకలించి పారేస్తాయి. వాటిని రాసుకుని అద్దంలో చూసుకుంటూ ‘ఆ క్రీమ్లే ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేస్తాయన్నంతగా, ఉద్యోగం తెచ్చి పెడతాయన్నంతగా’ సూడో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేలాగానూ చేస్తాయి. వాటిని రాసుకుంటే స్పోర్ట్స్‌లో చాంపియన్ అయిపోవచ్చన్నంతగా భ్రమింపచేస్తాయి. నిజానికి స్పోర్ట్స్ పర్సన్ ఎవరూ ఈ భ్రమకు లోనుకారు కానీ యాడ్ చూసి సాధారణ అమ్మాయిలు మనసు పారేసుకుంటున్నారు. చాప కింద నీరులా సమాజం మీద ఫెయిర్‌నెస్ క్రీములు చేస్తున్న దాడి అంతా ఇంతా కాదు. రౌడీమూకల నుంచి వెయ్యికళ్లతో కాపు కాచి ఆడపిల్లల్ని కాపాడుకోవచ్చేమో కానీ, ఫెయిర్‌నెస్ క్రీముల నుంచి కాపాడుకోవడం తల్లిదండ్రుల వల్ల కావడం లేదు. అందుకే మహారాష్ట్రలో ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఈ క్రీమ్‌ల తయారీ మీద ప్రత్యేక నిఘా పెట్టాలని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కేంద్రానికి తెలియచేసింది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా అవసరానికి మించినన్ని క్రీమ్‌లు దొరుకుతున్నాయిప్పుడు. దుకాణాలకెళ్లి పది రూపాయలు పెట్టి ఒక ట్యూబ్ కొనేస్తున్నారు అమ్మాయిలు. వాటిని వాడటం వల్ల ఎదురయ్యే సమస్యల గురించి వాళ్లకు తెలియదు, చెప్పేవాళ్లు ఉండరు. కొనరాదే తల్లీ! డ్రగ్ అండ్ కాస్మటిక్ రూల్స్, 1945 ప్రకారం కేంద్రప్రభుత్వం షెడ్యూల్ హెచ్ కేటగిరీ ప్రకారం ఫెయిర్‌నెస్ క్రీముల్లో 14 రకాల స్టెరాయిడ్స్‌కు అనుమతిచ్చింది. ఆ తర్వాత కాలక్రమేణా మరికొన్ని రకాలకు అనుమతిస్తూ వచ్చింది. డ్రగ్ అడ్వైజరీ బోర్డు సూచనల మేరకే ఈ నిర్ణయం జరిగింది. అలాగే షెడ్యూల్ హెచ్... ఈ క్రీములను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మరాదనే నిబంధన కూడా పెట్టింది. ఇప్పుడు అనుమతి ఉన్నవి లేనివీ తేడా తెలుసుకోలేనంతగా కలగాపులగమైపోయాయి క్రీములు. పైగా అవి మార్కెట్లో ‘అమ్మేది మేము కొనేది మీరు. మధ్యలో డాక్టర్ చెప్పేదేముంది?’ అన్నంతగా రాజ్యమేలుతున్నాయి. క్రీమ్ పేరులో స్పెల్లింగ్ తెలియని పిల్లలు కూడా ఆ క్రీమ్‌లను వాడేస్తున్నారు. చాలాచోట్ల ప్రజాదరణ పొందిన క్రీమ్ పేరును కొద్దిగా మార్చి అదే ఉచ్ఛారణనిచ్చే నకిలీలు ఉంటున్నాయి. ఇంగ్లిష్ బాగా తెలియకపోతే వాటిని గుర్తించడమూ కష్టమే. అలాంటి వాళ్లకు ఆ క్రీముల తయారీలో ఏమేం వాడారో తెలుసుకోవడం సాధ్యమయ్యే పని ఏ మాత్రం కాదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర వేసిన ముందడుగు ఇది. ప్రభుత్వాలు ఎన్ని అడుగులు వేసినా సరే, వాటిని అమ్మరాదని వ్యాపారుల్లో, కొనరాదని ఆడపిల్లల్లో చైతన్యం వచ్చినప్పుడే నష్టనివారణ జరుగుతుంది. ఆ చైతన్యం వచ్చినప్పుడే అమ్మాయిల మీద క్రీముల హానికారక దాడికి కళ్లెం పడినట్లు. అయినా అందానికి నిర్వచనం ఏమిటి? తెల్లదనంలోనే అందం ఉందనేటట్లు సమాజాన్ని ట్యూన్ చేసిందెవరు? ‘అసలైన అందం మెండైన ఆత్మవిశ్వాసంలోనే ఉంటుంది, మేనిరంగులో కాదు’ అని కొత్తగా ట్యూన్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ల మీదనే ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఫెయిర్‌నెస్ క్రీములను చర్మాన్ని తెల్లబరుస్తాయనే నమ్మకంతో వాడుతుంటారు. నిజానికి ఈ క్రీమ్‌లు ఏం చేస్తున్నాయంటే... అనేక చర్మ సమస్యలకు కారణమవుతున్నాయి. హార్మోన్ సమస్యలకూ కారణమవుతుంటాయి. క్రీముల్లో ఉండే బెక్లామెథాసోన్, బీటామెథాసోన్, డిసోనైడ్ వంటి స్టెరాయిడ్స్ చర్మం ద్వారా దేహంలోకి ఇంకుతాయి. వీటి కారణంగా చర్మం పిగ్మెంటేషన్ (మంగు)కు గురవుతుంది. వీటి వాడకం ఎక్కువయ్యే కొద్దీ... చర్మం పలుచబారడం, మంటగా అనిపించడం, మొటిమలు, కొద్దిపాటి ఎండలోకి వెళ్లినా భరించలేకపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని డాక్టర్ కిరణ్ నబర్ చెప్తున్నారు. – మంజీర -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పువ్వు...
ఈ భూభాగంలో అత్యంత ఆకర్షణీయమైనది, అద్భుత ఔషధ గుణాలు కలిగిది, సుగంధ ద్రవ్యాలలో అత్యంత ఖరీదైనది కుంకుమపువ్వు. ఈ పేరు వినగానే మనకు వెంటనే కాశ్మీర్ గుర్తుకు వస్తుంది. నిజానికి కుంకుమపువ్వు స్వస్థలం దక్షిణ ఐరోపా! అక్కడ నుంచే వివిధ దేశాలకు విస్తరించింది. గ్రీసు, స్పెయిన్, ఇరాక్, ఇటలీ, సిసిలీ, టర్కీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లోనూ దీన్ని ఎక్కువగా పండిస్తారు. అయితే, అన్నింటిలోకి కాశ్మీరీ కుంకుమపువ్వు నాణ్యమైనది. క్రీ.పూ. 500 సంవత్సరాలకు ముందే మన దగ్గర దీని ప్రస్తావన ఉంది. వేదకాలపు సంస్కృతిలోనూ ప్రముఖమైన సౌందర్యపోషణ ద్రవ్యమిది. వంటకాలకు ప్రత్యేకమైన రంగు, రుచిని ఇస్తుంది. నాటి రాచరిక కాలపు దర్పణానికి చిహ్నం ఈ కుంకుమ పువ్వు. ఈ పువ్వు రుచికి కొద్దిగా చేదుగా, కొద్దిగా తియ్యగా ఉంటుంది. కుంకుమపువ్వు అందించే మొక్కలను ప్రత్యేకంగా పెంచుతారు. పువ్వు మధ్య ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వు తయారుచేస్తారు. ఒక కిలో కుంకుమపువ్వు తయారుచేయాలంటే కనీసం రెండు లక్షల పూలు అవసరమవుతాయి. తిండి గోల -
వస్తాదులు ముస్తాబవుతున్నారు...
