ఆరోగ్యకరమైన ఆహారంతోనే  మేనికి మేలైన నిగారింపు! | Nutrition is a good thing with a healthy diet | Sakshi
Sakshi News home page

ఆరోగ్యకరమైన ఆహారంతోనే  మేనికి మేలైన నిగారింపు!

Published Wed, Aug 29 2018 12:27 AM | Last Updated on Wed, Aug 29 2018 12:27 AM

Nutrition is a good thing with a healthy diet - Sakshi

స్కిన్‌ కౌన్సెలింగ్‌

నా వయసు 18 ఏళ్లు. నాకెందుకో కాస్మటిక్స్‌ అంటే ఇష్టం ఉండదు. చర్మానికి శాశ్వతమైన మెరుపు రావాలంటే అది నేచురల్‌గానే మెరుస్తుండాలన్నది నా కోరిక.  మంచి డైట్‌తోనే చర్మానికి మంచి నిగారింపు వచ్చేందుకు మార్గాలు చెప్పండి.  – సుష్మా, హైదరాబాద్‌ 
మీరన్నది వాస్తవమే. కాస్మటిక్‌ ద్వారా వచ్చే నిగారింపు కాసేపే ఉంటుంది. అదే నేచురల్‌గానే మేనిలో మెరుపు ఉంటే దానికి మేకప్‌తో గానీ, కాస్మటిక్స్‌తోగాని ప్రమేయం ఉండదు. ఆరోగ్యకరమైన కొన్ని ఆహారాలతో మేనిలో స్వాభావికంగానే మెరుపు వచ్చేలా చేసుకోగలగడం సాధ్యమే. అయితే కొన్ని ఆహారాలు చర్మం మెరుపును తగ్గించేందుకు అవకాశం ఉంది. ఆ రెండు ఆహారాల వివరాలు...

మేనికి మేలు చేసే ఆహారాలు
ఆహారం: తాజా చేపలు, అవిశెలు, బాదం... వీటిల్లో ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువ. 
ప్రయోజనం: ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉండేలా చేస్తాయి. కాస్త గరుగ్గా ఉండే చర్మాన్ని నుపుపుగా చేసేందుకు దోహదపడతాయి. 
ఆహారం: ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, బార్లీ, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్స్‌ వీటిల్లో పీచు పదార్థాలు ఎక్కువ. 
ప్రయోజనం: శరీరంలోని విషాలను తొలగించి బయటకు పంపుతాయి. (డీ–టాక్సిఫై చేస్తాయి). ఇందులోని పీచు పదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి. 
ఆహారం:వైటమిన్‌–బి6 ఎక్కువగా ఉండే ఆహారమైన క్యారెట్‌తో పాటు కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్‌నట్, అవకాడో 
ప్రయోజనం: హార్మోన్లలోని అసమతౌల్యత వల్ల వచ్చే మొటిమలను వైటమిన్‌–బి6 నివారిస్తుంది. హార్మోన్‌ల సమతౌల్యత సక్రమంగా ఉండేలా సహాయపడుతుంది. 
ఆహారం: ఆపిల్, అరటి, నారింజ, జామ వంటి అన్ని రకాల తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. 
ప్రయోజనం: చర్మాన్ని ముడతలు పడేలా చేసే ఫ్రీ–రాడికల్స్‌ను తొలగించడానికి యాంటీఆక్సిడెంట్లు ఉపయోగపడతాయి. అందుకే చర్మం చాలాకాలం పాటు యౌవనంగా ఉండాలంటే తాజా పండ్లు తినాలి. 

చర్మానికి కీడు చేసే పదార్థాలు
ఆహారం: కాఫీ, టీ, శీతలపానియాలు, కోలా డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌. 
కీడు: వీటిల్లో కెఫిన్‌ పాళ్లు ఎక్కువ. ఇది చర్మంలో నుంచి తేమను సంగ్రహించి చర్మం పొడిబారి కనిపించేలా చేస్తుంది. కెఫిన్‌ ఒంట్లోని నీటిని తొలగిస్తుంది కాబట్టి విషాలు పేరుకుపోయే అవకాశాలు ఎక్కువ. 
ఆహారం: చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలైన చాక్లెట్లు, సోడా డ్రింక్స్, భోజనం తర్వాత తినే తీపి పదార్థాలు, స్వీట్స్‌ ఎక్కువగా ఉండే పానియాలు. 
కీడు: తీపి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఇన్‌ఫ్లమేషన్‌ అవకాశాలను పెంచుతుంది. తీపి ఎక్కువగా ఉండే ఆహారంతో మొటిమలు వస్తాయి. 
ఆహారం: బేకరీ ఫుడ్స్, బర్గర్స్, నిల్వ ఉంచి తీసుకునే క్యాన్‌డ్‌ ఫుడ్‌.
కీడు: ఇందులో అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఎక్కువ. అవి చర్మసౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. చర్మం త్వరగా ముడుతలు పడేందుకు దోహదం చేస్తాయి. 
ఆహారం:  నూనె పదార్థాలు, వేపుళ్లు, చిప్స్, ఫ్రెంచ్‌ ఫ్రైస్, ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఉపయోగించే మార్జరిన్‌ నూనె ఉపయోగించిన పదార్థాలు. 
కీడు : ఇందులో ట్రాన్స్‌–ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువ. ఇవి రక్తంలో కొవ్వు పదార్థాలను పెంచి చర్మంపై మొటిమలు పెరిగేందుకు దోహదం చేస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement