రుద్రవరంలోని కస్తూర్బా బాలికా విద్యాలయం బాలికలకు ఇవ్వాల్సిన కాస్మోటిక్ కిట్లలోని వస్తువులు
కర్నూలు ,ఆళ్లగడ్డ: ఇంటి దగ్గరయితే అమ్మ శుభ్రంగా స్నానం చేయించి...చక్కగా తలదువ్వి..దిష్టిచుక్క పెట్టి..బాగా చదువుకోవాలని పిల్లలను దీవించి పాఠశాలకు పంపుతుంది. హాస్టళ్లలో ఉండే బాలబాలికలకు ఈ పని ఎవరు చేయాలి? వారి వ్యక్తిగత శుభ్రతకు ఎవరు హామీ ఇవ్వాలి? ఈ ప్రశ్నలకు ఎవరినడిగినా ప్రభుత్వమే అని సమాధానం వస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఈ పని చేయడం లేదు. కాస్మోటిక్ చార్జీలు చెల్లించకుండా..కిట్లు ఇవ్వకుండా చోద్యం చూస్తోంది. చెదిరిన నవ్వుతో..చెమర్చిన కళ్లతో తరగతులకు హాజరవ్వడం విద్యార్థినుల వంతవుతోంది.
కస్తూర్బా విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న బాలికలందరూ బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలే. కాస్మోటిక్ చార్జీల కింద ఇచ్చే రూ. 100 వారి బ్యాంక్ అకౌంట్‌కు జమ అవుతోంది. ఆ మొత్తాన్ని తల్లిదండ్రులు వాడుకుంటున్నారని, విద్యార్థినులు కనీస అవసరాలకు సరిపడా వస్తువులు కూడా కొనుగోలు చేయలేకపోతున్నారని ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థినులకు అవసరమైన కాస్మోటిక్ వస్తువులు అన్నీ కొనుగోలు చేసి ప్రతి మూడు నెలనెలకోసారి నేరుగా కిట్లను సరఫరా చేస్తామని ప్రకటించింది. గత విద్యాసంవత్సరం మార్చినుంచి కిట్ల పంపిణి మొదలు పెట్టింది. మార్చి నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని 53 కస్తూర్బా విద్యాలయాలకు ఒక్కో పాఠశాలకు ఒక్క సారి మాత్రమే సరఫరా చేశారు. కిట్లను సరఫరా చేసినప్పుడు వాటిని చూసిన బాలికలు ఎంతో ఆనంద పడ్డారు. అయితే వారి ఆశలు ఎన్నో రోజులు కొనసాగలేదు. ఒక్కసారి సరఫరా చేసిన ప్రభుత్వం అటు తరువాత ఆ ఊసే ఎత్తడం లేదు. పాఠశాలలు పునఃప్రారంభమై ఆరునెలలు కావస్తున్నా ఇంతవరకు కిట్లు కాని కాస్మోటిక్ చార్జీలు కాని ఇవ్వడం లేదు.
కిట్స్‌లో ఉండాల్సిన వస్తువులివే...
స్నానపు సబ్బులు 6, దుస్తులు ఉతికే సబ్బులు 4, కొబ్బెరనూనె సీసీ 1, డెటాల్ 1, బాడీలోషన్ 1, డిజర్జంట్ పొడి 1, దువ్వెన, పౌడర్ డబ్బా, టూత్ పేస్టు, బ్రష్, టంగ్ క్లీనర్, ప్లాస్టిక్ దువ్వెన, బొట్టు బిల్లలు, ష్యాంపు పాకెట్లు, నైలాన్ రిబ్బన్లు, హెయిర్‌బ్యాండ్లు, ఆలౌట్.. తదితర 15 రకాలు ఉంటాయి.
ఇవీ ఇబ్బందులు..
కిట్లు అందక పోవడంతో విద్యార్థినులు చెదిరిన జుట్టు, మాసిన దుస్తులతోనే తరగతులకు హాజరవుతున్నారు. కొందరు తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లి దాచుకున్న సొమ్మును బాలికలకు ఇస్తున్నారు. ఈ డబ్బుతో సబ్బులు, కొబ్బెరనూనె, పేస్టు తదిత వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఈ డబ్బులు కూడా లేని నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలు తమ బాధను చెప్పులేక పోతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
గతేడాది జనవరి నుంచి కాస్మోటిక్ చార్జీలు ఇవ్వకుండా కిట్స్ ఇచ్చారు. అయితే కాంట్రాక్టర్లు ఒక్కో కేజీబీవీకి ఒక్కోసారి మాత్రమే సరఫరా చేశారు. తరవాత ఇవ్వలేదు. విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.– నాగేశ్వరి, బాలికల సంరక్షణ అధికారి (జీసీడీఓ)
ఇంటి నుంచి తెచ్చుకుంటున్నాం
గత సంవత్సరం నుంచి కాస్మోటిక్స్ చార్జీలు చెల్లించడం లేదు. పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కాస్మోటిక్ కిట్ ఇచ్చారు. అవీ అప్పుడే అయిపోయినాయి. అప్పటి నుంచి సబ్బులు, నూనె ఇతర వస్తువులు ఇంటిదగ్గర నుంచే తెచ్చుకుంటున్నా. – రజియాబీ, విద్యార్థిని
దుస్తులు శుభ్రం చేసుకోవాలంటే ఇబ్బందులు
పాఠశాలలో ఉండే వారందరమూ నిరుపేదలమే. కాస్మోటిక్ చార్జీలు కాని, కిట్లుగాని ఇవ్వక పోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా అమ్మనాన్నలు కూలి పనులకు వెళ్లి సంపాదించిన సొమ్ములతో నూనె ఇతర సామగ్రి కొనుగోలు చేసి పంపుతున్నారు. దుస్తులు శుభ్రం చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. సబ్బులు లేక ఉత్త నీళ్లతో ఉతుక్కుంటున్నాం. – మహేశ్వరి, విద్యార్థిని
Comments
Please login to add a commentAdd a comment