మగాడంటే... ఒకప్పుడు వస్తాదులా ఉండాలి. మరిప్పుడో..! ముస్తాబై ఉండాలి. ఎప్పుడో చెప్పారు బ్రహ్మంగారు... వారు వీరవుతారని... వీరు వారవుతారని... ఆయన ఏం ఊహించుకుని అన్నారో తెలీదు గానీ, అందచందాల విషయంలో మాత్రం మగాళ్లు ఇప్పుడు శ్రద్ధ పెంచుతున్నారు. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నారు. ‘వారేవా... ఏమి ఫేసు... అచ్చం హీరోలా ఉంది బాసూ’ అనేలా తయారవుతున్నారు. సౌందర్య పోషణ ఆడాళ్లకే పరిమితమా..? మగాళ్లకు మాత్రం ఉండొద్దూ..? పౌడర్లు, క్రీములు వగైరాలన్నీ ఆడాళ్లకే ప్రత్యేకమా..? మగాళ్లకు అక్కర్లేదూ..? ఇంకెన్నాళ్లు ఈ వివక్ష..? అని ప్రశ్నిస్తున్నారు మగమహారాజులు. ప్రశ్నించే మగపుంగవుల ఆక్రోశాన్నీ, ఆవేదనను అర్థం చేసుకున్న మార్కెట్ శక్తులు... ఇదిగిదిగో... మీ కోసం మేమున్నాం... మరేం ఫర్వాలేదు అంటూ ముందుకొస్తున్నాయి. ‘మగాళ్లకు మాత్రమే’ పౌడర్లు, క్రీములు వగైరా ఉత్పత్తులతో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. సహజంగానే కళాపోషకులైన పురుషపుంగవులు సదరు ఉత్పత్తులను సాదరంగా సొంతం చేసుకుంటున్నారు. మేని మెరుపుల కోసం ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా తమ సౌందర్య పిపాసను చాటుకుంటున్నారు. సౌందర్య పోషణలో కొన్నేళ్లుగా పురుష ‘ప్రపంచ దృక్పథం’ మారింది. అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాల్లోనే కాదు, మన దేశంలో కూడా. పైగా, మన దేశంలో ధవళకాంతులతో అలరారే మేనిఛాయకే అగ్రతాంబూలం. సూటిగా చెప్పాలంటే, మనోళ్లకు తెల్లతోలుపై మోజెక్కువ. సౌందర్య పోషక ఉత్పత్తులను తయారు చేసే బడా కార్పొరేట్ సంస్థలన్నీ, ఈ బలహీనతను సొమ్ము చేసుకునేందుకు పోటాపోటీగా కొత్త కొత్త ఉత్పత్తులతో మన మగమహారాజులను ఊరిస్తున్నాయి. ఇదే అదనుగా మహానగరాలు మొదలుకొని చిన్న చిన్న పట్టణాల్లో సైతం సందు సందునా మెన్స్ బ్యూటీపార్లర్లు, సెలూన్లు, స్పాలు వెలుస్తున్నాయి. మెన్స్ పార్లర్లు, సెలూన్లలో వినియోగించే క్రీములు, పౌడర్లు, బ్లీచింగ్ ప్రక్రియల వల్ల మేనిఛాయ తాత్కాలికంగా మెరుగుపడినా, ఆ తర్వాత వాటి దుష్ర్పభావాల ఫలితంగా చర్మంపై నల్లని పొరలా ఏర్పడటం, మొటిమలు ఏర్పడటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటి ఇబ్బందులు పడే పురుష పుంగవులు ఎలాంటి సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తే ఏమవుతుందో తెలియని భయంతో కుంగిపోతుండటం కూడా మామూలే. చర్మతత్వానికి తగిన మేలిరకం సౌందర్య పోషక ఉత్పత్తులను వినియోగించడం, సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి కొద్దిపాటి జాగ్రత్తలతో మగ మహారాజులు సోగ్గాళ్లలా వెలిగిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి కాకుండా వృత్తి, ఉద్యోగాల రీత్యా పురుషుల చర్మసౌందర్యాన్ని దెబ్బతీసే రకరకాల సమస్యలు, వాటి నివారణ మార్గాలపై నిపుణులు ఏం చెబుతున్నారంటే... ఖతర్నాక్ కాలుష్యం వృత్తి, ఉద్యోగాల కారణంగా చాలామంది ద్విచక్ర వాహనాలపై గంటల తరబడి ఎండనపడి తిరగడం చాలామందికి అనివార్యం. భవన నిర్మాణ పనుల్లో సిమెంటు, ధూళి సోకే పరిసరాల్లో గంటల తరబడి గడపడం కూడా సమస్యలను తెచ్చిపెడుతుంది. నిత్యం కాలుష్యంబారిన పడేవారికి పాలీమార్ఫిక్ లైట్ ఎరప్షన్ (పీఎంఎల్‌ఈ) ర్యాషెస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ర్యాషెస్ ‘సన్‌బర్న్’ అంత తీవ్రమైన సమస్య కాకపోయినా, నిరంతరం చర్మంపై దురదపెడుతూ ఇబ్బంది కలిగించే సమస్యే. ఇలాంటి సమస్యతో బాధపడేవారు చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత బట్టి పైపూతగా వాడే కార్టికో స్టిరాయిడ్ క్రీములు లేదా నోటి ద్వారా తీసుకునే కార్టికో స్టిరాయిడ్ మాత్రలు ఇస్తారు. ఈ సమస్య రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవాలనుకుంటే, నాణ్యమైన సన్‌స్క్రీన్ ఉపయోగించాలి. గంటల తరబడి ఎండలో ఉండకుండా, వీలైనంత వరకు నీడ పట్టున ఉండేలా చూసుకోవాలి. ముందస్తు ముదిమి వయసు మళ్లడం మొదలయ్యాక చర్మం వదులై, ముఖంపై ముడతలు పడటం ఎవరికైనా సహజమే. కొందరిలో మాత్రం ముప్పయిలు దాటకుండానే ముదిమి లక్షణాలు మొదలవుతాయి. చర్మంలో ఒకదానినొకటి బిగుతుగా అంటిపెట్టుకుని ఉండే కణజాలం బలహీనపడుతూ ఉంటుంది. ఫలితంగా చర్మం వదులై, ముఖాన ముడుతలు దేరి ముసలాళ్లలా కనిపిస్తారు. దీనినే ‘ప్రీమెచ్యూర్ ఏజింగ్’ అంటారు. తెలుగులో చెప్పుకోవాలంటే, ఈ సమస్యను ముందస్తు ముదిమి అనుకోవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించే వారు తీక్షణమైన ఎండకు దూరంగా ఉండాలి. సన్‌బాతింగ్ వంటి చర్యలు ఇలాంటి వారికి అసలు పనికిరావు. ఎండలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్ వాడాల్సి ఉంటుంది. గంటల తరబడి ఎండలో గడపడం తప్పనిసరి అయితే, ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్ అప్లై చేయాల్సి ఉంటుంది. సబ్బు బదులు మాయిశ్చరైజింగ్ బాడీవాష్ వాడటం వల్ల ఫలితం ఉంటుంది. చర్మం బిగుతు సడలకుండా ఉండేందుకు వ్యాయామాలు, మసాజ్‌లు కొంతవరకు దోహదపడతాయి. ఈ సమస్యకు ‘నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ’ చికిత్స కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. వర్ణం చర్మాంతర్యామి పుట్టుకతోనే చర్మానికి రంగు వస్తుంది. దానినెవరూ మార్చలేరు. కొందరిలో వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో అసహజమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. చర్మంపై అక్కడక్కడా నల్లని మచ్చలు ఏర్పడటం, చర్మం గరుకుగా మారడం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కొందరికి ముఖంపై అక్కడక్కడా నల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇవి ఒక క్రమ పద్ధతిలో కాకుండా అడ్డదిడ్డంగా ఉంటాయి. చర్మానికి గాఢమైన రంగునిచ్చే మెననోసైట్స్ ఒకేచోట ఎక్కువగా పోగుపడటం వల్ల ఇలాంటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పరిస్థితిని ‘మెలాస్మా’ అంటారు. ఇక కొందరికి నుదురు, మెడ, బాహుమూలలు, మర్మాయవాల వద్ద చర్మం చాలా నల్లగా మారడమే కాకుండా, దళసరిగా మారుతుంది. ఈ పరిస్థితిని ‘అకాంథోసిస్ నెగ్రికాన్స్’ అంటారు. దీనిని డయాబెటిస్‌కు ముందస్తు సూచనగా కూడా పరిగణిస్తారు. ఇలాంటి అసహజమైన చర్మ సమస్యలు తలెత్తినప్పుడు చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కొందరి చర్మం జిడ్డుగాను, మరికొందరి చర్మం పొడిగాను ఉంటుంది. చర్మం అడుగున ఉత్పత్తయ్యే ‘సీబమ్’ హెచ్చుతగ్గుల కారణంగానే ఇలా జరుగుతుంది. కొందరిలో ముఖంపై జుట్టు మరీ దట్టంగా పెరుగుతుంది. గడ్డం దాదాపు కళ్ల దిగువ వరకు ముఖమంతా కప్పేసినట్లు పెరిగితే చూడటానికి ఇబ్బందిగానే ఉంటుంది. నిపుణులను సంప్రదిస్తే, లేజర్ చికిత్స ద్వారా ఈ సమస్యను చక్కదిద్దుతారు. కొందరిలో కనుబొమలు బాగా పల్చబడిపోవడం లేదా పూర్తిగా లేకుండా పోవడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలకు కూడా ఇప్పుడు తగిన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. - ఇన్పుట్స్: డా. స్మిత ఆళ్లగడ్డ, చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ నీడలో నీటుగాళ్లు ఎండ కన్నెరుగకుండా ఎంతసేపూ నీడపట్టున ఆఫీసుల్లో, ఇళ్లలో కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, టీవీ తెరలకు అతుక్కుపోయి బతికేసే నీటుగాళ్లకు కూడా రకరకాల చర్మ సమస్యలు తప్పవు. గంటల తరబడి ఎండలో గడిపే వాళ్లకు అల్ట్రావయొలెట్ కిరణాల కారణంగా ఎలాంటి హాని జరుగుతుందో, నిత్యం డెస్క్‌టాప్, లాప్టాప్, టాబ్లెట్లు, సెల్ఫోన్లతో బిజీబిజీగా గడిపేసే ఐటీ, బీపీవో ఉద్యోగులకు కూడా అలాంటి దుష్ర్పభావాలే కలుగుతాయి. వారు వాడే ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాల వల్ల చర్మం కాంతి విహీనంగా మారుతుంది. పైగా, నీరెండ అయినా సోకకుండా బతికేయడం వల్ల విటమిన్-డి లోపం ఏర్పడి ఎముకలు కూడా బలహీనపడతాయి. ఈ పరిస్థితిని నివారించడానికి మంచి సన్‌స్క్రీన్ ఉపయోగించడం, తగినంత నీరు తాగడం, తరచు ఖనిజ లవణాలతో కూడిన ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. టీనేజీ కుర్రకారు అందచందాలపై తాపత్రయం టీనేజ్లోనే మొదలవుతుంది. టీనేజ్ కుర్రాళ్లు గంటల తరబడి అద్దం ముందు గడుపుతుంటారు. అమ్మాయిల దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతుంటారు. తమ అభిమాన కథానాయకుల తరహాలో తయారయ్యేందుకు అష్టకష్టాలు పడుతుంటారు. టీవీ, పేపర్లలో కనిపించే ప్రతి యాడ్‌లోని ఉత్పత్తినీ వెంటనే కొనేసి, ముఖాలకు పూసుకుంటూ ఉంటారు. ఇక స్ప్రేలు, సెంట్లు సరేసరి. కుర్రకారులోని ఈ ప్రయోగశీలత ఒక్కోసారి సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. ఎలాంటి పదార్థాలతో తయారు చేశారో, నాణ్యత ఏమిటో తెలుసుకోకుండా హానికరమైన క్రీములు వాడేస్తే, ముఖవర్చస్సు దెబ్బతిని, మొటిమల వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, యాడ్స్ మాయాజాలంలో కొట్టుకుపోకుండా, వైద్యుల సలహాపై తమ చర్మం తీరుకు సరిపడే ఉత్పత్తులనే వాడాలి. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే, తగిన వ్యాయామం చేయడం ద్వారా చర్మ సౌందర్యాన్ని, శరీరాకృతిని కాపాడుకోవచ్చు -
ఆట ఒకటే... దొంగలే వేరు!
ఆ సీన్ - ఈ సీన్ ఏ విషయంలోనైనా అనుసరణ ఉండాలి తప్ప అనుకరణ ఉండకూడదు అంటారు. కానీ ఈ విషయాన్ని సినిమావాళ్లు పట్టించుకోరేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ముఖ్యంగా దొంగాట లాంటి సినిమాలు చూసినప్పుడు ఆ అభిప్రాయం మరింత బలపడుతుంది! జగపతిబాబు, సౌందర్యలతో కోడి రామ కృష్ణ తీసిన ‘దొంగాట’ చిత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. గిలిగింతలు పెట్టే కామెడీ, కంటతడి పెట్టించే సెంటి మెంట్, మనసును తడిమే సన్నివేశాలు, చక్కని సంభాషణలు... అన్నీ కలిసి ‘దొంగాట’లో దర్శకుడిని విజేతగా నిలి పాయి. అయితే నిజానికి... ఈ ఆటను హాలీవుడ్‌వాళ్లు అంతకు ముందే ఆడేశారు. కేట్ కెనడాలో హిస్టరీ టీచర్. ప్రియుడు చార్లీని పెళ్లాడటానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే చార్లీకి బిజినెస్ పనిమీద ప్యారిస్ వెళ్లాల్సి వస్తుంది. ఆమెనూ రమ్మంటాడు కానీ, విమాన ప్రయాణమంటే ఉన్న భయం వల్ల రానంటుంది. అతను వెళ్లిపోతాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి, ప్యారిస్‌లో పరిచయమైన ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డానని చెప్తాడు. షాక్ తిన్న కేట్ ప్యారిస్ బయలుదేరుతుంది. ఫ్లయిట్ ఎక్కాక భయంతో వణికిపోతుంటే, పక్క సీట్లో కూర్చున్న ల్యూక్ మాటల్లో పెట్టి, భయం లేకుండా చేస్తాడు. అతడో దొంగ. తను కొట్టేసి తీసుకెళ్తోన్న డైమండ్ నెక్లెస్‌ని, కస్టమ్స్ వాళ్లు పట్టుకుంటారన్న భయంతో కేట్ లగేజీలో కలిపేస్తాడు. తర్వాత దాని కోసం ఆమెనే అనుసరిస్తాడు. ఆ క్రమంలో కేట్కు అండగా మారతాడు. అతని సాయంతో చార్లీని కలుసుకుంటుంది కేట్. కానీ చార్లీ ఎంత చెడ్డవాడో తెలుసుకుని, అతణ్ని తనతో తీసుకెళ్లాలన్న ఆలోచనను విరమించుకుంటుంది. తగిన బుద్ధి చెప్పి తిరిగి ప్రయాణమవుతుంది. వెళ్లేముందు ల్యూక్ని పట్టుకోవడానికి తిరుగుతోన్న పోలీసాఫీసరుకి తన దగ్గరున్న నెక్లెస్‌ని ఇచ్చేసి, అతణ్ని వదిలేయమంటుంది. వైన్యార్డ్ పెట్టి సెటిలవ్వడానికే ల్యూక్ దొంగతనాలు చేస్తున్నాడని తెలుసుకుని, తను దాచుకున్న డబ్బు మొత్తం అతనికి చెందేలా చేసి బయలుదేరుతుంది. అది పోలీసు ద్వారా తెలుసుకున్న ల్యూక్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి, తన ప్రేమను కేట్కి తెలపడంతో కథ ముగుస్తుంది. ఇది 1995లో విడుదలైన ‘ఫ్రెంచ్ కిస్’ చిత్ర కథ. అచ్చం ‘దొంగాట’ కథలాగే ఉంది కదూ! కథే కాదు... కథనం, సన్ని వేశాలు అన్నీ అచ్చు గుద్దినట్టే ఉంటాయి. నటీనటులు, ప్రదేశాలే మారతాయి. హాలీవుడ్లో హీరోయిన్ మెగ్ ర్యాన్ కెనడా నుంచి ఫ్రాన్స్‌కు వెళ్తుంది. టాలీవుడ్లో సౌందర్య ఓ పల్లెటూరి నుంచి సిటీకి వస్తుంది. మెగ్ ఫ్లయిట్ ఎక్కితే, సౌందర్య రెలైక్కుతుంది. ఆమెకు విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు భయం. ఈమెకు రైలు బ్రిడ్జిమీద వెళ్లేటప్పుడు భయం. ఇలా మన నేటివిటీకి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేశారు తప్ప, మిగతాదంతా సేమ్ టు సేమ్. సినిమా మొత్తం హీరో, హీరోయిన్, ఆమె ప్రియుడు, అతడు ప్రేమించిన అమ్మాయి, పోలీసాఫీసర్... ఈ ఐదు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. కాకపోతే తెలుగులో కొందరు కమెడియన్లను యాడ్ చేశారు. మనకు పాటలూ ముఖ్యం కాబట్టి వాటినీ చేర్చారు. ఇంకే తేడా ఉండదు. ‘దొంగాట’ విడుదలైన తర్వాతి ఏడు హిందీలో కూడా ‘ఫ్రెంచ్ కిస్’ని తీశారు... ‘ప్యార్తో హోనా హీ థా’ పేరుతో. అజయ్ దేవగన్, కాజోల్ జంటగా నటించారు. అది కూడా మక్కీకి మక్కీనే. కాకపోతే అక్కడా హిట్టయ్యింది. ఈ మూడు సినిమాల్లో ఒక్కటి చూసినా మరొకటి చూడక్కర్లేదు. ఎంత కాపీ కొట్టినా మరీ ఇలా జిరాక్స్ కాపీల్లాగా కనిపించే సినిమా మరోటి ఉండదేమో. వేరే భాషలో సక్సెస్ సాధించిన చిత్రం నుంచి స్ఫూర్తి పొంది, మనవాళ్లకూ ఆ సినిమాను అందించాలను కోవడంలో తప్పు లేదు. కాకపోతే కథ మనది కానప్పుడు కనీసం రచయితలు తమ పేరు వేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఆ విషయాన్ని విస్మరించి క్రెడిట్ తీసుకోవడం మాత్రం అన్యాయమే! కొసమెరుపు: సినిమాయే కాపీ అంటే, ‘దొంగాట’లో ఓ పాట కూడా కాపీయే. ‘ఓ చిలకా... రా చిలకా’ అన్న పాట, చాలా యేళ్ల క్రితం వచ్చిన ‘రామ్ తేరీ గంగా మైలీ’ చిత్రంలో ‘సున్ సాహిబా సున్’ అన్న హిట్ పాటకు కాపీ. ఈ చిత్రాలకు ప్రాణం హీరోయిన్ల పర్ఫార్మెన్సే అని చెప్పాలి. ‘ఫ్రెంచ్ కిస్’లో మెగ్ ర్యాన్ నటన శిఖరాగ్ర స్థాయిలో ఉంటుంది. తెలుగులో సౌందర్య కూడా అమాయకమైన అమ్మాయిగా అదరగొట్టింది. హిందీలో కాజోల్ కూడా కంటతడి పెట్టించింది. ఈ కథకు నూరు శాతం న్యాయం జరిగింది, లాభాల పంట పండింది అంటే... అందుకు ముఖ్య కారణం ఈ నటీమణుల అద్భుత నటనే. -
ఇదో రకం టెండర్!
ఎక్కువ మొత్తంలో సరుకులు కొనుగోలు చేస్తే మార్కెట్ ధరకంటే రూపాయో, రెండు రూపాయలో తగ్గించడం సహజం. అదే భారీ మొత్తంలో ఏడాది పాటు కొనుగోలు చేస్తే ఇంకా తగ్గించడం వ్యాపార లక్షణం. అదే టెండర్ల ప్రక్రియలో ఎవరు తక్కువ ధరకు ఇస్తే వారి వద్దే కొంటాం. అయితే గిరిజన సహకారం సంఘం (జీసీసీ) ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలకు పప్పులు, కాస్మోటిక్స్, కూరగాయలు సరఫరా చేయడానికి వేసిన టెండర్లు భిన్నంగా ఉన్నాయి. టెండర్ల విధానానికి విరుద్ధంగా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. నాలుగు రోజుల కిందట ఐటీడీఏలో జరిగిన టెండర్ల ప్రక్రియలో వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో ఈ పరిస్థితి నెలకుందనే విమర్శలు వస్తున్నాయి. సీతంపేట:సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలో 44 గిరిజన సంక్షేమ ఆశ్రమఉన్నత పాఠశాలలు, మూడు వసతిగృహాలు, 22 పోస్ట్‌మెట్రిక్ వసతిగృహాలు, ఒక కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్, మూడు గురుకుల కళాశాలలు, నాలుగు గురుకుల పాఠశాలలు, మూడు కేజీబీవీలు, రెండు మినీ గురుకులాలున్నాయి. వీటిలో 18,850 మంది గిరిజన విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. వీరి మెనూకు అవసరమైన సరుకులన్నీ (కూరగాయలు తప్ప) జీసీసీ ద్వారా సరఫరా చేయాలి. గిరిజన సంక్షేమశాఖ ద్వారా నిధులు వచ్చిన వెంటనే మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి జీసీసీకి చెల్లిస్తుంటారు. అయితే మెనూకు అవసరమైన వస్తువలను టెండర్ ప్రక్రియ ద్వారా జీసీసీ కొనుగోలు చేసి సరఫరా చేస్తుంది. ప్రతీ ఏటా విద్యాసంవత్సరం ఆరంభంలో ఈ తంతు జరుగుతుంది. గతేడాది టెండర్లు వేయకుండానే విజయనగరం జిల్లాలోని టెండర్ ధరలను ఇక్కడ అమలు చేశారు. అయితే టెండర్లప్పుడు ఒక క్వాలిటీ సరుకులను చూపించి అనంతరం సరఫరా చేసినప్పుడు నాశిరకం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. కందిపప్పు వంటి ముఖ్యమైన సరుకులు ఇలానే వసతిగృహాలకు గతంలో సరఫరా చేశారు. అప్పట్లో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖాధికారులు కూడా హాస్టళ్లను సందర్శించినపుడు నాణ్యత లేని కందిపప్పును, ఇతర వస్తువులను తిరస్కరించాలని ఆదేశించారు. ప్రస్తుతం టెండర్‌దారులు కోట్ చేసిన ధరలిలా ఉన్నాయి. జీసీసీ వేసిన టెండర్లలో వ్యాపారులు కోట్ చేసిన ధరలు పరిశీలిస్తే.. కందిపప్పు కిలో రూ. 155కు కోట్ చేశారు. ప్రస్తుతం మండుతున్న ధరల్లోనే కిలో కందిపప్పు రూ.150 ఉంది. అయినా రూ.5 ఎక్కువగా టెండర్ వేయడం గమనార్హం. నెల రోజుల క్రితమైతే కిలో రూ. 108 ఉండేది. ఇప్పుడు టెండర్‌దారులు రూ.155 కోట్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. కారంపొడి కిలో ప్యాకెట్ మార్కెట్లో రూ. 140 లోపు ఉండగా టెండర్ దారులు రూ. 142కి ఖరారు చేశారు. రిన్ సబ్సు రూ.4.55 పైసలు, డాబర్ కొబ్బరి, సంతూర్ సబ్బు చిన్నది మార్కెట్లో రూ.5 ఉండగా కేవలం 50 పైసలు మాత్రమే తగ్గించారు. అదే డిపార్ట్మెంట్ మార్కెట్లో ఒక్కటి కొనుగోలు చేస్తేనే రూపాయి వరకు తగ్గిస్తారు. టెండర్‌దారులు రూ.4.50 పైసలకు కోట్ చేశారు. పది రూపాయల టూత్ పేస్ట్ రూ.8.50 ధర ఖరారయ్యింది. నూనె రూ.23.75 పైసలు, (వంద గ్రాములు), లీటర్ పామాయిల్ ప్యాకెట్ రూ.47, పెసరపప్పు కిలో రూ. 102, గుడ్‌మిల్క్ ప్యాకెట్ రూ.39, బన్సీ రవ్వ రూ. 23.75, బటాణీ రూ.33.25 పైసలకు సరఫరా చేసేలా టెండర్‌దారులు కోట్ చేశారు. దీనిలో ఒకటి, రెండు వస్తువులు తప్పితే మిగతా వస్తువులన్నీ అధికధరలకు ఉండడం గమనార్హం. అరువుపై ఇస్తున్నారు కాబట్టి తప్పదు: మోహన్‌రావు,జీసీసీ డీఎం ఈ విషయాన్ని జీసీసీ డివిజనల్ మేనేజరు మోహన్‌రావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. అరువుపై సరుకులను సరఫరా చేస్తారు కాబట్టి ఈ ధరలు కేటాయించడం తప్పడం లేదన్నారు. గిరిజన సంక్షేమశాఖ ద్వారా బిల్లులు ఎప్పటికో అవుతాయన్నారు. గతేడాది బిల్లులు ఇంతవరకు టెండర్‌దారులకు చెల్లించలేదని చెప్పారు. -
అందానికి ఉల్లి తోడు!
సౌందర్య పోషణలో కురులదే కీలకపాత్ర. అందులోనూ స్త్రీలకు ఒత్తై తలకట్టు అందాన్నిస్తుందన్నది నిర్వివాదాంశం కూడా. తలవెంట్రుకలు రాలిపోయే సమస్యతో బాధపడేవారి పాలిట ఉల్లి మంచి మందు. అంతేకాదు, కొందరికి పేను కొరుకుడు వల్ల తలపై అక్కడక్కడ పాయలు పాయలుగా జుట్టు ఊడిపోయి, అసహ్యంగా కనపడుతుంది. అటువంటివారు ఉల్లిపాయను మెత్తగా చితక్కొట్టి లేదా మిక్సీలో వేసి రసం తీసి నెత్తిమీద వెంట్రుకలు పలుచగా ఉన్న చోట రాసుకుంటే నిద్రాణంగా ఉన్న వెంట్రుకల కుదుళ్లు చైతన్యవంతమై, తిరిగి అక్కడ జుట్టు మొలుస్తుందట. ఉల్లిలో ఉండే సల్ఫర్ జీవక్రియలను వేగవంతం చేయడం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రపరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఉల్లిపాయను బాగా దంచి, రసం తీసి, కొబ్బరినూనెలో లేదా ఇతర కేశవర్థక తైలాలలో కలిపి తలకు రాసుకున్నా మంచి ఫలితమే. చుండ్రుతో బాధపడేవారు ఉల్లిరసంలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి మాడుకు పట్టించి, అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే అందం ద్విగుణీకృతం అవుతుంది... నిజం! ఉల్లితోడు! అన్నట్టు ఉల్లికి ఆడ, మగ తేడా ఏమీ లేదు. మగవాళ్లు కూడా ఉల్లిరసం రాసుకోవచ్చు. -
ముంబైలో బ్లాక్ బ్యూటీ బిపాసా సందడి